ఆ రాత్రి గడిచిపోనివ్వండి…. – మహమ్మద్ ఖదీర్‌బాబు
బాంబేలోని బాంద్రా నుంచి పెడర్ రోడ్‌కు 15 కిలోమీటర్లు ఉంటుంది. కారులో గంట గంటన్నర పట్టొచ్చు. ఈ కొద్ది దూరం, ఆ కాస్త సమయం ఒక విలువైన ప్రాణం తీయగలదు– మంకుపట్టుకు పోతే.
అక్టోబర్ 9, 1964.
ఆ సాయంత్రం నుంచి గురుదత్ పెడర్ రోడ్‌లోని తన ఇంటిలో తాగుతూ కూచున్నాడు. అతనికి హఠాత్తుగా తన కూతురు నీనాను చూడాలనిపించింది. ఇష్టం ఆ పాపంటే. అప్పటికి సంవత్సరం రోజులుగా గీతాదత్ అతనితో లేదు. పిల్లలు ముగ్గురిని తీసుకుని బాంద్రాలో ఉంటోంది. అప్పుడప్పుడు కలుస్తున్నారు తప్పితే సయోధ్య కుదరలేదు. గురుదత్‌కు ఆమె కావాలని ఉంది. అప్పటికి ఆమెలో అతనిపై ప్రేమ చచ్చిపోయింది.
Ads
‘పిల్లల్ని పంపు కారు పంపుతాను’ అని గురుదత్ ఫోన్.
‘రాత్రి తొమ్మిదైపోతూ ఉంది. పిల్లలు నిద్ర పోయారు. రేపెలాగూ స్కూల్ అయ్యాక కలుస్తారుగా’
‘పంపాల్సిందే’
‘నువ్విలాగే చేస్తావు’
గురుదత్ ఫోన్లు చేస్తున్నాడు. ఆమె జవాబివ్వడం లేదు. పిల్లల్ని పంపడం లేదు. ‘నాకు నా కూతుర్ని చూడాలని ఉంది’ గురుదత్ ఆక్రందన చేస్తున్నాడు. ‘పంపకపోయావో నా శవాన్నే చూస్తావు’ బెదిరిస్తున్నాడు. ఇతనిది మంకుపట్టు. ఆమె ఏ ఉద్వేగం అంటని మృతమనస్సు. తెల్లవారింది. గురుదత్ మరణించి కనిపించాడు.
రేపటి వరకు అతను ఆగలేదు. అడుగుతున్నాడు కదా అని ఆ రాత్రి ఆమె కరగలేదు. ఒక రాత్రి ఎన్ని జీవితాలను ధ్వంసం చేసింది?
గురుదత్ తనను ప్రేమించి పెళ్లాడే సమయానికి గీతాదత్ సూపర్‌స్టార్. గురుదత్‌ను స్టార్ చేయడంలో ఆమె చరిష్మా ఉంది. ఆమె అతణ్ణి నమ్మింది. అతడు మరో స్త్రీ ఆకర్షణలో పడటం తీవ్రమైన నమ్మకద్రోహంగా భావించింది. గురుదత్‌కు డిప్రెషన్ ఉంది. మానసిక సమస్యలున్నాయి. రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రతిసారీ నోట్ రాశాడు. మూడోసారి నోట్ లేదు. పైగా మరుసటిరోజు రాజ్‌కపూర్‌తో మీటింగ్ ఉంది. కోపం, ఆగ్రహం, ఉక్రోషం, మారాం చేస్తే పోయిన ప్రేమ తిరిగి రావచ్చనే బాలచేష్ట, నేను లేకుండాపోయి నిన్ను దండిస్తాననే తెంపరితనం ఇవన్నీ గురుదత్‌ను తీసుకెళ్లాయి. మద్యం, వాటిలో కలుపుకున్న నిద్ర మాత్రలు… ప్రమాదంలో ప్రమోదం.
గురుదత్ మరణించాక ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కోలుకోలేదు. ఒకరు గీతాదత్. మరొకరు జానీ వాకర్. గీతాదత్‌కు మానసిక బలం పూర్తిగా పోయింది. ఆమె ఉన్నన్ని రోజులు పిల్లలు గాని స్నేహితులు గాని బంధువులు గాని గురుదత్ అనే మాటే ఎత్తలేదు. ఆ పేరు తాకితే ఆమె ఏ భావనో తెలియదు ఆ భావనతో కుప్పకూలేది. వివాహ ప్రయత్నాలు చేస్తే? ‘నా జీవితంలో గురుదత్ మాత్రమే ఉండాలి… ఉంటాడు’. కాని ఆ గురుదత్‌ను ఆ రాత్రి ఆమె కాపాడుకుని ఉండొచ్చు. ఆ రాత్రి అతడు ఆమెకు మిగిలి ఉండొచ్చు.
అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎవరూ చెప్పడం లేదు. ఏవో మానసిక సమస్యలు వస్తాయి. ఎవరూ వెళ్లబోసుకోవడం లేదు. తనను ఎవరూ ప్రేమించడం లేదని అనిపిస్తుంది. ఆ మాట అరచి చెప్పడం లేదు. ఒంటరిభావన అనిపిస్తుంది. పంచుకోవడం లేదు. నిస్సహాయ స్థితిలో ఉన్నాను సాయం చేయండి అనడానికి నామోషీ. బంధాల పట్ల ఎవరు ఎటైనా పోనీ అనే మంకుపట్టు. చూసి చూసి… విసిగి విసిగి… ఒక రాత్రి వస్తుంది. ఆ రాత్రి పడగవిప్పి ఆడుతుంది. మనసు ఏదైనా ఒకటి అసాధ్యమైనది సులభసాధ్యం చేయమని ఉసిగొల్పుతుంటుంది. అలాంటి పని చేస్తే అయినా లోకం తన గురించి గొల్లుగొల్లుమని ఏడుస్తుందేమోనని ఆశ కలుగుతుంది.
ప్రియమైన మిత్రులారా… ఆ రాత్రి దాటిపోనివ్వండి. ఆ రాత్రి మంచిగా తిని నిద్రపోండి. ఆ రాత్రి పాటలు వినండి. ఆ రాత్రి బస్సెక్కి ఏదైనా ఊరిలో ఇష్టంగా పలకరించే మిత్రుని దగ్గరకు బయలుదేరండి. ఆ రాత్రి మీ ఫ్యామిలీ ఆల్బమ్‌ను తిరగేస్తూ కూచోండి. ఆ రాత్రి మీ మనసులో ఉన్నదంతా తెల్లకాగితం మీద గీకి, బరికి, దాని మీద ఊసి, ఉండచుట్టి డస్ట్‌బిన్‌లో వేయండి. ఆ రాత్రి మీ పొరుగువారి తలుపు బాది కాళ్ల మీద పడి కాపాడమని చెప్పండి. ఓదార్చమని చెప్పండి. ఏడ్వండి. తల బాదుకోండి.
కాని ఆ రాత్రిని జరిగిపోనివ్వండి. కరిగిపోనివ్వండి.
పరువూ ప్రతిష్ట… పోతే పోతాయి. ఉంటే ఉంటాయి. ప్రాణాలతో మీరు మీ వాళ్లకు ఉంటారు. మీకు ఉంటారు. గురుదత్ జీవించి ఉంటే ఏం తీసేవాడోగాని తీస్తున్న వాళ్లందరినీ చూసి వెక్కిరించేవాడు కదా. అందుౖకైనా ఉండాలి. గీతాదత్ సంతోషంగా ఉండుంటే లతాతో నేనింకా ఉన్నాను అనగలిగేది కదా.
సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు. ఈ దిక్కుమాలిన పన్నెండు గంటల్లో ఏదో సాధిద్దామని ఘనకార్యాలు చేసేయకండి. తెల్లవారనివ్వండి. – జూలై 9, 2024……. (నేడు గురుదత్ శతజయంతి మొదలు)
Share this Article