.
సినిమాను సినిమాగా చూడాలి అని ప్రేక్షకులకు సుద్దులు చెబుతారు సినిమా పెద్దలు… అది వాళ్ల అవసరం కోసం..! కానీ సినిమాను ఓ సినిమాగా మాత్రమే తీయాలి కదా అని ప్రేక్షకుడు అడగలేడు, అడిగే చాన్స్ లేదు, ఇవ్వరు…
ఏవేవో మాటలతో, ప్రచారాలతో ఊదరగొట్టి, సినిమాను పైకి లేపడానికి ప్రయత్నిస్తారు… నభూతో నభవిష్యతి అన్నంత కలరిస్తారు… అవును, మనం చెప్పుకుంటున్నది ఏపీ డిప్యూటీ సీఎం, ఒకప్పటి తెలుగు తెర పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు గురించి కూడా…
Ads
ఇక్కడ పవన్ కల్యాణ్ సినిమా అని ఎందుకు రాసుకోవడం అంటే… ఇది కేవలం పవన్ కల్యాణ్ సినిమా… ఇందులో ఏ చరిత్రా లేదు, పవన్ కల్యాణ్ ఓ రాజకీయ నాయకుడిగా మోస్తున్న సనాతన ధర్మ భావజాలాన్ని, తన వర్తమాన జెండాను, ఎజెండాను ఎక్స్‌పోజ్ చేయడం కోసం ఉద్దేశించిన ఓ కల్పిత కథ… ఇది పండుగ సాయన్న కథ కాదు, ఇంకెవరి కథ కూడా కాదు…
తన రాజకీయ జీవితం మొదటి నుంచీ చాలా సిద్ధాంతాలు మార్చాడు పవన్ కల్యాణ్… ఇప్పుడు సనాతన ధర్మపరిరక్షణ జెండా పట్టుకున్నాడు కదా… అదుగో ఆ కోణంలో రాయబడిన, మార్చబడిన కథ… అయిదేళ్ల క్రితం ఈ సినిమా మొదలైనప్పుడు ఇంకేదో అనుకున్నట్టున్నారు కథను… చివరకు పవన్ కల్యాణ్ మారిన సిద్ధాంతాలకు తగినట్టుగా రంగులు మార్చుకున్న మరేదో కథ ఇది…
ఇదంతా ఎటెటో పోతున్నదీ అనుకున్న మొదటి దర్శకుడు క్రిష్ మొదట్లోనే వదిలేశాడు… పదే పదే వాయిదాలు, అసాధారణమైన జాప్యం, నడుమ కరోనా, పవన్ కల్యాణ్ బిజీ రాజకీయ జీవితం… వెరసి ఇన్నేళ్ల ప్రయాణం… చివరకు నిర్మాత కొడుకే మెగాఫోన్ పట్టాడు… తన వల్ల కూడా కాలేదు, కాదు కూడా… చివరకు కొన్ని సీన్లు, యాక్షన్ సీన్లను సాక్షాత్తూ పవన్ కల్యాణే డైరెక్ట్ చేసుకున్నాడు… తనకు కావల్సినట్టు వేరే దర్శకులు డైరెక్ట్ చేయలేరు కాబట్టి…
మరి సనాతన ధర్మరక్షణ ఎజెండా బలంగా ఫోకస్ కావాలంటే.., హైందవం మీద కక్షకట్టి, అతి క్రూరంగా పాలించిన ఔరంగజేబు పాత్రను విలన్‌గా తీసుకొచ్చారు… హిందూ మతానికి తను చేయని అన్యాయం లేదు… నిజమే, తనను ఢీకొట్టి పోరాడే హిందూ ధర్మపరిరక్షకుడిగా హీరో పాత్రను మలిచారు…
బుర్రా సాయిమాధవ్ డైలాగుల పదును కొన్నిచోట్ల కనిపించింది… తప్పదు కదా, జనసైనికుల ప్రస్తావన కూడా తీసుకొస్తాడు కథానాయకుడి నోటి వెంట… అందుకే చెప్పింది, ఇది హరిహర వీరమల్లు పాత్ర కాదు, పదే పదే పవన్ కల్యాణ్ మాత్రమే కనిపిస్తుంటాడు…
ఇవన్నీ సరిపోలేదు, అందుకే ఏకంగా కృష్ణదేవరాయల అంశనూ కలిపారు… అదీ సరిపోలేదు, పేరులోనే శైవ, వైష్ణవ అద్వైతాన్ని పులిమారు… డేగ, డమరుకం… శివకేశవుల అవతారంగా చూపారు… సరిపోలేదు, రాబిన్ హుడ్ తత్వాన్ని కూడా కలిపారు… అబ్బే, ఇవి సరిపోతాయా..? జనం చూస్తారా..? అదుగో, అప్పుడిక సగటు తెలుగు సినిమా తాలూకు పాటలు, కామెడీ ఎట్సెట్రా ప్రవేశించాయి… వెరసి కలగాపులగం… కథాకథనాల్లో గందరగోళం… ఎక్కడా ఓ ఎమోషనల్ సీన్ పడలేదు…
పోనీ, అదైనా సరిగ్గా జరిగిందా..? లేదు… అత్యంత నాసిరకం గ్రాఫిక్స్… ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ అదే… పైగా మూడు గంటల నిడివి… ఎంఎం కీరవాణి తమ రాజమౌళి కుటుంబ సినిమాలకు తప్ప మరే సినిమాలకూ సంగీతం సరిగ్గా ఇవ్వడు, ఇవ్వడం లేదు… చివరకు తెలంగాణ జాతిగీతాన్ని కూడా ఎమోషన్‌రహితంగా పాడించాడు కదా… ఈ సినిమా పాటలు కూడా అంత ఇంప్రెసివ్ ట్యూన్లు కావు… ఆ గ్రాఫిక్స్‌కు తగినట్టుగానే ఆ బీజీఎం…
హీరోయిన్ పాత్ర ఉన్నదే కాసేపు… చివరకు ఆమెకు మేకప్ కూడా సరిగ్గా లేదంటే ఈ సినిమా నిర్మాణం పట్ల బాధ్యులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో తెలుస్తుంది… ఫస్టాఫ్ కాస్త పద్దతిగానే వెళ్తుంది సినిమా అనుకుంటే, సెకండాఫ్ కథ ఎటెటో తిరిగి, కథనం ఎక్కడెక్కడో మునిగీ తేలి… చివరకు అసలు పోరాటం రెండో భాగంలో చూద్దాం అని పేలవంగా ముగిస్తారు… దాంతో మరింత అనాసక్తంగా మారిపోయింది సినిమా…
అయ్యా, నిర్మాత రత్నం గారూ… తమరేదో రత్నంలాంటి, కథలో చెప్పిన కోహినూర్ వజ్రంలాంటి సినిమాను… పవర్‌స్టార్ సూపర్ రేంజుకు తగిన సినిమాను ఇస్తారనుకుంటే… ఓ రంగురాయిని సమర్పించారేంటి స్వామీ..!! అడ్డగోలు రేట్లతో ఎడాపెడా వేసిన ప్రీమియర్ షోల డబ్బు సరిపోతుందా..?
తెలంగాణలో వోకే, గానీ ఏపీలో సినిమాను సినిమాగా చూడరు… వైసీపీ వర్గం అస్సలు చూడదు, సోషల్ మీడియాలో నెగెటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు కూడా… వాటిని బ్రేక్ చేసి, మెప్పించాల్సిన సినిమా, వాళ్ల ట్రోలింగుకు మరింత చాన్స్ ఇచ్చింది…
ఒక్కమాట చెప్పుకోవాలి చివరగా… ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ బాగా చేశాడు, కాకపోతే సెకండాఫ్ వచ్చేసరికి తన పాత్ర కూడా వీక్ అయిపోయి, తన శ్రమ, ప్రయాస కూడా ఫాయిదా కాలేకపోయింది..!
Share this Article