ఒక చిన్న వార్త… నిజానికి ఇది చెప్పుకోదగినంత వార్తేనా కాదో కూడా తెలియదు… కానీ ఒక అన్నం మెతుకు ఇది… ఒక ఏరియా, ఒక నియోజకవర్గం, తన ప్రజలను బలంగా ఓన్ చేసుకునే ఓ విశిష్ట గుణం… అది రాజకీయం కోసమే కావచ్చుగాక… ఐనా అభినందించాలి… విషయం ఏమిటో కాస్త వివరాల్లోకి వెళ్దాం…
కొంతకాలం క్రితం… ఇండియన్ ఐడల్ సీజన్ స్టార్టయింది… ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన పవన్ దీప్ రాజన్ అనే గాయకుడు తన గానమాధుర్యంతో అందరినీ అబ్బురపరుస్తున్నాడు, అలరిస్తున్నాడు… వివిధ ఇన్‌స్ట్రుమెంట్ల మీద జ్ఞానం ఉంది, గొంతు మీద, బ్రీత్ మీద అదుపు ఉంది… ఓరోజు హఠాత్తుగా షోలో తెరపైకి ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు… నా రాష్ట్రం నుంచి వచ్చిన గాయకుడు మరింత రాణించాలని కోరుతున్నాను అన్నాడు… గుడ్…
సీన్ కట్ చేస్తే… తన ప్రతిభతోపాటు తన రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కూడా తోడై పవన్ దీప్ ఆ సీజన్ విజేత అయ్యాడు… తన ప్రియస్నేహితురాలు, రన్నరప్ అరుణితతో కలిసి దేశదేశాలు పర్యటిస్తూ కచేరీలు చేస్తున్నాడు, వీడియోలు చేస్తున్నాడు… కథ మారిపోయింది… ఆఫ్టరాల్ ఓ సింగింగ్ కంపిటీషన్‌లో పాల్గొనే తమ రాష్ట్రవాసికి ముఖ్యమంత్రి అభినందనలు, ఆశీస్సులు అందించడం అందరికీ నచ్చింది… అసలు రాజకీయ నాయకులంటేనే అవలక్షణమూర్తులు… ఎప్పుడో చుక్కతెగి రాలిపడ్డట్టు ఇలాంటి సత్లక్షణాలు కనిపిస్తుంటయ్… కొందరిలో… కొన్నిసార్లు…
Ads
ఎస్, సిద్దిపేట ఎమ్మెల్యే, తెలంగాణ ఆర్థిక, వైద్య మంత్రి హరీష్ రావు కూడా కాస్త డిఫరెంట్… తను కూడా ఇండియన్ ఐడల్ తెలుగు షోలో పార్టిసిపేట్ చేస్తున్న తమ సిద్దిపేట వాసి లాస్యప్రియకు ట్విట్టర్ ద్వారా ఇలాగే అభినందనలు చెప్పాడు… మనఃపూర్వక శుభాశీస్సులు తెలిపాడు… ఇదీ అది…
ఆహా లో జరుగుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ 2 సింగింగ్ కాంపిటీషన్లో అద్భుతంగా పాటలు పాడుతూ అందర్నీ మెప్పిస్తున్న సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియకు హృదయపూర్వక అభినందనలు. నీ సంగీత ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. pic.twitter.com/BT9c3GQKjl
— Harish Rao Thanneeru (@BRSHarish) April 20, 2023
అఫ్‌కోర్స్, ఆ ట్విట్టర్ హ్యాండిల్ చేసేది ఎవరో తన ఎంప్లాయీ కావచ్చుగాక… కానీ దీని సంకేతం జనంలోకి పాజిటివ్‌గా వెళ్తుంది… తన ప్రజలను తను ఎంత బలంగా ఓన్ చేసుకుంటాడో చెబుతుంది… చిన్న విషయమే కావచ్చుగాక, కానీ ప్రభావవంతంగా పేలతాయి ఇలాంటివి…
వక్త, కవి, రచయిత, విమర్శకుడు, సమీక్షకుడు, యూనివర్శిటీ ఆచార్యుడు, ఈమధ్య గుండెపోటుతో మరణించిన గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి తమ్ముడి బిడ్డ ఈ లాస్య ప్రియ… ఆయన హెడ్ మాస్టర్… (నాకు గుర్తున్నంతవరకు వాళ్లది పోతారెడ్డిపేట, ఓ అష్టావధాని కొడుకులు వీళ్లు)… మొదట్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించని లాస్య ప్రియ క్రమేపీ పుంజుకుని మూడు నాలుగు ఎపిసోడ్లుగా ఇరగదీస్తోంది…
సరే, కంపిటీషన్ అన్నాక ఎవరో ఒకరే గెలుస్తారు, మిగతావాళ్లు మౌనంగా, మర్యాదగా తప్పుకుంటారు… కానీ పోటీలో ఉన్నన్నిరోజులు ఎవరెలా పర్‌ఫామ్ చేశారనేదే ముఖ్యం… వాళ్లకు దొరుకుతున్న మద్దతు ఎలాంటిదనేదీ ముఖ్యమే… ఇండియన్ ఐడల్ హిందీ షోలో అబ్బుపరిచేలా పర్‌ఫామ్ చేసిన షణ్ముఖప్రియ వచ్చిన వైజాగ్ నుంచే ఇప్పటి తెలుగు ఇండియన్ ఐడల్ షోలో కనీసం ముగ్గురు పోటీదారులు టాప్-7లోకి వచ్చారు… విజేతగా నిలుస్తుందని భావిస్తున్న సౌజన్య (ఈమె ఇండియన్ ఐడల్ హిందీ షోలో పార్టిసిపేట్ చేసిన భాగవతుల శిరీష సోదరి), వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన హితేశ్ సాయి, చిచ్చరపిడుగు అయ్యన్ ప్రణతి విశాఖవాళ్లే… సరే, అవన్నీ ఎలా ఉన్నా… ఆల్ ది బెస్ట్ లాస్య ప్రియ… మీ ఎమ్మెల్యే ఆశీస్సులకు సార్థకత తీసుకురా…!!
Share this Article