కృష్ణరాయడికి ముగ్గురు భార్యలా?
తిరుమలా దేవి, చిన్నా దేవి కాకుండా కమల లేదా అన్నపూర్ణ పేరుతో కృష్ణరాయలుకు మూడో భార్యను కూడా సృష్టించి పెళ్లి కూడా చేసింది లోకం. దురదృష్టం కొద్దీ విజయనగర శాసనాలేవీ ఈ మూడో భార్యను గుర్తించినట్లు లేవు! ఆయన కూడా ఆముక్తమాల్యదతో పాటు ఇతర సంస్కృత కావ్యాల్లో ఇద్దరు భార్యలను ప్రస్తావించి…మూడో భార్య విషయం చెప్పలేదు. కనపడితే కాలర్ పట్టుకుని అడగండి. గట్టిగా అడిగితే ఒప్పుకోకపోడు!
ఆముక్తమాల్యద పెద్దన రాశాడా?
అల్లసాని పెద్దన రాసి పెట్టిన “ఆముక్తమాల్యద”ను తాను రాసినట్లు కృష్ణరాయలు డబ్బా కొట్టుకున్నాడట! ఇలా అన్న వారిని ఖండ ఖండాలుగా ప్రఖ్యాత పండితుడు చిలుకూరి నారాయణరావు కత్తితో ఖండించారు. తెలుగు, సంస్కృతం, కన్నడ, తుళు, తమిళ భాషల్లో అనన్యసామాన్యమయిన పాండిత్యం ఉన్న కృష్ణరాయలు ఆముక్తమాల్యద రాయలేదని అనేవారు ఆయన పుట్టనే లేదని కూడా అనగలరు అన్నారు చిలుకూరి.
నైజాం ప్రభువు బ్రిటీషు వారికి వదిలివేసిన అన్న అర్థంలో దత్త-సీడెడ్ జిల్లాలు అని తలదించుకోవాల్సిన పేరును మార్చి “రాయలసీమ” అని తల ఎత్తుకోగల రాయల స్ఫూర్తితో నామకరణం చేసింది చిలుకూరి వారే. అన్ని భాషలు తెలిసినా తన తల్లి చంద్రగిరి ప్రాంత నాగలాంబ మాట్లాడే “తెలుగు భాష లెస్స” అన్నందుకు రాయలుకు తెలుగు పద్యం రాయడమే రాదన్నది పాడు లోకం. ఇలా అంటారని తెలిసి ఉంటే…ఆముక్తమాల్యద తానే రాసినట్లు, ఎవరూ రాసిపెట్టలేదని హంపీ ఊరి ముందు ఒక శిలాశాసనం కూడా వేయించి ఉండేవాడు కదా!
Ads
అష్టదిగ్గజ కవులు లేరా?
అష్టదిగ్గజ కవుల వయసులను బట్టి ఎనిమిది మంది ఏకకాలంలో రాయల కొలువులో లేరని మహా మహా పండితులు అయిదు శతాబ్దాలుగా జుట్లు పట్టుకుని కొట్టుకుంటూనే ఉన్నారు. కృష్ణరాయలు సంగీత, సాహిత్య ప్రదర్శనకు తన రాజభవనం పక్కనే భువనవిజయ సభా మండపం కట్టించినది నిజం. అందులో ఎనిమిది మంది కవులు ఉన్నమాట నిజం.
వీధుల్లో వజ్రాలెలా అమ్ముతారు?
అంగళ్ల రతనాలు అమ్మినారట ఇచట…అని పాడుకోవాల్సిందే కానీ…విరూపాక్ష గుడిముందు ఇంటర్నేషనల్ బజార్లో వీధుల్లో వజ్రాలు పోసి ఎందుకమ్ముతారు? విడ్డూరం కాకపోతే! అన్నది మన పెదవి విరుపు. విఠలాలయ అరుగు కింద చైనా, పర్షియా విదేశీ వర్తకులు గుర్రాల్లో వచ్చి ట్రేడింగ్ చేసినట్లు వారి వారి వేషాలు, ముఖ కవళికలతో పాటు శిల్పాల వరుసలో కథనాలు ఉన్నాయి. వజ్రాలతో పాటు ఆ వీధిలో అమ్మని నగలు లేవు…రోమ్ తరువాత ప్రపంచంలో ఇంతటి నగర వైభవం ఇంకెక్కడా లేదు అని కృష్ణదేవరాయలకంటే ముందే హంపీని సందర్శించిన ఇద్దరు, ముగ్గురు విదేశీ పర్యాటకులు చెప్పిన రికార్డులను కూడా తుంగభద్రలో తొక్కేద్దాం. మురుగు కాలువ కంపు మీద మనం పానీ పూరీ ఫాస్ట్ ఫుడ్డు తిన్నట్లే…హంపీ వీధి చివర చీకట్లో గుడ్డి గుర్రం దిగి కృష్ణరాయలు కూడా పాచి ఫుడ్డు తిని…ఇంటికెలా వెళ్లాలో తెలియక మనల్ను అడుగుతున్నాడు అని అనుకోవడంలో మన తృప్తే తృప్తి! ఇప్పటి మన దౌర్భాగ్యాన్నే అప్పటి హంపీకి కూడా అంటగడదామా?
చరిత్రలో కలిసిపోయేవారు కొందరు.
చరిత్రను విస్మరించేవారు కొందరు.
చరిత్రను నిర్మించేవారు కొందరు.
విజయనగరానిది విస్మరించడానికి వీల్లేని చరిత్ర.
తుంగభద్రా తీరంలో పడి ఉన్న ప్రతి రాయి గొంతు విప్పి ఆ సముజ్వల చరిత్రను గానం చేస్తూనే ఉంటుంది.
శత్రు మూకల దాడుల్లో శిల్పాల తలలు తెగినా…కోటలు కూలినా…మొండేలు, మొండి గోడలు కూడా సంగీతం, సాహిత్యం, కళలు…మనదయిన ఒకానొక గొప్ప సంస్కృతికి విజయకేతనమయిన విజయనగర దిగ్విజయ గీతాన్ని వినిపిస్తూనే ఉంటాయి…చెవి ఒగ్గి వింటే. కళ్లు తెరిచి చూస్తే. మనసు పెట్టి తిరిగితే.
కళ్లున్నందుకు కనీసం ఒక్కసారైనా చూసి తీరాల్సినది హంపీ.
(ఈ 8 వ్యాసాలకు నేను ఉపయోగించుకున్న పుస్తకాలు; వ్యాసాలు:-
1. శ్రీకృష్ణదేవరాయల వైభవం- ఎమెస్కో ప్రచురణ.
2. హంపీ క్షేత్రం- కొడాలి వేంకట సుబ్బారావు.
3. రాయలనాటి రసికత- రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ.
4. రాయలనాటి రసికతా జీవనం- పుట్టపర్తి నారాయణాచార్యులు.
5. హంపీ- పుట్టపర్తి నారాయణాచార్యులు
6. పెనుగొండ లక్ష్మి- పుట్టపర్తి నారాయణచార్యులు.
7. శ్రీకృష్ణదేవరాయలు- నేలటూరి వెంకటరమణయ్య
8. విజయనగర సామ్రాజ్యం- గాడిచర్ల హరిసర్వోత్తమరావు
9. ఆముక్తమాల్యద కృతికర్త కృష్ణరాయలే- చిలుకూరు నారాయణరావు.
రెఫెరెన్సుల్లో, విషయంలో, రాజుల సంవత్సరాల్లో ఎక్కడయినా పొరపాట్లు దొర్లి ఉంటే తెలియజేయగలరు. సవరించుకుంటాను. అసలే వక్రీకరణకు గురైన హంపీ చరిత్రకు మరింత వక్రీకరణ మంచిది కాదు. హంపీలో ఫోటోలకు, నా వీడియోలకు నా భార్య శోభ కెమెరా వుమన్. ఇన్నేళ్ళుగా నేను చెబుతున్న పద్యాల్లో ఎక్కడేది చెప్పాలో గుర్తు చేస్తూ… నన్ను హంపీ దృశ్యంలో బంధించింది)… హంపీ వైభవం వ్యాసాలు దీనితో సమాప్తం…
రచయిత :: పమిడికాల్వ మధుసూదన్ …. ఈ సీరీస్ మీద మీ అభిప్రాయాలు తెలపాల్సిన నంబర్ ఇదీ… 99890 90018
Share this Article