Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ తల్లిని అక్కడ ప్రతిష్ఠిస్తేనే… ఆత్మాభిమాన ప్రకటనా..? లేకపోతే అపచారమేనా..?!

September 17, 2024 by M S R

ఓ దిక్కుమాలిన వివాదం ఇది… నగరంలోనే కాదు, తెలంగాణవ్యాప్తంగా… ఆ లెక్కన ప్రతి రాష్ట్రంలోనూ లక్షల విగ్రహాలు… వ్యక్తి ఆరాధన సంకేతాలు… అక్కడక్కడా విగ్రహాలకు అపచారాలు, క్షీరాభిషేకాలు, ప్రక్షాళనలు, కేసులు, పంచాయితీలు సరేసరి…

తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం పెట్టడం మీద ఓ డిఫరెంట్ వివాదం… తెల్లారిలేస్తే ఏదో ఒకటి క్రియేట్ చేసైనా సరే, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి, బదనాం చేసి, ఓ అస్థిరతను రేపాలనేది బీఆర్ఎస్ క్యాంప్ స్ట్రాటజీ… ప్రజలు ఛీకొట్టిన తరువాత కాస్త ఆత్మమథనంతో, సమీక్షతో, సరైన పొలిటికల్ అడుగులు వేస్తే వోకే… ప్రతిపక్షంగా, ఓ రాజకీయ పార్టీగా దాని అవసరం అది… వోకే…

కానీ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్టు… ఏదేదో హంగామా చేసి, అర్జెంటుగా రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోకపోతే విపత్తులు, ఉపద్రవాలు, ప్రమాదాలు తప్పవు అన్న రీతిలో వ్యవహరించడం ఓ చికాకు వ్యవహారం కాగా… ప్రతి ఇష్యూకు తెలంగాణ అస్థిత్వాన్ని లింకు పెట్టి, సెంటిమెంటును రాజేసే ప్రయత్నం మరో చిరాకు వ్యవహారం…

Ads

ఆమధ్య ప్రభుత్వ చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం లేవనీ, అది తెలంగాణ అస్థిత్వానికే ద్రోహమనీ విమర్శ… మరీ కొందరైతే అవి తెలంగాణ మతసామరస్యతకు చిహ్నాలనీ, గంగాజమున తెహజీబ్ అనీ వ్యాఖ్యానాలు చేశారు.., చార్మినార్ ముస్లిములకు, కాకతీయ తోరణం హిందువులకు ఎలా ప్రతీకలు అవుతాయి..? చార్మినార్ హైదరాబాద్ అస్థిత్వ ముద్ర… హిందూ, ముస్లింలే కాదు, వందల సంవత్సరాలుగా హైదరాబాదును తమ ఇళ్లుగా చేసుకున్న అనేక ఇతర మతస్థులు, జాతుల వాళ్ల అస్థిత్వ ముద్ర… కాకతీయ తోరణం ఓ రాజ్యానికి చిహ్నం మాత్రమే…

ఎన్నికల్లో ఓడిపోయాక మరీ బీఆర్ఎస్ విధానాలు మరీ పాడి కౌశిక్ మార్క్ సిద్ధాంతాలుగా రూపాంతరం చెందుతున్నాయి… మళ్లీ ఆంధ్రా- తెలంగాణ సెంటిమెంట్‌కు పెట్రోల్ పోసి అంటిస్తున్నారు… ఇప్పుడు సచివాయలం ఎదుట రాజీవ్ విగ్రహావిష్కరణ వివాదమూ అంతే… ఆ స్థల పవిత్రత ఏమిటి..? అక్కడే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనే పట్టు ఏమిటి..? మరి పదేళ్లలో ఎందుకు పెట్టలేదు..? సచివాలయం కట్టినప్పుడు, ఇటు పక్క అమరవీరుల స్మారకాన్ని కట్టినప్పుడు ఎందుకు గుర్తురాలేదు..?

వోకే, సోనియా కుటుంబం పట్ల ప్రస్తుత ప్రభుత్వ ముఖ్యులు తమ అపారమైన విధేయతను ప్రకటించడానికి రాజీవ్ విగ్రహాన్ని పెట్టారనే అనుకుందాం… సో, వాట్..? తను మాజీ ప్రధాని… స్మరణీయుడే… పచ్చి తెలంగాణ వ్యతిరేకుల విగ్రహాలు కూడా ఈరోజుకూ వేలల్లో ఉన్న ఈ నగరంలో రాజీవ్ విగ్రహం ఉంటే తప్పేమిటట..? అక్కడే ఎందుకు పెట్టకూడదట..? పెడితే వీళ్లు అధికారంలోకి రాగానే దాన్ని తీసుకెళ్లి గాంధీభవన్‌లో పడేస్తారట… అసలు అక్కడ తెలంగాణతల్లి విగ్రహం పెట్టకపోతే అది ఢిల్లీకి తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం అనే సూత్రీకరణ ఏమిటి..? ఊరూరా తెలంగాణతల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు ఏమిటి..? తెలంగాణ అస్థిత్వంలో ఆటలనే ఆరోపణలేమిటి..? నమస్తే వాడయితే ఏకంగా అమ్మా తెలంగాణమా, అపచారాన్ని మన్నించమ్మా అంటాడు… ఏం భాష్యాలో, ఏం సూత్రీకరణలో…

ప్రభుత్వమే చెబుతోంది కదా… సచివాలయం ఎదుట కాదు, ఏకంగా సచివాలయంలోనే తెలంగాణతల్లి విగ్రహం పెడతామని..! అధినేత చాన్నాళ్లుగా అదృశ్యం, అన్నీ తానై నడిపించాల్సిన నాయకుడు ఫామ్ హౌజ్ వదిలి రావడం లేదు… వరదలు వంటి ఉపద్రవాల్లో కూడా కానరాడు… కేడర్‌లో నిస్తేజం… ఏ పిలుపులిచ్చినా ఎవరూ స్పందించేవాళ్లు లేరు… అదుగో ఆ నైరాశ్యం నుంచి ఇదుగో ఈ ప్రయత్నాలు… నిజంగా కేటీయార్, హరీష్‌రావు నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే ఫీల్డ్‌లో బోలెడు సమస్యలున్నాయి…

రేవంత్ పాలన తాలూకు వైఫల్యాలు పల్లెల్లో బోలెడు… రుణమాఫీ అడ్డదిడ్డంగా జరిగింది… ఇదొక ఉదాహరణ మాత్రమే… ఛీకొట్టిన జనంలో మళ్లీ ఆదరణ పెంచుకోావలంటే ఇలాంటి సమస్యలపై విస్తృతంగా జనంలోకి వెళ్లాలి… అదీ పోరాడాల్సిన తీరు… అన్ని విషయాల్లోలాగే మిగతా మంత్రులకు కౌంటర్లు చేతకాకపోయేసరికి… ఆ కోపం, ఆ అసంతృప్తి ప్రభావం రేవంత్ రెడ్డి భాషను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తోంది…

విగ్రహం జోలికొస్తే తాటతీస్తా… కేసీయార్ విగ్రహం కోసం ఆ స్థలాన్ని అలాగే ఉంచాలనుకున్నారు, ఫామ్ హౌజుల్లో జిల్లేళ్లు మొలిపిస్తా, రాజీవ్ కంప్యూటర్ పరిచయం చేయకపోతే కేటీయార్ ఇడ్లి-వడ అమ్ముకునేటోడు వంటి దురుసు వ్యాఖ్యలు వస్తున్నాయి… సీఎం పోస్టులో ఏం మాట్లాడినా కాస్త సంయమనం, భాషపై అదుపు అవసరమంటారు కదా… నథింగ్ డూయింగ్, నా భాష ఇదే, కేసీయార్ పార్టీకి ఇదే సరైనది అని రేవంత్ ఫీలింగ్..!!

అవునూ… ఈరోజు తెలంగాణ ఇండియన్ యూనియన్‌లో కలిసిన రోజు… అయితే నిజమే కదా… విద్రోహం, విమోచనం, విలీనం వంటి నానా పేర్లు, వాదనలు, పంచాయితీలు ఉన్నా సరే… ఓ స్వతంత్ర రాజ్యం అంతర్థానమై, దేశంలో ఐక్యమైన రోజునేది నిజమే కదా… విముక్తి అందామా..? దండయాత్ర అందామా..? సామ్రాజ్యవిస్తరణ అందామా..? అదంతా వేరు… కానీ ప్రజాపాలన దినం ఏమిటి..? అంటే రాజరికం పోయి ప్రజాస్వామిక పాలన వచ్చిందని చెప్పడమా..? పోనీ, అదైనా కాస్త జనానికి అర్థమయ్యేట్టు చెప్పొచ్చు కదా… అదీ చేతకావడం లేదు ఈ ప్రభుత్వానికి..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions