Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మార్ మత్ చోడో …. పండుగ సాయన్న కథలో కీలకమైన ట్విస్టు ఇదే…

July 7, 2025 by M S R

.

‘హరిహర వీరమల్లు’… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమాది దాదాపు అయిదేళ్ల కథ… దర్శకుడు మారిపోయాడు, నిర్మాత కొడుకే దర్శకుడయ్యాడు… కొన్ని సీన్లు హీరోయే డైరెక్ట్ చేసుకున్నాడనీ అంటారు… పదే పదే వాయిదా పడుతూ వస్తోంది…

ఇప్పుడు మళ్లీ ఓ వివాదం… ఇది పండుగ సాయన్న కథను వక్రీకరించేలా ఉందనీ, సినిమాను అడ్డుకుంటామని బహుజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి… హైదరాబాదులో మీటింగులు పెట్టి తమ నిరసనను వ్యక్తీకరిస్తున్నాయి… నిజంగా అది పండుగ సాయన్న కథేనా..? దానికే క్రియేటివ్ ఫ్రీడం పేరిట ఇష్టారాజ్యం మార్పులు చేసుకున్నారా..? వేరే కథా..? నిర్మాతలో దర్శకులో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది…

Ads

మనవాళ్లకు చరిత్రల వక్రీకరణలు అలవాటే కదా, అందుకే ఈ ఆందోళన… రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా అల్లూరి, కుమ్రం భీమ్ కథలకు వంద శాతం వక్రీకరణ… సరే, పండుగ సాయన్న కథ ఏమిటి..? ఆ కథ చదువుతూ ఉంటే ఓ ఆసక్తికరమైన ట్విస్టు చివరకు సాయన్న మరణానికి కారణమవుతుంది… ఏమిటది..?

పండుగ సాయన్న తెలంగాణ రాబిన్ హుడ్… ఒకరకంగా సర్దార్ సర్వాయి పాపన్న కథ వంటిదే… సాయన్న కూడా సాయుధ దళాన్ని తయారుచేసుకుని, ఆధిపత్య శక్తులపై దాడులు చేసి, దోచుకొచ్చి, పేదలకు పంచేస్తుంటాడు…

తనపై ఆధిపత్య వర్గాలు బందిపోటు అనే ముద్ర వేస్తాయి…  ఆనాటి నిరంకుశ నిజాం అధికారులను ప్రశ్నించాడు… వారిని ఎదిరించి, తన సొంత పాలనా వ్యవస్థను స్థాపించుకున్నాడు… ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు సాయన్న…

1860 -1900 కాలం తనది… మహబూబ్‌నగర్, నవాబుపేట మండలం, మెరుగోనిపల్లి ఊరు… కంట్లో నలుసుగా మారిన సాయన్నను నిజాం పాలకులతో చెప్పి అరెస్టు చేయిస్తారు దేశ్‌ముఖ్‌లు, కరణం పటేళ్లు, భూస్వాములు… కానీ జనం తిరగబడతారు… సాయన్నను చంపేస్తారనీ, నువ్వు జోక్యం చేసుకోవాలని వనపర్తి మహారాణి శంకరమ్మపై ఒత్తిడి తెస్తారు…

  • ఆమె నిజాం పాలకులతో మాట్లాడింది… విడుదలకు పదివేల జమానత్ కూడా కట్టింది… ‘మర్ మత్, చోడో’ (చంపొద్దు, వదిలేయండి) అని ఓ ఆర్డర్ పట్టుకొస్తుంది… భూస్వామ్యవర్గాలు స్థానిక పోలీసులతో కుమ్మక్కై, దాన్ని ‘మార్, మత్ చోడో (చంపేయండి, వదలొద్దు) గా మార్పిస్తారు… తరువాత పండుగ సాయన్న తల నరికి మొండెం ఒక దగ్గర, తల ఒక దగ్గర విసిరేస్తారు…

ప్రజలు ఆగ్రహంతో ఎస్పీ కార్యాలయం పైకి పోతారు… ఎస్పీ జనాగ్రహాన్ని చూసి గుండె పోటుతో చనిపోతాడు… నాగిరెడ్డి, వెంకట్రావు, పెద్దిరెడ్డి రాంరెడ్డి తదితర భూస్వాములు దావత్‌ చేసుకుంటున్న ప్రభుత్వ వసతి గృహాన్ని వేలాది మంది ప్రజలు చుట్టుముట్టి తగులబెడతారు… అందులోనే వారు మసైపోతారు…

ఇదీ కథ… ఇప్పటికీ చాలామంది సంచార, బహుజన కళాకారులు సాయన్న కథను గానం చేస్తారు ఊళ్లల్లో… కానీ హరిహర వీరమల్లు ట్రెయిలర్ చూస్తేనేమో అదేదో కోహినూర్ వంటి వజ్రాన్ని కొల్లగొట్టడానికి నిజాం పాలనలోనే హీరో చేసే ప్రయత్నాలే సినిమా కథ అనిపిస్తుంది… సో, క్లారిటీ ఇవ్వాల్సింది నిర్మాత, దర్శకుడు మాత్రమే… ఎందుకంటే, ఆ సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతోంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ కాలేశ్వర కదనం దేనికి..? కదం, కవాతు దేనికి..? బీఆర్ఎస్ రాంగ్ స్ట్రాటజీ..!!
  • కాపీ వీడియోల వడబోత సరే… కంటెంట్ స్టాండర్డ్స్ మాటేమిటి మరి..?!
  • హీరో మహేశ్ బాబును వదలని సాయి సూర్య ‘రియల్’ తలనొప్పి…
  • మార్ మత్ చోడో …. పండుగ సాయన్న కథలో కీలకమైన ట్విస్టు ఇదే…
  • ఆల్ ఇండియా ర్యాంకర్స్… ఆ సీన్… వివాదం పెరిగి దర్శకుడి క్షమాపణ…
  • కామాఖ్య గుడిలో తెలుగు నాయకుల భగాలాముఖి గుప్త పూజలు..!!
  • జీమూత భల్లుడు… తెలుగు సినీ మహానగరంలో ఓ మాయగాడు…
  • మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…
  • శుభమన్ గిల్… అంకెల్లో కాదు, ఆ స్పిరిట్‌లో చూడాలి తన ఆటను..!!
  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions