Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అభివృద్ధిని ‘ఆనందపు లెక్కల్లో’ కొలిచే దేశం మరో కొత్త ఆలోచన…

November 14, 2024 by M S R

.

ఆనందానికి ఒక నగరం ఆనందం; పరమానందం; బ్రహ్మానందం- మాటలకు వేదాంత కోణంలో వేరే అర్థాలున్నా – మనం లౌకిక అర్థమే చూద్దాం .

ఆనందం వెతుక్కోవడంలోనే మనం తికమకపడుతున్నాం . ఆనందం కానిది ఆనందం అనుకుని పరుగులు తీస్తున్నాం . జీవితం ఎప్పుడూ సరళరేఖ కానేకాదు . ఒకేవేగం , ఒకే పద్ధతిలో వెళ్ళదు . ఎగుడు దిగుళ్లు ; లాభనష్టాలు ; కష్టసుఖాలు సహజం . అయితే లాభమూ సుఖమూ ఆనందించదగ్గది – నష్టమూ కష్టమూ భరించకూడనిది అవుతుంది . ఇక్కడే వస్తోంది చిక్కంతా .

Ads

జీవితం సంక్లిష్టం కావాలని ఎవరూ కోరుకోరు . కానీ సంక్లిష్టమయినప్పుడు బయటపడడానికి , ఆ ప్రయత్నంలో ఆనందం వెతుక్కోవడానికి ప్రయత్నించేవారు తక్కువ .

ఆనందం దానికదిగా వస్తువు కాదు . మార్కెట్లో దొరకదు . ఆనందం అక్షరాలా మనకు మనమే తయారు చేసుకోవాల్సిన పదార్థం . మనలో మనమే వెతికి పట్టుకోవాల్సిన వస్తువు . మనలోపలే ఉన్నా మనం లేదనుకుని వెతికే ఫీలింగ్ . ఒక అనుభూతి . ఒక మానసిక స్థితి .

మరి – మనలోపలే ఆనందం టన్నుల కొద్దీ ఉంటే మనకెందుకు కనిపించదు ? అనిపించదు ?

గెలుపు ఆనందం- ఓటమి బాధ . స్థూలంగా ఆనందానికి- బాధకు మన నిర్వచనం ఇది . లక్ష్యం , గమ్యం ఆనందం .
చేరేదారి, గమనం బాధ. నొప్పి , అసహ్యం , అసహనం , అసంతృప్తి .

గమ్యంతోపాటు గమనాన్ని , చేరే దారిని కూడా ఆనందించాలి , ప్రేమించాలి , అనుభవించాలి .

జీవితం చాలాసార్లు సవాళ్లు విసురుతుంది . ఇక మార్గమే లేనట్లుగా చేస్తుంది . బరువుగా మారుతుంది . దిగులుగా చేస్తుంది . నీరసపరుస్తుంది . నిస్పృహ నింపుతుంది . మొండిగా బండగా మారుస్తుంది . కానీ ఇలాంటి సమయాల్లో కూడా ఆనందాలను వెతుక్కోవాలి . అలవికాని ఆశలు , అంచనాలు , ఇతరులతో పోలిక , ఇతరులు ఏమనుకుంటారోనన్న ఆందోళనలు వదిలేస్తే ఎన్నెన్నో ఆనందాలు కళ్ళముందే ప్రత్యక్షమవుతాయి .

బాధ – కృతజ్ఞత రెండూ ఒక ఒరలో ఒదగవు . చెప్పుల్లేనివాడు పొర్లి పొర్లి ఏడుస్తున్నాడు . ఎవరూ ఓదార్చలేకపోయారు . అయితే రెండు కాళ్లు లేనివాడిని చూసేసరికి అతడి ఏడుపు ఆగిపోయింది . కాళ్లు లేనివాడిగురించి కన్నీళ్లు ఉబికాయి . ఇప్పుడు అతడిది బాధ కాదు- సహానుభూతి , సానుభూతి , పరిపక్వత . కాళ్లున్నందుకు ఆనందం , కృతజ్ఞత . అలా లేనివాటికంటే – ఎన్నో మనకున్నవాటికి ఎంత కృతజ్ఞతతో ఉండాలి ?

చాలామంది డబ్బు , కార్లు , ఇళ్లు , విలాసాల్లో ఆనందం ఉందనుకుని వాటికోసమే ఆగని పరుగుల్లో ఉన్నారు . ఆ పరుగుల్లో నిజానికి ఆనందం తప్ప అన్నీ దక్కించుకుంటున్నారు . ఎంతో కష్టపడి , పరుగులుతీసి సంపాదించుకున్నవి ఎక్కడ పోతాయోనని బతికినంతకాలం బాధపడుతూ ఉంటారు . ఆశకు అంతే లేదు . చిన్న చిన్న బంధాలు , ప్రేమలు , స్నేహాలు , ఇష్టాలు , ఇచ్చిపుచ్చుకోవడాలు , చేతనయిన సాయం చేయడాల్లో అంతులేని ఆనందాలు దాగి ఉన్నాయి .

జీవితంలో బ్యాంక్ బ్యాలన్స్ , ఇతరసంపదలు పోగు చేసినట్లే – ఆనందం పోగుచేయడానికి ఏమి చేస్తున్నామో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి . చేయకూడనివి ఏవి చేస్తూ ఆనందాలకు దూరమవుతున్నామో సమీక్షించుకోవాలి . చుట్టూ ఉన్న వాతావరణాన్ని , మనుషులను నిత్యం ద్వేషిస్తూ ఉంటే – ప్రతిఫలంగా ద్వేషమే వస్తుంది .

చాలా సార్లు పరిస్థితులను యథాతథంగా , లోతుగా కార్యకారణ సంబంధాలతో అర్థం చేసుకోవడమే ఆనందమవుతుంది . అర్థం కాకపొతే అదే అయోమయం , బాధగా మారుతుంది .

ఫిన్లాండ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, నార్వే, ఆస్ట్రేలియా, స్వీడెన్ లాంటి దేశాలు ప్రతి ఏటా ప్రపంచ ఆనంద పద్దులో ముద్దుగా ముందు వరుసలోనే ఎలా ఉంటాయని ఆలోచించే తీరిక, ఓపిక భారతీయులుగా మనకు ఉండవు.

ఐ ఐ టి ఎండమావుల వెంట అక్షరాభ్యాసం నాడే పరుగులు తీసే భారతీయ తల్లిదండ్రుల ఆనందాన్ని కొలిచే పరికరాలు, సూచీలు ఐక్యరాజ్యసమితి దగ్గర ఉండి ఉండకపోవచ్చు. అన్నప్రాసన నాడే అమెరికా గ్రీన్ కార్డ్ రంగుల కలలు కనే భారతీయ సగటు కుటుంబం ఆనందాన్ని బేరీజు వేసే త్రాసులు ఐక్యరాజ్యసమితి దగ్గర ఉండి ఉండకపోవచ్చు.

సినిమా హీరో కోసం బ్లేడ్లతో కోసుకుని తొలిరోజు స్పెషల్ షోకు నాలుగు రెట్లు టికెట్ రేటు ఎక్కువ పెట్టి రక్తం ధార పోయడంలో ఉన్న సైకో ఫ్యాన్స్ ఉన్మత్త అమితానందాన్ని లెక్కకట్టే ప్రమాణాలు ఐక్యరాజ్యసమితి దగ్గర ఉండి ఉండకపోవచ్చు. కల్చర్ లెస్ పీపుల్ అని ఎదుటివారిని తిడుతూ అదే నోటితో నడి రోడ్డు మీద కేకరించి ఉమ్మేసే మన ఆనందాన్ని నిర్వచించే సూత్రాలు ఐక్యరాజ్యసమితి దగ్గర ఉండి ఉండకపోవచ్చు.

బ్లడీ పీపుల్ కామన్ సెన్స్ ఉండదు అని తిడుతూ ఇంటి ముందు రోడ్డును సొంత ఆస్తిగా షామియానాలు వేసి శుభాశుభ కార్యాలు చేయడంలో, రోడ్డును అడ్డగిస్తూ పార్కింగులు చేయడంలో, రాంగ్ రూట్లో వెళుతూ ఎదుటివారిని తిట్టడంలో ఉన్న భారతీయుల ఆనందాన్ని ఐక్యరాజ్యసమితి పరిగణనలోకి తీసుకోదు. లేకపోతేనా!
భారతదేశం దరి దాపుల్లోకి రాగల దేశం ఈ భూమండలంలో ఒక్కటైనా ఉంటుందా?

సందర్భం:-

భూటాన్ లో 2,500 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో “ఆనంద నగరం” నిర్మాణానికి పనులు ప్రారంభించారు. “మైండ్ ఫుల్ నెస్ సిటీ”గా దీనికి నామకరణం చేశారు. ఎన్ని అత్యాధునిక వసతులు ఇందులో ఉన్నా; ఎంతగా పరిశ్రమలు వచ్చినా…ఈ కొత్త నగరంలో వాహనాలకు అనుమతి ఉండదు. శబ్ద, వాతావరణ కాలుష్యానికి చోటు లేదు. నిరుద్యోగం ఉండకూడదు. ప్రశాంతతకు భంగం కలగకుండా ఇక్కడ ఉండబోయేవారికి ప్రత్యేక విధి విధానాలను రూపొందించారు. శారీరక, మానసిక ఆరోగ్యమే ఇక్కడ పరమావధి కానుంది. అంతా అనుకున్నట్లు జరిగితే మంచిదే. ఇలాంటి నగరాలు భారత్ లో కూడా చాలా కావాలి. రావాలి.

కొసమెరుపు:-

దేశాల ఆనందాన్ని తక్కెడలో పెట్టి కొలిచి…మిల్లీగ్రాములతో పాటు లెక్కలు తేల్చడానికి ఐక్యరాజ్యసమితి దగ్గర సున్నితపు త్రాసులేమీ ఉండవు. స్థూలంగా వాళ్ల లెక్కలేవో వాళ్లకుంటాయి. భారత్, చైనా లాంటి అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో ఎన్ని మౌలిక వసతులు పెరిగినా, ఎంతగా సాంకేతికత అంది వచ్చినా, ప్రభుత్వాలు ఎంత చేసినా…పూటగడవనివారు కోట్లలో ఉంటారు. నిలువ నీడలేనివారు కోట్లలో ఉంటారు. రోగమొస్తే ఆసుపత్రికి మైళ్లు నడవల్సినవారు కోకొల్లలుగా ఉంటారు.

రెండు, మూడు తరాల కిందటితో పోల్చుకుంటే భారత్ ఇప్పటి ప్రాభవం చిన్నదేమీ కాదు. ఎంత చెట్టుకంత గాలి. ఎవరి ఆనందం వారిది. మన దేశంలో ఒక జిల్లా అంత కూడా లేని ఇంకేదో దేశపు ఆనందంతో పోల్చి చూసుకోవడం వల్ల మనకు మిగిలేది నిరాశ, నిస్పృహలే.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018



ఈ కథనానికి కొంత వాల్యూ యాడిషన్… అన్ని దేశాలూ అభివృద్ధిని జీడీపీ లెక్కల్లో చూస్తాయి… ఆ జీడీపీ పారామీటర్స్ పెద్ద భ్రమపదార్థాలు… కానీ భూటాన్ మాత్రమే దేశాభివృద్ధిని జీఎన్‌హెచ్ లెక్కల్లో చూసుకుంటుంది… అంటే గ్రాస్ నేషనల్ హేపీనెస్… స్థూల జాతీయ ఆనంద సూచీ… ఓ నూతన విశిష్ట ఆనంద నగరం నిర్మించే ఆలోచన కూడా ఈ దిశలోనే..! హేపీ న్యూస్..!!



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions