పితృకర్మల్ని వారసులు గాకుండా… ఎవరు పడితే వారు నిర్వర్తించవచ్చా..? తద్వారా పితృ ఆత్మలకు శాంతి లభిస్తుందా..? సంతృప్తి పొందుతాయా..? అసలు ప్రభుత్వాలే ఈ పితృకర్మల్ని ఓ బిజినెస్‌గా మార్చేయవచ్చా..? పోనీ, ఆన్‌లైన్ పెళ్లిళ్లలాగే ఆన్‌లైన్ పిండప్రదానాలు చేయవచ్చా..? వారసుడి తరఫున పంతుల్లే మమ అనిపించేసి, ఓ వీడియోను పెన్‌డ్రైవ్‌లో పంపించేస్తే, పంతులుకు సంభావన ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేస్తే సరిపోతుందా..? ఇవన్నీ ఆమోదయోగ్యమేనా..? ఎప్పుడైనా ఈ ప్రశ్నలు మీలో మెదిలాయా..?
పితృకర్మలు హిందూ ఆధ్యాత్మిక సంస్కృతిలో ఓ భాగం… ఓ విశ్వాసం… మరణించిన పితృదేవతల్ని స్మరించడం, పిండప్రదానం చేయడం ఓ కర్తవ్యంగా భావిస్తుంది సగటు హిందూ కుటుంబం… వాటిల్లో ఎన్నిరకాలు ఉంటాయి..? వాటి విశిష్టత ఏమిటో మనం చర్చించబోవడం లేదు ఇక్కడ… ఇళ్లల్లో లేదా ఏదైనా నదీప్రవాహాల వద్ద చేయిస్తుంటారు… కొందరు బియ్యంతో చేయిస్తే, కొందరు పిండితో ముద్దలు చేయిస్తారు… ఇంకొందరు గోధుమల్ని కూడా… ఆయా ప్రాంతాల ఆహార విశిష్ఠతల్ని బట్టి… అయితే..?
కోట్ల మంది భారతీయులు బయటి దేశాల్లో ఉన్నారు… తిథి వస్తే పిండం పెట్టే వెసులుబాటు ఉండదు… వారసుల్లాగా తన కర్తవ్యం నిర్వహించలేక పోయామే అనే బాధ ఉంటుంది… ఈ దేశంలోనే ఉన్నా సరే, కొన్నిసార్లు శ్రాద్ధకర్మ వీలు కాదు… అలాంటి సందర్భాల్లో ఓ బ్రాహ్మణ కుటుంబం భోజనానికి అయ్యే సరుకుల్ని, కొంత సంభావనను కలిపి ‘‘సాయిత్యం’’ పేరిట ఏ గుడిలో పూజారికో ఇచ్చేస్తుంటారు… తరువాత ఏదైనా పుణ్యతీర్థానికి పోయినప్పుడు, ఇలా ఎత్తిపోయిన కర్మలన్నీ ఒకేసారి పెట్టేస్తుంటారు… లేదా ఏ పుష్కరస్నానానికో వెళ్లినప్పుడు పాత బాకీలన్నీ తీర్చేస్తుంటారు… మరి బయట దేశాల్లో ఉండేవారి మాటేమిటి..?
Ads
సాధారణంగా ఇలాంటి కర్మలకు ప్రధాన క్షేత్రం బీహార్‌లోని గయ… అఫ్‌కోర్స్, వారణాసి కూడా… అలా శ్రాద్ధ ప్రాధాన్యత ఉన్న స్థలాలు కొన్ని ఉన్నయ్… ఎక్కువగా బీహార్‌లోనే… అందుకే దాన్ని మోక్షభూమి అని కూడా వ్యవహరిస్తుంటారు… పైగా ప్రతి ఏటా పితృపక్షాన్ని ప్రత్యేకంగా పాటిస్తుంటారు…
ఈ సంవత్సరం 10 వ తేదీ నుంచి 25 వరకు ఉంటుంది… ఈ 15 రోజులూ దేశంలో ఎక్కడెక్కడి నుంచో గయకు వచ్చి పితృకర్మల్ని నిర్వర్తిస్తుంటారు… బీహార్ ప్రభుత్వం ఈ సందర్భాన్ని కమర్షియలైజ్ చేసి, ప్యాకేజీలుగా మార్చి, పితృకర్మను కూడా ఓ వ్యాపార సరుకుగా మార్చేసి, ఫుల్ అడ్వర్టయిజ్‌మెంట్లు గుప్పిస్తోంది…
తమ రాష్ట్రానికి ఈ కర్మల కోసం లక్షలాది మంది పర్యాటకులుగా వస్తే… వాళ్లకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఆలోచిస్తే మెచ్చుకోవచ్చు… ఆధ్యాత్మిక పర్యాటకంలాగే పితృపర్యాటకం అని పేరు పెట్టి, ప్రమోట్ చేస్తే పెద్ద ఫరక్ పడదు… కానీ రకరకాల వాణిజ్య ప్యాకేజీలు పెట్టి, తనే వ్యాపారం చేస్తోంది… అదీ చివుక్కుమనిపిస్తోంది… గయ వంటి చోట్ల ఎవరు వెళ్లినా ప్రధానంగా వచ్చే సమస్య ఆయా పండితులతో… వాళ్ల రేట్లతో… దానిపై ఓ నియంత్రణ, ఓ పద్ధతి ఆలోచిస్తే సరిపోయేది…
కానీ టూరిజం శాఖే ఓ ‘‘కర్మ వ్యాపారి’’ అవతారం ఎత్తడం బాగాలేదు… నమ్ముతారా..? కొన్ని ప్యాకేజీల రేట్లు 37 వేల వరకూ ఉన్నాయి… ఈ-పిండప్రదానం రేటు 20,425 రూపాయలు… డౌటేముంది..? మనదేశంలో పిండాలు పెట్టినా జీఎస్టీ తప్పదు కదా… అంతా మోడీ సాబ్ దయ, సుపరిపాలన… దీనిపైనా 5 శాతం జీఎస్టీ ఉంది…
అన్నింటికీ మించి ఈ-పిండదాన్ అని ఓ ప్యాకేజీ పెట్టింది… అంటే మీరు ఎక్కడున్నా సరే, ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని, ప్యాకేజీ డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తే చాలు… సంబంధిత కర్మను వీడియో చేసి డిస్క్ లేదా పెన్‌డ్రైవ్ పంపిస్తారుట… లేదంటే ఆన్‌లైన్‌లోనే ఫైల్ ట్రాన్స్‌ఫర్ చేస్తారు…
అంతేకాదు, మీ తరఫున మీ బంధువులో, మీ స్నేహితులో కూడా మీ పితృదేవతలకు పిండప్రదానం చేయవచ్చునట… గరుడపురాణం దానికి అనుమతినిస్తోంది అని బీహార్ టూరిజం శాఖ ఉన్నతాధికారులు పిచ్చి బాష్యాలు కూడా చెబుతున్నారు… పైగా ఇంటర్‌నెట్, వాట్సప్ వాడకం తెలియని పంతుళ్లు మాత్రమే ఈ కొత్త సౌకర్యాల్ని వ్యతిరేకిస్తున్నారంటూ ముద్రలు వేస్తోంది… అలాంటి అధికారులు, బాధ్యులను, ఆ రాష్ట్ర పాలకులను వాళ్ల పితృదేవతలు క్షమింతురుగాక..!!
Share this Article