.
Subramanyam Dogiparthi ….. జంధ్యాల గారికి విజయా వారి మాయాబజార్ సినిమాకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుగా ఉంది . ఆ సినిమాలోని మూడు పాటల మకుటాలతో మూడు సినిమాలు తీయటమే కాకుండా ఆ సినిమా ద్వారా పాపులర్ అయిన పింగళి గారి పలుకు హైహై నాయకాతో కూడా ఓ సినిమా చేసాడు .
- 1989 లో వచ్చిన ఈ హైహై నాయకా సినిమాకు ఓ గొప్ప ప్రత్యేకత ఉంది . నోరు తెరిస్తే పచ్చి బూతులు తప్ప మరో మాట రాని పొగరుబోతు పిల్లాడిని బుధ్ధిమంతుడుగా తీర్చిదిద్దిన ఓ మాస్టారి మీద సినిమా ఇది . టైటిల్సులో ఉపాధ్యాయులను కించపరచటం మా ఉద్దేశం కాదని నమస్కార బాణం వేసారు . వాస్తవానికి ఉపాధ్యాయ వృత్తికి గౌరవం పెంచిందీ సినిమా .
ఈ సినిమాలో బుల్లి రాయుడులాంటి విద్యార్ధులు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మాకు కళాశాల స్థాయిలో కూడా అప్పుడప్పుడు తారసపడుతుంటారు . విసుగుపడకుండా సామ దాన బేధ దండోపాయాలను ఉపయోగిస్తూ ఉంటాం . అంతటి గొప్ప అవకాశం మా ఉపాధ్యాయ వృత్తికే దొరుకుతుంది .
Ads
చక్కటి కధను వ్రాసిన ఆదివిష్ణుని , తగ్గట్టు స్క్రీన్ ప్లేని , సంభాషణలను తయారు చేసుకున్న హాస్యబ్రహ్మ జంధ్యాల వారిని మెచ్చుకోవలసిందే .
కధ టూకీగా ఏంటంటే ..: నరేష్ బామ్మ సూర్యకాంతం చాటు కుర్రాడు . రాజమండ్రి కాలేజీలో చదువుకునే సమయంలో ఒకమ్మాయిని ప్రేమిస్తాడు . అమ్మాయీ ప్రేమిస్తుంది . నరేష్ తొందరపడి హీరోయిన్ శ్రీ భారతిని ముద్దు పెట్టుకుంటాడు . ఆమెకు కోపం వచ్చి గెటవుట్ అంటుంది .
నరేష్ తెలుగు మాస్టారి ఉద్యోగం పోయాక బామ్మకు తెలియకుండా చిన్నాచితకా పనులు చేస్తుంటాడు . ఆ పరిస్థితిని చూసిన బామ్మ ఏదో విధంగా పెళ్లి , ఉద్యోగం కొరకు తాపత్రయపడుతూ ఉంటుంది . ఇదిలా ఉండగా హీరోయిన్ గ్రామంలో వాళ్ళ నాన్న కొడుకు కోసమే ఓ స్కూల్ కట్టిస్తాడు .
ఈ బుడతడు నోరు తెరిస్తే తండ్రిలాగా బూతులు తిడుతూ ఉంటాడు . ఆరు నెలల్లో ఆ బుడతడిని రిపేర్ చేయకపోతే స్కూల్ పడగొట్టి రైస్ మిల్లు కట్టేసి మాస్టర్ల చేత మూటలు మోయిస్తానని ప్రకటిస్తాడు . మాస్టర్లు అందరూ కలిసి నరేషుని రంగంలోకి దించుకుంటారు .
సామ దాన బేధ దండోపాయాలను ఉపయోగించి ఆ బుడతడిని ఫుల్లుగా రిపేర్ చేస్తాడు నరేష్ . నరేష్ సహోపాధ్యాయులు శ్రీలక్ష్మి , సంధ్య హీరోయిన్ మనసును మార్చి పెళ్లికి ఒప్పిస్తారు . ఆఖరి నిమిషంలో బామ్మ హీరోయినుకి టెన్షన్ పెట్టాలని నరేషుని పిల్లి పిల్లల్ని తిప్పినట్లు తిప్పుతూ ఉంటుంది . బుడతడి సహాయంతో పెళ్ళి జరగటంతో సినిమా సుఖాంతం అవుతుంది .
జంధ్యాల హాస్య రస చిత్రాలు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది . ఒక్కో పాత్రకు ఒక్కో మేనరిజం . సినిమా అంతా సరదా సరదాగా సాగిపోతుంది . ఎక్కడా బోరించదు . సుత్తి వేలు , శ్రీలక్ష్మి పెళ్ళి గోల , పుచ్చా పూర్ణానందం పెళ్లి గోల , బ్రహ్మానందం సంధ్యల పెళ్లి గోల సబ్ ప్లాటులో రన్ అవుతాయి . సినిమా చివర్లో మొత్తం నాలుగు పెళ్ళిళ్ళతో సమాప్తం అవుతుంది .

నరేషుకు ఇలాంటి పాత్రలు అప్పటికే కొట్టిన పిండి అయిపోయాయి . బాగా నటించాడు . హీరోయిన్ శ్రీ భారతి కొత్తమ్మాయి . పెద్ద గ్లామరస్ గా ఉండదు . ఎందుకు ఎంపిక చేసుకున్నారో ! ఈ సినిమా తర్వాత మళ్ళా ఏ సినిమాలో కనిపించినట్లుగా లేదు . ముఖ్య పాత్రలు రాయుడు గారిగా కోట శ్రీనివాసరావు , బుడతడుగా మాస్టర్ విన్నకోట వెంకట్ లవి . ఇద్దరూ అదరగొట్టేసారు .
చాదస్తపు , పొసెసివ్ బామ్మగా సూర్యకాంతం . ఆమె నటన గురించి చెప్ప మనమెంత ! ఇతర పాత్రల్లో బ్రహ్మానందం , సుత్తి వేలు , బట్టల సత్యం , జిత్ మోహన్ మిత్రా , సుబ్బరాయ శర్మ , అశోక్ కుమార్ , గుండు హనుమంతరావు , చిట్టిబాబు , శ్రీలక్ష్మి , సంధ్య తదితరులు నటించారు .
మాధవపెద్ది సురేష్ సంగీత దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇదే . పాటలన్నీ బాగుంటాయి . గురువంటే గుండ్రాయి కాదు పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . ఇది సరిగమలెరుగని రాగము , అచ్చులు పదహారు , ముధ్దొచ్చే పాప ముంచావే కొంప అంటూ సాగుతాయి మిగిలిన పాటలు . అన్నీ శ్రావ్యంగా ఉంటాయి .
జొన్నవిత్తుల , ముళ్ళపూడి శాస్త్రి పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , జానకమ్మలు పాడారు . షూటింగ్ అంతా రాజమండ్రి , గోదావరి , విశాఖ పరిసర ప్రాంతాల్లో చేసారు . ఇ వి వి సత్యనారాయణ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ .
అయ్యబాబోయ్ బూతు బూతు అనే అరుపుల గోల సరదాగా ఉంటుంది . అలాగే తింగరి చచ్చినోడా అనే సూర్యకాంతమ్మ తిట్టు కూడా . అప్పటికి తింగరోడు అనే మాట విన్నట్లుగా లేదు . ఇంతకముందు చూసి ఉన్నా మరలా చూడవచ్చు . చక్కటి చిక్కటి కాలక్షేపం . సినిమా యూట్యూబులో ఉంది .
నేను పరిచయం చేస్తున్న 1212 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article