Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పాజీ కనుగుడ్ల కథ నిజమేనా..? రాయల మొహంపై మచ్చలు ఉండేవా..?

February 19, 2023 by M S R

Planted Stories: తిమ్మరుసు కనుగుడ్ల కథ…. విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయల కొడుకు తినే అరటి పండులో విషం పెట్టించి మహా మంత్రి తిమ్మరుసు/ అప్పాజీ చంపించాడు. దాంతో కృష్ణరాయలు గుండె పగిలి ఏడ్చి… ఏడ్చి… కోపంతో తిమ్మరుసు కనుగుడ్లు పెరికించి, పెనుగొండలో చీకటి గృహంలో బందీగా పెట్టాడు.

కొంతకాలానికి కొడుకు మృతికి తిమ్మరుసు కారణం కాదని తెలుసుకుని… కృష్ణరాయలు అర్జంటుగా గుర్రమెక్కి హంపీ నుండి ఆగకుండా పెనుగొండ వెళితే… కనులు లేని నన్ను నీ కళ్లు చూడలేవు రాయా! వెళ్లు… అని నిర్మొహమాటంగా చెప్పాడు అప్పాజీ. ఆ బాధతో కృష్ణరాయలు హంపీలో పోయాడు. కనులు చూడని కారు చీకట్లలో పెనుగొండ బందిఖానాలో తిమ్మరుసు కూడా పోయాడు… ఇదీ కథ…

ఈ కథ ఎలా పుట్టిందో? ఎందుకు పుట్టిందో? కానీ… అయిదు వందల ఏళ్లుగా కథలు కథలుగా అల్లుకుంటూనే ఉంది. తను బతికి ఉండగానే ఎనిమిదేళ్ల (ఒకటిన్నర సంవత్సరం వయసు అని మరొక శాసనంలో ఉంది) కొడుకును కృష్ణరాయలు విజయనగర చక్రవర్తిగా ప్రకటించి, తను సలహాలిస్తూ పర్యవేక్షించే ప్రధాని పదవిలో ఉన్నది నిజం. ఆ పిల్లాడు అనారోగ్యంతో మరణించినది నిజం. ఆ దిగులుతో అనారోగ్యం పాలై కృష్ణరాయలు మరణించినది నిజం. కృష్ణరాయల కొడుకు మీద తిమ్మరుసు ప్రయోగించిన విషం… కనుగుడ్లు పెరకడం… కథంతా జరిగింది కృష్ణరాయల పెనుగొండ వేసవి విడిదిలో అని ఇప్పటికీ పెనుగొండలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

Ads

కృష్ణరాయల మరణం తరువాత కూడా తిమ్మరుసు విజయనగరం మహా మంత్రిగా పని చేస్తూ… కొన్నేళ్ల తరువాత తిరుమలకు వెళ్లినట్లు తిరుపతిలో దొరికిన ఒక శాసనం స్పష్టం చేస్తోంది. అవసాన దశలో తిమ్మరుసు ఆర్థికంగా దెబ్బ తిన్నట్లు కూడా ఆ శాసనాన్ని బట్టి అర్థమవుతుంది.

తన తరువాత తన తమ్ముడు లేదా తమ్ముడి పిల్లలు చక్రవర్తులయితే ఇంటిపోరుతో విజయనగరం కూలిపోతుందన్న భయంతోనే…సదుద్దేశంతోనే… కృష్ణరాయలు అంత పసిపిల్లాడయిన కొడుకును సింహాసనం మీద కూర్చోబెట్టాడే కానీ ఇందులో ఇంకో కారణమేదీ కనిపించడం లేదు.

అనేక అడ్డంకులను దాటుతూ తనను చక్రవర్తిని చేసిన తిమ్మరుసుకు చెప్పకుండా కృష్ణరాయలు కొడుకును చక్రవర్తిగా ప్రకటించి ఉంటాడని మనం అనుకుంటే దానికి వారేమి చేయగలరు? తిమ్మరుసు లేకపోతే కృష్ణరాయలు లేడు. కృష్ణరాయలు లేకపోతే తిమ్మరుసు లేడు. అంతే.

కృష్ణరాయల తండ్రికి ఇద్దరు భార్యలు. ఒక శాసనంలో ముగ్గురు భార్యలు అని కూడా ఉంది. ఇద్దరో, ముగ్గురో తేలక చరిత్రకారులు చేతులెత్తేశారు. కృష్ణరాయలును చంపి తన కొడుకుకు అడ్డు తొలగించాలని సవతి తల్లి ఆదేశించినప్పుడు మేక కళ్లు తెచ్చి చూపించి…కృష్ణరాయల కళ్లు పీకేశాము… అని రుజువుగా వాటిని చూపించి… రాయలును బతికించినవాడు తిమ్మరుసు. అలాంటి తిమ్మరుసు సాక్షాత్తు రాయల కొడుకును చంపడం ఏమిటి? ప్రతిగా రాయలు తిమ్మరుసు కళ్లు పీకేయించడం ఏమిటి? ఈ కనుగుడ్ల కథ అల్లికలో అన్నీ లొసుగులే.

కృష్ణదేవరాయలు శిక్షించి కళ్లు పెరికించిన తిమ్మరుసును తరువాత విజయనగరం మహా మంత్రిగా పెట్టుకుందా? కళ్లులేని గుడ్డివాడయినా కూర్చుని గుడ్డి పాలన చేయమని గుడ్డిగా అడిగిందా?

ఇంకా లోతుగా వెళితే ఇదో గ్రంథమవుతుంది. నేను చదివిన విజయనగరం చరిత్ర ప్రకారం-
1. తిమ్మరుసు కృష్ణదేవరాయల కొడుకును చంపించలేదు.
2. తిమ్మరుసు కనుగుడ్లను కృష్ణరాయలు పెరికించలేదు.
3. పెనుగొండలో తిమ్మరుసు సమాధి అని కొందరంటారు. బందిఖానా అని కొందరంటారు. తిమ్మరుసు కులాచారం ప్రకారం శవానికి దహనం జరిగి ఉండాలి కానీ… సమాధి ఉండడానికి వీల్లేదు. చచ్చి బూడిద కాకుండా… సమాధిలో కళ్లు లేని ప్రేతమై అలాగే ఉంటే… ఆ పగ కలకాలం నిలిచి ఉంటుందని చేశారా?
4. కృష్ణరాయలతో పాటు దివికేగలేక దుర్భరంగా బతుకుతున్నట్లు అల్లసాని పెద్దన స్పష్టంగా చెప్పుకున్నాడు. కృష్ణరాయల మరణం తరువాత తిమ్మరుసుది కూడా అలాంటి దీన స్థితే అయి ఉండాలి.
5. నాటకాలు, సినిమాల్లో నాటకీయత కోసం, కథలో అనూహ్యమయిన, గుండె మెలిపెట్టే మలుపుల కోసం మధ్యలో ఎవరో తిమ్మరుసు కనుగుడ్ల మీద పడి పెరికి ఉండాలి.
6. రాయలు- తిమ్మరుసు మధ్య అసూయలకు, వైరుధ్యాలకు, శత్రుత్వానికి అవకాశమే లేదు.
కృష్ణరాయలుకు మొహమంతా మచ్చలా?
కృష్ణదేవరాయలు అంత పొడుగూ కాదు. పొట్టీ కాదు. నలుపు రంగు. మొహం నిండా స్ఫోటకపు మచ్చలు అని ఇప్పుడే ఆయన్ను చూసి… మాట్లాడి వచ్చినట్లు చెప్పేవారెవరూ ఆయన్ను చూడనేలేదని నా తీర్మానం. ఆయన అందగాడు. కండలు తిరిగిన యోధుడు. పెదవి మీద చిరునవ్వు చెదరని వాడు. యాభై కిలోమీటర్ల వేగంతో గుర్రం మీద వెళుతూ పక్కన మరో గుర్రం మీదికి ఎగిరి కూర్చోవడం లాంటి విద్యలు అతడికి ఆట.

ఒకరోజు పొద్దున్నే గుర్రం మీద పెనుగొండలో బయలుదేరి సాయంత్రం లోపు హంపీలో పూజకు రాయలు వెళ్లినట్లు… అప్పుడు ఆయన పక్కన అదే వేగంతో పరుగెత్తిన గొడుగుపాలుడికి ఆయన బహుమానంగా ఇచ్చిన ఊరే గొడుగుపాలపురం… అదే గోపాలపురం అయ్యిందని ఒక శాసనాన్ని రుజువుగా చూపుతూ తిరుమల రామచంద్ర “హంపీ నుండి హరప్పా దాకా”లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కథ కర్ణాటక- ఆంధ్ర సరిహద్దుల్లో తరతరాలుగా చెప్పుకుంటున్నదే.

Srikrishna Devaraya Kingdom Fact

నెత్తిన ముత్యాలు వేలాడే పట్టు తలపాగాతో అందం పోతపోసిన రాయలు మొహం నిండా మచ్చలు ఎవరికి కనిపించాయో? ఎప్పుడు చూశారో?
ఇంకా నయం! బయటి ప్రపంచానికి తన మచ్చల మొహం చూపించలేక… ఇంట్లో అద్దంలో ఆ మచ్చలనే పదే పదే చూసుకుంటూ కుమిలి కుమిలి చిక్కి శల్యమై చనిపోయాడనలేదు.

ఒక విదేశీ సందర్శకుడు కృష్ణరాయలును కలిసి అన్న మాట ఒకటి రికార్డుల్లో ఉంది. “హంపీ రాజభవనంలో మేము నలుగురం కృష్ణరాయలును కలవడానికి వెళ్ళాము. తనిఖీలు అయ్యాక మమ్మల్ను ఆయనున్న గది ముందు కూర్చోబెట్టారు. బంగారు తాపడంతో ముత్యాలు వేలాడుతున్న దీవాన్ లా ఉన్న వాటి మీద మెత్తటి పరుపులు వేసి ఉన్నాయి. కాసేపటికి పిలుపు వచ్చి లోపలికెళితే… కృష్ణరాయల అందం చూడాలో… అక్కడున్న ఏనుగు దంతాల ఇంటీరియర్ అందం చూడాలో తెలియక తికమక పడ్డాం. అతిథి మర్యాదలు మరచిపోలేనివి. విరూపాక్ష గుడి పక్కన కొండెక్కి చూస్తుంటే వీధుల్లో ఎటు చూసినా సందడే సందడి”

ఇతడికి మచ్చలు కనపడలేదా? లేక నా మచ్చల గురించి మాత్రం బయట ఎక్కడా చెప్పకు అని కృష్ణదేవరాయలు ప్రాధేయపడితే… సరేలే అని అభయమిచ్చి ఉంటాడా?….. రచయిత :: పమిడికాల్వ మధుసూదన్ …. 99890 90018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions