.
Gottimukkala Kamalakar ….. ఈ కొత్త సంవత్సరంలో చిన్ని చిన్ని ఆశలు…!
****
మీకు మెలకువ వచ్చినప్పుడే తెల్లవారుగాక..!
మీకు నిద్ర వచ్చినప్పుడే చీకటగుగాక..!
మీరు బ్రష్ చేయకున్నా నోరు పాచికంపు కొట్టకుండా గాక..!
మీకు మంచం మీదికి కావలసిన కాఫీ/టీ/ జ్యూసులు వచ్చుగాక..!
మీరు ప్రొద్దుటే పాచినోటితో కాఫీ తాగిననూ మీ దంతములు ధృడముగా యుండుగాక…!
మీకు ఏమి తిన్ననూ, ఎంత తిన్ననూ మలబద్ధకము ఉండకుండు గాక..!
మీ బాత్రూములో నిరవధిక నీటి సరఫరా యుండుగాక..!
ఎన్ని సంవత్సరాలు వాడిననూ మీ టూత్ బ్రష్ బ్రిసిల్స్ వంగిపోక నిటారుగా యుండుగాక…!
Ads
మీ యొక్క పేస్టూ, సబ్బూ, షాంపూ నిరంతరమూ నిండుగా సరికొత్తగా ఉండుగాక…!
మీకు ప్రతిరోజూ స్నానము చేసిన వెంటనే శుభ్రమైన పొడి తువ్వాలు అందుబాటులో ఉండుగాక..!
మీరు కోరిన బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి ధరించుటకు సిద్ధముగా యుండుగాక..!
మీరు కోరిన టిఫిను, కోరినంత కోరినప్పుడు దొరుకుగాక..!
మీ జీవితభాగస్వాములు మిమ్ము ప్రేమింతురుగాక..!
మీ ఖర్చుకన్నా మీ భర్త సంపాదన ఎక్కువుండు గాక..!
మీ భార్య అనుమానములన్నియునూ నిజమై, మీకా శక్తిసామర్థ్యాలు సిద్ధించు గాక..!
మీ బిడ్డలు కోరుకున్న దేశపు వీసాలు; కోరిన జీవనము దొరుకుగాక…!
మీరు తాగి ఇంటికి వచ్చిన సాయంత్రం మీ ఆవిడ పట్టించుకోకుండా ప్రేమతో తలుపుతీయుగాక..!
మర్నాడు పొద్దున్నే హ్యాంగోవర్ పట్టకయుండుగాక..!
ఘన (ముక్క); ద్రవ (మందు); వాయు( ఈ నగరానికేమైంది) పదార్థాలు మీ ఆరోగ్యాలపై దుష్ప్రభావాలు చూపకుండుగాక…!
మీ కారు ఎంత తిరిగినా ఎప్పుడూ ఫుల్ ట్యాంక్ ఇంధనముండుగాక…!
వెదకకుండానే మీ టీవీ రిమోట్; కళ్లద్దాలు; కార్ తాళాలూ దొరుకుగాక..!
నీళ్లు పోయడం మరిచినా మీ బాల్కనీ మొక్కలు తాజాగా ఉండుగాక..!
మీ చొక్కాల గుండీలు; పంట్లాల జిప్పులూ పాడవకుండుగాక…! మీరు ప్రతిరోజూ జిప్పును మరిచిపోకుండా పెట్టుకుందురు గాక..!
మీ ఫ్రిజ్ లో కూరగాయలు తాజాగా ఉండి కుళ్లకుండుగాక…!
ఆ యొక్క కూరలు అత్యంత రుచిగా ఉండుగాక..!
మీ సిబిల్ స్కోరు నిత్యమూ 850 పైచిలుకు ఉండుగాక..!
మీ మొబైల్ నంబరూ; బ్యాంకు డిపాజిట్లూ సరిసమమగుగాక…!
మీకు జిమ్ వెళ్లకుండానే పొట్ట కరుగుగాక..!
వి-కేర్ వెళ్లకుండానే వత్తైన జుట్టు యుండుగాక..!
మీకు తిరుపతికొండ మీద ధర్మదర్శనం పదినిమిషాల్లో అరగంట పాటు జరుగుగాక…!
మీకు స్మార్ట్ ఫోన్ లేకుండానే సమస్తలోకాలూ గుప్పిట్లో ఉండుగాక..!
మీ పనిమనిషి నెలకు ముప్ఫైరోజులూ పనికివచ్చు గాక..!
మీకు నెలకు పాతిక రూపాయలకే నెట్ ఫ్లిక్స్ చందా దొరుకుగాక…!
మీ పేపరువాడు, పాలవాడు మీరిచ్చేదాకా డబ్బులు అడగకుండుగాక..!
మీరేం రాసినా, చేసినా, తీసినా, చూసినా జనుల మనోభావాలు దెబ్బతినకుండుగాక..!
మీకు నచ్చే సినిమాలు తెలుగులో కూడా వచ్చుగాక..!
మీకు ఈఎమ్మైలూ, ఎమ్మారైలూ, ఉండకుండుగాక..!
మీ తెల్ల చొక్కా పసుపు రంగుకు మారకుండుగాక..!
మీ ముదురురంగు చొక్కా వెలియకుండుగాక..!
మీ చీరల ఎంపిక మీ సతీమణికి నచ్చుగాక..!
మీపై ఐలయ్య పుస్తకం రాయకుండుగాక…!
మీరు పుస్తకం రాస్తే దాని పబ్లిసిటీ పబ్లిషర్ మాత్రమే చేసుకుని మీకు తదుపరి పుస్తకం రాయగలిగే సమయము సమృద్ధిగా లభించుగాక..!
మీకు ఉదయం ఎగ్సూ; సాయంత్రం పెగ్సూ, రాత్రికి లెగ్సూ దొరుకుగాక…!
మీకు సూరజ్ బర్జాత్యా, శ్రీకాంత్ అడ్డాల సినిమాల్లో అంత మంచి మనుషులసాంగత్యము దొరుకుగాక..,
మీరు యశ్ చోప్రా, కరణ్ జోహార్ సినిమాల్లో అంత ధనవంతులగుదురు గాక..,
మీతో కే రాఘవేంద్రరావు బియ్యే సినిమాల్లో అంత సౌందర్యరాశులు సయ్యందురు గాక..,
మీ జీవితంలో కృష్ణవంశీ సినిమాల్లో అంత సందడి యుండుగాక..,
మీకు పెద్దవంశీ సినిమాల్లో అంత నీటి వనరులూ, రైల్వే కనెక్టివిటీ దొరుకుగాక..,
మీకు చార్లీ చాప్లిన్ సినిమాల్లోలా విషాదమున్నా నవ్వగలిగే వరం లభించుగాక..,
త్వరగా క్షమించుట నేర్చుకొందుకు గాక..,
త్వరగా, ఆలోచించకుండా స్పందించుట మానుదురు గాక..!
పనికిరాని ప్రతీ కావడినీ మోయకుందురు గాక..!
ప్రపంచంలోని ప్రతి గుమ్మడికాయ దొంగతనానికీ మీరు భుజాలు తడుముకోకుందురు గాక..!
ఏడొందల నలభై కోట్ల లింగాలలో మనిద్దరం రెండు బోడిలింగాలమని గుర్తింతురు గాక..!
ప్రతీ గంట ఫేసుబుక్కు చూచు సమయానికి ఓ అరగంట మామూలు బుక్కు చదువు సమయమును కేటాయింతురు గాక..!
జిమ్మును మొదలెట్టి, గుండెల్లో దమ్మును పెంచుకుని, ఊపిరితిత్తుల్లోకి దమ్మును పీల్చకుందురు గాక..!
మీలోకి ఆల్కహాలు సందర్భవశాత్తూ వెళ్ళిననూ, మీరు ఆల్కహాలులోకి వెళ్లకుందురు గాక..!
ఫేస్ బుక్కులో ప్రతీ మట్టగిడస వ్యవహారానికీ మీ మనోభావాలు దెబ్బ తినకుండుగాక..!
****
Share this Article