Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గుల్జార్… ఏక్ ప్రేమ్ కహానీ… beyond the borders….

March 7, 2023 by M S R

దాయాది దేశానికి చెందిన ఓ వ్యక్తి… కానీ, రెండు సరిహద్దుల ఆవలి నుంచి అతడి ఓ రెండు ప్రేమకథలు మనల్ని కట్టిపడేస్తాయి. అతగాడి కథవైపు మన దృష్టిని తిప్పుకునేలా చేస్తాయి. తాజాగా వచ్చిన ఓ సీతారామమో.. గతంలో యష్ చోప్రా తీసిన ఓ వీర్ జరానో కాదు.. అంతకుమించిన భిన్నమైన ప్రేమకథ ఈ గుల్జార్ ది. రండీ.. ఓసారి విందాం… ఆ ప్రేమకథలో కథానాయకుడి కోసం ఇటు భారత్.. అటు పాక్ నుంచి ఇద్దరు మహిళల నిరీక్షణెంత… ఆ పోరాటంలోని గాఢతెంటో ఓసారి తెలుసుకుందాం.

హైదరాబాద్‌ అతిపెద్ద సెంట్రల్ జైల్.. చర్లపల్లికెళ్లితే అందులో వందలాది మంది ఖైదీల్లో ఓ పాకిస్థానీ పౌరుడు కూడా ఆ ఊచలు లెక్కబెడుతూ కనిపిస్తాడు. అతడే ఈ కథలో కథానాయకుడు. పేరు షేక్ గుల్జార్ మాసిహ్.. అలియాస్ గుల్జార్ ఖాన్. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని కులువాల్ కు చెందిన ఈ 55 ఏళ్ల గుల్జార్… ఇప్పటికే ఏడాదికి పైగా జైలులో గడుపుతున్నాడు. ఇప్పటికీ గుల్జార్ బెయిల్ విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.

అయితే, ఇటు భారత్… అటు పాకిస్తాన్ సరిహద్దుకిరువైపులా ఇద్దరు మహిళలు గుల్జార్ రాక కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అందులో ఒకరు షీలాలాల్. ఈమె రావల్పిండివాసి. ఇస్లామాబాద్‌లో పనిచేస్తున్నారు. అయితే, గుల్జార్ పట్ల ఈమె నిరీక్షణకు కారణం.. గుల్జార్  షీలాలాల్ ఏడుగురు తోబుట్టువుల్లో ఒకడు. 2010 నుంచి సౌదీ అరేబియాకు వెళ్లిన గుల్జార్ అదృశ్యమైనప్పటి నుంచి షీలా.. తమ్ముడు గుల్జార్ జాడకై ప్రయత్నిస్తూనే ఉంది. అసలు గుల్జార్ బతికే ఉన్నాడా… లేక, చనిపోయాడా అన్న విషయం కూడా కుటుంబ సభ్యులకు తెలియని ఓ దు:ఖస్థితి.

Ads

గుల్జార్ కోసం నిద్ర లేని రాత్రుల్లో మా అమ్మ ఏడ్వటం.. ఆమె రంది పడటం ఏకంగా ఆమె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసింది అంటోంది రావల్పిండిలో ఉన్న షీలా. వాస్తవానికి గుల్జార్ క్రైస్తవ కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి లాల్ ఖాన్ గొర్లకాపరి. షీలా, ఆమె సోదరి.. ఉన్నత విద్య కోసం మిషనరీ సంస్థల్లో చేరారు. గుల్జార్ మాత్రం బడి మానేసి.. సియాల్‌కోట్‌కు వెళ్లాడు. క్రీడా వస్తువుల తయారీ కేంద్రమైన సియాల్ కోట్ లో గుల్జార్ ఫుట్‌బాల్స్ తయారు చేసే ఓ ఫ్యాక్టరీలో చేరాడు. కానీ, ఎన్నాళ్లో గుల్జార్‌కు ఆ ఉద్యోగం నచ్చలేదు. దాంతో సౌదీ అరేబియా వెళ్లేందుకు ప్లాన్ చేశాడు.

కానీ, వెళ్లాలంటే డబ్బవసరం. అలా గుల్జార్ అవసరం తీర్చేందుకు తన తల్లి వాళ్లకున్న భూమిని అమ్మేయాల్సి వచ్చింది. అలా మొత్తానికి సౌదీ బాట పట్టిన గుల్జార్.. అక్కడ ఓ పెయింటర్ అవతరామెత్తాడు. తను సంపాదించిన మొత్తంలో కొంత డబ్బు ఇంటికి పంపిస్తూ.. కుటుంబ సభ్యులకు క్రమం తప్పకుండా ఫోన్ చేస్తుండేవాడు. కానీ కొన్నేళ్ల తర్వాత డబ్బు రాకపోగా.. గుల్జార్ ఫోన్ చేయడం కూడా మానేశాడు.

gulzar

మొత్తంగానే కనిపించకుండా పోయిన గుల్జార్ కోసం.. తన యజమాని, అక్కడి పనిచేసే తోటి సహచరులు కూడా వెతికారు. అయినా, గుల్జార్ ఆచూకీ మాత్రం తెలియలేదు. అప్పటికే ఆందోళన చెందుతున్న గుల్జార్ కుటుంబం.. ముఖ్యంగా సోదరుడిపై అమిత ప్రేమను కల్గి ఉన్న షీలా.. గుల్జార్ ను వెతికేందుకు ఏడుగురు సోదరుల్లో ఒకరిని ఏకంగా సౌదీ అరేబియాకు పంపించారు. రెండేళ్ల తర్వాత పంపిన మరో సోదరుడు రిక్తహస్తాలతో వచ్చాడే తప్ప.. గుల్జార్ ఆచూకీ మాత్రం లభించలేదు. దాంతో గుల్జార్ చనిపోయాడనే భావించారు కుటుంబీకులు.

కట్ చేస్తే 2011, జనవరిలో.. గుల్జార్ ఆంధ్రప్రదేశ్‌లోని గడివేముల అనే గ్రామంలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ పాకిస్థాన్ రావల్పిండీలో తమ్ముడికై ఎదురుచూస్తున్న షీలాది ఒక అఫెక్షనల్ స్టోరీ అయితే.. ఇదిగో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని ఎక్కడో గడివేములలో గుల్జార్ తో ప్రేమలో పడింది దౌలత్ బీ. ఎక్కడ పాకిస్థాన్.. ఎక్కడ రావల్పిండి.. ఎక్కడ సౌదీ.. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ గడివేముల… విధి అంటే ఇంతేనేమో అనిపించేలా లేదూ ఈ ప్రేమ కథ..?!!

సౌదీలో పనిచేస్తున్నప్పుడు సహచరుల వల్ల ఏర్పడిన పరిచయంతో.. ఓ గడివేములకు చెందిన వితంతువు దౌలత్ బీ తో గుల్జార్ కు కనెక్షన్ కుదిరింది. దౌలత్ బీ ఓ బిడ్డ తల్లి కూడా. 2009 నుంచి నేటి సాంకేతిక విప్లవమైన ఫోన్ ఎక్కడో సౌదీలో ఉన్న పాకిస్థానీ గుల్జార్ నూ.. ఆంధ్రప్రదేశ్ గడివేములకు చెందిన దౌలత్ బీని కల్పింది. అలా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. ఏకంగా 2011, జనవరి 25వ తేదీన అలా 55 ఏళ్ల గుల్జార్, 41 సంవత్సరాల దౌలత్ బీ జంట కర్నూల్ లోని ఓ మసీద్ లో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.

కానీ, గుల్జార్ పాకిస్థాన్‌ వ్యక్తని మాత్రం దౌలత్‌కు ఇంకా తెలియదు. తనను తాను గుల్జార్ పంజాబ్ కు చెందినవాడుగా పరిచయం చేసుకున్నాడు. విషాదానికి మరో విషాదం ముడిపడినట్టు.. గుల్జార్ కోసం తన సోదరి ఎలాగైతే తన కోసం పాక్ లో ఎదురుచూస్తోందో.. గడివేములలో దౌలత్ బీ కూడా కనిపించకుండా పోయిన మానసిక వికలాంగుడైన ఆమె తమ్ముడి కోసం నిరీక్షిస్తుండటాన్ని విధి అనాలా.. కాకతాళీయమనాలా అన్నది మరో ప్రశ్న..? దౌలత్ బీ తండ్రి గడివేముల మసీదుకు ఇమామ్‌గా పనిచేసేవారు. ఆమె దివంగత భర్త ఓ తాపీ మేస్త్రీ. దౌలత్ బీకి బిడ్డ పుట్టిన తర్వాత.. ఆమెకు వరుస విషాదాలు ఎదురవుతూనే ఉన్నాయి.

guljar
అయితే గుల్జార్ తో కేవలం ఫోన్ సంభాషణతోనే దౌలత్ బీకి ముడిపడలేదు. దౌలత్ వద్దనుకుంటున్నా గుల్జార్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు. దాంతో మొత్తంగా గుల్జార్ మాటలు.. ఆ తర్వాత పెరిగిన పరిచయంతో దౌలత్ తనకు ఇంట్లో రెండో పెళ్లి కోసం చూస్తున్న సంబంధాలను కూడా తిరస్కరించింది. దౌలత్ ఇష్టాన్ని గౌరవించిన కుటుంబీకులు కూడా గుల్జార్ తో మాట్లాడటం.. దౌలత్ వితంతువని, ఓ బిడ్డ తల్లి అని తెలిసినా గుల్జార్ పెళ్లికి ఒప్పుకోవడం.. దౌలత్ తాను పనిచేస్తున్న స్కూల్ లో సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకోవడంతో.. ముందు గుల్జార్ ను ఓసారి చూడాలని నిర్ణయించుకున్నారు. దాంతో గుల్జార్ ముంబైకి చేరుకున్నాడు.

దౌలత్ దిశానిర్దేశంతో ఇంకేం ఏపీలోని గడివేములకూ వచ్చేశాడు. కానీ, దౌలత్ బీ బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించగా.. విచారించిన పోలీసులు గుల్జార్‌కు క్లీన్‌చిట్ ఇచ్చారు. అప్పటివరకూ గడివేములలో గుల్జార్ భారత్ లోని పంజాబ్‌కు చెందినవాడనే అందరి అభిప్రాయం. వివాహానంతరం గుల్జార్ గడివేములలో స్థిరపడ్డాడు. పెయింటింగ్ చేస్తూ సంపాదిస్తూనే.. గ్రామంలో తల్లోనాలుకైపోయాడు. సమయం వచ్చినప్పుడు తన కుటుంబాన్ని పరిచయం చేస్తాననీ దౌలత్ కు చెప్పాడు.

అలా సంసారం కొనసాగుతున్న దౌలత్.. గుల్జార్ దంపతులకు 2011- 2019 మధ్య నలుగురు పిల్లలు జన్మించారు. అయితే అంతకుముందున్న సవతి కొడుకు పట్ల మాత్రం గుల్జార్ ఎన్నడూ చిన్నచూపు చూడలేదు. అంతేకాదు గుల్జార్ లో ఓ పెయింటరే కాకుండా.. ఓ కవి ఉన్నాడని.. ఆయన రాసిన ఉర్దూ కవితలు భార్య దౌలత్ బీకి అంతే బిగ్గరంగా వినిపించేవాడన్నది ఆ గ్రామస్థులు చెప్పే మాట. దౌలత్ బీకి ఎన్నోసార్లు కోపం వచ్చినా గుల్జార్ ప్రశాంతత మాత్రం ఆమెను ఆయన్ను మరింత ప్రేమించేలా చేసేదట.

తెలుగు భాషతో పాటుగా స్థానికంగా ఉండే స్లాగ్ ని కూడా త్వరగానే ఒంటబట్టించుకున్న గుల్జార్.. 2018 నుంచి పాకిస్థాన్‌లో ఉంటున్న తన కుటుంబాన్ని కలుసుకోవాలన్న తహతహలో మాత్రం కనిపించేవాడంటారు అక్కడి స్థానికులు. అలా ఓరోజు గుల్జార్ నుంచి ఫోన్ కాల్ అందుకున్న షీలాకు.. దశాబ్దం తర్వాత ఉన్నాడో, లేడో తెలియని తన సోదరుడి గొంతును విన్న రోజు.. నిబిడాశ్చర్యంతో మూర్ఛబోయినంత పనైందట.

రావల్పిండి ప్రావిన్స్ లోని కులువాల్‌కి దగ్గరగా ఉండే ఓ వ్యక్తితో గుల్జార్‌ ఫేస్‌బుక్‌ స్నేహం.. గుల్జార్ జీవించే ఉన్నాడనే కబురును తన సోదరి షీలా కుటుంబానికి తెలియపర్చింది. తను మళ్లీ కులువాల్ కి వస్తానని చెప్పిన గుల్జార్.. దౌలత్ ని తన సోదరికి పరిచయం చేశాడు. ఓ రోజు భార్య, పిల్లలతో కలిసి పాకిస్థాన్ కు వెళ్లడానికి ప్రయాణం సిద్ధమైంది. స్థానిక పోలీసులకూ విషయం తెలియజేయగా ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం కాలేదు.

అలా 2019, నవంబర్ లో ఓరోజు గడివేముల నుంచి సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుని ఢిల్లీ రైలు కోసం ఎదురుచూస్తోంది గుల్జార్ కుటుంబం. ఇదిగో ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది. తెలంగాణా కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పాకిస్థాన్‌కు గుల్జార్ చేసిన కాల్స్‌పై.. అప్పటికే ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీస్ నిఘా కొనసాగుతోంది. గుల్జార్ దగ్గర భారతీయ పాస్‌పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడి అన్నీ లభించాయి. తాను పాక్ కు వెళ్లే విషయాన్ని కూడా కర్తార్ పూర్ కు యాత్రకు వెళ్తున్నట్టుగా పేర్కొన్నాడు. అలా 1946 విదేశీయుల చట్టం, దేశంలోకి అక్రమ చొరబాటు పేరిట 1920 పాస్‌పోర్ట్ చట్టం, అలాగే1967 పాస్‌పోర్ట్‌ల చట్టంలోని వివిధ సెక్షన్‌ల కింద పత్రాలను మోసపూరితంగా పొందడం వంటి పలు అభియోగాలతో కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు గుల్జార్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

ఉత్తరాఖండ్‌కు చెందిన వ్యక్తిగా నటిస్తూ సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయానికి గుల్జార్ వెళ్లాడని.. పాస్‌పోర్ట్స్ పోగొట్టుకున్న సందర్భంలో.. లేదా, దొంగిలించబడిన, చిరిగిపోయిన సందర్భాల్లో పౌరులకిచ్చే ఎమర్జెన్సీ సర్టిఫికెట్ పేరిట దరఖాస్తు చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అలా సౌదీ నుంచి భారత్ లోకి ప్రవేశించి దౌలత్ ను పెళ్లి చేసుకున్న గుల్జార్ అరెస్ట్ తో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. దౌలత్ ఇంట్లోనూ రైడ్ చేసిన అధికారులు గుల్జార్ వస్తువులన్నింటినీ సీజ్ చేశారు. పాక్ లో ఉన్న గుల్జార్ కుటుంబానికీ సమాచారమందించారు. గుల్జార్‌ను రిమాండ్‌పై హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.

గుల్జార్ నిర్లక్ష్యపు చర్యలు.. ఏకంగా అతని కుటుంబాన్నే ప్రమాదంలోకి నెట్టడంపై ఇప్పుడాయన కుటుంబీకులు తల్లడిల్లుతున్న పరిస్థితి. కానీ, గుల్జార్ స్వతహాగా మంచి మనిషన్నది భార్య దౌలత్ అభిప్రాయం. పరిస్థితులు మాత్రమే గుల్జార్ అబద్ధాలు చెప్పడానికి కారణమయ్యాయన్నదే దౌలత్ బీ వాదన. అలా తన భర్త కోసం చందాల రూపేణా కూడా డబ్బు పోగు చేసి.. తాను మళ్లీ స్కూల్ లో చేరి.. న్యాయపరమైన ఖర్చుల కోసం డబ్బు సంపాదించింది దౌలత్.

ఏడాది తర్వాత గుల్జార్‌కు బెయిల్ మంజూరైంది. ఇటు గడివేములలోని గుల్జార్ కుటుంబం.. గ్రామంతో పాటు.. అటు పాక్ లోని కుటుంబీకులు కూడా సంతోషించారు. కానీ, ఆ సంతోషం ఫిబ్రవరి 9, 2022 న మళ్లీ ఆవిరైంది. పోలీసులు మళ్లీ గుల్జార్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు తేలే వరకు బెయిల్‌పై ఉంటాడని భావించిన కుటుంబసభ్యులకు… ప్రభుత్వ నిర్బంధ ఉత్తర్వులు గొంతులో పచ్చి వెలక్కాయను దింపాయి.

ప్రస్తుతం గుల్జార్ కేసును హైదరాబాద్‌లోని న్యాయవాది M.A. షకీల్ వాదిస్తున్నారు. ఫారినర్స్ యాక్ట్, 1946లోని సెక్షన్ 32 (2) (ఇ) ప్రకారం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకునే అధికారం రాష్ట్రానికి లేనందున.. కేసును సవాల్ చేశారు. సెక్షన్ 32 (2) (జి) కింద కేంద్రం మాత్రమే అరెస్టు చేయగలదన్నది న్యాయవాది వాదన. కేంద్రం రాష్ట్రానికి ఈ అధికారం ఇవ్వనప్పుడు, వారు ప్రజలను ఎలా నిర్బంధిస్తారన్నది న్యాయవాది ప్రశ్న..?

ఇక ఇప్పుడెలాగైనా తన భర్తను విడిపించుకునేందుకు మరో న్యాయపోరాటానికి సిద్ధమైంది దౌలత్ బీ. పాక్ లోని తన అత్తమామలతోనూ రెగ్యులర్ గా వీడియో కాల్స్ మాట్లాడుతూ అభిమానాన్ని చూరగొంది. దౌలత్ పాక్ లో నివసించేందుకు సిద్ధపడితే తాము ఆహ్వానించేందుకూ సిద్ధమంటోంది గుల్జార్ కుటుంబం. లేదంటే భారతదేశంలోనే ఉండాలనుకుంటే కూడా అదీ తమకు సమ్మతమేనన్నది వారి అభిప్రాయం.

ఎక్కడున్నా తన సోదరుడు.. అతడి కుటుంబం సురక్షితంగా హాయిగా ఉండాలన్నదే పాక్ లో గుల్జార్ కుటుంబీకుల ఆకాంక్ష. తాను తన భర్తతో శాంతియుత జీవితాన్ని గడపాలని కోరుకుంటున్న దౌలత్ బీ.. అది భారతైనా, పాకైనా ఎక్కడైనా ఓకే అంటోందిప్పుడు. మరి ఈ గుల్జార్ ఏక్ ప్రేమ్ కహానీకి ఎలాంటి ఎండ్ కార్డ్ పడుతుందన్నదే ఈ కథలో ఒకింత ఆసక్తి, ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న..?

అనువాదం: రమణ కొంటికర్ల..✍🏽

(ది వీక్ సౌజన్యంతో… )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions