ముందుగా ఓ విషయం చెప్పుకుని… వివాదంలోకి వెళ్దాం… ఈటీవీలో వచ్చిన ‘పాడుతా తీయగా’ చాలా పాత వీడియోలు చూస్తుంటే ఓచోట ఎస్పీ బాలు అసహనంగా చెబుతున్నాడు… ‘‘నోట్స్, హైపిచ్, లోపిచ్… శ్రోతలకు పెద్దగా అక్కర్లేదు, కానీ భావయుక్తంగా ఒక పదాన్ని గాయకుడు ఉచ్చరించాడా లేదా గమనిస్తాడు… సరైన ఉచ్ఛరణకు సంగీత నియమాలు అడ్డం వస్తే, ఉచ్ఛరణ కోసం ట్యూన్లను, టోన్లను, నోట్లను మార్చుకోవాలి తప్ప మన పదాల్ని కాదు…’’ చప్పట్లు కొట్టాల్సిన సందేశం…
ఇక వివాదంలోకి వెళ్దాం… సిద్ శ్రీరామ్ అనే పాపులర్ గాయకుడు… ఇప్పుడు అందరికీ తనే కావాలి… తమిళ మూలాలు… అమెరికాలో పుట్టి పెరిగాడు… కర్నాటక సంగీతంలో ప్రవేశం ఉన్నట్టుంది… తెలుగును కూడా ఇంగ్లిషు లిపిలో రాసుకుని తెలుగులో పాడుతున్న స్పూర్తిని మెచ్చుకోవాలా..? అపశృతులతో పదాల ఉచ్చరణను భ్రష్టుపట్టిస్తున్నందుకు అభిశంసించాలా తరువాత ఆలోచిద్దాం…
కారుణ్య, శ్రీరామచంద్ర, రేవంత్, రోహిత్, హేమచంద్ర… ఎట్సెట్రా ఎందరు లేరు మన తెలుగు గాయకులు..? ప్రతి పదాన్ని భావయుక్తంగా పాడగలవాళ్లు… జాతీయ స్థాయి దాకా వెళ్లి పాటల పోటీల్లో నిలిచినవాళ్లు… కానీ తెలుగు తెలియని, తెలుగు చదవలేని, తెలుగు రాయలేని, అన్నింటికీ మించి అచ్చమైన తెలుగు పాడలేని సిధ్ శ్రీరామ్ ఈరోజు మనకు సూపర్ సింగర్…
Ads
ఆమధ్య సీనియర్ జర్నలిస్టు, మిత్రుడు ధాత్రి మధు ఓ వీడియో విడుదల చేస్తూ… ‘‘సిధ్ శ్రీరామ్ పాడే పాటలకు గేయ రచయితలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు… తెలుగువారు బతికిపోతారు.
ఉంటే
కంటే
మంటి
పంటి
ఒంటి… లాంటి సున్నా తరువాత ట, టి, టే అక్షరాలు వచ్చే పదాలు దయచేసి రాయకండి. రాస్తే వాటిని అతను…
ఉల్టే
కల్టే
మల్టి
పల్టి
ఒల్టి… అని స్పష్టంగా పాడుతున్నాడు.
చేసుకుందాం
చూసుకుందాం
కొట్టుకుందాం
దాక్కుందాం… లాంటి కు సున్నా తరువాత దా వచ్చే మాటలను కూడా దయచేసి రాయకండి. వాటిని అతను…
చేసుకుల్దాం
చూసుకుల్దాం
కొట్టుకుల్దాం
దాక్కుల్దాం... అని పరవశించి పాడుతున్నాడు.
తెలుగు దర్శక నిర్మాతలకు రచయితలకు నటులకు ఎవరికీ ఇందులో తప్పు కనిపించలేదు. ఒక్కో పాటను కొన్ని కోట్ల మంది కళ్ళావి కళ్ళావి అని కళ్ళాపి చల్లుకుంటూ కూరలావి కురులావి అని ఏదో తెలియని పైశాచి భాషలా అనుకుని పాడేసుకుంటున్నారు.
చంద్రబోస్, రామజోగయ్య, అనంత్ శ్రీరామ్ తో పాటు ఏ రచయిత అయినా …
సిధ్ శ్రీరామ్ కు…
ఉంటే
కుందాం
అన్న మాటలను
ఇంగ్లీషులో
Unte (not ulte)
Kundam (not kuldam)
అని రాసి చూపించి… వాటిని ఎలా పలకాలో కూడా చెప్పాల్సిందిగా భాషాభిమానులుగా మా అభ్యర్థన…’’ అని కడిగి పారేశాడు…
గాడిదలో గాకు…
అడిగా అడిగా పాటలో గాకు తేడా లేనప్పుడు తెలుగు భాషాభిమానులుగా మా గోడు ఎవరికి చెప్పుకోవాలి?
గుర్రం గాడిద ఒకటి కాదని ఎవరు చెప్పాలి మీకు?
అతను భాష తెలియక పాడితే పాడవచ్చు గాక. భాష తెలిసి… సరిదిద్దాల్సిన మీకు బాధ్యత లేదా?
ఈ ఉల్టా పల్టా విల్టే గుల్డె చెరువై చెవికోసుకుల్దాం చెమటలు పట్టించుకుల్దాం మల్డే మళ్టలు ఎన్నాళ్లు?’’ అనీ అడిగి పారేశాడు…
ఆ వీడియో బాగా పాపులరైంది… భాషాభిమానులు, సంగీతాభిమానులు చాలామంది చూశారు… నిజంగానే సిధ్ శ్రీరామ్ పదాల ఉచ్ఛరణ ఇనుప గుగ్గిళ్లతో సమానం అనే విమర్శ చాన్నాళ్లుగా ఉంది… ఈ వీడియో తరువాత ఐడ్రీమ్స్ చానెల్ కోసం ఎవరో జర్నలిస్టు మిత్రుడు అనంత శ్రీరాంను ఈ ప్రశ్న అడిగాడు… ఈమధ్య చిప్ కొట్టేసి ఏదేదో మాట్లాడుతున్న అనంత శ్రీరాం మరో దిక్కుమాలిన సమర్థనకు పూనుకున్నాడు…
హై పిచ్‌లో పాడేటప్పుడు కొన్నిసార్లు గాయకుడు శృతి కోసం అనుస్వరానికి ఏదేని హల్లును తోడు తెచ్చుకుంటాడట… అంటే తెలుగు పదం అక్కడ ఎంత పొల్యూట్ అయిపోయినా, చివరకు అర్థమే మారిపోయినా సమర్థనీయమేనా..? ఇంకా ఏవేవే చెప్పాడు… అందరికీ అది సహజమనీ, సాంకేతిక అంశాలు తెలియకుండా మాట్లాడకూడదనీ సదరు ధాత్రి మధుకు జవాబు చెప్పాడు…
నిజానికి తనకు ఏమీ తెలియదు… అలాంటప్పుడు మౌనంగా ఉండాలి… పైన చెప్పిన మన తెలుగు గాయకులు పాడుతుంటే పదాల ఉచ్ఛరణ తేటగా, తెలుగంత తీయగా పలుకుతుంది… మరి వాళ్లకు హైపిచ్ కష్టాలు, లోపిచ్ అవస్థలు ఎందుకు ఉండవు..? ఒక్క సిధ్ శ్రీరాంకే ఎందుకు..? మధు అనంతశ్రీరాంకు మరో వీడియోలో బదులు ఇస్తూ…
‘‘సినిమా పాటల రచయిత అనంత్ శ్రీరామ్ గారికి- అయ్యా,..
తెలుగు సినిమా పాటల్లో సిధ్ శ్రీరామ్ ఉల్టే కల్టే కుల్దాం అని పాడడాన్ని నేను తప్పు అన్నాను. ఇలా పాడడం తప్పు కాదు అని మీరంటున్నారు. కనీసం రాసిన రచయిత అయినా చెప్పాలి కదా అని నేను సూచించాను. మీరు అది అవసరమే లేదని… సంగీతంలో తీవ్ర శృతిలో పాడేప్పుడు ఎవరయినా అలాగే పాడతారని… ఆ సాంకేతిక అంశాలు తెలియకుండా మాట్లాడకూడదని మీరన్నారు.
(కాపీ రైట్ సమస్య వల్ల ఆ వీడియోను ఇక్కడ చూపడం కుదరదు. ఆసక్తి ఉన్నవారు ఆ ఛానల్ లో చూడవచ్చు) నాకు అర్థమయినంతవరకు ఐడ్రీమ్స్ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో యాంకర్, రచయిత సిరాశ్రీ నా పేరు ప్రస్తావించి… సిధ్ శ్రీరామ్ తెలుగు పాడడంలో లోపాల మీద నేను చేసిన వీడియో గురించి మిమ్మల్ని అడిగితే… మీరు నాకు ఇచ్చిన ఉచిత సలహాలివి…
1. పై స్థాయి/.తీవ్ర శృతి/.తార స్థాయిలో పాడేప్పుడు ఈ దోషాలు సహజం.
2. గతంలో కొన్ని పాటల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. అవి దోషం కాదు.
3. సంగీతం పాడడంలో సాంకేతిక అంశాలు తెలియకుండా… ఇలా సినిమా రచయితలు, గాయకులను విమర్శించకూడదు.
4. ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులకు తెలుగు నేర్పాలి.
5. లేదా గొప్ప కార్పొరేట్ బళ్లలో తెలుగు బోధించాలి.
నేను పూర్తి స్పృహలో ఉండే మాట్లాడాను. మీరు కూడా పూర్తి స్పృహలో ఉండి ఏమి మాట్లాడుతున్నారో తెలియాలంటే... ఈ విషయం మీద మీ జ్ఞానం- నా అజ్ఞానం వాదించుకోవడం దండగ.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరున్న సంగీత, భాషాశాస్త్రవేత్తలను ఇద్దరినో, ముగ్గురినో ఎంపిక చేసి… వారి ముందు మన వాదనలు వినిపిద్దాం. సిధ్ శ్రీరామ్ అలా పాడడం తప్పు కాదని భాషాశాస్త్రవేత్తలు అంగీకరించినా… సాంకేతికంగా సంగీతం పాడేప్పుడు ఉంటే ఉల్టే; కుంటే కుల్టే; కుందాం కుల్దాం అవుతుందని సంగీతవేత్తలు అంగీకరించినా… నేను మీకు క్షమాపణ చెప్పి…నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటాను. మీ వాదన తప్పని తేలితే మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన పని కూడా లేదు. ఇంకోసారి సిధ్ శ్రీరామ్ కు పిఆర్ఓగా వకాల్తా పుచ్చుకుని మీరు ఇలా తలాతోక లేకుండా మాట్లాడకుంటే చాలు.
Share this Article