టోక్యోలో గోల్డ్ గెలిచిన నీరజ్ చోప్రా.. పారీస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ గెలిచి మన దేశ పరువును కాపాడాడు. జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్‌ను గమనిస్తే.. అతడిపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు కనపడింది. టోక్యోలో గోల్డెన్ త్రో వరకు నీరజ్ అంటే ఎవరో దేశంలో 99 శాతం మందికి తెలియదు. అప్పుడు అతనిపై ఎలాంటి ఒత్తడి లేదు. కానీ గోల్డ్ గెలిచాక.. 140 కోట్ల మంది ఆశలు అతడు భుజన మోస్తూ ప్యారీస్‌లో జావెలిన్ విసరాల్సి వచ్చింది. ఒక అంతర్జాతీయ ఆటగాడు, డిఫెండింగ్ ఛాంపియన్.. ఫైనల్ త్రోలో ఏకంగా ఐదు ఫౌల్స్ చేస్తాడని ఊహించామా?
సెకెండ్ త్రో క్లీన్‌గా విసిరాడు కాబట్టే సిల్వర్‌తో పరువు నిలుపుకున్నాడు. కొంత కాలంగా గాయాల పాలవడం.. మళ్లీ గోల్డ్ గెలవాలనే తీవ్రమైన ఒత్తిడి అతడు అన్ని ఫౌల్స్ చేయడానికి కారణం అయ్యింది. పైగా పాకిస్తాన్ అథ్లెట్ ఏకంగా ఒలింపిక్ రికార్డు దూరం విసిరి.. సవాల్ చేశాడు. అది మరింత ఒత్తిడికి గురి చేసి ఉంటుంది. ఏదైతేనేమి మొత్తానికి నీరజ్ దేశానికి సిల్వర్ అందించాడు.
ఇక పాకిస్తాన్ తరపు తొలి వ్యక్తిగత గోల్డ్ గెలిచిన అర్షద్ నదీమ్ ఎలాంటి గడ్డు పరిస్థితుల్లో ఈ పతకం సాధించాడో తెలుసుకుంటే మీ మనసు చలించి పోతుంది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ఖానేవాల్ గ్రామంలో ఒక జాట్ కుటుంబంలో ఛౌదరి అర్షద్ నమీద్ విర్క్ జన్మించాడు. నదీమ్ తండ్రి తాపీ పని చేస్తుంటాడు. 8 మంది సంతానంలో నదీమ్ మూడో వాడు. మన దేశంలోలాగే పాకిస్తాన్‌లో క్రికెట్‌కు తప్ప వేరే ఆటకు ప్రాధాన్యతే ఉండదు. స్కూల్‌లో కూడా క్రికెట్ ఆటవైపే మొగ్గాడు. రబ్బరు బంతితో జిల్లా స్థాయి క్రికెట్ ఆడాడు.
Ads
అర్షద్ 7వ తరగతిలో ఉన్నప్పుడు రషీద్ అహ్మద్ సాఖి అనే అథ్లెట్ కంట్లో పడ్డాడు. అథ్లెటిక్స్‌లో సత్తా చాటగలిగే వారిని గుర్తించి.. వారిని మెరికల్లా తీర్చి దిద్దడంలో రషీద్ అహ్మద్‌కు వెన్నతో పెట్టిన విద్య. దీంతో అర్షద్‌ను అథ్లటిక్స్ వైపుకు తీసుకొని వచ్చాడు. మొదట్లో షార్ట్ పుట్, డిస్కస్ త్రో వంటి ఆటలు ఆడాడు. పంజాబ్ యూత్ ఫెస్టివెల్లో పతకాలు కూడా గెలిచాడు. కానీ అర్షద్ జావెలిన్ త్రో వైపు క్రమంగా మొగ్గు చూపాడు. ఆ ఆటలో ఉన్న మజాను గుర్తించాడు. క్రమంగా ఆ ఆటకే అంకితమై పోయాడు.
పాకిస్తాన్‌లో ఖాళీ ఆటస్థలాల్లో క్రికెట్, ఫుట్‌బాల్ ఎక్కువగా ఆడుతుంటారు. దీంతో జావెలిన్ త్రో ప్రాక్టీస్‌కు స్థలమే దొరికేది కాదు. దీంతో తన గ్రామంలో ఇంటి దగ్గరే.. వెనుక ఉన్న పొలాల్లో జావెలిన్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. అర్షద్ నదీమ్‌ది పేద కుటుంబం కావడంతో జావెలిన్ కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. దీంతో గ్రామస్థులే అతడి టాలెంట్‌ను గుర్తించి డబ్బులు పోగుచేసి అతనికి ఇచ్చారు.
ఏ అంతర్జాతీయ పోటీలకు వెళ్లాలన్నా.. గ్రామస్తులే చందాలు వేసుకొని నదీమ్ చేతిలో డబ్బు పెట్టేవాళ్లు. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా.. పాకిస్తాన్ ప్రభుత్వం అతనికి ఎలాంటి సాయం చేయలేదు. పైగా జావెలిన్ అనే సరికి స్పాన్సర్లు కూడా వచ్చే వాళ్లు కాదు. ఎలాగో కష్టపడి టోక్యో వెళ్లాడు. ఫైనల్‌లో 84.62 మీటర్లు విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఇక ప్యారీస్ ఒలింపిక్స్ సన్నద్దత కొరకు కూడా తీవ్రంగా శ్రమించాడు. ప్రాక్టీస్ కోసం సరైన జావెలిన్ కూడా లేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా.. తనకు సాయం చేయాలని కోరాడు. చాలా మంది సాయం చేయడంతో ప్రాక్టీస్ ప్రారంభించాడు. టోక్యోలో ఫైనల్ ఓటమి.. ఆర్థిక కష్టాలు నదీమ్‌ను మరింత రాటు దేల్చాయి. ఎలాగైనా గోల్డ్ కొట్టాలనే కసితో విసిరాడనుకుంటా.. అందుకే 92.97 మీటర్ల దూరం వెళ్లిందా జావెలిన్. ఫైనల్‌లో రెండు సార్లు 90+ మీటర్లు విసిరి తన కసినంతా ప్రదర్శించాడు.
తను గెలిచింది తోటి అథ్లెట్లపై కాదు. చిన్నప్పటి నుంచి అనుభవించిన పేదరికం, ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, తనను పట్టించుకోని స్పాన్సర్లపై గెలిచాడు. ఇప్పుడు తన చుట్టూ వంద కార్పొరేట్ కంపెనీలు చేరనీ.. ప్రభుత్వం పిలిచి కోటి రూపాయలు ఇవ్వనీ.. అవన్నీ వృధాయే. తన వెన్నంటి ఉన్న గ్రామస్థులు, కుటుంబమే తనకు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. పాకిస్తాన్‌కు తొలి గోల్డ్ అందించింది నదీమ్ కాదు. ఆయన పుట్టిన ఊరంతా కలిసి అందించారు.
అమ్మ… ప్యారీస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్ ముగిసిన వెంటనే నీరజ్ చోప్రా తల్లి దగ్గరకు మీడియా వెళ్లింది. మీ అబ్బాయి టోక్యో లాంటి ప్రదర్శన చేయలేదు కదా.. మీరు ఏమైనా నిరాశకు గురయ్యారా అని అడిగారు. అదేం లేదు.. మాకు ఈ సిల్వర్ కూడా గోల్డ్‌తో సమానం అని చెప్పింది. పాకిస్తాన్ అథ్లెట్ గోల్డ్ గెలిచాడు కదా.. దీనిపై మీ స్పందన ఏంటని ప్రశ్నించగా.. అతను కూడా నా బిడ్డే అని గర్వంగా చెప్పింది.
ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తే.. నీరజ్ తల్లి ఇచ్చిన సమాధానాలు ఎంత హుందాగా ఉన్నాయో కదా. అథ్లెట్లకు ఉండే క్రీడా స్పూర్తి.. ఈ తల్లికి కాస్త ఎక్కువగానే ఉన్నట్లు అనిపించింది. టోక్యో ఒలింపిక్స్ సమయంలో కూడా నీరజ్ జావెలిన్‌ను నదీమ్ తీసుకొని ఏదో చేయబోయాడని మీడియాలో వార్తలు వచ్చినప్పుడు కూడా.. నీరజ్ తల్లి ఖండించింది. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. నదీమ్ అలా చేయడు అని వెనకేసుకొని వచ్చింది. ఆ తల్లిలో టోక్యో నుంచి ప్యారీస్ వరకు ఎలాంటి మార్పు చెందలేదు. పైగా మరింత పరిణితి చెందిన వ్యక్తిలా మాట్లాడింది. హ్యాట్సాఫ్… [ భాయ్‌జాన్, John Kora ]
Share this Article