జనం నవ్వడం వేరు… జనం నవ్విపోవడం వేరు..!! మొదటిది జనాన్ని కామెడీతో నవ్వించడం… రెండోది జనం వెక్కిరిస్తూ నవ్వడం..!! జనాన్ని ఏడ్పించడం, రెచ్చగొట్టడం, ఇతరత్రా ఉద్వేగాలకు గురిచేయడం ఈజీ… కానీ నవ్వించడం కష్టం… నవ్వించే కసరత్తులో తేడా వస్తే జనం నవ్విపోతారు, ఆ ప్రయత్నం చేసినవాడు నవ్వులపాలవుతాడు… అంతా నవ్వులాటగా మారిపోతుంది…! మన సినిమా, టీవీ ఇండస్ట్రీలకే వద్దాం… నవ్వించే షోలు టీవీల్లో ఇప్పుడు బోలెడు… జబర్దస్త్ దగ్గర నుంచి మాటీవీ కామెడీ స్టార్స్ దాకా… అంతెందుకు, ఈటీవీ వావ్, క్యాష్, అలీతో సరదాగా… అన్ని షోలలోనూ కాస్త నవ్వించే ప్రయత్నాలే… చివరకు న్యూస్ చూస్తుంటే మన నాయకుల మాటలు, ప్రకటనలు, వ్యాఖ్యలు చూస్తుంటే అదీ నవ్వించడమే… ఈ స్థితిలో ఒక ప్రేక్షకుడిని థియేటర్ దాకా రప్పించి, వాడి జేబు ఖాళీ చేయించి మరీ నవ్వించాలంటే… ఆ కామెడీలో ఎంత దమ్ముండాలి..? అదుగో సందీప్ కిషన్, రాజేంద్ర ప్రసాద్ నటించిన తాజా సినిమా గల్లీ రౌడీ ఈ మథనాన్నే కలిగిస్తుంది…
హీరో సందీప్ కిషన్ కామెడీ పండించడంలో తోపు… రాజేంద్ర ప్రసాద్ మహా తోపు… నిర్మాత కోన వెంకట్ కూడా తోపే… దర్శకుడు నాగేశ్వరరెడ్డి కూడా మరో తోపు… వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, వైవా హర్ష అదనపు తోపులు… మరి ఇన్ని తోపులు కలిస్తే సినిమా నవ్వుల్ని పండించాలి కదా… అబ్బే, ఏందిర భయ్, సినిమాను ఇలా తీశాడు అని ఏడుపు మొహాలు పెట్టేస్తాం… నిజానికి సినిమాలో కామెడీ పండకపోవడం గురించి కాదు, ఈ దర్శకుడు సినిమాను మరీ ముఫ్పయ్ ఏళ్లు లేటుగా తీశాడేమిట్రా అనే జాలి కలుగుతుంది… ఎయిటీస్, నైంటీస్ అయితే ఫాఫం, అప్పటి ప్రేక్షకులు ఏం చూపించినా చూశారు, చప్పట్లు కొట్టారు… కానీ ఇప్పుడు టీవీ షోలు, సీరియళ్లు, ఓటీటీలు, వెబ్ సీరీస్, యూట్యూబ్ వీడియోలతో ప్రేక్షకులు కూడా చాలా ముందుకు వెళ్లిపోయారు…
Ads
హేమిటో రౌడీ అంటే సాము నేర్చుకోవాల్సిందే అంటాడు, అదేదో ప్రధాన అర్హత అయినట్టు… రౌడీలకు స్టామినా అవసరమే గానీ, అదే ప్రధానార్హత కాదు, కనిపించినవాళ్లను కొట్టేసి, రక్కేస్తే రౌడీయిజం కాదు… ఓ తాత, తను రౌడీ, ప్రత్యర్థిగా మారిన మరో రౌడీతో అవమానం… తన కొడుకును ప్రయోగించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే కుదరదు, చివరకు మనమడిని రౌడీగా తీర్చిదిద్దే పనిచేస్తాడు… అసలు రౌడీగా తయారు చేయడం అనేదే ఫన్నీ… ఓ కానిస్టేబుల్ ఉంటాడు, రెండు కోట్ల భూమిని ఎవడో కబ్జా చేస్తే ఏమీ చేయలేడు… కానీ బిడ్డ ఊరుకోదు, అదేలెండి హీరోయిన్ అన్నమాట… హీరో సాయంతో విలన్‌కు కిడ్నాప్ చేసి, ఆ సొమ్ము కక్కించాలని ప్లాన్, తీరా వాడు హరీమంటాడు మధ్యలోనే… తరువాత ఇంకో భీకర విలన్ వస్తాడు… గందరగోళంగా ఉంది కదా… అవును, కథంతా అంతే… అదేమిటో గానీ హీరో సందీప్ కిషన్ అనుకుంటాం కదా… ఫాఫం, రాజేంద్ర ప్రసాద్ చుట్టే కథ తిరుగుతుంది… హీరోకు, విలన్‌కు భీకరంగా బిల్డప్ ఇవ్వబోయి, అది వర్కవుట్ గాక బేర్‌మంటాడు దర్శకుడు… చివరకు కథ అటూ ఇటూ తిరిగీ తిరిగీ, నడుమ నవ్వించలేని కామెడీ సీన్ల బారినపడి… చివరకు శుభం కార్డు పడి, ప్రేక్షకులు ఊపిరి పీల్చుకుంటారు… ఇంతకుమించి ఈ సినిమా గురించి ఏం రాసినా, అది ప్రేక్షక పాఠకుడికి గల్లీ రౌడీ చూపించినంత పాపం… అందుకే ఇక్కడ ఆపేద్దాం…!!
Share this Article