.
కేటీయార్‌తో సమస్య ఇదే… ఏదో ఒకటి మాట్లాడతాడు… రేవంత్ రెడ్డే ప్రథమ టార్గెట్… కానీ అంతకుముందు ఆయా విషయాలపై తమ ధోరణి ఏమిటనేది మరిచిపోతాడు…
కేటీయార్ ఏ ప్రజాసమస్యను ప్రస్తావిస్తున్నా సరే, అంతకుముందు కేసీయార్ పాలనకాలంలో దారుణమైన ధోరణిని కనబర్చారనే కీలకాంశాన్ని మరిచిపోతుంటాడు… జనం మతిమరుపు మీద అపారమైన నమ్మకం తను… కానీ కేసీయార్ పాలన దూరమై చాన్నాళ్లు కాలేదు… రెండేళ్లే కదా… జనానికి అన్నీ గుర్తున్నాయి…
Ads
ప్రతిపక్షంలోకి రాగానే అన్ని అంశాలపై యూటర్న్ తీసుకుని, ప్రజానుకూల విధానమంతులం అని చెప్పుకుంటే జనం మరిచిపోతారా ఏం పాత సంగతులను..? బోలెడు ఉదాహరణలు… బట్, తాజా ఉదాహరణ తీసుకుందాం…
బీజేపీ వాళ్లు కార్పెట్ బాంబింగ్ అని ఏదో మాట్లాడుతుంటే… అక్కడ పాకిస్థాన్ వాడు మనల్ని తంతుంటే, అక్కడ బాంబులు వేయకుండా ఇక్కడేం వేస్తారులే అని రేవంత్ రెడ్డి విమర్శించాడు… కాకపోతే భాష మీద కాస్త అదుపు తప్పింది…
దీనికి బీజేపీ నుంచి మళ్లీ కౌంటర్లు లేవు… కానీ బీజేపీ వ్యాఖ్యల అసలు అర్థం తెలియకుండా… కేటీయార్ దొరికింది చాన్స్ అనుకుని, సంబరపడి, రేవంత్ దొరికాడు అనుకుని ఓ ట్వీట్ కొట్టాడు… ఏమనీ అంటే..?

*సాయుధ బలగాలలో చేరి, తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి అపారమైన కష్టం, అంకితభావం, నిబద్ధత మరియు దేశంపై ప్రేమ అవసరం. మన సైనికులు అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సరిహద్దుల్లో శ్రమిస్తున్నారు కాబట్టే మనం సురక్షితంగా ఉన్నాము, రాజకీయాలు చేసుకోగలుగుతున్నాము, సాధారణ జీవితాలను గడపగలుగుతున్నాము, కుటుంబాలతో జీవించగలుగుతున్నాము.
ఒక ఎన్నికల సభ ప్రసంగం కోసం కేవలం భారత సైన్యాన్ని అవమానించడం అనేది మీ నీచమైన ప్రమాణాల్లో ఇది తాజా పతనం (new low), రేవంత్ రెడ్డి!
మీరు భారత సైన్యాన్ని కించపరిచి, పాకిస్తాన్‌ను ఎందుకు పొగడాలనుకుంటున్నారు? మీరు భారత సైన్యానికి క్షమాపణ చెప్పి, మీ మాటలను వెనక్కి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
చేతినిండా డబ్బు సంచులతో పట్టుబడిన వ్యక్తికి గూండాలను, రౌడీ షీటర్లను పూజించడం సహజం. కానీ మీరు తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, దయచేసి కొంచెం మర్యాదగా ప్రవర్తించండి. మీరు శత్రు దేశాన్ని ఆరాధించడం, సైన్యాన్ని అవమానించడం ఆపగలరా?*
విషయానికి వద్దాం… రేవంత్ రెడ్డి పాకిస్థాన్‌ను పొగడలేదు… ఆరాధించలేదు… సైన్యాన్ని అవమానించలేదు… బీజేపీ చేసే కార్పెట్ బాంబింగ్ వ్యాఖ్యలను కౌంటర్ చేయడం మాత్రమే… ఇక్కడ కార్పెట్ బాంబింగ్ అనే పదాన్ని బీజేపీ వాడటమే ఓ నాన్సెన్స్… మేం సర్వశక్తులనూ ప్రయోగిస్తామని నేరుగా చెప్పడం వేరు, జనానికి అర్థం కాని కార్పెట్ బాంబింగ్ పదాల్ని వాడటం ఏమిటో బీజేపీ నేతలకే తెలియాలి…
మరి కేటీయార్ ఎందుకు పట్టుకున్నాడు దీన్ని..? బీజేపీని అనాలి గానీ రేవంత్ రెడ్డి మెడకు చుట్టడం దేనికి..? సరే, ఒకసారి పెద్ద దొర గత వ్యాఖ్యల్ని చూద్దామా..?
అదే పాకిస్థాన్ మీద సర్జికల్ స్ట్రయిక్స్ చేసి, ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తే కేసీయార్ ఎలా తృణీకరిస్తున్నాడో, సందేహాలు వ్యక్తం చేస్తూ రాజకీయం ప్రదర్శిస్తున్నాడో చూశారు కదా… ఇది పాకిస్థాన్ పట్ల ఆరాధనను, ఇండియన్ ఆర్మీ ప్రాణాలకు తెగించి చేసే పోరాటాల్ని కించపరచడం కాదా..?
అంతేనా..? చైనాతో సాగిన గల్వాన్ పోరాటంలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు మరణిస్తే… ఆ మృతదేశం హైదరాబాదుకు వచ్చేవరకూ అప్పటి తెలంగాణ సీఎంకు సోయి లేదు… సినిమా ప్రముఖులు మరణిస్తే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం మీద ఉన్న శ్రద్ధ ఈ దేశ రక్షణకు ప్రాణాలొదిలిన తెలంగాణ కల్నల్ పట్ల ఎందుకు ఉండదు..? (సంతోష్ బాబు మరణానంతరం మహావీరచక్ర పొందాడు)…
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ నెటిజనం విరుచుకుపడితే, అప్పుడు కళ్లు తెరిచాడు తను… అప్పటికే గవర్నర్ తమిళిసై మృతవీరుడికి గౌరవవందనం సమర్పించింది… గవర్నర్ మీద విద్వేషం వేరు… ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన సంతోష్ బాబుకు సరైన అంతిమ గౌరవం కనబరచలేదు ఎందుకు..? చైనా మీద ప్రేమా..? ఇండియన్ ఆర్మీ మీద చులకన భావమా..? కేటీయార్‌కు పాత సంగతులు తెలియవు, గుర్తుండవు… ఇదే తార్కాణం… తీవ్ర విమర్శల తరువాత సంతోష్ బాబు కుటుంబానికి ఆర్థిక సాయం, ఆయన భార్యకు కొలువు ప్రకటించాడు, ఆ ఇంటికి వెళ్లాడు… నష్టనివారణ కోసం…
అంతేకాదు, మరోసారి ప్రెస్‌మీట్‌లో ‘అక్కడ మనవాళ్లను దంచుతున్నారు’ అన్నాడు… అంటే చైనాను కీర్తించడమా..? ఇండియన్ ఆర్మీ ప్రాణ త్యాగాలను అవమానించడమా..? ఇవన్నీ కేసీయార్ మార్క్ దేశభక్తి నిజస్వరూపాలు… ఇవన్నీ తెలంగాణ జర్నలిస్టులకు గుర్తున్నాయి, జనానికీ గుర్తున్నాయి… కేటీయార్‌కు ఇవన్నీ గుర్తులేవో, లేక గుర్తులేనట్టు నటిస్తున్నాడో… తెలంగాణ జనం కళ్లకు అలవాటైనట్టుగానే గంతలు కడుతున్నాడో తెలియదు..!!
Share this Article