కాపీ కొడతావా..? కొట్టు..! ఓ టీం పెట్టుకుని, క్రియేటివ్ వర్క్ చేయించి, నీ పేరుతో నీ గొప్పగానే చెప్పుకుంటావా..? చెప్పుకో..! అసలు సరుకు ఏమీ లేకపోయినా, ఇంకేదో కళతో నెట్టుకొస్తున్నావా..? గుడ్, కంటిన్యూ…! సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే అల్టిమేట్… ఎలా సాధించావనేది ఎవడూ చూడడు, ఏం సాధించావనేదే చూస్తారు… విజయాల కిక్కు తలకెక్కినా పర్లేదు, ఇండస్ట్రీ భరిస్తుంది, పిచ్చి విలేకరులు భరిస్తారు, పిచ్చి జనం భరిస్తారు… కానీ ఎన్నాళ్లు..?
సంగీత దర్శకుడు తమన్ చాలా సీరియస్‌గా ఆలోచించాల్సింది ఇదే… చాలామంది వస్తారు, నిలబడతారు, వెళ్తారు, కొట్టుకుపోతారు… ఇండస్ట్రీ ఎవరి సొత్తూ కాదు.., ఎటొచ్చీ విజయాలు, డబ్బు, పేరు తలకెక్కితే ఏమిటో సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ఆలోచించుకోవాలి… అసలే తమన్ కాస్త తిక్క కేరక్టర్… ఇప్పుడు కాస్త నెత్తికెక్కింది ఆ కిక్కు… కానీ ఒక్కసారి డౌన్ ఫాల్ స్టార్టయితే మాత్రం…? వద్దులెండి, అపశకునం ప్రతిహతం అవుగాక…
తనది కాని విషయాల్లో వేలుపెట్టకూడదు… ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఇదే… ఇప్పుడు ఇది చెప్పుకోవడం దేనికంటే… తమన్ ఓవరాక్షన్‌కు ఓ తాజా ఉదాహరణ ఉంది… మామూలుగా సినిమా రివ్యూలు అంటే ఏమిటి..? పెయిడ్ రివ్యూల్ని వదిలేస్తే… సోషల్ రివ్యూలు గట్రా స్థూలంగా సినిమా గురించి చెబుతాయి… సరుకు బాగుంటే భేష్ అంటాయి… సరుకు నాసిరకం అయితే మీమొహాలు మండా అని తిట్టిపోస్తయ్… సహజం… సరుకును మార్కెట్‌లో పరీక్షకు పెట్టినప్పుడు నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్, ఇతర సిబ్బంది దీనికి సిద్ధపడాలి… కానీ తమన్ ఓవరాతిఓవరుడు కదా… పైగా గెలుపు మత్తు దారితప్పించింది…
Ads
రాధేశ్యామ్ సినిమాపై మిక్స్‌డ్ టాక్ ఉంది… రివ్యూలు కూడా అలాగే ఉన్నయ్… సినిమా స్లోగా ఉందనేది ప్రధానంగా పెదవివిరుపు… అది సగటు ప్రేక్షకుడి అభిప్రాయం… అడ్డగోలు రేట్లు, ప్రయాసతో టికెట్టు కొని సినిమా చూసేవాడికి కడుపు మండితే తిట్టిపోస్తాడు… అదే రివ్యూల్లో కూడా కనిపిస్తుంది… ఏయ్, మా సినిమా మీద నెగెటివ్ రివ్యూలు రాస్తారా అని ఉడుక్కుంటే, బీపీలు పెంచుకుంటే నష్టం ఎవరికి..? దరిద్రంగా ఉన్నాసరే, ప్రతి రివ్యూయర్ మీకు డప్పు కొట్టాలా ఏంది..?
రాధేశ్యామ్ మీద రివ్యూలు, కామెంట్లు, మీమ్స్, వెక్కిరింపులు గట్రా ఆ సినిమాకు సంగీతం అందించిన తమన్‌కు నచ్చలేదు… నిన్నో మొన్నో ప్రెస్‌మీట్ వంటి భేటీ ఒకటి ఆర్గనైజ్ చేశారు… దాన్ని అరేంజ్ చేసినవాళ్లకు, ఆర్గనైజ్ చేసినవాళ్లకు కూడా బేసిక్‌గా అది ఎందుకు ఏర్పాటు చేయబడిందో కూడా తెలిసినట్టు లేదు… విలేకరులనగానే ఎడ్డిమొహాలు ఎక్కడికి రమ్మన్నా వచ్చిపాలిపోతారులే అనే ధీమా ఒకటి ఉన్నట్టుంది…
ఈ మీడియా మీట్‌కు దర్శకుడు రాధాకృష్ణ వచ్చాడు, తమన్ వచ్చి కూర్చున్నాడు… నిజానికి సినిమా పూర్తయ్యాక ఇక సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్ గట్రా సినిమా గురించి ప్రచారాల గురించి పట్టించుకోరు… ఏమైనా కంట్రవర్సీ వస్తే నిర్మాతో, దర్శకుడో తెర మీదకు వస్తారు… కానీ ఈ మీడియా మీట్ 40 నిమిషాలు సాగితే అరగంట తమనే మాట్లాడాడు… దర్శకుడిని ఒక్క ప్రశ్న వేయనివ్వడు… ప్రతి దానికీ తనే జవాబు చెబుతాడు… పైగా తిక్క ఎదురు ప్రశ్నలు…
‘‘ఒకాయన సినిమా స్లోగా ఉంది అన్నాడు నాతో… నువ్వెవరు అనడిగాను… నేను క్రిటిక్కును అన్నాడు… ప్రతి ఒక్కడూ క్రిటిక్కే… ఇక్కడ క్రిటిక్కులకు కాలేజీ వంటిది ఏమైనా ఉందా..?’’ ఇలా సాగిపోయింది తమన్… ఫాఫం, విలేకరులు… ‘‘కవరేజీ’’ పాపానికి తమన్‌ను భరించాల్సి వచ్చింది… పక్కనే ఉన్న రాధాకృష్ణ బొమ్మలాగా కూర్చుండిపోయాడు… అవును, తమనూ… ప్రతి ఒక్కడూ సంగీత దర్శకుడే, ఇక్కడ సంగీత దర్శకులకు కాలేజీ వంటిది ఏదైనా ఉందా..? అని ఓ సగటు ప్రేక్షకుడు అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటావ్..? ఫలానా నీ ట్యూన్, ఫలానా పాత ట్యూన్‌కు కాపీ అని వీడియో చూపిస్తే ఏం చేస్తవ్..? ఈ ఓవరాక్షన్ దేనికి..?
ఐనా వాడినెవడినో క్రిటిక్కు అని చెప్పుకుంటే వెక్కిరించావ్ సరే… ప్రతి ప్రేక్షకుడూ క్రిటిక్కే… నీకొచ్చిన నొప్పేమిటి..? నువ్వెందుకు ఉలిక్కిపడుతున్నవ్..? నువ్వా సినిమా లాభనష్టాలకు, నాణ్యతకు బాధ్యుడివి..? చెప్పేవాడికి రాసేవాడు లోకువ అన్నట్టుగా నువ్వు చెప్పడం, వీళ్లు రాసుకోవడం..!! నా కష్టకాలంలో యూవీ క్రియేషన్స్ నాకు రెండు మంచి ఆఫర్లు ఇచ్చింది, ఈ సినిమాతో నా రుణం తీర్చుకున్నా అన్నాడు… సోవాట్..? నీ జేబు కష్టాలు తీర్చారు కాబట్టి మేమంతా సినిమాకు డప్పు కొట్టాలా..? ఏం తెలివి ఇది తమన్..?
తమన్‌కు ఎంతగా తలకెక్కిందంటే… ఈ ప్రెస్‌మీట్ టైంకు తమన్ అన్నపూర్ణలో తన వర్క్ చేసుకుంటున్నాడు… ప్రెస్‌మీట్ జరగాల్సిందేమో పార్క్ హయాత్‌లో… ఎహె, నేను అక్కడికి రాను, విలేకరులనే ఇక్కడికి రమ్మనండి… అన్నాడు తమన్… సినిమా విలేకరులు కదా… పోలోమంటూ అన్నపూర్ణకు చేరారు… కాపీ కళాకారుడిగానే ఇంత పెరిగిపోతే… నిజంగా సొంత క్రియేటివిటీ ఉంటే తమన్ ఇప్పటికే ఇంకెంత చెలరేగిపోయేవాడో… అన్నీ ఉన్న విస్తరాకు అణిగి ఉంటుంది, ఏమీ లేనిదే ఎగిరెగిరి పడుతుంది… నిండుకుండ తొణకదు… ఓటికుండకే చప్పుళ్లు ఎక్కువ… ఇలాంటి సామెతలు బహుశా తమన్ విని ఉండడు…!!
Share this Article