ఈమధ్య కొన్ని సినిమా ప్రెస్‌మీట్లు విచిత్రంగా సాగుతున్నాయి… సినిమాకు సంబంధించిన కథలో, పాటలో, కాపీ వివాదాలో, సెన్సార్ చిక్కులో, డర్టీ డైలాగులో, యాక్టర్లో, నిర్మాణ వ్యయమో మాట్లాడుకోవడం లేదు… ఎటెటో సాగిపోతున్నాయి… ఏవో వివాదాలకు తలుపులు తెరుస్తున్నాయి… జనాన్ని ఎంటర్‌టెయిన్ చేస్తున్నారో, దిక్కుమాలిన ప్రశ్నలు, జవాబులతో చిరాకు పుట్టిస్తున్నారో…
సందర్భం ఎలా మొదలైందో గానీ… మిస్టర్ బచ్చన్ సినిమా మీడియా మీట్‌లో హరీష్ శంకర్ ఎవరినో అడుగుతున్నాడు… మీరు (సినిమా జర్నలిస్టులు) యాంకర్ సుమతో వేదిక మీద సారీ చెప్పించారు కదా, మరి జర్నలిస్ట్ కొండేటి సురేష్‌తో సారీ ఎందుకు చెప్పించలేకపోయారు అని..? అసలు ఆ ప్రెస్ మీట్ దేనికి..? ఈ పరస్పరం గోక్కునే కథలు దేనికి..?
కానీ ఏమాటకామాట నిజం… సినిమా జర్నలిస్టులతో గోక్కోవడానికి ఏ సినిమా సెలబ్రిటీ సాహసించడు… అబ్బో, అదొక సిండికేట్ అంటుంటారు ప్రైవేటుగా… మరీ తెలుగు సినిమా జర్నలిస్టుల్లో ఎవరో ఓ పెద్దాయన (ఏదో సైటు విలేకరి కావచ్చు), ఈ సురేష్ ఏవో అసంబద్ధ ప్రశ్నలు అడుగుతుంటారు… వాళ్లంటే ఎందుకో హడల్… ఐతేనేం, దర్శకుడు హరీష్ శంకర్ ‘నాకేమీ మొహమాటం లేదు’ అంటూ చెడామడా దులిపేస్తున్నాడు… ఆ టెంపర్‌మెంట్ ఆశ్చర్యమే…
Ads
నిజానికి ఆరోజును స్నాక్స్‌ను భోజనంలా చేయకండి అని సుమ అన్నదాంట్లో పెద్దగా తప్పుపట్టాల్సిందేమీ లేదు… ఆమెకు దాదాపు ప్రతి సినిమా జర్నలిస్టు తెలుసు, అందరితోనూ చనువు ఉంది, సరదాగా స్పాంటేనియస్‌గా ఏదో జోకింది… అంతే తప్ప ఎవరినో నిందించాలనే ఆలోచన లేదు… ఆమె అలా చేయదు, ఎక్కడేం మాట్లాడాలో బాగా తెలిసిన యాంకరిణి… కానీ ఎవరో ఓ జర్నలిస్టుడు ఏదో తప్పుతీయబోతే… ఆమె ఎందుకొచ్చిన దురద అనుకుని తనే సారీ చెప్పింది… అంతేతప్ప జర్నలిస్టులు చెప్పించలేదు… ఆమె కూడా జర్నలిస్టే, తనూ ఇంటర్వ్యూలు చేస్తుంది, అది మరిచిపోయాడు సదరు జర్నలిస్టుడు…
నేహా శెట్టి మీద సురేష్ కొండేటి చేసిన ఓ పిచ్చి వ్యాఖ్యను ఆమె ఖండించింది… వెనక్కి తగ్గలేదు, రాజీపడలేదు… సురేష్ కొండేటి కూడా తరువాత సారీ చెప్పినట్టుగా చదివినట్టు గుర్తు… ఇవన్నీ వచ్చీపోయే చిన్న చిన్న వివాదాలు, సహజం… కానీ ఆ పాతవన్నీ తవ్వి ఇంకా ఇంకా గోక్కోవడం దేనికనేది ఒక ప్రశ్న… అడగాల్సిందే, కడగాల్సిందే, ఎందుకు ఊరుకోవాలనే హరీష్ శంకర్ ధోరణీ అనవసరమే…
ఆమధ్య నటి రోహిణి ఎవరో సీనియర్ జర్నలిస్టు అట, ఆయనకు ఇచ్చిపడేసింది… (ఆయనది నిజంగా ఓవరాక్షనే…) మరొకాయన దట్టమైన చెవివెంట్రుకల పెద్దాయన యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో ఏదేదో చెప్పేస్తుంటాడు… భలే కేరక్టర్లు… అంతేలెండి సార్, మన జర్నలిజం పోకడలో నాణ్యత అలా ఉంది అంటారా..? నిజంగా ఏవైనా మంచి ప్రశ్నలు, అర్థవంతమైన వివరణలు, సందేహాలు, సమాధానాలు సినిమా ప్రేక్షకులు, ప్రేమికులు ఆశపడటమే తప్పు, అత్యాశ అంటారా..? ఏమో… కావచ్చు..!!
Share this Article