ప్రజాస్వామ్యమా!
చూస్తున్నావా తోపుడుస్వామ్యం?
———————-
“మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పై పైకి!
Ads
కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,
హృదంత రాళం గర్జిస్తూ,
పదండి పోదాం”
ఇది శ్రీ శ్రీ కవిత అని చెప్పాల్సిన పనిలేదు. తెలుగు కవితను ఊరించి, ఊగించి, ఊరేగించి, శ్వాసించి, శాసించిన కవి శ్రీ శ్రీ. తెలుగు కవిత శ్రీ శ్రీ కి ముందు శ్రీ శ్రీ తరువాత అని చెప్పుకోవాలి.
ఈ కవిత కర్ణాటక శాసనమండలి సభ్యులకు అర్థం కాకపోవచ్చు. అసలు ఈ కవితను వారు చదివి ఉండకపోవచ్చు. చట్టసభలకు వెళ్లడానికి విద్యార్హతే అనవసరమయినప్పుడు కవితలు చదవాల్సిన అవసరం ఉండదు కూడా. కానీ శ్రీ శ్రీ కవితలో ఉన్న-
“పదండి ముందుకు
పదండి తోసుకు”
అన్న మాటను మాత్రం కర్ణాటక శాసనమండలి సభ్యులు అక్షరాలా పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో జరిగిన తోపులాట దృశ్యాలు చర్చనీయాంశమయ్యాయి. పెద్దల సభలో తోపులాటలో ఎవరికీ గాయాలు కాలేదు. ఎలాంటి ప్రాణాపాయం లేదు.
సాధారణంగా చర్చలకోసం చట్ట సభలు లేదా చర్చించి చట్టాలు చేయడానికి చట్టసభలు అని అకెడెమిక్ గా అనుకుంటాం. అంతకు మించి మామూలు కంటికి కనిపించని ఇంకా ఎన్నో చట్టసభల్లో జరుగుతుంటాయి. కొన్ని కంటికి ప్రత్యక్షంగా కనిపిస్తున్నా అది నిజంగా అది కాకపోవచ్చు. అది ఇంకేదో అయి ఉండవచ్చు.
కర్ణాటక శాసనమండలి తోపులాటను కూడా మరో ప్రస్థానానికి చేరే మరోకోణంలోనే చూడాలి.
1 . చర్చను పక్కదారి పట్టిస్తున్నప్పుడు, సభను పక్కదారి పట్టిస్తున్నప్పుడు గౌరవ సభ్యులు సభాధ్యక్షుడినే పక్కకు తీసుకెళ్లాలి.
2 . టగ్ ఆఫ్ వార్ అని తాడు లాగే పోటీలు జరుగుతుంటాయి. తాడును అటు ఒక జట్టు, ఇటు ఒక జట్టు పట్టుకుంటుంది. ఎవరి వైపు బలంగా లాక్కోగలిగితే వారు గెలిచినట్లు. చట్ట సభల్లో కూడా అంతే. సభను, సభాధ్యక్షుడిని ఒకవైపు జట్టు లాగేసుకుంది.
3. కర్ణాటక శాసన మండలి తోపులాటలో గెలుపు ఎవరిది అని నిర్ణయించడానికి మిగతా వ్యవస్థలకు అధికారం లేదు. తోపులాటకు గురయిన సభాధ్యక్షుడే కుదుటపడ్డాక తోపులాట ఫలితాలను సభలోనే ప్రకటించాలి.
4 . తోపులాట ఫలితాల ప్రకటన సమయంలో మళ్లీ తోపులాటే జరగకూడదని ఆటలో నియమేమీ లేదు.
5 . ప్రజాస్వామ్యం శారీరకంగా, సైద్ధాంతికంగా, మానసికంగా, విధానపరంగా బలపడడానికి తోపులాటలు బాగా ఉపయోగపడతాయి.
6 . ఇకపై పార్టీలు అభ్యర్థులకు బి ఫారం ఇవ్వడానికి ముందు- తోపులాటలో వారి అభినివేశాన్ని, నైపుణ్యాన్ని, బలాన్ని తప్పనిసరిగా రుజువు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రజాస్వామ్యమా!
చూస్తున్నావా తోపుడుస్వామ్యం?
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article