…. Author :: Taadi Prakash……………… నువ్వు లేవు… నీ త్యాగం నిలిచి ఉంది…
GUERILLA DOCTOR NORMAN BETHUNE
—————————————————————
పొద్దున్నే ఫేస్బుక్లో జయదేవ్ గారి కార్టూన్ suprise చేసింది. ఒక స్టెతస్కోప్ మధ్య ఉయ్యాల లాంటి మాస్క్ లో భూగోళం!
మరొకటి: మాస్క్ వేసుకున్న పెద్ద లేడీ డాక్టర్ బొమ్మ. వెనకాల వందల చుక్కలు. ఎన్లార్జి చేస్తే వాళ్లంతా డాక్టర్లు! కరోనా పేషెంట్ల సేవలో ప్రాణాలు కోల్పోయినవాళ్లు. చివుక్కుమంది.
ఆ రోజు జూలై1. మన డాక్టర్స్ డే.
ఒక మార్టిన్ లూథర్ కింగ్, ఒక స్పార్టకస్,
ఒక నెల్సన్ మండేలా.
వీళ్లని తలుచుకున్నప్పుడు వొక ఉద్వేగం
సుడిగాలి అవుతుంది. అలా డాక్టర్లలో ఎవరున్నారు?
కెనడా: హెన్రీ నార్మన్ బెథూన్
ఇండియా: ద్వారకానాథ్ కోట్నీస్
అర్జెంటీనా: ఎర్నెస్టో చేగువేరా
ఈ ముగ్గురిలోనూ ఒక ప్రత్యేకత వుంది.
బెతూన్, కోట్నీస్ ఇద్దరూ చైనా వెళ్లి, సైనికులకు వైద్యం చేసి, అక్కడే చనిపోయారు.
చేగువేరా క్యూబాలో విప్లవం తెచ్చి, కాంగో, బొలీవియాలనీ విముక్తి చేయాలని
వెళ్లి అక్కడ ప్రాణత్యాగం చేశాడు.
16 ఏళ్లకే నార్మన్ బెతూన్ జీవిత కథ చదివాను.
మరపురాని అనుభవం అది. వైద్యవృత్తి నెత్తురుతాగే వ్యాపారంగా మారడాన్ని చూస్తున్న ఈ రోజుల్లో రోగుల కోసం రక్తం ధారబోసిన నార్మన్ బెతూన్ని తలచుకుందాం.
టొరంటోకి 160 కి.మీ. దూరంలోని GRAVENHURSTలో 1890 మార్చి 3వ తేదీన పుట్టాడు నార్మన్ బెతూన్.
బెతూన్ తాత నార్మన్ మిలటరీ సర్జన్. రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు HENRY DUNANTతో కలిసి నాటి క్రిమియా యుద్ధకాలంలో పనిచేశారు. వైద్యుల కుటుంబానికి చెందిన బెతూన్ 1909లో టొరంటో యూనివర్సిటీలో ఫిBజియాలజీ, బయో కెమిస్ట్రీ చదివాడు. చదువు ఖర్చుల కోసం కొందరికి ఇంగ్లీష్ నేర్పేవాడు. స్థానిక పత్రికకి విలేకరిగానూ పనిచేశాడు. నిక్కచ్చి మనిషి. దూసుకుపోయే తత్వం.
జనం కోసం ఏమన్నా చేయాలన్న తపన.
1914 సెప్టెంబర్లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. అప్పటికి బెతూన్ వయసు 24 ఏళ్లు. ఫ్రాన్స్ వెళ్లాడు. స్ర్టెచర్ మోసే పని. గాయపడిన సైనికులను గబగబా స్ట్రెచర్ మీద తీసుకెళ్లడం.
ఆరు నెలల తర్వాత బెల్జియంలో జరిగిన
battle of Ypres యుద్ధరంగానికెళ్లాడు.
అక్కడో పదునైన ఆయుధం కాల్లో గుచ్చుకుంది. వెనక్కివచ్చి 1916 కల్లా మెడిసిన్ పూర్తిచేశాడు.
1917 నుంచి మళ్లీ యుద్ధంలోకి.. పూర్తి అయ్యేదాకా నేవీ సర్జన్గా పనిచేశాడు. లండన్, ఎడిన్ బరోలో మూడేళ్లు సర్జికల్ హౌస్ ఆఫీసర్ గా పనిచేశాడు. అక్కడి నుంచి అమెరికా వెళ్లాడు. మిచిగన్, డెట్రాయిట్లో సర్జన్ గా చేశాడు. వేల్ యూనివర్సిటీలో టీచర్గా పేరుపొందాడు. సామాజికకార్యకర్తగా,
గొప్ప సర్జన్గా బెతూన్ని గుర్తించారు.
34 ఏళ్లకే హృద్రోగ నిపుణుడిగా, థొరాసిక్ సర్జరీ స్పెషలిస్టు గా ఖ్యాతిగాంచారు. 1926లో ఒక రోజు బెతూన్కి అలసటగా అనిపించింది.
టెస్ట్ చేయించుకుంటే టి.బి అని తేలింది.
అప్పటికి, విశ్రాంతి తీసుకోవడమే టి.బి.కి మందు. న్యూయార్క్ శానిటోరియంలో చేరాడు. అలా ఖాళీగా మంచంమీదే వుండడం నచ్చలేదు. తోటి రోగుల్ని పోగుచేసి షికార్లు తిప్పి కబుర్లు చెప్పి మంచం మీదే పడి వుండనక్కర్లేదని వాళ్లకి ధైర్యం చెప్పాడు.
ఆర్టిస్టు కూడా అయిన బెతూన్ కాగితాలు సంపాదించి రంగుల బొమ్మలు వేశాడు. పెద్ద పెద్ద కుడ్య చిత్రాలు గీశాడు. ఇక కోలుకోలేనేమోననే దిగులు కుంగదీసింది. ప్రతి బొమ్మ కిందా కవిత్వం రాశాడు. ఒక పెద్ద డాక్టరు తెగించి బెతూన్కి ఆపరేషన్ చేశాడు. రెండు నెలల్లోనే బాగా కోలుకున్నాడు. ఒక ఏడాది శానిటోరియంలోనే గడిచిపోయింది. తర్వాత అమెరికా వైద్యవిద్యార్థులకు తర్ఫీదు యిచ్చాడు.
మళ్లీ కెనడా చేరుకున్నాడు. సామాన్యజనానికి వైద్యసేవలు అందించాడు. 1935 వేసవిలో
లెనిన్ గ్రాడ్ వెళ్లాడు. అది తొలి అంతర్జాతీయ ఫిజియోలాజికల్ సభ. కండిషన్డ్ రిఫ్లెక్సెస్ గురించి చెప్పిన సుప్రసిద్ధ డాక్టర్ పావ్లోవ్ ఆ సభకి అధ్యక్షుడు. పావ్లోవ్ స్ డాగ్ అంటాం కదా! స్టాలిన్ నాయకత్వంలో సోవియోట్ యూనియన్ వైద్యరంగంలో ఏం సాధించిందో తెలుసుకోవాలని బెతూన్ లెనిన్ గ్రాడ్లో అనేక ఆస్పత్రులకు వెళ్లాడు. క్షయవ్యాధి కట్టడికి రష్యా డాక్టర్లు అనుసరించిన విధానంచూసి ఆనందాశ్చర్యాలతో అవాక్కయ్యాడు బెతూన్. అక్కడి నుంచి తిరిగి రాగానే కెనడా కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. మాంట్రియల్లో ప్రజావైద్యశాల ప్రారంభించాడు. డాక్టర్లంతా ప్రజలకు ఉచితంగా వైద్యం చేయాలనీ, ప్రభుత్వం డాక్టర్లకి జీతాలు యివ్వాలనీ గట్టిగా ప్రచారం చేశాడు. కెనడాలో పారిశుధ్యం దుర్భరంగా వుందనీ, ఆస్పత్రుల్లో సౌకర్యాలు అరకొరగా వున్నాయనీ గొంతెత్తి చెప్పాడు.
1936 రానే వచ్చింది.
జూలైలో స్పెయిన్ అంతర్యుద్ధం మొదలైంది. నియంత ప్రాన్సిస్కో ఫ్రాంకో ఫాసిస్టు పాలనకి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం అయ్యింది.
ఆ సమయంలోనే స్పానిష్ మహాకవి ఫ్రెడరికో గార్షియాలోర్కాని ఫ్రాంకో సైనికులు కాల్చి చంపారు.
ప్రఖ్యాత బ్రిటిష్ మార్క్సిస్ట్ రచయిత క్రిస్టోఫర్ కాడ్వెల్ కూడా ఆ యుద్ధంలోనే మరణించారు. అప్పుడు, కాద్వేల్ వయసు 30. లోర్కా వయసు 38.
ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో వుండాలి. కమ్యూనిస్టుగా కర్తవ్యం నెరవేర్చాలి.
నార్మన్ బెతూన్ స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ చేరుకున్నాడు. ప్రజలు న్యాయంగా ఎన్నుకున్న రిపబ్లికన్లకు వ్యతిరేకంగా ఫ్రాంకో ఫాసిస్టు సేన కుట్ర చేసింది. హిట్లర్, ముస్సోలినీ ఫ్రాంకోకి మద్దతుగా నిలబడ్డారు. స్పెయిన్ కమ్యూనిస్టుల ప్రతిఘటన తీవ్రంగా అయింది. గాయపడ్డవాళ్లకి బెతూన్ నాయకత్వంలోని డాక్టర్ల బృందం వైద్యం చేస్తోంది. మొబైల్ బ్లడ్ transfusion సర్వీస్ అత్యవసరం
అని బెతూన్ గుర్తించాడు. స్పానిష్ అధికారులు
ఓకే అన్నారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్ వెళ్లి బెతూన్ పరికరాలు తెచ్చాడు. ఒక రిఫ్రిజిరేటర్,
ఇంక్యుబేటర్, స్టెరిలైజర్ యూనిట్తో బ్లడ్ transfusion సర్వీసు ప్రారంభించాడు.
బెతూన్ కొత్త ఆలోచన, చురుకైన పనితనం చూసి అంతా ఆశ్చర్యపోయారు. వెయ్యి కిలోమీటర్లు విస్తరించిన యుద్ధరంగంలో 100 ఆస్పత్రుల్లో ఈ యూనిట్లతో పని మొదలుపెట్టారు.
గాయపడ్డ కొన్ని వందలమందిని ఆదుకున్నారు. బెతూన్ ఒక గెరిల్లాలా మెరుపు వేగంతో పనిచేశాడు.
కొత్తగా ఆలోచించడం, తక్షణ అమలు చేయడం
ఎంత తెగించి పనిచేస్తున్నా, ఆ దారుణమైన పరిస్థితుల నుంచి బయటపడటమే మంచిదని బెతూన్కి సహచరులు నచ్చజెప్పారు. 1937 జూన్లో మాంట్రియల్ తిరిగి వచ్చాడు. వెయ్యి మందికి పైగా జనం స్వాగతం చెప్పారు. ఫాసిస్టు వ్యతిరేక పోరాటం ప్రాధాన్యం వివరిస్తూ ప్రచార సభల్లో
మాట్లాడాడు బెతూన్.
చిట్టచివరి మజిలీ కమ్యూనిస్టు చైనా
1937లో జపాన్ చైనాపై యుద్ధం ప్రకటించింది. విమానాలు బాంబులు కురిపిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశం పక్షాన నిలబడాలని బెతూన్ నిర్ణయించారు. కెనడా కమ్యూనిస్టు పార్టీ, న్యూయర్క్ లోని చైనా సహాయమండలితో సంప్రదించాడు. తక్షణ వైద్యసహాయం అందాలని చెప్పాడు. 1938 జనవరిలో కెనడా నర్సు నేన్ ఎవెన్తో కలిసి వాంకూవర్ నించి బయల్దేరాడు బెతూన్. సముద్రం మీద హాంకాంగ్ చేరుకున్నారు.
అక్కడ్నించి రైళ్లలో, గుర్రాలమీద, నడిచీ..సుదీర్ఘ ప్రయాణం తర్వాత, ఉత్తర చైనాలోని యేనాన్ చేరుకున్నారు. జపాన్ సైన్యం దాడులు చేస్తూనే వుంది. యేనాన్ కొండల్లోని చైనా కమ్యూనిస్టు పార్టీ హెడ్క్వార్టర్స్లో బెతూన్, చైర్మన్ మావో సేటుంగ్ని కలిశాడు. స్పెయిన్లో బెతూన్ సాహసగాథలు విని వున్న మావో ఎంతో ఆదరంతో మాట్లాడి,
అదే నిబద్ధతతో పనిచేయాలని కోరారు.
ఆల్ చైనా మెడికల్ ఫోర్సెస్కి బెతూన్ని కమాండర్గా నియమించారు. “మావోని కలిసిన వాళ్లెవరైనా మంత్రముగ్ధులవుతారు. ప్రపంచంలో అతి గొప్ప మనుషుల్లో ఆయన ఒకరు“ అని బెతూన్ రాసుకున్నారు. తక్షణమే రంగంలోకి దిగారు. గాయపడ్డ సైనికుల్ని కలిశారు. మంచి వైద్యపరికరాలు లేవు. కొండల మధ్యే మట్టి కొంపలే ఆస్పత్రులు. అక్కడే గాయాలు నయం చేసేందుకు మందులు ఇవ్వాలి. తగినన్ని పరికరాలు తెప్పించాలని చెప్పాడు. మొదటి నెలరోజుల్లోనే 147 ఆపరేషన్లు చేశాడు బెతూన్. చైనా పార్టీలో ఎనిమిదో రూట్ సైన్యం ప్రధానమైనది. ఆ దళాల్లోని సైనికులకు చికిత్స చేయడమే బెతూన్ పని. అక్కడ దాదాపు నాటు వైద్యమే నడుస్తోంది. యువకులు కొద్దో గొప్పో చదువుకున్న వాళ్లు, ఆధునిక ఆస్పత్రి అంటే తెలీదు. అసలు ఆస్పత్రి చూడనివాళ్లే ఎక్కువ. అలాంటి వాళ్లకు వైద్యం నేర్పాడు. తీరిక లేకుండా రేయింబవళ్లు పనిచేశాడు. గాయపడిన వాళ్లకు మందులు ఇవ్వడంతోపాటు తనే స్వయంగా బొమ్మలు గీసి, ఎముకలు విరిగిన వాళ్లకి అవసరమయ్యే కర్రచట్రాలూ, మంచాలూ ఎలా తయారు చెయ్యాలో వడ్రంగులకు నేర్పాడు. బెతూన్కి నెలకి 100 యువాన్ల భత్యం ఇవ్వాలని మావో ఉత్తర్వులు జారీ చేశాడు. ఇక్కడి సైనికుల దుఃఖాన్నీ, సంతోషాన్నీ పంచుకొంటున్నానని బెతూన్ మావోకి లేఖ రాశారు. క్షతగాత్రుల ఆహారం కోసం ఆ 100 యునాన్లు వాడాలని పార్టీని బెతూన్ కోరాడు. ఐదారువారాలు కష్టపడి బెతూన్ ఒక పాత గుడిని ఆస్పత్రిగా మార్చారు. మెరుగైన సౌకర్యాలతో ఒక మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దారు. ఆయనో సుత్తి తీసుకుని వైద్యపరికరాలు తయారీలో కమ్మరివాళ్లకి సాయపడ్డాడు. “ఒక మంచి సర్జను కావాలంటే, ఒకే సమయంలో కమ్మరి, వడ్రంగి, దర్జీ, మంగలి అన్నీ కాగలగాలి“ అనే వారు బెతూన్. వేల మంది జనం వచ్చి సరిహద్దులోని ఆ ఆస్పత్రిని చూసి వెళ్లారు.
రెండు నెలల్లోనే 30 వేల సైన్యంతో జపాన్ ఆ ప్రాంతంపై విరుచుకుపడింది. ఆస్పత్రి నుంచి వెంటనే వెళ్లిపోవాలని చైనాసైన్యం బెతూన్కి చెప్పింది. బెతూన్ బృందం గుర్రాలపై ఆ గ్రామం విడిచి మరో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయింది. గ్రామాలనీ, ఆస్పత్రినీ శత్రు సైనికులు ధ్వంసం చేశారు. మరో చోట వైద్యసేవలు ప్రారంభించారు. గాయపడ్డ సైనికులు మన దగ్గరకు రావడం కాదు, మనమే గాయపడ్డ వారి దగ్గరికి వెళ్లాలని బెతూన్ చెప్పారు. గుర్రాల మీద పర్వతాలు దాటడం, ఎక్కడికక్కడే వైద్యం చేయడం, ఒక గ్రామంలో వున్న చిన్న ఆస్పత్రిలాంటి దాన్ని ఆపరేషన్ థియేటర్లా మార్చాడు. ప్రజల ఇళ్ల మధ్య శత్రువుకి కనిపించకుండా వుండేది. ఆపరేషన్లు సరిగ్గా చేయడం కోసం గుమ్మడికాయలకి `క్షవరం` చేసి వాటికి గాట్లు పెట్టాలని విద్యార్థులకు చెప్పేవాడు. మత్తు మందు ఇవ్వడం ఎలాగో నేర్పేవాడు. నేరుగా యుద్ధరంగంలోకే వెళ్లడానికి సంచార
వైద్యబృందాలని సిద్ధంచేశాడు.
ఐడియా యిచ్చిన గాడిద!
ఓ రోజు ఓ గ్రామీణుడు ఓ గాడిద మీద రెండు వెదురు బుట్టలేసుకుని వచ్చాడు. తక్షణం బెతూన్కి ఐడియా తట్టింది. ఆపరేషన్ గదికి, కట్లు కట్టే కేంద్రానికి కావాల్సిన వస్తువులన్నీ సరిపోయేలా కలిసి వుండే రెండు చెక్కపెట్టెల్ని తయారు చేయించాడు.
అది పరిస్తే కట్టుకట్టే బల్లవుతుంది.
రెండు పెట్టెల్ని మడత పెడితే, గాడిద మీద
అటూ యిటూ వేసి మరో చోటికి తీసుకుపోవచ్చు. గెరిల్లా పోరులో చివరి సంవత్సరం 1939 ఫిబ్రవరిలో హోపెయ్ రాష్ట్రంలో. యుద్ధం భీకరంగా జరుగుతోంది. గుర్రాలపై బయలుదేరిన బెతూన్ వైద్యబృందం హోపెయ్ చేరుకుంది. యుద్ధరంగానికి మూడు కిలోమీటర్ల దూరంలో చిన్న ఆస్పత్రి. నిర్విరామంగా వైద్యం చేస్తూనే వున్నాడు. రెండు రాత్రులు, రెండు పగళ్లు అవిశ్రాంతంగా పని. ఇంతలో దగ్గర్లోనే బాంబు పేలింది. ఆస్పత్రి వెనకగోడ కూలిపోయింది. ఎక్కడైనా దాక్కోవాలని సూచించారు మిత్రులు. ఇక్కడ నా రక్షణ ముఖ్యం కాదు. నాకు సౌఖ్యం అవసరంలేదు అని పని కొనసాగించాడు. అలా బెతూన్ వైద్యం వల్ల కోలుకున్న వందలమంది తిరిగి
యుద్ధరంగానికి వెళ్లారు.
ఓ రోజు గాయపడ్డ సైనికుణ్ని తీసుకొచ్చారు. అతనికి కాలు తీసివేయాలి. రక్తం అవసరం. చాలా మంది రక్తం ఇస్తామన్నారు. మీరంతా ఇప్పటికే రెండు మూడుసార్లు రక్తం యిచ్చి వున్నారు. నాది `ఒ` గ్రూపు రక్తం. ఎవరికైనా సరిపోతుంది అని బెతూన్ తన రక్తం యిచ్చారు. అంతా సంభ్రమంతో బెతూన్ని చూస్తుండి పోయారు. మరో గ్రామం, మరో ఆస్పత్రి. గబగబా వైద్యసేవ. శత్రుసైన్యం వస్తోందని తెలిసినా తెగించి పనిచెయ్యడం, శత్రువు దగ్గరికి రాగానే గుర్రాలెక్కి వేగంగా వెళిపోవడం, సరిహద్దులో,
నదుల పక్కన, కొండవాలుల్లో ఒకటీ రెండూ కాదు. వంద సాహసాలు చేశాడు బెతూన్.
రాత్రిపూట దీపం పట్టుకుని వార్డుల్లో తిరిగేవాడు. సైనికుల్ని పలకరించేవాడు.
చైనా సైన్యానికి నిధులు, మందులు తీసుకురావడానికి కెనడా వెళ్లాలనుకున్నాడు బెతూన్. అప్పటికి ఆయన వయస్సు 49 సంవత్సరాలు. 1939 అక్టోబర్ 20న వెళ్ధామనుకున్నాడు. జపాన్ దాడులు మహోగ్రరూపం దాల్చాయి. ప్రయాణం వాయిదా పడింది. చర్మవ్యాధి వున్న ఒక సైనికుడికి ఆపరేషన్ చేస్తున్నప్పుడు బెతూన్ వేలికి గాయమై, ఇన్ఫెక్షన్ సోకింది. వద్దన్నా వినకుండా గుర్రం ఎక్కి యుద్ధరంగానికి బయల్దేరాడు. బలహీనంగా వున్నప్పటికీ మరో 16 గంటలపాటు వైద్యం చేశాడు. నవంబర్ 9న బెతూన్ ఆరోగ్యం క్షీణించింది. వెనక్కి వెళిపోదాం, మీకు చికిత్స అవసరం అని మిత్రులు బెతూన్ని ఒప్పించారు.
గుర్రాల మీద చలిలో ప్రయాణిస్తూ నవంబర్ 10వ తేదీకి మారుమూల పచ్చరాయి గ్రామానికి బెతూన్ని చేర్చారు. ఆయన్ని రక్షించుకోవడం కోసం చైనా డాక్టర్లు వచ్చారు. బెతూన్ చేతికి గాంగ్రిన్ అయ్యింది. చెయ్యి వెంటనే తీసేయాలి. బెతూన్ ఒప్పుకోలేదు. ఆయన మెలకువగానే వున్నాడు. “ఇక వైద్యసేవ చేయలేనందుకు బాధగా వుంది అన్నాడు. నాకు వచ్చింది సెప్టీ సేమియా-నన్నెవరూ రక్షించలేరు. విజయం సాధించబోయే కొత్త చైనాని చూడలేకపోతున్నాను“ అన్నారు.
నవంబర్ 11న మిలటరీ కమాండ్ అతి
కష్టమ్మీద ఒక ఉత్తరం… “చైనాలో నేను గడిపినవి అర్థవంతమైన సంవత్సరాలు. కెనడా కమ్యూనిస్టు పార్టీకి, అమెరికా ప్రజలకూ యీ నా మాటలు తెలియజేయండి“ అని రాశారు.
1939 నవంబర్ 12న గెరిల్లా డాక్టర్ హెన్రీ నార్మన్ బెతూన్ కన్నుమూశాడు.
మావో ఒక ప్రత్యేక సంతాప సందేశంలో బెతూన్కి నివాళులర్పించారు.
ART OF HEALING WAS HIS PROFESSION
HIS EXAMPLE WAS AN EXCELLENT LESSON అన్నారు మావో.
బెతూన్ అంతిమయాత్ర
బెతూన్ మృతదేహాన్ని తీసుకుని సైనికులూ, పార్టీ కామ్రేడ్స్ మంచు కప్పిన కొండల గుండా ఒక వూరేగింపుగా నాలుగు రోజులు నడిచి వెళ్లారు. షాన్సి అనే ఒక సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. కెనడా జెండా లేకపోవడ వల్ల అమెరికా జాతీయ పతాకాన్ని బెతూన్ మీద కప్పి, ఖననం పూర్తి చేశారు. 1952లో బెతూన్ అస్తికలను సేకరించి రాజధాని బీజింగ్కి
300 కి.మీ దూరంలోని విప్లవవీరుల శ్మశానవాటికకు తరలించారు. దానికి దగ్గర్లోనే బెతూన్ అంతర్జాతీయ శాంతి ఆస్పత్రి నిర్మించారు. అందులోనే బెతూన్ స్మారక మందిరం వుంది. ప్రతీయేటా వేలమంది దానిని సందర్శిస్తూ వుంటారు.
LAST WORDS
న్యూయార్క్ శానిటోరియంలో చనిపోతాననే దిగులుతో, ఒక మ్యూరల్ కింద
బెతూన్ రాసిన కవిత ఇది:
Sweet death, thou kindest angel of them all
In thy soft arms, at last, O, let me fall
Bright stars are out, long gone the burning sun
My little act is over and the tiresome play is done.
కష్టాల్లోవున్న ఇతరుల సహాయం చేయడమే
జీవితానికి అర్థం అని .. బెతూన్ ఆదర్శం
మనకి చెబుతోంది.
ఎక్కడి కెనడా? ఎక్కడి చైనా?
త్యాగం కాగడా అయి వెలిగిన జీవితం
వేలమందికి ప్రాణదానం చేసింది.
– తాడి ప్రకాష్. 9704541559
Share this Article
Ads