Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విలాసం, సౌకర్యం, సౌందర్యం… ఇదీ విజయనగర రాజుల జీవన వైభవం…

February 15, 2023 by M S R

Art-Architecture of Vijayanagara: ఇక్కడ రసికత అంటే శృంగారపరమయిన అర్థంగా కుంచించుకుపోయిన చిన్న మాట కాదు. సౌందర్యారాధన, కళాపోషణకు సంబంధించిన విస్తృత అర్థంలో ఉన్న పెద్ద మాట. రాయలు అంటే ఇరవై ఏళ్లపాటు విజయనగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు ఒక్కడే కాదు. మూడు వందల ఏళ్లకు పైగా విజయనగరాన్ని పాలించిన రాజులు అనే అర్థంలోనే చూడాలి.

Hampi Raja Mandir

అనేక కావ్యాల్లో వర్ణనలు, శాసనాలు, ఇప్పుడు మిగిలి ఉన్న నిర్మాణాలు, ఆచారాలు, అలవాట్లు, ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా తరతరాలుగా జనం చెప్పుకుంటున్న కథల ఆధారంగా సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు, ప్రఖ్యాత విమర్శకుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాయలనాటి సామాన్యుల బతుకులో అందచందాలను, వారి కళా తృష్ణను, వారు అనుభవించిన సౌఖ్యాలను చాలా గొప్పగా ఆవిష్కరించారు. ‘శ్రీకృష్ణదేవరాయ వైభవం’ పేరిట ఎమెస్కో ప్రచురించిన పుస్తకంలో వీరిద్దరి వ్యాసాలున్నాయి. మొత్తం ప్రస్తావిస్తే నిడివి పెరుగుతుంది కాబట్టి కొన్ని విషయాలకే పరిమితమవుతాను.

Ads

ఒక రాణి స్నాన పురాణం: ప్రపంచంలో ఎంత ఉన్నవారయినా వారి స్థాయికి తగినట్లు పెద్ద ఇల్లు కట్టుకుంటారు. ఆ ఇంటికి తగినట్లు పెద్ద స్నానాల గది- బాత్ రూమ్ కట్టుకుంటారు. వేడి, చన్నీరు చల్లే షవర్లు, మునగడానికి నీటి తొట్టెలు- బాత్ టబ్బులు ఇంకా వీలుంటే పర్సనల్ స్విమ్మింగ్ పూల్ పెట్టుకుంటారు. అందరిలా చేస్తే వారు విజయనగర రాజులు ఎందుకవుతారు?

హంపీ రాజమందిరంలో రాణులు స్నానం చేయడానికి ఏకంగా పెద్ద భవనమే కట్టించారు. ఇప్పటిలా కరెంట్, నీరు పంప్ చేయడానికి మోటార్లు, షవర్లు, షాంపూలు, స్ప్రేలు అప్పుడు లేవు అనుకుంటే మన అజ్ఞానానికి వారు నవ్వుకుంటారు. మూడున్నర కిలోమీటర్ల దూరం నుండి తుంగభద్ర నీరు సహజంగా ఈ స్నాన మందిరానికి రావడానికి రాతి ఛానెల్ ఏర్పాటు చేశారు. ఆ స్నాన భవనం మధ్యలో ఆరడుగుల లోతున పెద్ద కృత్రిమ ఈత కొలను- స్విమ్మింగ్ పూల్. ఈత కొలనులో రాణులు స్నానం చేస్తుండగా పరిచారికలు గులాబీ పూలు, సుగంధ ద్రవ్యాలు చల్లడానికి ప్రత్యేక కిటికీలు. వారు స్నానం చేస్తుండగా మంద్రంగా సంగీతం వాయించడానికి ప్రత్యేకమయిన అరుగులతో కిటికీలు. వారు స్నానించి మెట్లెక్కి పైకి రావడానికి ఏర్పాట్లు. వారి స్నానం అయ్యాక ఆ నీళ్లు బయట పూల తోటల్లోకి వెళ్లేలా పంపింగ్ ఏర్పాట్లు. వారి పల్లకీలు, గుర్రాలు, ఏనుగులు పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ఏర్పాట్లు.

రాణుల స్నానానికే ఇన్ని ఏర్పాట్లు చేసినవారు తమ స్నానానికి తక్కువ చేసుకుంటారా? పండుగలకు పవిత్ర స్నానం చేయడానికి రాజభవనం వెనుక ప్రత్యేకంగా తమ కోసం ఈత కొలను కట్టించుకున్నారు. ఉత్సవాలకు రాజభవనానికి వచ్చే సామాన్యులు స్నానం చేయడానికి మరో ఈత కొలను కట్టించారు. ఈ మూడూ ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయి. రాజభవనంలో సామాన్యుల స్నానానికి తన పర్సనల్ స్విమ్మింగ్ పూల్ పక్కనే కృత్రిమ ఈత కొలను కట్టించిన రాజు ఈ భూమండలం మీద లోగడ ఎవరయినా ఉన్నారా? ఇకపై పుట్టనయినా పుడతారా? కలలో అయినా ఇలాంటిది ఊహించగలమా?

తింటే తినాలిరా!
ఒక రోజు ఉదయం నుండి రాత్రి దాకా రాయలకాలంలో సామాన్యులు ఏమేమి తిన్నారో? ఏమేమి తాగారో? ఏయే రుతువులకు వారి ఆహారపుటలవాట్లు ఎలా ఉండేవో? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అనేక ఆధారాలతో అద్భుతంగా ఆవిష్కరించారు. అదంతా రాస్తే ఒక పుస్తకం అవుతుంది. పైపైన చూద్దాం.

Hampi Raja Mandir

రాత్రిళ్లు వెన్నెల్లో భోజనాలు చేయడానికి డాబాల మీద ప్రత్యేకంగా అరుగులు. మంచాలు. అక్కడిదాకా అల్లించిన మల్లె తీగలు. పారిజాత సుమదళాల పరిమళం ఉండనే ఉంటుంది. ఇప్పటి సూపుల్లా భోజనానికి ముందు కొన్ని రసాలు. భోజనం అయ్యాక మరి కొన్ని రసాలు. పోపు వేసిన మజ్జిగ, చెరకు రసం, దానిమ్మ రసం, ద్రాక్ష రసం లేని భోజనం భోజనమే కాదు. నంజుకోవడానికి వడలు, వడియాలు, అప్పడాలు, ఉప్పు వేసి ఊరబెట్టిన మిరపకాయలు. బెల్లం స్వీట్లు ఎన్ని రకాలో లెక్కే లేదు.

నాన్ వెజ్ లో కోళ్లు, మేకలు స్వాహా. వేసవిలో అంటుమామిడి ముక్కల్లో ఉప్పు, కారం వేసి, పోపు వేసి, అందులో ఎండబెట్టిన చిన్న చేపలను ఫ్రై చేసి వేస్తే… జస్ట్ అదొక పచ్చడి అంతే. వారు వేళకు తినడం తెలియనివారట. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినేవారట. తిన్నప్పుడు మాత్రం పచ్చడి, కూర, పప్పు, సాంబారు, చారు, పెరుగు, నెయ్యి, అప్పడాలు, వడియాలు, పళ్లరసాలు; నాన్ వెజ్ అయితే రెండు మూడు జంతువులు తప్పనిసరిగా ఉండాల్సిందేనట.

మేడంటే మేడ కాదు…….. కరెంటు, ఏసీలు, గీజర్లు, మోటార్లు, హీటర్లు ఏవీ లేకపోయినా రుతువులకు తగ్గట్టు భవన నిర్మాణంలో మెలకువలతో ఎండా కాలంలో చల్లగా… చలికాలంలో వెచ్చగా ఉండే ఏర్పాటు చేసుకున్నారు. వేసవిలో పైకప్పు నుండి కిటికీల మీద నీటి తుంపరలు పడడానికి ప్రత్యేకంగా ఏర్పాటు ఉంది. అందులో సుగంధ ద్రవ్యాలు చల్లుకోవడం అదనపు ఆకర్షణ.

పెరటి పూల తోట………. ఇంటిముందు, వెనుక పూల తోటల్లేని ఇల్లు విజయనగరంలో ఇల్లే కాదు. మల్లె, జాజి, సంపంగి, పారిజాతం, మందారం, నందివర్ధనం, గులాబీ పూల పొదరిళ్లలో వారి పూల బతుకును వర్ణించడానికి మాటలు చాలవు. ఇంటి తోటల్లో నెమళ్లు, జింకలు, కుందేళ్ళను పెంచుకునేవారు.

మేకప్ కు కూడా స్వర్ణయుగం………. వారి మేకప్ కథలు వింటే ఇప్పటి మేకప్ మేకప్పే కాదని వైరాగ్యం వస్తుంది. హంపీ విరూపాక్ష ఆలయం ఎదురుగా కుడి ఎడమ మంటపాలు అప్పుడు అంతర్జాతీయ మార్కెట్. అక్కడ దొరకని వస్తువు లేదు. మొహానికి పూసుకునే గంధం వేరు. ఇంటి ముందు కళ్ళాపి చల్లే గంధం వేరు. స్త్రీ పురుషులిద్దరూ చెవికి కమ్మలు, మెడలో హారాలు వేసుకునే వారు. ఇంటి గుమ్మాలకు, స్తంభాలకు అలంకరించే రత్నాలు వేరు. మెడలో రత్నాలు వేరు.

“వారు అప్పుడు అలా బతికారు అంటే ఇప్పుడు మన ఊహకు కూడా అందదు. అప్పుడు కృష్ణరాయడు ఒక కలగని ఆ కలకు రూపమిచ్చాడు. కలలో అయినా ఇప్పుడు మనకు ఆ ధైర్యం వస్తుందా?” అని పుట్టపర్తి నారాయణాచార్యులు అందుకే అన్నారు.

రేపు:-
హంపీ వైభవం-5
“విజయనగరంలో నిత్యోత్సవం”
-పమిడికాల్వ మధుసూదన్ [ 99890 90018 ]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions