.
Yaseen Shaikh ……… 5 జూలై 2018 …. అనగా హైదరాబాద్ గౌలిగూడ బస్టాండ్ కుప్పకూలినరోజు…
.
ద ‘డోమ్స్’ డే!
తాజ్‌మహల్‌ను కాస్త దగ్గరికి నొక్కి, చుట్టూ ఉన్న మీనార్లను పీకి దాని తలపై ప్రతిష్టిస్తే?
చార్మినార్ అవుతుంది.
కాకపోతే… తాజ్‌మహల్ తెల్లగా ఉంటుంది. మన చార్మినార్‌కు ఒకింత వన్నె తక్కువ.
ఈమాత్రం దానికి ఆగ్రా వెళ్లనేల?
Ads
****
ఎప్పుడైనా కొడైకెనాల్ కొడై లేక్ చూశారా? అక్కడికెళ్లే ముందు గైడ్‌లు తెగ ఊరిస్తారు. తీరా చూశాక… అరె… మన హుసేన్‌సాగర్ కంటే చిన్నగానే ఉందనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి కొడై వెళ్లినవాళ్లు ఇలా అనుకోకపోతే నా పేరు మార్చి పెట్టండి.
****
నా ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి. ఢిలీ ఎర్రకోటకు దీటుగా మనకు గోల్కొండ! లండన్‌కు థేమ్స్‌లాగే మనకు మూసీ! ప్రపంచంలోని ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కో ప్రత్యేక అంశం ఉంటుందేమో? కానీ అవన్నీ ఒక్క మన హైదరాబాద్‌లోనే!
****
ఒక అద్భుత బీభత్స భయానక అపురూప జ్ఞాపకం.
బాబ్రీ మసీదు విధ్వంసంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగిన సమయంలో నేను హైదరాబాద్‌లో ఉన్నా. మూణ్ణాలుగు రోజుల తర్వాత 6 గంటల పాటు కర్ఫ్యూ సడలించారు. సూర్యాపేటకు బస్సులు నడుస్తున్నాయట. ఈలోపు మనకు బస్సు దొరకకపోతే మళ్లీ నా షెల్టర్‌కు చేరుకోలేను. తిరిగి కర్ఫ్యూ మొదలైతే… ఇక అంతే సంగతులు.
అలాంటి వేళ… ఆత్రుతగా పరుగెత్తుకొని వస్తున్న వేళ…
ఆ డోమ్ కింద ఒకటో నెంబరు ప్లాట్‌ఫారమ్. దాని మీద రెడీగా బస్సు.
హమ్మయ్య అనుకున్నాను. ఆ రోజున ఆ డోమ్ నాకు ఎలా కనిపించిందంటే… ‘వాషింగ్టన్ డీసీలోని యూఎస్ కాపిటోల్’ కంటే అందంగా!
గౌలీగూడ బస్‌స్టాండ్‌లో ఇలాంటి జ్ఞాపకాలెన్నో!!
****
అది ఇవాళ కూలిపోయింది. ఎప్పుడో నిజామ్ కాలంలో కట్టిన ఆ డోమ్‌ను దాదాపు 40 ఏళ్లుగా చూస్తూనే ఉన్నా. ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు కాల్చి అతకవచ్చన్న వేమన మాట అబద్ధమేమో. లోహం విరిగితే… మనసు కరిగితే?
ఆ ద్రవం కన్నీళ్లలాగే ఉంటుందా?
****
ప్యారిస్ ఐఫిల్ టవర్‌ను అర్ధచంద్రాకారంలో అనేకమార్లు ఒంచి దాని మీద రేకులు కప్పితే ఏమవుతుంది?
హైదరాబాద్ గౌలీగూడ బస్‌స్టాండ్ అవుతుంది.
ఈమాత్రం దానికి మరి హైదరాబాద్ కంటే ప్యారిస్ ఏరకంగా గొప్ప?
****
ఇప్పుడు కూలింది ఒక లోహపు కట్టడమా? కావచ్చు.
నా జ్ఞాపకాల నిర్మాణం ఎప్పుడూ కూలదు. నా ఊహల్లో అది ఎలా ఉంటుందంటే…
అర్ధచంద్రుణ్ణి బోర్లించి… పక్కలకు కాస్త నొక్కి… దాని ఇరు వైపులా దారులు చేసినట్టుగా…
అచ్చం గౌలీగూడ బస్‌స్టాండ్‌లా! – యాసీన్
.
( RTC ఈ స్థలాన్ని హడ్కో రుణం కోసం తాకట్టు పెట్టిందనే ప్రచారాల నేపథ్యంలో… ఆ బస్టాండ్ కుప్పకూలినరోజున రాసుకున్న ఫీలింగ్ ఇది )
Share this Article