.
( రమణ కొంటికర్ల ) ….. జులపాల జుట్టుతో అభిమానుల్ని అలరిస్తాడు ధోనీ… మిల్ట్రీ కట్టింగ్ కు వెస్టర్న్ పోకడలు యాడ్ చేసి వీరాభిమానుల్ని పిచ్చెక్కిస్తాడు కోహ్లీ.. పైన కిరీటం పెట్టినట్టు, మధ్యలో అంతా మధ్యరాత్రి ఎలుకలు కొరికినట్టు.. కింద బవిరి గడ్డంతో తనవైపు దృష్టిని లాగేసుకుంటాడు శ్రేయాస్ అయ్యర్.
అయితే, వీరంతా క్రికెట్ ప్లేయర్స్ మాత్రమే. కానీ, బిజినెస్ మ్యాన్ అనంత్ అంబానీ నుంచి రోహిత్ శర్మకైనా.. సినీస్టార్ రణబీర్ కపూర్ కైనా ఇప్పుడు ఒకే ఒక్కడు హెయిర్ స్టైలిస్ట్. అంత మంది సెలబ్రిటీలను కాలానికనుగుణంగా ట్రెండీగా ఉంచుతున్న ఆ హెయిర్ డ్రెస్సరే…
Ads
ఆమధ్య అంబానీ ఇంట్లో వేడుకల్లోనూ ఆ కుటుంబీకులకు, వచ్చిన అతిథులకు హెయిర్ డ్రెస్సింగ్ అదరగొట్టి ఓ చర్చయ్యాడు. ముంబై గల్లీలో సెలూన్ ప్రారంభించి… అంబానీలు, అదానీలు ఆయన లేందే హెయిర్ కటింగ్ చేసుకోని స్థాయికెదిగిన అతగాడు ఇప్పుడు కాసింత గుర్తింపు కోరుకుంటున్నాడు.
అవును, తెరపై మిలమిల మెరిసే తారలకే కాదు.. ఆ తారల ఆహార్యాన్ని రూపొందించడంలో కీలక పాత్రధారులైన హెయిర్ స్టైలిస్టులకూ అవార్డ్స్ పంపిణీలో స్థానం దక్కాలన్నది ఇప్పుడు ఆలీం హకీం విజ్ఞప్తి లాంటి డిమాండ్.
అంతర్జాతీయంగా ఆస్కార్, బాప్టా వంటి అవార్డ్స్ లోనూ హెయిర్ స్టైలిస్టులకు గుర్తింపుంటోంది. వారినీ అవార్డ్స్ కు నామినేట్ చేస్తున్నారు. పురస్కారాలందిస్తున్నారు. కానీ, మన బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ వంటి చోట్ల మాత్రం ఎందుకా ఆస్కారం లేకుండా పోతోందన్నదే ఇప్పుడు ఆలీం హకీం బాధ.
కాబట్టి, మనదేశంలో కూడా ఫిలింఫేర్, నేషనల్ అవార్డ్స్, జీసినిమా అవార్డ్స్, ఐఫా అవార్డ్స్ ఇచ్చే న్యాయనిర్ణేతలను, వాటిని నిర్వహించే సంస్థలను.. తమ పేర్లనూ అవార్డుల జాబితాలో చేర్చాలని అడుగుతున్నాడు. అదేదో అవార్డ్ ఇస్తే వచ్చే ట్రోఫీ కోసమో.. అందే ప్రైజ్ మనీ కోసమో కాదని.. కేవలం తాము చేస్తున్న కృషికి ఓ గుర్తింపుగానైనా భావిస్తాం కదా అంటూ ఓ రిక్వెస్ట్ చేస్తున్నాడు.
దక్షిణాది సినిమాలైన ఒక రోబో, మరో జైలర్, ఓ బాహుబలి, ఓ సాహూ.. అటు ఉత్తరాదిలో విడుదలై సంచలనంగా మారిన యానిమల్, సంజు, వార్, చావా, శ్యామ్ బహదూర్ ఇలాంటి సినిమాలన్నింటిలోనూ ఆయా క్యారెక్టర్స్ కు అద్భుతమైన రూపాన్నిచ్చిన హెయిర్ స్టైలిస్ట్ ఆలీం హకీం.
తనలాగే హెయిల్ స్టైలిస్ట్ గా పనిచేస్తున్నవారితో పాటు.. సినిమా మాధ్యమంలో కీలకమైన క్రాఫ్ట్స్ అన్నింటినీ సమానంగా చూసే ఒక విధానముండాలనేది ఇప్పుడు హకీం ఆవేదన.
దేశంలో అత్యంత ప్రభావితం చేస్తున్న స్పోర్ట్స్ స్టార్స్, సినీ స్టార్స్, బిజినెస్ టైకూన్స్.. బయటకొస్తే వేసుకునే డ్రెస్సు, ధరించే ఆభరణాలు, పెట్టుకునే గాగుల్స్.. మొత్తంగా గ్రూమింగ్ బాగా కనిపించాలంటే.. ప్రతీ దానివెనుక ఎంతో శ్రద్ధ కనిపిస్తుంది.
ఎందుకంటే లక్షలు, కోట్ల మంది అభిమానులు తమను ఆదరిస్తున్న క్రమంలో.. కాలు బయట అడుగు పెడితే వారి అంచనాలకు తగ్గట్టు కనిపించడంతో పాటు.. తమకేది అనుకూలంగా అనిపిస్తుంది.. దానికి ఆయా రంగాల ఫ్యాషన్ డిజైనర్స్ ఏమంటున్నారన్న దాన్నిబట్టే వారి స్వరూపం మనకు బయట కనిపిస్తుంది.
వాటన్నింటిలోకి ప్రధానంగా దృష్టి సారించాల్సిన విషయాల్లో డ్రెస్సింగ్ ఎలాగో.. ఆ తర్వాత, అందరినీ ఆకట్టుకునేది హెయిర్ డ్రెస్సింగే. మొత్తంగా లుక్కింగ్ వెరీ ఇంపార్టెంట్.
అలాంటి హెయిర్ డ్రెస్సరే ఆలీమ్ హకీమ్. తన 9 ఏళ్ల ప్రాయంలోనే తండ్రి హకీం కైర్వానీని కోల్పోయినాడు. హకీం తండ్రి కైర్వానీ కూడా ఆలీం హకీంలాగే సినిమాల్లో హెయిర్ స్టైలిస్ట్.
ఆయన అమితాబ్ బచ్చన్, సునీల్ దత్, మెహమూద్ తో పాటు.. ఇంటర్నేషనల్ ఫేమ్ బ్రూస్ లీ వంటివారికీ హెయిర్ స్టైలిస్ట్ గా వ్యవహరించిన అనుభవం కలవారు. అమితాబ్ మర్డ్ సినిమాలో పనిచేస్తున్నప్పుడు సరిగ్గా 39 ఏళ్ల వయస్సులో కార్డియాక్ అరెస్టై కన్నుమూశాడు. అదిగో అలాంటి దయనీయ పరిస్థితుల నుంచి.. ముంబై బిండీ బజార్లో పుట్టి పెరిగిన ఆలీం హకీమ్..
అక్కడే చాలామంది హెయిర్ డ్రెస్సర్స్ లాగే ఓ చిన్న హెయిర్ కటింగ్ సెలూన్ పెట్టుకుని 20, 30 రూపాయలకు కటింగ్ చేసే స్థాయి నుంచి.. దిగ్గజాలకు తానే హెయిర్ డ్రెస్సర్ గా ఉండాలనే స్థాయికెదిగాడు. తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్నాడు. ఏదో ఒక రంగాన్ని ఎంచుకున్నప్పుడు అందులో బాగా ప్రాక్టీస్ చేస్తే ఆ రంగాన్నెలా శాసించవచ్చో ఆలీం హకీం వేళ్లల్లోని కత్తెర మాయ మనకు పట్టి చూపుతుంది.
ఆలీమ్ హకీమ్ తండ్రైన హకీమ్ కైర్నవీ… ఆలీమ్ ఎదిగేవరకూ బతికుండుంటే.. తన తండ్రి వారసత్వాన్ని సులభంగానే అందిపుచ్చుకునేవాడేనేమో..?! కానీ, ఆలీమ్ తన తండ్రిని 9 ఏళ్ల వయస్సులోనే కోల్పోయి.. కుటుంబాన్ని పోషించేవారు లేని ఒక విషాద పరిస్థితి నుంచి ఎదిగాడు.
ఇక తండ్రి అంతకాలం చేసిన బాధ్యతలనే ఆలీమ్ భుజానికెత్తుకున్నా… తండ్రే పోయాక తనను ఆ స్థాయిలో ఆదరించేవారెవరు..? అందుకే, ఓవైపు ముంబైలో గ్రాడ్యుయేషన్ చేసుకుంటూనే… మరోవైపు హెయిర్ స్టైలింగ్ లో నిపుణులైన వారివద్ద తర్ఫీదు పొందుతూ.. తన నైపుణ్యాన్ని మెరుగుపర్చుకున్నాడు.
ముంబై స్టార్ హోటల్స్ లో ఉన్న ఓ సెలూన్ లో ఉద్యోగం ఆలీమ్ హకీమ్ జీవితాన్ని మలుపు తిప్పింది. ప్రఖ్యాత తాజ్ హోటల్‌లో ఉన్న మేడమ్ జాక్వెస్ సెలూన్‌లో ఉద్యోగం వచ్చింది. అక్కడే తన నైపుణ్యాన్ని మరింత మెరుగుపర్చుకుంటూ.. తన అసాధారణ ప్రతిభతో హెయిర్ స్టైలింగ్ లో ఓ గుర్తింపు సాధించాడు.
తాజ్ హోటల్ కు వచ్చినవారికి.. కచ్చితంగా మేడమ్ జాక్వెస్ సెలూన్ ను సందర్శించిన వారికి.. ఆలీమ్ హకీమ్ పేరు బాగా వినిపించడంతో పాటు.. అది కాస్తా మౌత్ టాక్ గా స్ప్రెడ్ అయింది. దాంతో విభిన్న రంగాలకు చెందినవారు మేడమ్ జాక్వెస్ సెలూన్ కు క్యూ కట్టడం మొదలెట్టారు.
అప్పటివరకూ ఉన్నదానికంటే ఎక్కువ గిరాకీ రావడంతో పాటు.. వచ్చినవారంతా ఆలీమ్ హకీమ్ తోనే తమ హెయిర్ కటింగ్ చేయించుకుంటామనే స్థాయిలో.. తన నైపుణ్యాన్ని హెయిర్ స్టైలింగ్ లో ప్రదర్శించి ఆకర్షించాడు హకీమ్.
అలా తాజ్ హోటల్ లో వచ్చిన గుర్తింపు కార్డునే ముందరపెట్టుకుని.. ముంబైలో తాను పుట్టి పెరిగిన బిండీ బజార్ లోనే ఓ హై ఫై సెలూన్ ను ఓపెన్ చేశాడు. ఓవైపు హకీమ్ హెయిర్ స్టైల్ కు ఆకర్షితులవుతున్నవారి సంఖ్య.. సెలబ్రిటీల తాకిడెలాగైతే పెరుగుతుందో… తన సెలూన్ వ్యాపారం కూడా అదే స్థాయిలో విస్తరిస్తోంది. అలా ఆలీమ్ హకీమ్ ప్రఖ్యాత స్పోర్ట్స్, బిజినెస్, సినీ స్టార్స్ అందరి దృష్టిలో పడటమే కాదు.. తమకు పెరిగినప్పుడల్లా కటింగ్ హకీమ్ మాత్రమే తీయాలనే చందంగా తయారయ్యారు.
అయితే, ఆలీమ్ హకీమ్ సెలూన్ లో కటింగ్ చేయించుకోవాలంటే.. ఫీజ్ కనీసం ఒక లక్ష రూపాయలుంటుందంటే… ఆయన సెలూన్ కు ఎంత డిమాండో అర్థం చేసుకోవచ్చు. సెలూన్ లో ఎగువ మధ్య తరగతి నుంచి చాలామంది ధనికుల వరకూ హెయిర్ స్టైలింగ్ కు వచ్చేవాళ్లుండగా.. ఇక సెలబ్రిటీలకు హెయిల్ స్టైలింగ్ కు ఆలీమ్ హకీమ్ ఎంత తీసుకుంటాడో జస్ట్ ఊహించుకొండి.
ఇప్పుడు హకీమ్ కస్టమర్లలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, విరాట్ కోహ్లీ, టాలీవుడ్ హీరో ప్రభాస్, ఎం.ఎస్. ధోనీ, అనంత్ అంబానీ, రణబీర్ కపూర్ వంటివారెందరో ఉండగా.. వారెవ్వరిని హకీమ్ హెయిర్ స్టైలింగ్ గురించి టచ్ చేసినా.. హకీమ్ తప్ప తమకెవ్వరు కటింగ్ చేసినా నచ్చదనే స్థాయిలో వారిని ఇంప్రెస్ చేసేశాడు ఆలీమ్ హకీమ్.
అందుకే ఆమధ్య మూణ్నెల్లపాటు అంబానీ ఇంట్లో వివాహ వేడుకల్లో… ఆలీమ్ హకీమ్ ఫుల్ బిజీబిజీగా గడిపాడు. వేడుకలు ప్రారంభమైన్నాట్నుంచి… ముగిసేవరకూ అంబానీ ఇంటికి వచ్చేవారితో పాటు… ఆ కుటుంబీకుల్ని తన కటింగ్ తో స్టన్నింగ్ గా చేయడంతో మరోసారి ఆలీమ్ హకీమ్ పేరు మార్మోగిపోతోంది.
సామాన్య మధ్య తరగతి వారు హెయిర్ సెలూన్ కు వెళ్లితే.. ఇప్పుడు కనీసం నూటా యాభై రూపాయల నుంచి.. 300 వరకూ తలానీలాలకు పెట్టాల్సి వస్తున్న రోజుల్లో… ఆలీమ్ హకీమ్ వంటివారు అంతగా ఎదిగాక లక్ష రూపాయల ఫీజ్ పెద్ద గొప్పేమీ కాకపోవచ్చు. అందుకే, ఇప్పుడు హకీమ్ వార్షికాదాయం యావరేజ్ గా 19 కోట్ల రూపాయలట…….
Share this Article