.
హరీష్ రావు ఎందుకింత ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నాడో తెలియదు గానీ… నీటిపారుదల, ఉచిత విద్యుత్తు అంశాల మీద వక్రబాష్యాలు, అబద్దపు వాదనలతో తనను తాను దిగజార్చుకుంటున్నాడు… కేటీయార్‌కన్నా మీడియాలో ఎక్కువ మైలేజ్ రావాలనే తపన తనిష్టం, కానీ ఒకవైపు కవిత దాడి, రెండోవైపు పార్టీలో మెల్లిగా స్టార్టయిన కత్తెర్లు, ఇంకోవైపు ‘హరీష్ ఎవరెవరిని కలుస్తున్నాడో నాకు తెలుసు’ అనే రేవంత్ ప్రకటన… వెరసి ఒత్తిడి, దారితప్పుతున్నాడు, తనూ కేటీయార్‌లాగే మాట్లాడుతున్నాడు అర్థం లేకుండా…
ఉదాహరణకు కొన్ని అంశాలు తీసుకుందాం… రేవంత్ రెడ్డి మోటార్లకు మీటర్లు పెడతాడు, ఉచిత కరెంటు రద్దు చేస్తాడు అని హరీష్, కేటీయార్ ఇద్దరూ ఆరోపించారు… దానికి రేవంత్ రెడ్డి సూటిగా సవాల్ వేశాడు… నేను మీటర్లు పెట్టను, ఉచిత విద్యుత్తు కొనసాగిస్తే మీరు రాజకీయాల నుంచి విరమించుకుంటారా..? ఎన్నికల్లో పోటీచేయకుండా ఉంటారా..?
Ads
ఆ ఇద్దరు వెంటనే ఖంగుతిన్నారు… నో, నో, మోటార్లకు కాదు, ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు పెడతాడు అని మాట మార్చారు… ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు పెట్టి, ఉచిత కరెంటు లెక్కలు తీస్తే, దుర్వినియోగాన్ని అరికడితే బీఆర్ఎస్ పెద్ద తలలకు వచ్చిన నష్టమేమిటి..? అది విద్యుత్తు రంగంలో జవాబుదారీతనాన్ని పెంచడం కోసమే కదా… ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు పెడితే ఉచిత విద్యుత్తు రద్దు చేసినట్టవుతుందా..?

వెంటనే తమాయించుకుని, యూటర్న్ తీసుకుని… 24 గంటల కరెంటు ఇవ్వకపోతే నువ్వు రాజకీయాల నుంచి విరమించుకుంటావా అని వేరే సవాల్ విసిరారు… కేసీయార్ 24 గంటల కరెంటు ఇచ్చాడని అబద్ధాలకు దిగారు… పేరుకు 24 గంటల కరెంటు, కేసీయార్ హయాంలోనే దానికిి మంగళం పాడారు, సబ్‌స్టేషన్లవారీగా పాత డేటా తీస్తే అన్ని నిజాలూ బయటికొస్తాయి…
‘’రేవంత్ ఓ జీవో ఇచ్చాడు, దాని ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయబోయే రైతు డిస్కం (టీజీఆర్‌పీడీసీఎల్- TGRPDCL)కు కేవలం రెన్యువబుల్ ఎనర్జీ (సోలార్ పవర్ వంటి) ఇస్తాడట, అంటే ఎండ ఉన్నప్పుడే రైతులకు కరెంటు ఇస్తాడు, అంటే 24 గంటల కరెంటుకు మంగళం పాడినట్టే… పగటిపూట నీళ్లుండవు బోర్లలో, సాయంత్రం-రాత్రే నీళ్లు పారతాయి, సో, కరెంటు ఉండదు…

పైగా ఇరిగేషన్ లిఫ్టులకు సరిపడా కరెంటు ఇవ్వడు, దాంతో ప్రాజెక్టుల కింద నీళ్లు సరిపోవు, తాగునీటికీ కష్టమే… భౌగోళికంగా డిస్కమ్స్ ఉంటాయి తప్ప,, కనెక్షన్ల వారీ- కేటగిరీ వారీ డిస్కమ్స్ ఉండవు విద్యుత్తు చట్టం ప్రకారం, సో, కోర్టులో కొట్టుడుపోతుంది, ఇదంతా ఆదానీకి డిస్కమ్స్ కట్టబెట్టే కుట్ర’’ … ఇలా చెప్పుకొచ్చాడు రెండు మూడు మీటింగుల్లో, ఇంటర్వ్యూలలో…
అంతేకాదు, రెండు డిస్కమ్స్‌ను ప్రైవేటీకరించడానికి ఈ కుట్ర, కొత్త అప్పులు తీసుకురావడానికి కుట్ర అంటాడు హరీష్…

తప్పు… రెన్యువబుల్ ఎనర్జీని కేటాయించడం అంటే రైతులకు, లిఫ్టులకు చీప్ పవర్ ఇవ్వడం… అంతేగానీ, సోలార్ పవర్ వచ్చినప్పుడే టెక్నికల్‌గా సరఫరా చేయడం కాదు… (హరీష్ తనకు అర్థం కాని పవర్ సబ్జెక్టు జోలికి పోకపోవడమే బెటర్)… ప్రభుత్వ సబ్సిడీలు భరించే కనెక్షన్లను ఆ పరిధిలోకి తెచ్చి, సరిగ్గా ఆ వినియోగం ఎంతో లెక్కలు తీసి, ఈమేరకు ప్రభుత్వం ఖజానా నుంచి చెల్లిస్తే తప్పేమిటి..? ట్రాన్స్‌ఫార్మర్ల వారీగా మీటర్లు పెట్టినా, ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్ కింద ఏడెనిమిది మోటర్లే కాబట్టి, టారిఫ్‌కు పోతాడు రేవంత్ రెడ్డి అంటాడు హరీష్… హాస్యాస్పదమైన, వితండ వాదం ఇది…
మిగతా రెండు డిస్కమ్స్ వయబుల్ అయితే, నష్టాలు తగ్గించుకుంటే తప్పేమిటి..? కేసీయార్ పీరియడ్‌లో 60 – 70 వేల కోట్ల నష్టాలకు చేరాయి డిస్కమ్స్, వాటిని సరిదిద్దితే తప్పేమిటి..? కొత్త అప్పులు తెస్తే తప్పేమిటి..? ఐనా కొత్త అప్పులకూ ప్రైవేటీకరణకూ లింకేమిటి..? హేమిటో, తన వాదన అంతా బభ్రాజమానం భజగోవిందం టైపు… మామూలు జనానికి టెక్నికల్ అంశాలు అర్థం కావు కాబట్టి వాళ్ల చెవుల్లో అబద్దాల పూలు పెట్టే ప్రయాస…

దేశంలో ఎక్కడా రైతు డిస్కమ్స్ లేవు అంటాడు హరీష్… కొత్తగా తెలంగాణ ఓ ప్రయోగం చేస్తోంది, తప్పేమిటి..? కేంద్రం కొన్ని విధివిధానాలు చెబుతోంది, మన రైతులకు నష్టం లేకుండా, ఆ స్కీమ్స్‌లో మనం ప్రయోజనం పొందితే తప్పేమిటి..? పైగా, రెగ్యులేటరీ కమిషన్ దగ్గర పబ్లిక్ హియరింగు జరిగితే తను వెళ్లలేదు, కవితకు మొహం చూపాల్సి వస్తుందని… నిజానికి అది కదా ఇవన్నీ ప్రస్తావించడానికి సరైన వేదిక..?
రైతు డిస్కమ్‌కు రెన్యువబుల్ ఎనర్జీ తప్పు, లిఫ్టులు ఎలా పనిచేస్తాయి అంటూనే… వర్షాలు పడుతున్నప్పుడు కాళేశ్వరం నెట్‌వర్క్ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి, రిజర్వాయర్లలో నింపడానికి చాలా చీప్ హైడల్ పవర్ వస్తుంది, పెద్ద ఖర్చేమీ కాదు అంటాడు… క్వయిట్ కంట్రడిక్షన్…

ఇరిగేషన్ విషయానికి వద్దాం… పోలవరం పూర్తయితే భద్రాచలం మునుగుతుంది, కరకట్టలో, మరో ఆలోచనో చేయాలి కదా అని… ఎస్, నిజం… మరి ఏపీ అన్యాయంగా మన ఏడు మండలాలు తనలో కలిపేసుకుంటే, ఒక్కరోజు నామ్‌కేవాస్తే నిరసన తప్ప వాటికోసం తొమ్మిదేళ్లలో పోరాడింది ఏముంది..? చివరకు ఇప్పుడు రేవంత్ రెడ్డి భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న పురుషోత్తపట్నం, పిచుకలపాడు, ఏటపాక, గుండాల, కన్నాయిగూడెం… అయిదూళ్లను తిరిగి ఇవ్వమని పోరాడుతున్నాడు…
నిజమే, పోలవరం ఫస్ట్ ఫేజ్‌తో ప్రాబ్లం లేదు, కానీ సెకండ్ ఫేజ్ కూడా పూర్తయితే, భద్రాచలానికి ముంపు ఖాయం… కరకట్ట కంపల్సరీ… కానీ ఆ జాతీయ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ గురించి మరిచిపొండి, ఆ భూసేకరణ ఖర్చు భరించడం అసాధ్యం… అదొక బరాజు స్థాయికి పరిమితం అవుతుంది… ఐనా ముంపుపై ఒడిశా పోరాడుతోంది తప్ప బీఆర్ఎస్ సర్కారు ఒక్కరోజైనా నిజాయితీగా పోరాడిందా..?

తుమ్మిడిహెట్టి దగ్గర కట్టే బరాజు నుంచి సుందిళ్లకు నీళ్లు తెస్తానంటున్నాడు రేవంత్ రెడ్డి, సుందిళ్ల మేం కట్టిందే కదా అంటాడు హరీష్… అది తెలంగాణ సమాజపు ఆస్తి హరీష్, ఆ బరాజులను వినియోగంలోకి తీసుకురావద్దంటావా మరి..? మీ జేబులో డబ్బుల నుంచి కట్టలేవు వాటిని, వాటిని వినియోగంలోకి తీసుకొస్తే హర్షించాలి… కాగా దానికి భిన్నమైన విమర్శలు దేనికి..? కేవలం రెండు మూడు పిల్లర్లు మేడిగడ్డలో రిపేర్ చేస్తే చాలునంటాడు… కానీ మొత్తం బరాజుల నిర్మాణమే లోపభూయిష్టంగా ఉంది, మొత్తం మళ్లీ కట్టాల్సి వస్తుందేమో అని సెంట్రల్ డ్యామ్స్ అథారిటీ చెబుతోంది, అది మరిచిపోతే, నాలుగు తట్టల కాంక్రీట్ చాలు అన్నట్టు మాట్లాడితే, అది ఎవరిని మభ్యపెట్టడానికి..?
పాలమూరు ఫాస్ట్‌గా కట్టేశాం అంటాడు హరీష్… కానీ 50 శాతం కూడా పనులు జరగలేదు, అదీ కమీషన్లు వచ్చే లిఫ్టులు, పంపులు కట్టేసి, భూసేకరణ మరిచి అబద్ధాలు ఆడుతున్నారని సాక్షాత్తూ రేవంత్ రెడ్డే నిన్న నిజాలు చెప్పాడు…

కృష్ణాలో ఏపీ 74 శాతం నీళ్లు, తెలంగాణ 25 శాతం నీళ్లు వాడుకున్నాయని మరో విమర్శ… అవును, దానికి కారణం కమీషన్ల కాళేశ్వరం మీదే కాన్సంట్రేట్ చేసి, కృష్ణా ప్రాజెక్టుల్ని కేసీయార్ నిర్లక్ష్యం చేయడం కాదా..? అసలు కృష్ణా, గోదావరి ఇతర పెండింగ్ ప్రాజెక్టుల్ని కంప్లీట్ చేసుకోకపోవడం వల్ల కదా ఈ దుర్గతి..? ఇలా హరీష్ రావు విమర్శలు ఇరిగేషన్, ఎనర్జీ మీద జస్ట్ అబ్సర్డ్… ప్రజలకు సబ్జెక్టు తెలియకపోవడం తప్పు కాదు, వాళ్లకు ఎలాగూ తెలియదు కదాని తప్పుడు వివరాలతో వాళ్ల కళ్లకు గంతలు కట్టడం మాత్రమే ఖచ్చితంగా హరీష్ రావు తప్పే..!!
జీతెలుగు న్యూస్ ఇంటర్వ్యూలో ఓ మాటన్నాడు హరీష్… రెండురోజుల్లో బాంబు పేలుస్తానన్నాడు, ఉత్తదే కానీ… రేవంత్ రెడ్డి నా కింద కార్యకర్తగా పనిచేశాడు అన్నాడు… ఎప్పుడు, నీ కింద పనిచేయడం ఏమిటి..? రేవంత్ రెడ్డిది సిద్దిపేట నియోజకవర్గం కాదు, నువ్వేమీ పార్టీ అధ్యక్షుడివి కావు, కనీసం వర్కింగ్ ప్రెసిడెంటువు కూడా కావు… మరి నీ కింద పనిచేయడం ఏమిటి..? దీన్ని తెలుగులో ఏమంటారు నాయకా..?!
Share this Article