Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీఎం జేబులో కత్తెరతో తిరిగితే తప్పేంటి మిస్టర్ హరీష్‌రావూ..?

September 23, 2025 by M S R

.

పలు విషయాల్లో కేటీయార్ వ్యాఖ్యలు అదుపు తప్పి ఉంటాయి… కాస్త ఆచితూచి బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడే హరీష్‌రావు కూడా ఫ్రస్ట్రేషన్‌కు గురై ఏదేదో మాట్లాడుతున్నాడు… సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం, నర్మెట్ల ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సందర్శించినప్పుడు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం…

  • ప్రత్యేకించి తను ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అంశం… ప్రభుత్వం అనేది ఓ నిరంతర ప్రక్రియ… Continuation Process… పార్టీలు, పాలకులు వస్తుంటారు, పోతుంటారు… వ్యవస్థ నడుస్తూ ఉంటుంది, ఉండాలి…

ఇంతకీ తనేమంటాడంటే..? ‘‘ఈ ఫ్యాక్టరీ అనేది ఒక ఉద్వేగం… ఈ ఫ్యాక్టరీ రావడానికి కష్టపడింది, చెమట చిందించింది బీఆర్ఎస్ పార్టీ… విత్తనం నాటింది బిఆర్ఎస్ కానీ ఆ పండ్లను తినడానికి బయలుదేరింది కాంగ్రెస్… రేవంత్ రెడ్డి రిబ్బన్ కత్తిరించడానికి కత్తెర జేబులో పెట్టుకొని బయలుదేరిండు…’’

Ads

  • ఇదేం పోకడ..? కేసీయార్ సంకల్పించిన ఫ్యాక్టరీ అయితే… తనను జనం కుర్చీ నుంచి దింపేస్తే… ఇక ఫ్యాక్టరీ పఢావు పడాలా..? తరువాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పండబెట్టాలా..? ఎండబెట్టాలా..? హరీష్‌రావుకు ఏమైంది అసలు..?

బీఆర్ఎస్ పార్టీ చెమట అట… అదేమైనా పార్టీ నిధులతో కట్టారా..? ప్రభుత్వ నిధులు… ఆ ఫ్యాక్టరీ కసీయార్ హయాంలో మొదలుపెట్టారు, మేమెందుకు కంప్లీట్ చేయాలి  అనే సంకుచిత ధోరణితో కాంగ్రెస్ ఆలోచించలేదు కదా…, కంప్లీట్ చేసింది, ట్రయల్ రన్ చేశారు… ఇప్పుడు ప్రారంభానికి రెడీ… అది అభినందనీయం కాదా…

oilpalm

  • జేబులో కత్తెర పెట్టి తిరిగితే తప్పేమిటి..? నిర్మాణంలో ఉన్నవి కంప్లీట్ చేస్తే అది గుణాత్మకమే తప్ప, వ్యతిరేకించే అంశం ఎలా అవుతుంది..? అసలు అలా సంకుచితంగా ఆలోచించిందే కేసీయార్… వైఎస్‌కు పేరొస్తదని, ప్రాణిహిత- చేవెళ్లను బొందపెట్టి, కమీషన్ల కాళేశ్వరం తలపెట్టాడు… దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పఢావు పెట్టాడు…

మామ కేసీయార్ ఆలోచనధోరణిలాగే… హరీష్‌రావు ఆలోచనలు కూడా… ప్రభుత్వం అంటే ఓ కంటిన్యూయేషన్ ప్రాసెస్ అనే విజ్ఞత,  పరిణత ఆలోచన విధానం లేకపోవడం..! రాజకీయ విమర్శలు వేరు… ప్రతి దాంట్లో రాజకీయ కాలుష్యం దట్టించాల్సిన పనిలేదు…

ఇంకా ఏమంటాడంటే..? ‘‘గాలిలో తేమశాతం లేదని 2018లో పామాయిల్ సాగు జరగదని తేల్చి చెప్పిన ఐఐఓఆర్ కేంద్రం… 2021లో ఇదే ప్రాంతం గాలిలో తేమశాతం పెరిగి పామాయిల్ సాగుకు అనువైన ప్రాంతం అయింది… అశ్వరావుపేట, సత్తుపల్లి సముద్రతీరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కాబట్టి గాలిలో తేమశాతం ఉంటుంది. కాబట్టి అక్కడ మాత్రమే పామాయిల్ పండేది…

కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల పాలమూరు గాని, కాళేశ్వరం గాని, సీతారామ గాని వాటి ఫలితంగా తెలంగాణ ప్రాంతమంతా పామాయిల్ పంట సాగుకు అనుకూలంగా మారింది… కోతుల బాధ లేదు… చీడ పట్టే బాధ లేదు… ఒక్కసారి పెడితే 30 ఏళ్ల వరకు నెలనెల జీతం పడినట్టు ఆదాయం వస్తుంది…

కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఆయిల్ పాం సాగు అవుతున్నది… రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చిందంటే కారణం కాళేశ్వరం… గోద్రెజ్, నవభారత్, పతంజలి కంపెనీ వాళ్ళు వచ్చి ఈ టెక్నాలజీని చూసి పోతున్నారు… కేసీయార్ మళ్లీ వస్తాడు, జిల్లాకో ఫ్యాక్టరీ పెడతాడు… 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు కోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుందాం… ఇకముందు కోకో పంట వైపు అడుగులు వేద్దాం…’’

అంతా అనుకున్నట్టు జరిగితే మంచిదే… తెలంగాణ రైతు బాగుపడితే అందరికీ ఆనందమే… కానీ అలా ఆహా ఓహో అని చెప్సిన ఆ కాళేశ్వరం మెడలు, నొగలు విరిగాయి… ఆ కారణాలు ఎలా ఉన్నా.., ఆయిల్‌పామ్ సాగుకు మంచి తేమశాతం మాత్రమే  కాదు… మంచి నీటివసతి కావాలి… అంతకుమించి నేలలు ఆ సాగుకు సూట్ కావాలి…

అదే ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు యూకలిప్టస్, సరుగుడు ప్లాంటేషన్లు విపరీతం… ఇప్పుడు తగ్గిపోయి, ఐటీసీ కూడా ముడిసరుకు దొరక్క వేరే ప్రాంతాలకు వెళ్తోంది… సో, మొత్తం ఆయిల్‌పామ్ చెట్లతో నింపేద్దాం అనేది సరైన ఆలోచనధోరణి కాదని వ్యవసాయ ప్రణాళికవేత్తలు చెబుతుంటారు… మన నేలలకు సరిపడే ఆముదం, వేరుశెనగ వంటి నూనెదినుసుల సాగును… అలాగే పప్పు ధాన్యాల సాగును పెంచాలంటారు…

ఒకటి మాత్రం నిజం… తెలంగాణ రైతును పత్తి వంటి రిస్కీ పంటల నుంచి ప్రయోగాత్మక, లాభదాయక ఇతర సాగుల్లోకి మళ్లించాల్సిన అవసరం ఇంకా ఇంకా ఉంది… చివరకు వరి నుంచి కూడా..!!



  • ఈ సందర్భంగా హరీష్‌రావుకు ఓ విషయం చెప్పాలి… పీవీ నర్సింహారావు ప్రధాని పదవి దిగిపోయాడు… పోఖ్రాన్-2 అణుపరీక్షలకు అన్నీ సిద్ధం చేయబడింది అప్పటికే… తరువాత ప్రధాని వాజపేయి… ఇద్దరూ రాజనీతిజ్ఞులు… సమాజహితం, దేశప్రయోజనాల కోణంలో విశాల దృక్కోణాలు కలిగిన స్టేట్స్‌మెన్… వాజపేయి కలిసినప్పుడు పీవీ పోఖ్రాన్ వివరాలు ఇచ్చి తనతో చెప్పాడు… ‘‘సామగ్రి తయ్యార్ హై, ఆగే బడో…’’

vajpayee



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యూట్యూబ్ స్టార్ హీరోయిన్ నాగదుర్గ… ఇప్పుడిక తమిళ ఇండస్ట్రీలోకి…
  • ఇప్పుడప్పుడే ప్రపంచాన్ని వదిలేలా లేదు సాడే సాత్ శని..!!
  • విషసర్పాలు, బుడ్డెరఖాన్‌లు… హైదరాబాద్ ప్రెస్ దుర్వాసనలు..!!
  • ఆకుపూజ చేయించారా..? పారేయకండి… ఔషధాహారం చేయొచ్చు…
  • వావ్… తెలుగు టీవీ చానెళ్లలో ఇప్పుడు ఏబీఎన్ ఫస్ట్ ప్లేస్ అట…
  • చెప్పిన మాట వినని ఎఐ… ఇప్పుడిక పోబే అని తిరగబడుతోంది..!
  • వామ్మో, ఇదేం జర్నలిజం… అసలు ఎవుర్రా మీరంతా…
  • మగడు లేని వేళ తుమ్మెదా, వచ్చి మొహమాట పెడతాడె తుమ్మెదా
  • 6-5=2 … కన్నడంలో ఓ ప్రయోగం… కొత్త తరహా టెక్నిక్, కొత్త జానర్..!
  • భస్మాసుర బంగ్లాదేశ్..! మన ఈశాన్యాన్ని తనలో కలిపేసుకుంటుందట..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions