పావు శతాబ్దపు నీడలు.. అల్‌ఖైదా కొత్త ఎత్తుగడలు!
అమెరికాను వణికించిన 9/11 ఉగ్రదాడులకు పాతికేళ్లు పూర్తయ్యాయి. కాలం మారుతున్నా, ఆ భయానక జ్ఞాపకాలు మాత్రం ఇంకా పదిలంగానే ఉన్నాయి. సరిగ్గా ఈ మైలురాయి సమయానికే ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా విడుదల చేసిన ఒక ప్రచార వీడియో ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ‘ఏ క్వార్టర్ సెంచరీ ఆఫ్ ది 11 సెప్టెంబర్ రైడ్స్’ పేరుతో అల్‌ఖైదా మీడియా విభాగం ‘అస్-సహాబ్’ విడుదల చేసిన సుమారు 50 నిమిషాల వీడియో ఇప్పుడు ప్రపంచ దేశాల నిఘా వర్గాలను అప్రమత్తం చేసింది.
ఈ వీడియోలో కనిపించిన ఒకే ఒక్క దృశ్యం ఇప్పుడు అన్ని చర్చలకు కేంద్రబిందువుగా మారింది. అదే.. ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ ప్రత్యక్షం కావడం. తెల్లటి తలపాగా ధరించి, పక్కనే తుపాకీ ఉంచగా మట్టి గోడ ముందు కూర్చున్న హమ్జా దృశ్యాలు అందులో ఉన్నాయి. ఏడేళ్ల కిందటే.. అంటే 2019లోనే అమెరికా జరిపిన సైనిక ఆపరేషన్‌లో హమ్జా హతమైనట్లు అంతా భావించారు. అమెరికా ప్రభుత్వం కూడా అతడి ఆచూకీ తెలిపిన వారికి రివార్డు ప్రకటించి, ఆ తర్వాత అతడు చనిపోయినట్లు అధికారికంగానే వెల్లడించింది.
Ads
అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కీలక నేతలు హతమైనప్పుడు ఆర్భాటంగా సంతాప ప్రకటనలు చేసే అల్‌ఖైదా, హమ్జా విషయంలో మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు ఏకంగా 9/11 పాతికేళ్ల సందర్భాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన వీడియోలో అతడిని చూపించడం ద్వారా ఆ సంస్థ ఏం చెప్పదలుచుకుంది? హమ్జా నిజంగానే ఇంకా సజీవంగా ఉన్నాడా? లేక ఇది పాత విజువల్స్‌తో చేసిన మైండ్ గేమా? అనే ప్రశ్నలకు అంతుచిక్కడం లేదు.
నిఘా వర్నాల విశ్లేషణ ప్రకారం.. ఇది పూర్తిగా అల్‌ఖైదా చేస్తున్న ఒక మానసిక ప్రచార వ్యూహంగా కనిపిస్తోంది. సంస్థకు పూర్వ వైభవం తెచ్చేందుకు, పాత రోజులను గుర్తుచేసేందుకు బిన్ లాడెన్ పేరును, ఆయన వారసుడి ఇమేజ్‌ను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. కొడకును వారసుడిగా చూపించడం ద్వారా కొత్త తరానికి చెందిన యువతను ఆకర్షించడం, భావజాలాన్ని ప్రచారం చేయడం, తిరిగి కేడర్‌ను కూడగట్టడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశంగా నిపుణులు భావిస్తున్నారు.
2001 సెప్టెంబర్ 11న జరిగిన ఆ దుర్ఘటనలో దాదాపు మూడు వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ భద్రతా స్వరూపాన్నే ఆ దాడులు పూర్తిగా మార్చేశాయి. అలాంటి చారిత్రక విషాదానికి పావు శతాబ్దం నిండిన వేళ.. పాత నాయకుల నీడలను, వారి వారసత్వాన్ని ఉగ్ర సంస్థలు ఇంకా వదలలేకపోతుండటం ఆందోళనకరమైన పరిణామం. ఈ వీడియో వెనుక అసలు నిజాలు తేల్చేందుకు ఇప్పుడు అమెరికాతో పాటు పలు దేశాల నిఘా విభాగాలు తీవ్రంగా కూపీ లాగుతున్నాయి.
Share this Article