Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

H-Fast – హైదరాబాద్‌ కడుపుకి చికిత్స – ఫుడ్ సేఫ్టీ హల్‌చల్ !!

July 2, 2026 by M S R

.

గమనిస్తున్నారా..? నిశ్శబ్దంగా ఓ కొరడా హైదరాబాదులోని ఫుడ్ సెంటర్లపై విరుచుకుపడుతోంది… ప్రచార పటాటోపాలు, ప్రకటనలు, హంగామా ఏమీ లేదు… ఫాస్ట్‌గా ఓ ప్రక్షాళన ప్రక్రియ సాగుతోంది… అదే ఫుడ్ సేఫ్టీ..! రోజురోజుకూ బయటపడే బోలెడు అక్రమాలు విస్తుగొలుపుతున్నాయి…

కల్తీ మసాలాలు, రోజుల తరబడీ నిల్వ చేసిన ఆహారం, మాంసం, చికెన్, పన్నీర్, గ్రేవీ, బిర్యానీ… అనేకసార్లు వాడీవాడీ మాడిన వంట నూనె… బొద్దింకలు, ఎలుకలు, ఈగలు, దోమలు… గుట్కా పాకెట్లు, ఓపెన్ డ్రెయిన్లు… అత్యంత అనారోగ్య పరిస్థితుల్లో కిచెన్లు… ఒక్క ముక్కలో చెప్పాలంటే హైదరాబాద్ కడుపును కుళ్లబెట్టారు ఇన్నేళ్లు… ఆ దుర్వాసనే ఈ దాడుల్లో బయటికొస్తోంది…

Ads

  • డబ్బు ఇచ్చి మరీ మనం డబ్బా ఫుడ్ కొంటున్నాం, తింటున్నాం… మనకుమనమే మన కడుపుల్ని కుళ్లబెడుతున్నాం… పర్యవసానం..? దేశంలోనే మనం డయాబెటిక్ హబ్… ఒబెసిటీ, బీపీ, గట్ హెల్త్, వాటి సైడ్ ఎఫెక్ట్స్… కార్పొరేట్ హాస్పిటల్స్‌ డబ్బు వండుకుంటున్నాయి… అంటే డబ్బు పెట్టి మరీ రోగాల్ని పెంచుకుంటున్నాం… ఇది విశ్వనగర లక్షణమేనా..? కాదు, అస్సలు కాదు… మరి పరిష్కారం..?

ఇప్పుడు H-Fast పేరిట ఫాస్ట్‌గా ఓ చికిత్స జరుగుతోంది… అత్యంత అపరిశుభ్ర, అనారోగ్య ఆహార కేంద్రాలపై దాడులు, కేసులు, ప్రక్షాళన… H-Fast అంటే ఫుల్ ఫామ్ Hyderabad Food Adulteration Surveillance Team… మీకు బాగా గుర్తుండాలంటే ఇలా రిజిష్టర్ చేసుకొండి…

  • H-Fast అంటే Hyderabad Fast… H-Fast అంటే hygiene Fast… H-Fast అంటే Hyderabad Fast food… వెరసి హైజీన్ హైదరాబాద్..! ఎందుకు ఈ దుస్థితి వచ్చింది మరి..? అదీ కీలకం… తెలంగాణ స్వరాష్ట్రం వచ్చాక పదేళ్లు పాలించిన కేసీయార్, తన వారసులు, సహచరులు, అనుచరుల కళ్లన్నీ భూములపైనే! పెద్ద పెద్ద షోఅప్స్… ప్రచారాలు, డప్పులు…

 

కానీ లివింగ్ కండిషన్స్ మీద అంతులేని నిర్లక్ష్యం… ప్రత్యేకించి ఫుడ్..! అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, హైరైజ్ బిల్డింగులు మాత్రమే కాదు… వరల్డ్ క్లాస్ సౌకర్యాలు కూడా! అందులో ఒకటి నగరవాసి ఆరోగ్యం కూడా..! దాన్ని కేసీయార్ పాలన అస్సలు పట్టించుకోలేదు… ఆ సోయి ఉంటే కదా అసలు..?

లక్షల మంది కడుపు చేత్తో పట్టుకుని ఈ నగరానికి వలస వస్తున్నారు… వర్కింగ్ మెన్, వుమెన్ హాస్టళ్లు, స్టూడెంట్ హాస్టళ్లు, పీజీలు, క్లౌడ్ కిచెన్లు, స్ట్రీట్ ఫుడ్, పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లే కాదు, వీటి వ్యాపారమే చాలా రెట్లు… దాదాపు హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ కూడా ఓ కుంగిన మేడిగడ్డ బరాజు… పోలిక కరెక్టే…

ఫుడ్ సేఫ్టీ ఎందుకు కూలిపోయింది? … హైదరాబాద్‌లో ఈరోజు దాదాపు 70 వేలకుపైగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్లౌడ్ కిచెన్లు, క్యాటరింగ్ యూనిట్లు, ఫుడ్ డెలివరీ యాప్స్, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి… లెక్కకు రానివి మరిన్ని రెట్లు… కానీ కేసీయార్ పాలనలో వాటిని తనిఖీ చేయాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారుల సంఖ్య? కేవలం 16 మంది… 

అందుకే రేవంత్ రెడ్డి రాగానే తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానమైంది ఫుడ్ సేఫ్టీ… అంటే చికిత్స… అంటే CURE… నిజానికి CURE అంటే… ఓఆర్ఆర్ లోపల ఓ నిజమైన విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి… అంటే Core Urban Region Economy… విదేశీ నగరాలకు దీటుగా నిలవాలనే సంకల్పం… మూసీ, మెట్రో2, ఫ్యూచర్ సిటీ నాణేనికి ఒక కోణం… మరో కోణం..?

అనారోగ్య లక్షణాలకు, వ్యాధులకు  క్యూర్ కూడా… అంటే చికిత్స… కేసీయార్ పదేళ్ల పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన నగరానికి చికిత్స… అందులో ఒకటి… హైదరాబాద్ కడుపుకి తక్షణ చికిత్స కూడా..! అవును, ప్రపంచనగరం కావాలంటే ప్రపంచస్థాయి జీవన ప్రమాణాలు కూడా కావాలి… అంటే లివింగ్ కండిషన్స్ మెరుగుపడాలి… దానికే CURE… ఈ చికిత్సలోనే మూసీకి చికిత్స… రవాణా కష్టాలకు చికిత్స… అలాగే గట్ క్యూర్ కూడా..!

అందుకే ఓ ‘ఫుడ్ పోలీస్’ ప్రవేశపెట్టబడ్డాడు… ఇందులో కేవలం మున్సిపల్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే కాదు, ఫుడ్ క్వాలిటీకి సంబంధించిన ప్రతి విభాగం (GHMC, FSSAI, Police Etc) అధికార్లు ఉంటారు… ఈ టీమ్స్ విరుచుకుపడుతున్నాయి.., మచ్చుకు కొన్ని అంకెలు కావాలా..?

  • చార్మినార్‌లో లైసెన్స్ లేకుండా నడుస్తున్న ఓ ఫాస్ట్‌ఫుడ్ గోదాంపై H-FAST దాడి చేసింది… అక్కడ 110 కిలోల తయారుచేసిన చికెన్, 90 లీటర్ల పదేపదే వాడిన వంటనూనె, నిషేధిత ఆర్టిఫిషియల్ కలర్స్, FSSAI లైసెన్స్ లేకపోవడం, అత్యంత అపరిశుభ్రమైన నిల్వలు బయటపడ్డాయి… ఇద్దరిని అరెస్ట్ చేశారు…

 

  • మరో దాడిలో 825 కిలోల ‘అనలాగ్ చీజ్’ను పన్నీర్ పేరుతో విక్రయిస్తున్న ముఠా బయటపడింది… “ప్రీమియం పన్నీర్”, “మలై పన్నీర్”, “ఫ్రెష్ పన్నీర్” పేర్లతో అసలు పన్నీర్ కాని ఉత్పత్తులను మార్కెట్లోకి పంపుతున్నట్లు గుర్తించారు… 45 రిటైల్ అవుట్‌లెట్లు, 8 తయారీ యూనిట్లపై దాడులు జరిగాయి…

మల్లేపల్లి… ఉస్మాన్ మటన్‌ షాప్ పేరుతో మటన్ లో బీఫ్ కలిపి హోటళ్లకు సరఫరా… ఈ ఒక్క ఉదాహరణ చాలుకదా, హైదరాబాదులో ఏం జరుగుతున్నదో చెప్పడానికి!!

  • రాయదుర్గంలోని షా ఘౌస్, హైటెక్ సిటీలోని మెహఫిల్, మాధాపూర్‌లోని ఓ కిచెన్‌పై తనిఖీల్లో పిండిలో చనిపోయిన బొద్దింకలు, మినప్పప్పులో పురుగులు, కిచెన్‌లో ఈగలు, ఓపెన్ డ్రైన్లు, గుట్కా మరకలు, లేబుళ్లు లేని ఆహారం, సిబ్బందికి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం వంటి షాకింగ్ ఉల్లంఘనలు బయటపడ్డాయి…

జనంలో కొనుగోలు శక్తి పెరిగింది, ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు, హోటళ్లకు వెళ్తున్నారు, కానీ ఏం తింటున్నారు? ఇదీ సమస్య… ఆర్డర్ రాగానే పాత కుళ్లిన ఆహారాన్నే వేడి చేసి, అందంగా ప్యాక్ చేసి, “హాట్ అండ్ ఫ్రెష్” పేరుతో ఇంటి గుమ్మానికి చేరవేయడం ఒక వ్యాపార మోడల్‌గా మారిపోయింది…

  • ఇది కేవలం పరిశుభ్రత సమస్య కాదు… ఇది ప్రజారోగ్య సమస్య… ఇటీవల వెలువడిన ICMR ఆధారిత అధ్యయనం ప్రకారం తెలంగాణలో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, ప్రజలు తమ నెలవారీ ఆహార ఖర్చులో గణనీయమైన భాగాన్ని అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌పైనే వెచ్చిస్తున్నారు… అలాంటి ఆహార వినియోగం టైప్-2 డయాబెటిస్ పెరుగుదలతో బలమైన సంబంధం కలిగి ఉంది… తెలంగాణను అధిక ప్రమాద ప్రాంతంగా కూడా అధ్యయనం పేర్కొంది…

 

అందుకే చికిత్స అత్యవసరమైంది… అదే H-Fast… ఒక నెలలోనే 61 కేసులు, 64 అరెస్టులు, దాదాపు 15 టన్నుల కల్తీ, నాసిరకం ఆహార పదార్థాల స్వాధీనం— ఇవి చిన్న సంఖ్యలు కావు. ఈ దాడుల్లో కల్తీ పన్నీర్, నాసిరకం నెయ్యి, అల్లం- వెల్లుల్లి పేస్ట్, టీ పొడి, మాంసం, వంటనూనెలు, ఇతర ఆహార పదార్థాలు బయటపడ్డాయి…

ప్రశ్న ఒక్కటే… ఇంతకాలం ఇవన్నీ ఎక్కడ దాగి ఉన్నాయి? ప్రజలు ఇన్నేళ్లు తిన్నది ఏమిటి? పెద్ద బోర్డు ఉంటే నాణ్యత కూడా పెద్దదే అని ఎందుకు అనుకోవాలి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అంశంపై కనిపిస్తున్న దూకుడు నిశ్శబ్దంగా ఓ మార్పును తీసుకొస్తోంది… కడుపుకి చికిత్స జరుగుతోంది…

ఎందుకంటే… హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చాలంటే కేవలం స్కైస్క్రాపర్లు చాలవు… ప్రపంచ స్థాయి ఫుడ్ సేఫ్టీ కూడా కావాలి… విదేశీ కంపెనీలు వస్తే సరిపోదు. విదేశీయులు భయపడకుండా తినగలిగే ఆహారం కూడా ఉండాలి… “హైదరాబాద్ అంటే బిర్యానీ” అనే బ్రాండ్‌ను నిలబెట్టుకోవాలంటే… ముందు “హైదరాబాద్ అంటే సురక్షితమైన ఆహారం” అనే నమ్మకం రావాలి…

Yes, Hyderabad not just an IT Hub, But a city that knows how to feed it’s people safely… అదే క్యూర్, అంటే చికిత్స… So, H for Hygeine… H for Hyderabad..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • H-Fast – హైదరాబాద్‌ కడుపుకి చికిత్స – ఫుడ్ సేఫ్టీ హల్‌చల్ !!
  • మావిగన్! ఆంధ్రుల రాజధాని ఇక ఎప్పటికీ ఓ ప్రశ్నార్థకమే!!
  • గోల్డ్ మార్కెట్! మన ‘బంగారు తల్లుల’ కొత్త పాఠాలు – అనూహ్య మార్పు!!
  • ‘తిరుచ్చిలో మా పోటీ అనైతికం’ – త్రిష కాళ్లల్లో లారెన్స్ కట్టెలు!
  • ఎవరు జర్నలిస్టు..? ఏది పత్రికాస్వేచ్ఛ..? ఓ దిక్కుమాలిన నిరర్థక చర్చ..!!
  • అక్కినేనితో ఒకటే – నందమూరితో ఒకటే – విజయశాంతితో లాస్ట్!
  • ఫామ్‌హౌజులో పశుపతి బందీ! – విమర్శలకు క్రియేటివిటీతో పదును!
  • తల్లిదండ్రుల ఓవర్ కంట్రోల్ అసలు సమస్య – చేతన్ భగత్ విశ్లేషణ!
  • ‘God Of War’… నాగవంశీ కొత్త మంట … ‘God Of South & North War’
  • భాగ్యరాజా సక్సెస్ స్టోరీలో కొన్ని ఫ్లాపుల కోణాలూ ఉన్నయ్!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions