Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్తంభించిన అమెరికా.. ఆకాశంలో విమానాలు, నేలపై గందరగోళం!

November 14, 2026 by M S R

.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల మధ్య కమ్యూనికేషన్స్ వైఫల్యం.. దేశవ్యాప్తంగా గ్రౌండ్ స్టాప్.. సైబర్ దాడి అనుమానాలపై స్పష్టత లేని పరిస్థితి.. పాత వ్యవస్థ నుంచి కొత్తదానికి మార్పే కారణమా?

అమెరికా విమానయాన వ్యవస్థ ఒక్కసారిగా కుదేలైంది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేలాది విమానాలు ఆలస్యమయ్యాయి. మరికొన్ని రద్దయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) కేంద్రాల మధ్య కమ్యూనికేషన్స్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్యతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దేశవ్యాప్తంగా గ్రౌండ్ స్టాప్ ప్రకటించింది. అంటే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాలు టేకాఫ్ కావద్దని ఆదేశించింది. అమెరికా గగనతలంలో అప్పటికే ప్రయాణిస్తున్న విమానాలను మాత్రం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అనుమతించారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలను పరిస్థితిని బట్టి అనుమతించాలని నిర్ణయించారు. 9/11 తరువాత ఇలాంటి స్థితి మళ్లీ ఇదే…

Ads

ఏం జరిగింది? నవంబర్ 13 శుక్రవారం మధ్యాహ్నం ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. అమెరికాలో విమానాల రాకపోకలను సమన్వయం చేసే 22 ప్రాంతీయ ఎయిర్ రూట్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల కమ్యూనికేషన్స్ వ్యవస్థలో అంతరాయం ఏర్పడింది. విమానాల కదలికలను సమన్వయం చేయడానికి ఈ కేంద్రాల మధ్య నిరంతర సమాచార మార్పిడి అవసరం. ఇందులో సమస్య తలెత్తడంతో విమానాల భద్రతను దృష్టిలో ఉంచుకుని FAA అసాధారణ నిర్ణయం తీసుకుంది. దేశంలోని విమానాశ్రయాలన్నింటిలోనూ బయలుదేరే విమానాలను నిలిపివేయాలని ఆదేశించింది.

రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, అన్ని ఎయిర్ రూట్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాలను ప్రభావితం చేసిన కమ్యూనికేషన్స్ సమస్యపై FAA సాంకేతిక నిపుణులు పరిశీలిస్తున్నారని తెలిపారు. ఈ ఆదేశాలతో అమెరికా విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. విమానాలు దారి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విద్రోహ చర్యా? సాంకేతిక వైఫల్యమా? ఈ పరిణామం వెనుక సైబర్ దాడి లేదా ఏదైనా విద్రోహ చర్య ఉందా అనే అనుమానాలు సహజంగానే వ్యక్తమయ్యాయి. అయితే అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి మార్క్‌వేన్ ముల్లిన్ ఇప్పటివరకు అలాంటి దాడికి సంబంధించిన ఆధారాలేవీ లేవని స్పష్టం చేశాడు. ప్రస్తుతానికి ఇది టెలికమ్యూనికేషన్స్ వైఫల్యంగానే కనిపిస్తోందని చెప్పాడు. అయినప్పటికీ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఏ అవకాశాన్నీ పూర్తిగా తోసిపుచ్చలేమని వెల్లడించాడు.

  • ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. గురువారం మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం ఏర్పడగా, శుక్రవారం అమెరికా విమానయాన వ్యవస్థలో ఈ సంక్షోభం తలెత్తింది. వరుసగా రెండు రోజుల పాటు కీలక సాంకేతిక వ్యవస్థల్లో సమస్యలు రావడంతో వీటి మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే చర్చ మొదలైంది. అయితే మైక్రోసాఫ్ట్ అంతరాయానికి, FAA కమ్యూనికేషన్స్ సమస్యకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు చెబుతున్నారు.

ground stop

పాత వ్యవస్థ నుంచి కొత్తదానికి మార్పే కారణమా? ఈ ఘటనలో అసలు ప్రశ్న అమెరికా విమానయాన వ్యవస్థలో సాంకేతిక మార్పుల గురించే. దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న పాత కమ్యూనికేషన్స్ వ్యవస్థలను ఆధునిక సాంకేతికతతో భర్తీ చేసే ప్రక్రియ అమెరికాలో కొనసాగుతోంది. పాత వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థకు మారే క్రమంలో అనుసంధాన సమస్యలు తలెత్తాయా? కొత్త వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడితే పాత వ్యవస్థకు తిరిగి వెళ్లే అవకాశం లేకపోయిందా? అన్న కోణాల్లోనూ చర్చ జరుగుతోంది.

  • CBS న్యూస్ కథనం ప్రకారం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థకు అనుసంధానమైన ప్రైవేట్ కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌లో అప్‌డేట్ సందర్భంగా రీబూట్ జరిగి, వ్యవస్థ క్రాష్ కావడం ఈ అంతరాయానికి కారణమై ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెట్‌వర్క్ నిర్వహణలో L3Harris సంస్థ పాత్ర ఉందని కూడా ఆ కథనం పేర్కొంది. అయితే అసలు కారణం ఏమిటన్నది ఇంకా అధికారికంగా తేలలేదు.

అమెరికా విమానయాన వ్యవస్థలో పాత సాంకేతిక పరిజ్ఞానం పెద్ద సమస్యగా మారుతోందని గతంలోనే విమర్శలు వచ్చాయి. దశాబ్దాల నాటి కంప్యూటర్లు, పాత టెలికమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌లు, విడిభాగాల కొరతతో వ్యవస్థ నిర్వహణ కష్టమవుతోందని రాయిటర్స్ సెప్టెంబరులోనే ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఘటన అమెరికా విమానయాన వ్యవస్థ ఆధునికీకరణపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ప్రస్తుత పరిస్థితి ఏమిటి? శుక్రవారం రాత్రి (ఇండియాలో శనివారం ఉదయం) అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కొన్ని అంతర్జాతీయ విమానాలకు పరిమితంగా టేకాఫ్ అనుమతులు ఇవ్వడం ప్రారంభించారు. అయితే దేశీయ విమానాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. FAA ప్రకటించిన గ్రౌండ్ స్టాప్ ఆదేశాల గడువు అమెరికా తూర్పు కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల వరకు ఉంది. ఆ సమయానికి సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందన్న హామీ మాత్రం లేదు.

ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థ ఫ్లైట్ అవేర్ గణాంకాల ప్రకారం, దాదాపు 11 వేల విమానాలు ఆలస్యం కావడం లేదా రద్దు కావడం వంటి ప్రభావానికి గురయ్యాయి. కొన్ని వందల విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది.

అమెరికా వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన దేశంలో విమానయాన వ్యవస్థలో ఇలాంటి అంతరాయం ఏర్పడటం చిన్న విషయం కాదు. నిన్న మైక్రోసాఫ్ట్ సేవల్లో సమస్య.. నేడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సంక్షోభం.. ఈ రెండింటికీ సంబంధం లేకపోయినా, ఆధునిక ప్రపంచం ఎంతగా సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడుతోందో, వాటిలో చిన్న లోపం తలెత్తినా ఎంత పెద్ద పరిణామాలు ఎదురవుతాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • స్తంభించిన అమెరికా.. ఆకాశంలో విమానాలు, నేలపై గందరగోళం!
  • అనిరుధ్ – కావ్య ‘ఆత్మగౌరవ వివాహం’ వెనుక వందేళ్ల చరిత్ర!
  • సినిమా రామాయణానికి తిరగమోత..! అసలు ఎవరు ఈ ‘బోధిసత్వుడు’..?
  • సముద్రంపై ఇల్లు..! ఇరాన్ యుద్దం సెగకు ‘క్రూయిజ్ ప్రాజెక్ట్’ కొలాప్స్ !!
  • కర్ణన్ కన్నుమూత… ఆయన కేసు అప్పట్లో ఓ సంచలనం, ఓ కుదుపు…
  • హానీట్రాపులే కాదు- అక్రమ మార్గాల్లో చైనాకు ఎన్వీడియా చిప్స్ !
  • ఓహో… ఈ కొత్త అర్జునుడు ఆ ఎఎంఆర్ వారసరత్నమేనా..?
  • మొదట్లో ఎన్టీయార్‌నే తిరస్కరించారు ఆ దేవుళ్ల పాత్రల్లో..!
  • రామాయణం హంగామా వెనుక కనిపించని ఓ కీలక వ్యక్తి… అశ్విని అయ్యర్!
  • …. అన్నట్టు విజయ సాయిరెడ్డి కొత్త పార్టీ అనగానే గుర్తుకొచ్చింది… .

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions