.
ఇప్పుడంటే తగ్గిపోయింది గానీ… చాలా పల్లెల్లో ‘ఓ స్త్రీ రేపురా’ అని గోడల మీద రాతలు కనిపించేవి… పిశాచమో, దెయ్యమో… అది వస్తుందనే భయం ప్లస్ నమ్మకం ప్లస్ వద్దని వేడుకోలు… ఓ ప్రయత్నం… ఇప్పుడంటే కనిపించడం లేదు గానీ… అయ్య వారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పూబెల్లాలు అని పిల్లలు ఇల్లిల్లూ తిరిగేవాళ్లు ఏదో పండుగ వేళ… (దసరా శరన్నవరాత్రులు)…
ఇవి రెండూ ఎందుకు గుర్తొచ్చాయీ అంటే… అమెరికాలో హాలోవీన్ సందడి ఊపందుకుంది… ప్రతి సంవత్సరం అక్టోబరు 31… అంటే ఈ ఉత్సవం దేశమంతటా… ఎటు చూసినా అదే కోలాహలం… ఇళ్లు, హాళ్లు, థియేటర్లు, స్కూళ్లు, హోటళ్లు, క్లబ్బులు… ప్రతిచోటా గుమ్మడి కాయలు, వాటిపై భీకరమైన ముఖాలు లేదా వాటిలో వెలిగే కొవ్వొత్తులు, దీపాలు… స్కెలిటన్ల రూపాలు, పుర్రెల బొమ్మలు… సాలీళ్లు, గబ్బిలాల బొమ్మలు… దెయ్యాలు, ఆత్మలను పోలిన రూపాలు…
Ads
- అమెరికాను ఆత్మలు ఆవహిస్తాయి..! అంతెందుకు..? మా టెస్లా కారు, దాని డ్యాష్ బోర్డు థీమే మార్చేశాడు మస్క్… మన కారు ఓ దెయ్యంలా, పక్కన ఎవరైనా మనుషులుంటే అస్థిపంజరాల్లా… అలర్ట్ బీప్స్ కూడా ఆత్మల చప్పుళ్లలా… అవును, హాలోవీన్ అంటే ఆత్మలు సంచరించే వాతావరణం… ఐతే ఒకప్పుడు భయంతో కావచ్చుగాక… ఇప్పుడిది వినోదం… ఓ సెలబ్రేషన్… ఓ అలంకరణ… ఓ ఆటవిడుపు…
మనవాళ్లూ అలవాటు చేసుకుంటున్నారు… తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే న్యూజెర్సీ, ఎడిసన్‌లో శరవణభవన్ వెళ్లినప్పుడు కౌంటర్ మీద రెండు గుమ్మడికాయలు, ఓ చిన్న పుర్రె బొమ్మ, ఓ గుడ్లగూబ బొమ్మ కనిపించాయి… అనేక ఇళ్ల ముందు హాలోవీన్ అలంకరణలు… రకరకాల థీమ్స్‌తో… మా ఫ్లాట్ పక్కన ఉన్నతను ఒక స్కెల్టన్ ఇంటిపైకి ఎక్కుతున్నట్టుగా అలంకరించుకున్నాడు… ఈ కమ్యూనిటీ క్లబ్ హౌజులో అదే వాతావరణం…

- అసలు గుమ్మడి కాయలకూ ఈ హాలోవీన్‌కు సంబంధం ఏమిటి..? అసలు హాలోవీన్ ఏమిటి..? ఈ దెయ్యాలు, ఈ ఆత్మల రాకపోకలేమిటి..? దీని వెనుక కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది… నిజానికి హాలోవీన్ పుట్టింది అమెరికాలో కాదు… దీని మూలాలు ఐర్లాండ్, స్కాట్లాండ్ ప్రాంతాలతో సహా ప్రాచీన సెల్టిక్ సంప్రదాయాల్లో ఉన్నాయి…
సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం సెల్టిక్ ప్రజలు సామ్‌హెయిన్ (Samhain) అనే పండుగను జరుపుకునేవారు… పంటల కోత ముగిసి, చలికాలం ప్రారంభమయ్యే కాలానికి అది సూచిక… ఆ సమయంలో చనిపోయినవారి ఆత్మలు మన ప్రపంచంలోకి తిరిగి రావచ్చని వారు నమ్మేవారు… ఆ భయాలు, విశ్వాసాలతో ముడిపడి మంటలు వెలిగించడం, విచిత్రమైన వేషాలు ధరించడం వంటి ఆచారాలు ఏర్పడ్డాయి…
తర్వాత క్రైస్తవ సంప్రదాయాల్లో నవంబరు 1న జరుపుకునే All Saints’ Dayకు ముందు రోజు సాయంత్రాన్ని All Hallows’ Eve అని పిలిచేవారు… కాలక్రమంలో ఆ పేరు కుదించుకొని Halloweenగా మారింది… మొదట్లో గుమ్మడికాయలు కాదు.. టర్నిప్లు! టర్నిప్ అనేది మన ముల్లంగిని పోలిన ఒక దుంప… ఐర్లాండ్, స్కాట్లాండ్ ప్రాంతాల్లో ప్రజలు వీటిని చెక్కి, భయంకరమైన ముఖాలు తయారుచేసి, వాటిలో వెలుగును ఉంచేవారు…
ఐర్లాండ్ నుంచి అమెరికాకు లక్షలాదిగా వలస వచ్చారు కదా… వాళ్లు తమ సంప్రదాయాలను కూడా తీసుకొచ్చారు… కానీ ఆ టర్నిప్లకు బదులు ఈ సీజన్లో, ఇదే సమయంలో అమెరికాలో
గుమ్మడికాయలు సమృద్దిగా లభిస్తాయి… అవీ పెద్ద పెద్ద సైజుల్లో… మరోవైపు ఫాల్ ప్రారంభం… అంటే శీతాకాలంలోకి ప్రవేశిస్తుంటాం…
- చెట్ల ఆకులు రకరకాల వర్ణాలకు మారి రాలిపోతాయి… గుమ్మడికాయల లోపలిభాగాన్ని తొలిచి, గుజ్జు తీసేసి, అందులో లైట్లు, కొవ్వొత్తులు పెట్టడం, వాటిని దెయ్యాల మొహాల్లా అలంకరించడం సులభం కదా, అందుకని టర్నిప్ల బదులు గుమ్మడికాయలు ప్రవేశించాయి… దెయ్యపు మొహాల్లాగా..!!
హాలోవీన్‌లో అత్యంత సందడిగా సాగే కార్యక్రమం Trick-or-Treat… పిల్లలు దెయ్యాలు, మంత్రగత్తెలు, సూపర్‌హీరోలు, సినిమా పాత్రల వేషాలు వేసుకుని తమ పరిసరాల్లోని ఇళ్లకు వెళ్తారు. ఇంటి తలుపు తట్టి “Trick or treat!” అని అడుగుతారు… దీని భావం ఏమిటంటే.. “మాకు ఏదైనా తీపి పదార్థం ఇవ్వండి.. లేదంటే ఏదైనా అల్లరి చేస్తాం!” అన్నట్లుగా సరదాగా చెప్పడం…
పూర్వం యూరప్‌లో మృతుల కోసం ప్రార్థనలు చేస్తూ ఆహారం అడిగే సంప్రదాయాలు, వేషాలు వేసుకుని ఇళ్లకు వెళ్లే ఆచారాలు ఉండేవి… అవి ఇతర సంప్రదాయాలతో కలిసిపోయి ఆధునిక Trick-or-Treat రూపుదిద్దుకున్నాయి ఇలా… ఇప్పుడు ఇది ప్రధానంగా పిల్లల వినోద కార్యక్రమం… ఇళ్లవారు చాక్లెట్లు, క్యాండీలు, ఇతర చిన్న స్వీట్లు ఇస్తారు… కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిటీ కార్యక్రమాలు, పాఠశాల వేడుకలు కూడా నిర్వహిస్తారు…
- సో, ఒకప్పుడు టర్నిప్లో వెలిగించిన చిన్న దీపం… నేడు గుమ్మడికాయ దెయ్యం ముఖంగా మారి అమెరికా శరదృతువు ఆగమనం గుర్తుగా నిలిచింది..!
Share this Article