హల్కాస ఏక్ నషాసా… ఆఖోంపే ఛారహా హై… అంటూ సూతింగ్ గా వినిపించే ఓ మెలోడీ గొంతు గురించి ఓసారి చెప్పుకోవాల్సిన రోజిది. తన గమకాలతో మత్తైన తమకంలో ముంచే ఆ పేరే హరిహరన్. సినీ నేపథ్య గాయకుడిగా… తమిళ, మళయాళ, కన్నడ, తెలుగు, హిందీ, సంస్కృతం, భోజ్ పురి, మరాఠీ, సింహళ, ఒరియా, బెంగాలీ వంటి బహు భాషా పాటగాడిగా హరిహరన్ దాదాపు అందరికీ సుపరిచితుడే.
మెహిదీ హాసన్, తలాత్ మహమూద్, బడే గులాం అలీ ఖాన్ వంటివారి తరం తర్వాత.. ఎవరైనా ది బెస్ట్ గజల్ సింగర్స్ ఉన్నారా అంటే కూడా గజల్స్ అభిమానులు ఠక్కుమని చెప్పే పేర్లలో కూడా హరిహరన్ ది మొదటివరుసలోనే ఉంటుంది.
అయితే, మీడియావారికి అక్రిడేషన్ కార్డులా… లేదా, ఏదైనా సంస్థలో పనిచేస్తున్నవారికి ఓ గుర్తింపు కార్డులా… భారతదేశ జనమందరికీ మన ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్ కార్డులా.. బొంబాయి సినిమాలోని ఉరికే చిలుక పాటే తన గుర్తింపంటాడు హరిహరన్. అయితే ఆ హరిహరన్ 68వ వడిలోంచి.. వడివడిగా ఈరోజే 69లోకి అడుగెట్టిన సమయాన.. ఆయన పాటల అభిమానులుగా హ్యాపీ బర్త్ డే చెప్పుకునే శుభ సందర్భమిది.
1955, ఏప్రిల్ 3.. హరిహరన్ పుట్టినరోజు
పది భాషల్లో 16 వేలకుపైగా పాటలు పాడాడు హరిహరన్. 2004లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ కూడా అందుకున్న ఈ కళాకారుడు.. ఫ్యూజన్ సంగీతంలో కూడా ఒక శైలిని క్రియేట్ చేశాడు. లెస్సీ లూయిస్ తో కలిసి కలోనియల్ కజిన్స్ వంటి ఆల్బమ్స్ తో దేశాన్ని ఉర్రూతలూగించాడు. క్రిష్ణ నీ బేగనే బారో అంటూ.. ఓ భక్తి గీతానికి అప్పటికున్న ప్రాచుర్యానికి మరింత రంగులద్దాడు. చిన్నికృష్ణుడి సౌందర్యాన్ని వర్ణిస్తూ.. రారమ్మని పిలిచే ఈ పాట.. ఓవైపు లెస్సీ లూయిస్ వెస్ట్రన్ మ్యూజిక్.. మరోవైపు హరిహరన్ గానంతో ఒక కొత్త పంథా సృష్టించుకుని.. రాను రాను మరిన్ని వేదికలపై వినబడేందుకు కారణమైంది.
గుల్షన్ కుమార్ టీ-సీరిస్ సంస్థ ద్వారా హరిహరన్ పాడిన హనుమాన్ చాలీసా ఇప్పటికే 3 బిలియన్లకు పైగా మంది వీక్షించారంటే ఎంత పాప్యులరో అర్థం చేసుకోవచ్చు. శాస్త్రీయ సంగీతకారులైన హెచ్ ఏ ఎస్ మణి, అలమేలు మణికి జన్మించిన హరిహరన్.. స్కూల్ చదువు ముంబై మాటుంగాలోని డాన్ బాస్కో స్కూల్ లో సాగింది. సెయింట్ జేవియర్ కళాశాలలో ఉన్నత విద్యనభ్యసించిన హరిహరన్… 1977లో తన మ్యూజికల్ జర్నీని ప్రారంభించాడు. తల్లిదండ్రులిద్దరూ శాస్త్రీయ సంగీత విద్వాంసులు కావడంతో… తాను సినీ నేపథ్య గాయకుడిగా, గజల్ సింగర్ గానే సుపరిచితుడైనా కూడా… శాస్త్రీయ సంగీత ఛాయలు కూడా తెలిసిన గాయకుడిగా కూడా మనకు ఆయన తన పాటల్లో కనిపిస్తుంటాడు.
హరిహరన్ విశ్వరూపం చూడాలంటే.. visaal-gazals for connoiseurs అనే ప్రైవేట్ ఆల్బమ్ విని తీరాల్సిందే. అలాగే గుల్ఫామ్, ఖరార్, హజిర్, ఇన్ ట్యాక్సికేటింగ్ హరిహరన్, జష్న్, హల్కా నషా, ఆథ్వాన్ సుర్ (ది అదర్ సైడ్ ఆఫ్ నౌషాద్), పైఘామ్, కాష్, ఆత్మ వంటి ఎన్నో హరిహరన్ సంగీత ప్రతిభకు అద్దం పట్టిన ప్రైవేట్ ఆల్బమ్స్.
1977లో ఆల్ ఇండియా సుర్ సింగర్ కాంపిటీషన్స్ లో ఫస్ట్ ప్రైజ్ సంపాదించుకున్న తర్వాత… హరిహరన్ జైదేవ్ అనే నాటి సంగీత దర్శకుడి గమన్ సినిమాలో పాడటానికి తొలి సంతకం చేశాడు. ఆ సినిమాలో హరిహరన్ పాడిన అజీబ్ స నేహా ముజ్ పర్ గుజర్ గయా యారో అనే పాట పెద్ద హిట్టైంది. ఉత్తరప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ దక్కించుకుంది. 1992లో ఏ. ఆర్. రెహమాన్ ప్రభంజనంతో.. స్టీరియో టైపిక్ గాయకులకు చెక్ పెట్టి కొత్త గాయకుల తెరంగ్రేటం ముమ్మురంగా ప్రారంభమైంది. ఆ సమయంలో రోజా సినిమాలో హరిహరన్ సాంగ్స్ ఒక రేంజ్ లో హిట్టవ్వడంతో పాటు.. ఆ తర్వాత వచ్చిన బొంబాయి సినిమాలోని ఉరికే చిలుక పాట… హరిహరన్ కెరీలో ఓ గుర్తింపు కార్డులా మారిపోయింది.
ఆ తర్వాత మెరుపుకలలు సినిమాలోని వెన్నలవే వెన్నలవే… భారతీయుడులోని టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా… రంగీలాలోని హాయ్ రామా ఏ క్యూ హువా… ఇందిరలోని లాలీ లాలీ అని.. సఖీలోని పచ్చనిదనమే పచ్చదనమే వంటి ఎన్నో పాటలు రెహమాన్, హరిహరన్ కాంబో ఎంత గట్టి బంధమో చెప్పాయి. అదే స్థాయిలో హిట్టయ్యాయి. 1998లో బార్డర్ లో అనుమాలిక్ సంగీతంలో హరిహరన్ పాడిన మేరే దుష్మన్, మేరే భాయి పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా నేషనల్ అవార్డ్ దక్కింది. అలాగే, అజయ్-అతుల్ సంగీత దర్శకత్వంలోని జోగ్వా అనే సినిమాలోని జివ్ రంగ్లా పాటకు కూడా నేషనల్ అవార్డ్ వచ్చింది.
ఇక గజల్స్ విషయానికొస్తే భారతీయ గజల్ సింగర్స్ లో… మహామహులు కూడా హరిహరన్ గజల్స్ గమకాలకు ముగ్ధులవుతారు. అలా సుమారు 35 ఆల్బమ్స్ చేసారు హరిహరన్. ఆశాభోంస్లేతో కలిసి చేసిన అబ్షర్ ఈ గజల్ అమ్మకాల్లో టాప్ గా నిల్చింది. ప్రముఖ తబలా విద్వాంసుడు హరిహరన్ తో కలిసి హరి చేసిన హజిర్ సంగీత ప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. హరిహరనే స్వాగత గీతంతోనే 2010లో కామన్ వెల్త్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. పద్మశ్రీ,, ఏసుదాస్ వంటి అవార్డ్స్ అందుకున్న హరి… 2010 నుంచి 2011 మధ్య ప్రతీ గురు, శుక్ర, శనివారాల్లో ప్రముఖ తమిళ టీవీ ఛానల్ జయటీవీలో హరియుదాన్ నాన్ అనే కార్యక్రమంతో తన పాటలతో కనిపించి, వినిపించేవారంటే.. హరిహరన్ కు దక్షిణ, ఉత్తరదేశమన్న తేడా లేకుండా ఎంత క్రేజు ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
అంతేకాదు, శంకర్ మహదేవన్ తో కలిసి హరిహరన్ చేసిన కొన్ని స్టేజ్ షోస్ ఆయన ఎనర్జీ లెవల్స్ ను పట్టి చూపిస్తాయి. ప్రతిభావంతుడైన మరో సింగర్ పక్కనుంటే… తానింకెంత రెచ్చిపోతాడో కళ్లకు కడతాయి. మొత్తంగా అపార ప్రతిభావంతుడు, విభిన్న భారతీయ గాయకుడిగా హరిహరన్ గాత్రం మరెంతో కాలం మనలాంటి వాళ్లం వింటూనే ఉండాలి. అందుకే మరోసారి భారతీయ సంగీత కళామతల్లి ముద్దుబిడ్డడైన హరిహరన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలతో…… (Article by రమణ కొంటికర్ల)
Share this Article