.
Sai Vamshi ……. #ప్రేమికులరోజు #ValentinesDay వీరందరికీ.. అంటే వీరందరికీ..
* ‘నాకు ప్రేమించడం ఇష్టం. మా కులం వాళ్లను ప్రేమించడం ఇంకా ఇంకా ఇష్టం’ అనేవాళ్లకి..
* ‘నిన్ను ప్రేమిస్తాను.. కానీ పెళ్లి గురించి గ్యారెంటీ ఇవ్వలేను’ అని చెప్పే అమ్మాయిలకీ, అబ్బాయిలకీ..
Ads
* ‘ప్రేమ ఓకే, కానీ ఉద్యోగం వస్తేనే నీతో పెళ్లి’ అని కండీషన్ పెట్టే అమ్మాయిలకీ..
* ‘మనది ప్రేమ పెళ్లే కానీ, మా వాళ్లకు మాత్రం కట్నం కావాలి’ అని చెప్పే అబ్బాయిలకీ..
* ‘ప్రేమిస్తావా, లేక పెట్రోల్ పోసి చంపేయమంటావా? కాదంటే యాసిడ్ పోయానా?’ అని అమ్మాయిలకు చావుపై ఆప్షన్లు ఇచ్చే సైకోలకూ..
* ‘మన ప్రేమ గురించి మా ఇంట్లో చెప్తాను. మా వాళ్లు అడిగితే సేమ్ క్యాస్ట్ అని చెప్పు’ అని ముందుగా హెచ్చరించే అమ్మాయిలకీ..
* ‘మా దేవుణ్ని నమ్మి మా మతంలోకి వస్తేనే మన పెళ్లి’ అని కండీషన్ పెట్టే పరమ పరలోక భక్తులకీ, ‘మా మతంలోకి వచ్చి బొట్టు పెట్టుకుంటేనే మనం కలిసుంటాం’ అని బెదిరించే వీరధర్మ పిల్లిపులులకూ..
* ‘మా క్యాస్ట్‌లో ప్రేమ పెళ్లిళ్లు ఒప్పుకోరు’ అని బుద్ధిగా, పద్ధతిగా చెప్పే అమ్మాయిలకీ, అయినా వాళ్ల వెంటపడే అబ్బాయిలకీ..
* ‘మా ఇంట్లో మన లవ్‌ని ఒప్పుకోవాలంటే నీకు గవర్నమెంట్ జాబ్ ఉండాలి’ అని కోరే అమ్మాయిలకీ, వాళ్ల కోసం అశోక్‌నగర్‌కి, దిల్‌సుఖ్‌నగర్‌లకీ అంకితమైన అబ్బాయిలకీ..
* ‘ప్రేమలో ఎలా ఉన్నా ఓకే, కానీ పెళ్లయ్యాక కొంచెం పద్ధతిగా ఉండు’ అని హెచ్చరికలు జారీ చేసే అబ్బాయిలకీ..
* ‘ఇప్పుడు మనకు పెళ్లయ్యింది. ముందులా ఉండాలంటే కుదరదు’ అని చెప్పే మొగుళ్లకీ, వాళ్ల మాటలకు తలూపే పెళ్లాలకీ..
* ‘ప్రేమించడానికి వాడే దొరికాడా, మన కులంలో ఎవరూ దొరకలేదా’ అని నిలదీసే అమ్మానాన్నలకీ, తమ కులంలోనే ప్రేమికుల్ని వెతుక్కోవాలనే ఆలోచన రాని యువతకీ..
* ‘ప్రేమాదోమా అంటే కాళ్లు విరగ్గొడతా! నోర్మూసుకుని తాళి కట్టించుకో’ అంటూ ఆడపిల్లల్ని బలిపశువుల్ని చేసే తల్లిదండ్రులకీ, ఆ అమ్మాయి తనకోసమే పుట్టిందనుకొని తాళి కట్టే పెళ్లి కొడుకులకీ..
* పెళ్లికి ముందు భార్య మరెవర్నో ప్రేమించదని తెలిసి, పుట్టిన కొడుకులో తన పోలికలున్నాయా, లేదా అని వెతికే ప్రబుద్ధ భర్తలకీ, వారితో నిత్యనరకం అనుభవిస్తున్న భార్యలకీ..
* కొడుకు ప్రేమ పెళ్లి చేసుకున్నా కోడలి నుంచి కట్నం అడిగి, కూతురు ప్రేమ పెళ్లికి మాత్రం కట్నమెందుకు అని నోళ్లు నొక్కుకునే ఆదర్శ అమ్మానాన్నలకీ, వాళ్ల పిల్లలకీ..
* కొడుకు ప్రేమిస్తే ‘ఆ అమ్మాయి మా వాణ్ని బుట్టలో వేసుకుందని’ నమ్మి, కూతురు ప్రేమిస్తే మాత్రం ‘వాడెవడో మా పిల్లను వల్లో వేసుకున్నాడు’ అని చాటుకునే ప్రియమైన తల్లులకూ..
* తమ కూతుళ్లు వేరే కులం అబ్బాయిల వైపు చూడకుండా బాడీగార్డులు ఏర్పాటు చేసే తండ్రులకి, వారి మద్దతు పలికే తల్లులకీ..
* ‘మీ పిల్లలు లవ్ మ్యారేజీ చేసుకున్నారంటగా’ అని గుచ్చిగుచ్చి అడిగే బంధువులకీ, ఆరాలు తీసే ఇరుగుపొరుగువారికీ..
* కూతురు వేరే కులం వాణ్ని, అందునా తమకంటే తక్కువ అని భావించే కులం వారిని ప్రేమించిందంటే, వెంటనే కత్తులకు సాన పెట్టే తండ్రులకూ, ఆ కత్తిని పిడికిట పట్టే కొడుకులకీ, వాళ్లని ఎగదోసే నానమ్మలకీ..
* కులం కోసం కత్తులు పట్టిన, పట్టించిన మనోహరాచారి, మారుతీరావు.. తదితర ప్రముఖోత్తములకూ, వారికి మద్దతు ఇచ్చే ‘కులగులాకారులకూ’..
* ‘ప్రేమించుకుంటూ టిఫిన్లు లేకపోతే ఎట్లా’.. అని కోడ్ భాష మొదలుపెట్టి మొదట ముద్దుల్ని, ఆ తర్వాత రగ్గుల్ని పంచుకుని ప్రేమకు కొత్త నిర్వచనం చెప్పే ప్రేయసీ ప్రియులకీ..
* ‘ఎవ్వరు ఏమన్నా ఆగదు ఈ ప్రేమ’ అని పాటలు పాడుకుంటూ ఇంట్లోంచి పారిపోయే 14 ఏళ్ల అమ్మాయిలకీ, 17 ఏళ్ల అబ్బాయిలకీ, వారి వీరప్రేమగాథకీ..
* ‘ప్రేమికుడు తోడుంటే స్వర్గానికైనా వెళ్లొచ్చు’ అనే సినిమా డైలాగులు నమ్మి, వారి వెంట వెళ్లి చివరకు ముంబయి కామాటిపురలో తేలే అమ్మాయిలకీ, వారి కన్నీటిగాథలకీ..
* 16 ఏళ్ల వయసులో 20 ఏళ్ల వాడిలో ప్రేమలో మునిగి, వాణ్నే కట్టుకొని, రెండేళ్లకే ఇద్దరు బిడ్డలకు తల్లై, 22 ఏళ్ల మొగుడి అలసత్వం, బద్దకం భరించలేక అవస్థ పడుతున్న 18 ఏళ్ల ముత్తయిదువులకీ, వారికి పుట్టిన అమాయకపు పిల్లలకీ..
* అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పగానే, ‘ఆహా! అయితే బంచిక్ బంబం అన్నమాట’ అంటూ సంపర్కం గురించి ఆలోచించే అబ్బాయి ఫ్రెండ్స్‌కి, వారి ఊహలకీ, వారి మెచ్యూరిటీకి..
* అబ్బాయిని ప్రేమిస్తున్నాని చెప్పగానే, ‘ఏజ్, సాలరీ, కులం, ఆస్తిపాస్తులు.. ఫైనల్లీ అందంగా ఉన్నాడా’ అని ఆరాలు తీసే అమ్మాయి ఫ్రెండ్స్‌కీ, వారి ఆలోచనలకీ, వారి ఆశలకీ..
* భర్త/భార్య మీద శారీరక ప్రేమని, ప్రియుడు/ప్రియురాలి మీద మానసిక ప్రేమను గుమ్మరించగలిగే ‘వీర ప్రేమికులకీ’..
* ‘ఇతర మతాల అమ్మాయిల్ని ప్రేమించు, పెళ్లి చేసుకుని మన మతంలోకి మార్చు’ అని సిద్ధాంతాలు గ్రంథస్తం చేసే మతపెద్దలకీ, వారికి మద్దతు పలికే అమాయక యువతకీ, వారిని హాయిగా వాడుకునే రాజకీయ నాయకులకీ..
* విదేశీ అమ్మాయిలు భారతీయులను ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇవాళ గొప్పగా పొగిడి, 60 ఏళ్ల క్రితం అదే పని చేసిన సోనియాగాంధీని మాత్రం ఆడిపోసుకునే సోషల్ మీడియా సోకాల్డ్ ధర్మపరిరక్షకులకు..
* అద్భుతమైన ప్రేమకథలు సినిమాలుగా తీసి, తమ పిల్లలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటానంటే మాత్రం అడ్డుపుల్లలు వేసే సృజనకారులకు, వారి వీరవిధేయులకీ..
* భార్య మీద ప్రేమ లేదంటూనే ముగ్గురు పిల్లల్ని కనే భర్తలకూ, ప్రేమంటే ఏమిటో తెలియకుండానే జీవితాలను ముగించేసిన కోటానుకోట్ల మంది స్త్రీలకూ..
* వాలెంటైన్స్ రోజు పార్కుల్లో దొరికినవారికి పెళ్లి చేసి, మిగిలిన 364 రోజులూ సామూహిక మౌనవ్రతం, వీలైతే అజ్ఞాతవాసం పాటించే సంఘదుష్కర్తలకీ..
* ‘ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదు, అది మన సంస్కృతి కాదు. అసలు మన సంస్కృతిలో ప్రేమే లేదు. ఉన్నదంతా పెళ్లే’ అని వీడియోల్లో ఊదరగొట్టే బ్రెడ్ బన్నులకూ, వారిని టీలో ముంచుకొని తినే ఆధునికవాదులకూ.. … వీళ్లందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.. – విశీ (వి.సాయివంశీ)
Share this Article