.
ఏదో ఏ మైకంలోనో బహిరంగ వేదికల మీద పిచ్చి కూతలు కూస్తే, తరువాత సారీలు చెప్పడమో, వివరణ ఇచ్చుకోవడమో బెటర్… కానీ కొందరు ఉంటారు,.. తిక్క సమర్థనలకు దిగుతారు, అంటే కవరింగు.,.
మొన్న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫంక్షన్‌లో నిర్మాత ఎస్‌కేఎన్ ‘ఇకపై తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయకూడదని నేనూ, నా దర్శకుడు సాయి రాజేష్ నిర్ణయం తీసుకున్నామనీ, తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో తెలిసొచ్చిందనీ అన్నాడు…
Ads
అంతకుముందు తను తీసింది వైష్ణవి చైతన్యతో బేబీ అనే సినిమా… ఆమెకు మంచి అప్లాజ్ వచ్చింది, ఆ సినిమాకు ఆమె నటనే ప్రాణం… మరి ఆమెతో ఎక్కడ ఏం బెడిసికొట్టిందో కానీ సదరు నిర్మాత గారికి తెలుగు అమ్మాయిలంటేనే మస్తు కోపం వచ్చేసింది… అందుకని అలా ఆ వేదిక మీద ఏదో కక్కేశాడన్నమాట…
అన్నట్టు, తను బేసికల్‌గా ఫిలిమ్ జర్నలిస్టు అట… ఈమధ్య ప్రతి మీడియా మీట్‌లో ఫిలిమ్ జర్నలిస్టులు అడిగే ప్రశ్నలు మరీ మరీ జనం నవ్వుకునేలా ఉంటున్నాయి కదా, సరే, అది వేరే సంగతి… తెలుగు అమ్మాయిలకు ఇకపై అవకాశాలు ఇవ్వబోం అనే తన వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఫుల్లు ఎక్కి దిగింది… అనగా వాయించిపడేసింది అని…
దీంతో ఓ వివరణ ఇచ్చుకునే విఫల ప్రయత్నం చేశాడు తను… ‘‘సరదాగా నేను చేసిన వ్యాఖ్యలను కొందరు సీరియస్ గా తీసుకుని చిలువలు పలవలుగా ప్రచారం చేస్తున్నారు… జోక్‌ను జోక్‌గా తీసుకోవాలి తప్పితే… నామీద నెగెటివ్ కామెంట్స్ చేయడం తగదు…
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం, ప్రోత్సహించడంలో ముందుంటాను.. ఇంతవరకూ తెలుగులో పలు చిత్రాల ద్వారా రేష్మ, ఆనంది, మానస, ప్రియాంక జవాల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, ఖుషిత పరిచయం అయ్యారు.., అలానే కొత్త సినిమా ద్వారా హారిక అనే అమ్మాయిని పరిచయం చేస్తున్నాం… ఇప్పటికే తెలుగులో పలు చిత్రాలలో నటించిన ఈషా రెబ్బా, ప్రియా వడ్లమాని, హిమజ, ఇనయా వంటి వారినీ ప్రోత్సహించాం…
నా కెరీర్‌లో ఎనభై శాతం తెలుగు అమ్మాయిలతోనే వర్క్ చేశాను… వివిధ శాఖలలో కనీసం 25 మందిని పరిచయం చేయాలన్నది నా టార్గెట్… ఓ ఉద్యమంలా తెలుగు వారిని ప్రోత్సహిస్తున్నాను..’’ అని ఏదో వీడియో రిలీజ్ చేశాడు…
అంతమందిని పరిచయం చేసినవాడివి మరి ఇప్పుడు ఎందుకలా మాట్లాడావు..? జోకా..? అసలు ఇది జోక్ అనడమే పెద్ద జోక్… మీకు సాగుతుందలా… అమ్మాయిలెప్పుడూ ఇండస్ట్రీలో చౌకగా దొరికే సరుకు అనుకుంటారు మీరు, మీరేమన్నా పాపం ఏమీ అనలేరు, స్పందించలేరు, అందరూ రాధికా ఆప్టేలు కాలేరు కదా… పైగా ఉద్యమకారుడు అట… అబ్బో…
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలో ఒక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, మరొక కీ రోల్ కాయదు లోహర్ అనే అస్సామీ అమ్మాయి… మరి తమరి ఉద్యమం ఏమైపోయింది మహాశయా…? చివరకు ఆమె మీద కాయలు, పళ్లు అని పిచ్చి, కుసంస్కార వ్యాఖ్యానాలు… పైగా తను ఉద్యమకారుడట, జోకులేస్తున్నాడట… అబ్బఛా…!!
Share this Article