.
Mohammed Rafee
….. త్వరత్వరగా దోచేసే హరిహర వీరమల్లు
కల్పితం అని ముందే చెప్పారు కాబట్టి విమర్శలు చేయవద్దని అభిమానులు చెప్పేసారు! తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా చూడకుండానే అధికారికంగా రేట్లు పెంచుకునే సౌలభ్యం ఇచ్చేశాయి! ఐదేళ్లు సినిమా తీశారు కాబట్టి, భారీ ఖర్చు పెట్టి గుర్రాలు పరుగెత్తించారు కాబట్టి, నిర్మాత నష్టపోకూడదు కాబట్టి జనం డబ్బులు దోచేసేయాలి త్వరత్వరగా!
Ads
డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ అలాంటిది! ఆయన ఉంటే చాలు! ఆయన కనిపిస్తే చాలు! కలెక్షన్లే కలెక్షన్లు! పరా పరా టికెట్లు తెగుతాయి! ఆయన కూడా ఒకే ఒక్కడు వందల మందిని ఆది నుంచి అంతం వరకు రప్పా రప్పా నరుకుతూనే వున్నాడు!
ఒక్కొక్కడికి ఒక్కో దెబ్బ వాళ్ళు నేలకు అతుక్కు పోతున్నారు! ఒకరిని కొట్టేటప్పుడు ఇంకొకరు చూస్తూ ఉండాలి! లేదంటే డైరెక్టర్లు ఒప్పుకోరు! అదేంటి ఒక సినిమాకు ఒకరే కదా డైరెక్టరు ఉండాల్సింది! హరిహర వీరమల్లుకు ఇద్దరు డైరెక్టర్లు! కాదు, పవన్ కల్యాణ్‌తో కలిపి ముగ్గురు. ఇదొక రికార్డు! ఇంటర్వెల్ వరకు క్రిష్ జాగర్లమూడి! ఇంటర్వెల్ తరువాత నిర్మాత ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ! యాక్షన్ సీన్లు పీకే…
ఇంటర్వెల్ వరకు బావుందనిపించింది! బాహుబలి ద్వారబంధాలు బద్దలు కొట్టే కాపీ సీను మొదలు గుర్రాలు పరుగెత్తించడమే చాలా వరకు! అన్నీ మాట వినే మంచి గుర్రాలే! సరే, శివుడే వీరమల్లు అని చూపించారు కాబట్టి, దేవుడు కాబట్టి ప్రకృతి సహకరిస్తుంది!
పులులు, జంతువులు అన్నీ సహకరిస్తాయి జస్ట్ వీరమల్లు వీర దొంగ చూపు చూస్తే చాలు! దాదాపు 1048 మందిని కొట్టి ఉంటాడు వీరమల్లు! కానీ, అంతటి వీరుడ్ని హీరోయిన్ నిధి ఒక్క దెబ్బ కొడితే గింగిరాలు తిరుగుతూ కింద పడిపోతాడు! స్త్రీ శక్తి అలాంటిది మరి!
విమర్శలు చేయకూడదు! ముందే కల్పితం అని బోర్డు వేసారుగా! 1350 తొలి షోకే! తరువాత మన పోరు పడలేక 1650 మార్చేసారుగా! కుతుబ్ షా, ఔరంగజేబు ఇలా చారిత్రక పాత్రలను పెట్టి కల్పిత కథలు అల్లుకునే హక్కు ఉందా రాజ్యాంగంలో! తెలియక అడిగానులెండి క్షమించేయండి!
వేదాలు, సంస్కృతి, సనాతన ధర్మం, దేవుళ్ళ గొప్ప తనాన్ని ఇంకా అద్భుతంగా చూపించవచ్చు! కరవులో అల్లాడిపోతున్న ముస్లింలకు తిండి పెట్టి మనుషులంతా ఒక్కటే అని చాటి చెప్పినట్లు ఇంకా గొప్పగా చెప్పవచ్చు! యజ్ఞం సజావుగా జరిగేందుకు మంట పుట్టించినట్లే, ప్రాణాలు కాపాడేందుకు వర్షం కురిపించినట్లు ఇలా మాయ మంత్రాలూ, విఠలాచార్య మేజిక్కులు బావున్నాయి!
సరే, హిందూ ముస్లింల మధ్య అప్పటి గొడవలంటూ కల్పిత యుద్ధాలు ఇప్పుడు చూపించి ఏం సందేశం ఇవ్వాలనుకున్నట్టో ఉప ముఖ్యమంత్రి! అదొక్కటే నాకు అర్ధం కాలేదు!
ముగింపు ఎలా చేయాలో తెలియకపోతే ఒక్కటే ఒక్క సులభమైన మార్గం ఉంది! To be continued part 2 అని వేసేయవచ్చు! హీరోకు డేట్స్ సెట్ కాకపోయినా ఇలా ముగించవచ్చు సినిమాను! అయినా ముందే చెప్పారుగా! కల్పితం మా ఇష్టం! ఎవరేం మాట్లాడొద్దు అభిమానులకు కోపం వస్తుందని! అందుకే వారి మనోభావాలు దెబ్బ తినకూడదు అని నేను సినిమా జోలికి వెళ్లడం లేదు!
అయినా ముందే చెప్పారుగా… జగన్ ను అధఃపాతాళానికి తొక్కేస్తా అని చెప్పి మరీ తొక్కేసినందుకు, వాళ్లంతా కక్ష కట్టి, కావాలని సినిమాను ఫ్లాప్ చేయాలని, బ్యాడ్ టాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని! పైగా ఎవ్వరేం ఫీల్ అవ్వొద్దు తన ఒంటిఫై చాలా గాయాలు ఉన్నాయి, ఇప్పుడు చేసే గాయాలను పట్టించుకోవద్దు, అయినా ఇంత సున్నితంగా ఉంటే ఎలా అని పవన్ కళ్యాణ్ ఎంతో భరోసా ఇచ్చేసారుగా!
కాబట్టి అధ్యక్షా… సినిమా బావుందా బాలేదా పక్కన పెట్టండి! జనం వస్తున్నారా లేదా పక్కన పెట్టండి! ఎందుకంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అని రెండో రోజే సక్సెస్ మీట్ కూడా పెట్టేసారుగా! ఇప్పుడు తెలియాల్సింది ఒక్కటే పుష్పా! కనీసం రిలీజ్ కు ముందు పవన్ కళ్యాణ్ సినిమా చూసారా లేదా? ఇదొక్కటే తెలియాల్సి ఉంది! – డా.మహ్మద్ రఫీ
నోట్ : ఇవాళ మధ్యాహం 1.30 షో @ సత్వ మల్టిప్లెక్స్! నేను ఒక్కడినే మొదటి ప్రేక్షకుడ్ని! సినిమా ప్రారంభమయ్యాక మరో 16 మంది వచ్చారు. ఫొటోలో కనిపిస్తున్నది నేనే! ఇదీ ఫోటో
Share this Article