Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉద్యోగం పురుష లక్షణం… అందం కూడా…! ఆడాళ్లతో పోలిస్తే… తగ్గేదే లా…!!

October 27, 2023 by M S R

Handsome Guys: “వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే;
పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్”శ్రీరామ మంగళాశాసనంలో ఉన్న “పుంసాం మోహన రూపాయ…” అన్న మాటను లోకం ఎందుకో సరిగ్గా అర్థం చేసుకోక మగవారు కూడా మోహంలో పడే మోహనరూపం రాముడిది అని అనుకుని… పద్యాలు, పాటలు అల్లి…అలాగే పరవశించి గానం చేస్తోంది. “ఉద్యోగం పురుష లక్షణం” అన్న మాట దగ్గర కూడా ఈ పొరపాటే జరిగింది. ధర్మార్థకామమోక్షాలు- చతుర్విధ ఫల పురుషార్థాలు. ఇక్కడ పురుషార్థం అంటే మనిషికి సంబంధించిన అనే తప్ప- మగవారికి అని కానే కాదు. అలాగే ఉద్యోగం పురుష దగ్గర కూడా. పని చేయడం మనిషి లక్షణం అన్న మంచి మాటను మగవారికి మాత్రమే పరిమితం చేసి మహిళలకు అన్యాయం చేసింది లోకం. రాముడు మగవారికి మాత్రమే మోహనాకారుడు అని సంకుచితంగా అంత గొప్ప మంగళాశాసన శ్లోకం ఎందుకంటుంది? అని వేద వ్యాకరణం, మంత్ర శబ్దోత్పత్తి, అర్థాన్వయాల లోతులు తెలిసిన సామవేదం షణ్ముఖ శర్మ లాంటి పెద్దలు చెబుతున్నా…మనం వినడం లేదు.

అందం ఇక ఎంత మాత్రం మహిళలకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. మగవారు కూడా పగబట్టి అందం వెంట పడుతున్నారు. ఉన్న అందాన్ని కాపాడుకోవడానికి, లేని అందాన్ని తెచ్చుకువడానికి మగవారు భారతదేశంలో ఏటా వ్యవస్థీకృత మార్కెట్లో పెడుతున్న ఖర్చు అక్షరాలా 31 వేల కోట్ల రూపాయలు. మహిళలు లక్ష కోట్లలో ఉన్నారనుకోండి. సౌందర్య సాధనాల తయారీ కార్పొరేట్ లెక్కల్లోకి రాని అందం ఇక ఎన్ని లక్షల కోట్ల మందంలో ఉంటుందో రతీమన్మథులే దిగి వచ్చినా చెప్పలేరు.

Ads

అందం కొరుక్కు తింటామా? అని వైరాగ్యపు మాటకు ఏనాడో కాలం చెల్లింది. అక్షరాలా అందాన్ని కొనుక్కు తినే రోజులొచ్చాయి.

“దంతంబుల్ పడనప్పుడే, తనువునందారూఢియున్నప్పుడే,
కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే,
వింతల్ మేన చరించనప్పుడె, కురుల్ వెల్వెల్లఁ గానప్పుడే…” అని కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి చాలా పెద్ద లిస్టే చెప్పాడు. ఎప్పుడో అయిదు వందల యాభై ఏళ్ల కిందట కాబట్టి ధూర్జటి అలా అని ఉంటాడు. ఇప్పుడు దంతంబులు కదిలితే…పెట్టుడు పళ్ళున్నాయి. పళ్లకు కట్టుడు వైర్ల బిగింపులున్నాయి. చర్మం ముడుతలు పడితే…పట్టి…లాగి…మునుపటి బిగువు, నునుపు తెచ్చే యాంటీ ఏజింగ్ నవలావణ్య నైపుణ్యాలున్నాయి. పై పూతలున్నాయి. పొట్ట లావెక్కితే..రంపపు కోతలున్నాయి. శరీరం వంగకుండా నిటారుగా నిలబెట్టే ఫిజికల్ ట్రయినింగులున్నాయి. కళ్లు మసకబారితే అద్దాలున్నాయి. అద్దాలు వద్దనుకుంటే లేటెస్ట్ లేజర్ కాంతి కిరణాల నేత్ర చికిత్సలున్నాయి. జుట్టు తెల్లబడితే…అద్దడానికి కారు నలుపు రంగులున్నాయి. జుట్టే మొలవకపోతే…నున్నటి నెత్తి దుక్కి దున్ని వెంట్రుకల హెయిర్ క్రాఫ్టింగ్ నారు పోసి…నీరు పోసి…యూరియా తైలాలు రుద్దడానికి కేశోపాయాలున్నాయి.

సైజ్ జీరో కోసం నోరు కట్టుకుని…గాలి భోంచేస్తూ…గాలిలో కలిసిపోయే అందం కోసం చచ్చిపోయే వ్యామోహాలున్నాయి. తెల్లతోలు తెలుపు కోసం ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికే ఉతుకుళ్లున్నాయి. చర్మకాంతి కోసం నిగనిగల క్రీములు, గంధాలున్నాయి. అందం అసూయపడే అంగాంగ పోటీలున్నాయి. అందం ఒక తపస్సుగా ఆరాధించాల్సిన భావన అయ్యింది. కాటికి కాళ్లు చాచిన వయసులో కూడా యముడి పిలుపుకు ముందు ఎంతో కొంత మేకప్ వేసుకోవాల్సిన సౌందర్య దృష్టి తొంగిచూస్తోంది.

వారంలో ఎలుగుబంటి నల్ల చర్మం తెలుపుబంటి తెలుపు అయ్యే లవ్లీ ఫెయిర్నెస్ క్రీములున్నాయి. కాంతివిహీనమయిన చర్మంలో నాలుగువేల మెగా పవర్ ప్లాంట్ల విద్యుత్ కాంతిపుంజాలను పుట్టించే గ్లో క్రీములున్నాయి. ఇంటర్వ్యూకు ముందు పూసుకుంటే…ఇంటర్వ్యూలో ఆటోమేటిగ్గా సెలెక్ట్ అయ్యే క్రీములున్నాయి. ప్రళయ భీకర వేళ లోకాలన్నీ కొట్టుకుపోతున్నా…చల్లుకున్న పెర్ఫ్యూమ్ వాసనకు అమ్మాయిలు వెంటపడే అలౌకిక సుగంధ ద్రవ్యాలున్నాయి. తల్లి అయినా పసిపిల్లలా కనపడడానికి రుద్దుకునే సొంతోష సంతూర్ లు ఉన్నాయి. చల్లుకున్న పౌడర్ల వల్ల కాలేజీలో అమ్మాయిలందరూ వెంటపడి బుగ్గలు గిల్లే అబ్బాయిల పౌడర్ డబ్బాలున్నాయి.

ఇంకానా! ఇకపై చెల్లదు అంటూ మగవారి సౌందర్య సాధనాల వాడకం గణనీయంగా పెరిగింది. జస్ట్ ఇంకొక్క 69 వేల కోట్లకు కొంటే…మహిళల లక్ష కోట్ల అమ్మకాలను మగవారు చేరుకుంటారు. అప్పుడు సౌందర్య సమానత్వం సిద్ధించి సమసమాన అందాల సమాజం ఏర్పడుతుంది.

ఇంతా చేస్తే- రేప్పొద్దున స్త్రీ పురుషులు కలిసి ఒక పెద్ద రాష్ట్రం వార్షిక బడ్జెట్ (రెండు లక్షల కోట్లు) అంతేనా మన దేశం అందం కోసం ఖర్చు పెట్టబోయేది?
ప్చ్…పిటీ!
వెరీ పూర్ బ్యూటీ!!……… – పమిడికాల్వ మధుసూదన్ 9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions