అవును, బెంగుళూరులోనే… స్కూల్ విద్యార్థుల బ్యాగులు చెక్ చేస్తే కండోమ్స్, సిగరెట్లు, వైట్నర్లు, మద్యం, గర్భనిరోధక మాత్రలు కనిపించాయని వార్త చదివాం… అఫ్‌కోర్స్, మరోరోజు చెక్ చేస్తే డ్రగ్స్ పాకెట్లు దొరికేవి… వాళ్ల ఫోన్లు పరిశీలిస్తే ఇక ఆ పరిశీలకులే కిందపడి కొట్టుకునేవారేమో… నిజం… నిన్న ఓ స్కూల్ టీచర్ రాజీనామా చేసింది… అదీ ప్రైవేటు స్కూల్… (గవర్నమెంట్ స్కూళ్లలో ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి)…
కొన్నివారాల నుంచి లేడీ స్కూల్ టీచర్ల రాజీనామాలు వినిపిస్తూనే ఉన్నాయి… పిల్లల నుంచి లైంగిక వ్యాఖ్యలు, వెక్కిరింపులు, అశ్లీలపు నినాదాలు, అసభ్య సంకేతాలతో విసిగిపోయి తమ కొలువులకే రాజీనామాలు చేస్తున్నారు… నిన్నటి రాజీనామా టీచర్ ఏమంటుందో చదివితే నిర్ఘాంతపోవడం మన వంతు… ‘‘నార్త్ బెంగుళూరులోని ఓ పాపులర్ ప్రైవేటు స్కూల్‌లో మ్యాథ్స్ చెబుతాను…
టీచర్‌గా పనిచేస్తున్నందుకు ఇన్నేళ్లూ గర్వపడ్డాను… ఆ రోజులు పోయాయి… స్కూల్ అన్నా, టీచర్ అన్నా భయభక్తులేమీ లేవిప్పుడు… ఓ పర్టిక్యులర్ క్లాస్‌కు వెళ్లాలంటే భయమేస్తోంది… విద్యార్థులందరినీ తప్పుపట్టడం లేదు నేను… కానీ పేరున్న కొన్ని కుటుంబాలకు చెందిన పిల్లల బిహేవియర్ మొత్తం విద్యార్థి లోకానికే తలవంపులు… రోజురోజుకూ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక ఇక టీచర్ వృత్తినే వదిలేయాలని నిర్ణయం తీసుకున్నాను…’’
Ads
ఇంగ్లిష్ చెప్పే మరో టీచరమ్మ ఏం చెబుతోందంటే… ‘‘నేను క్లాసులోకి ఎంటర్ అయిన వెంటనే గుడ్ మార్నింగు విషెస్ ఏమీ ఉండవు… కొందరు పిల్లలు విజిళ్లు వేస్తారు… ఏదైనా పద్యమో, మరొకటో చెబుతుంటే నేరుగా కామెంట్స్ పాసవుతూనే ఉంటాయి, నామీదే, నా ఎదురుగానే… ఐలవ్యూ టీచర్ దగ్గర నుంచి రకరకాల రొమాంటిక్ వ్యాఖ్యలు… కొన్ని నేను మీకు చెప్పలేను, నా బాడీ గురించి, నా పెదాల గురించి, నేనెలా నడుస్తాను, నా లుక్కు, నా బాడీ కలర్ ఎలా ఉంది… అసలు వాళ్లకు నేనే ఓ సబ్జెక్టు…
రెండుమూడుసార్లు క్లాసులోనే ఏడ్చేశాను… తరువాత రాజీనామా నిర్ణయం తీసుకున్నాను… ఇప్పుడు ప్రశాంతంగా ఉంది…’’ ఒకవేళ టీచర్ గనుక ఫ్రస్ట్రేటయి పిల్లాడిని ఏమైనా అంటే ఇక పెద్ద పంచాయితీ… పిల్లల పేరెంట్స్ వచ్చి అందరి ముందే టీచర్లను తిట్టేస్తున్నారు… అదీ అసలు ప్రాబ్లం… కర్నాటక మేనేజ్‌మెంట్ స్కూళ్ల అసోసియేషన్ కార్యదర్శి శశికుమార్ ఏమంటాడంటే..?
‘‘ఇంకా ఎక్కడున్నారు సార్ మీరు… గురుదేవోభవ, గురుభ్యోనమః అవన్నీ ఛాందసాలు… విద్యార్థులంటేనే గురువులు వణికిపోయే దురవస్థ వచ్చేసింది… ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు… చైల్డ్ రైట్స్ కమిషన్‌కే లెటర్ రాసింది ఈ అసోసియేషన్… ‘‘అయ్యా, మమ్మల్నేం చేయమంటారో కాస్త సూచించండి’’ అని..! వాళ్లు సింపుల్‌గా సమస్యాత్మక పిల్లలకు కౌన్సిలింగ్ చేయండి అని ఓ సలహా పడేశారు… అదంత వీజీ పనేనా..? ఎవరైనా పిల్లాడిని కౌన్సిలింగ్‌కు పిలిస్తే, ఓ సిగరెట్ వెలిగించి, ఏమిటో చెప్పండి త్వరగా అంటాడేమో…
ఇక్కడ మరో భూతం ఉంది… దాని పేరు మీడియా… నిజానిజాలు దానికి అక్కర్లేదు… ఫలానా స్కూల్‌లో పిల్లాడికి వేధింపులు అంటూ టాంటాం… పొరపాటున ఫిమేల్ స్టూడెంట్, మేల్ టీచర్ అయితే ఇక మీడియాకు పట్టపగ్గాల్లేవు… సమస్య ఎక్కడుంది..? పేరెంట్స్ దగ్గరా..? పిల్లల దగ్గరా..? వాళ్లను వేగంగా చెడగొట్టేస్తున్న మన సినిమాలు, మన సీరియళ్లు, మన ఫోన్లు, మన అసభ్య వీడియోలు, కారుచౌక బ్రాడ్‌బ్యాండ్ దగ్గరా..?! అవునూ, స్కూలింగ్ దగ్గరే ఇలా ఉంటే… ఆపై క్లాసుల్లో మాటేమిటి..?!
Share this Article