Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆమెకు ఇచ్చిన పెళ్లికానుక గాఢమైన సైనైడ్ ద్రావకం… ఇలాంటి పెళ్లి ఇంకోటి లేదు…

December 14, 2022 by M S R

ఓ నియంత ఆఖరి రోజులు….. By… గొల్లపూడి మారుతీరావు… (మొన్న గొల్లపూడి వర్ధంతి… ఇలా స్మరించుకుందాం…) యూదుల కారణంగా మానవజాతి సర్వనాశనమౌతోందని, కొన్ని కోట్ల యూదుల దారుణమయిన చావుకి హిట్లర్‌ కారణమయ్యాడు. హిట్లర్‌ మీద 1222 పేజీల అద్భుతమైన జీవిత చరిత్రను రాసిన జాన్‌ టోలెండ్‌ పుస్తకంలో ఆఖరి రెండు వాక్యాలు. ”ఈ భూమి మీద నుంచి ఆరు మిలియన్ల యూదుల్ని నాశనం చెయ్యడం ప్రపంచానికి తాను చేసిన ఉపకారంగా హిట్లర్‌ భావించాడు. కాని తత్కారణంగా యూదులకి ప్రత్యేకమైన దేశమే ఏర్పడింది.”

వ్యక్తిగా హిట్లర్‌ విచిత్రమైన స్వభావం కలవాడు. ఎన్నడూ తన ఆకలిని ప్రదర్శించలేదు. కష్టాన్ని నోటితో చెప్పలేదు. నష్టానికి బాధపడలేదు. బాధని వ్యక్తం చేయలేదు. ఎవరి నుంచీ జాలిని ఆశించలేదు. జాలిని చూపించలేదు. చివరి దశలో తప్ప అతని కళ్లలో నీళ్లు ఏనాడూ నిలవలేదు. తన లక్ష్యం మీద విశ్వాసాన్ని వదులుకోలేదు. రోజుల తరబడి తిండిలేకపోయినా నోరిప్పలేదు. ఒక్కసారి కూడా ఎవరితోనూ వ్యక్తిగతంగా అమర్యాదగా ప్రవర్తించలేదు. ముఖ్యంగా స్త్రీలతో.

సంభోగం కూడా మనిషికి ఒక విధమైన బలహీనత అని భావించేవాడు. వయసులో ఒకరిపట్ల మోజు కలిగినా కలిసిరాలేదు. మరొకరి పట్లనే జీవితాంతం, ఆ దగ్గరతనాన్ని నిలుపుకున్నాడు. ఆమె పేరు ఈవా బ్రౌన్‌. అక్రమాన్ని జీవితలక్ష్యం చేసుకున్న ఈ నియంత ఏనాడూ అవినీతికి పాల్పడలేదు. ఒక నాయకుడు పదిమందిలో అందరూ చేసే అతి సామాన్యమైన పనులను చేయకూడదనే వాడు. చేస్తూ కనిపించకూడదనేవాడు. ఉదాహరణకి – నాయకుడు బట్టలు ఊడదీసి ఈతకొట్టడం లాంటి పనులు చేయకూడదని చెప్పేవాడు. బార్‌లో డాన్స్‌ చెయ్యడానికి ఒప్పుకునేవాడు కాదు. ఏనాడూ తాగుడుకి లొంగలేదు. కారణం – తాగి తన ప్రవర్తన తన వశం తప్పే స్థితికి తీసుకువెళ్లడం అతను ఊహించలేని విషయం.

Ads

వ్యక్తిగతమైన ఏ కోణమూ -జనజీవనంలో ప్రస్ఫుటం కాకూడదనేవాడు. తన సిద్ధాంతాలను ప్రకటించే, అద్భుతంగా ప్రవచించే, పదిమందీ గౌరవంగానో, మర్యాదగానో చూసే వ్యక్తిత్వమే హిట్లర్‌ని ఎవరయినా చూడగలిగినది. బట్టలు లేని, బనీనుతో కూర్చున్న, ఆడపిల్లలతో సరసాలాడే, లేదా తైతక్కలాడే హిట్లర్‌ని ఎవరూ ఎప్పుడూ చూసి ఉండరు. అతను బీరు తప్ప మాదకద్రవ్యాలేవీ పుచ్చుకోలేదు. స్త్రీలతో అతి మర్యాదగా ప్రవర్తించేవాడు. అలనాటి ప్రపంచ ప్రఖ్యాత సౌందర్యరాశి హెడ్డీ లామర్‌ పొందిన గౌరవాలలో హిట్లర్‌ ఆమెని ముణుకులమీద నిలబడి చేతిని ముద్దుపెట్టుకోవడమని చెప్తారు.

చివరి రోజులలో అతని హత్యకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఒకానొక ప్రయత్నంలో ఎడమ చెయ్యి పట్టు పూర్తిగా పోయింది. ఆలోచనలు అదుపు తప్పాయి. మాట తడబడింది. అప్పుడప్పుడు చెప్పిందే పదే పదే చెప్పేవాడు. కాళ్లు తడబడే స్థితికి వచ్చాడు. అన్ని వేపుల నుంచీ శత్రుదేశాలు తరుముకు వస్తున్నాయి. ఒక్కొక్కటే నగరాలు కూలిపోతున్నాయి. తన ప్రభావానికి, ప్రభుత్వానికి ఆఖరి రోజులు వచ్చాయని తెలుస్తోంది. ఆయన సహచరులు హివ్లుర్‌ వంటి వారు ఆయన్ని ఏ జపాన్‌కో, ఇండోనేషియాకో, సింగపూర్‌కో వెళ్లి తలదాచుకోమన్నారు.

”ఈ క్షణంలో రాజధాని నుంచి పారిపోతే నైతికంగా నా వ్యక్తిత్వాన్ని కోల్పోతాను. ఈ క్షణంలో విధి చెప్పుచేతల్లో నేను నడుచుకుంటాను. ఈ దశలో నన్ను నేను రక్షించుకోగలిగినా ఆ పని చేయను. నౌకతో పాటే కేప్టెన్‌ కూడా కూలిపోవాలి” అన్నాడు. అవి 1945 ఏప్రిల్‌ మాసాంతం. శత్రువులు అన్నివేపులా దూసుకువస్తున్నారు. వాళ్లని ఆపగలిగితే మే 5 వరకూ కొనసాగించి కన్ను మూయాలని హిట్లర్‌ కోరిక. ఎందుకు? మే 5న నెపోలియన్‌ కన్ను మూసిన దినం. ఆ దశలోనూ తన హోదామీదా, తన పెద్దరికం మీదా దృష్టిపోలేదు.

ఒక రష్యన్‌ టాంకుని ధైర్యంగా ధ్వంసం చేసిన ఓ కుర్రాడికి లోహపతకాన్ని ఆ దశలో బహూకరించాడు. ఆ దశలో జీవితాంతం ఆయనతో సన్నిహిత సంబంధం పెట్టుకున్న ఈవా బ్రౌన్‌ ఆయన ఆహ్వానించకపోయినా ఆయన ఉండే రహస్య బంకర్‌ దగ్గరికి వచ్చేసింది. ఆమెని చూశాక ఆమె అవసరం ఎంతో ఆ క్షణాన గుర్తించాడు. జీవితంలో హిట్లర్‌ ఏనాడూ చెయ్యని పని -ఒకేఒక్కసారి -తన సిబ్బంది సమక్షంలో చేశాడు. ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆయన జీవితాంతం తనమీద కప్పుకున్న వ్యక్తిత్వపు అహంకారానికి తన అశక్తత తూట్లు పొడుస్తున్న సందర్భమిది.

ఆ బంకర్‌లో ఆఖరి విందుకి ఏర్పాట్లు జరిగాయి. ఈవా బ్రౌన్‌ పెళ్లికూతురుగా సిద్ధమయింది. ”సంవత్సరాల తరబడి జరిపిన పోరాటంలో వివాహానికి న్యాయం చెయ్యలేనని పెళ్ళి చేసుకోలేదు. ఇప్పుడు -నా జీవితానికి ముగింపు రాసే సమయంలో ఈమెను నా భార్యని చేసుకుంటున్నాను. సంవత్సరాల బాంధవ్యం తరువాత -తనంతట తాను ఈ దశలో నా దగ్గరికి వచ్చింది. తన ఇష్టప్రకారమే నాతో మృత్యువును పంచుకోడానికి సిద్ధపడింది” అన్నాడు. విచిత్రమేమిటంటే వారు మార్చుకున్న ఉంగరాలు వారి వేళ్లకు పెద్దవయిపోయాయి. అంతకంటే సరైన ఉంగరాలు ఆ దశలో దొరకలేదు. అప్పటికి ట్రెజరీలో ఆ ఉంగరాలే దొరికాయి.

పెళ్లి సర్టిఫికేట్‌ మీద ఈవా బ్రౌన్‌ సంతకం చేసింది. కాని అందరి పెళ్లికూతుర్ల లాగానే ఆమె కూడా కంగారులో ఆ దశలో ఈవా అని రాశి ‘హిట్లర్‌’ అని రాయడానికి బదులు ‘బ్రౌ’ అని రాయడానికి ‘బి’ అక్షరం రాసింది. వెంటనే సవరించి హిట్లర్‌ అని రాసింది. అది ఏప్రిల్‌ 28 అర్ధరాత్రికి కాస్త ముందు. సాక్షి సంతకం వాగ్నర్‌ అనే ఉద్యోగి చేశాడు. ఒక కాగితం మీద మరొక కాగితం పెట్టడంతో ముద్దగా ఉన్న సిరా చెదిరిపోయింది. గంట తర్వాత ఈ తప్పుని గుర్తించాడు. వెంటనే కాగితం మీద రాసిన సమయాన్ని సవరించాడు. ఎలా? అప్పటి టైము చూసుకుని. అప్పటికి తేదీ మారి 29 వచ్చేసింది. ఆవిధంగా ఒక చారిత్రకమైన ఘట్టానికి తప్పుడు సాక్ష్యం మిగిలింది.

ఇక ఆఖరి ఘట్టం. ఆత్మహత్య. ఆమెకి సైనైడ్‌ ద్రావకం ఉన్న చిన్న గొట్టాన్ని ఇచ్చాడు హిట్లర్‌. ఇది కొత్త పెళ్లికూతురుకి ఇచ్చిన మొదటి, ఆఖరి బహుమతి. అక్కడే ఉన్న మరొక నాజీ అధికారి ఓ అనుమానాన్ని వెళ్లబుచ్చాడు. ఆయన చుట్టూ శత్రువులున్నారు. తీరా ఆ గొట్టంలో ద్రావకం కల్తీ అయితే? అయితే దానివల్ల ఏం లాభం? లేదా ఏం నష్టం? శత్రువులకి హిట్లర్‌ దొరుకుతాడు. అతన్ని నానాహింసలు పెట్టి అవమానించే ప్రమాదం ఉంది. మరి ఈ నిజాన్ని ఎలా గుర్తించాలి?

హిట్లర్‌కి అత్యంత ప్రియమైన పెంపుడు కుక్క ఉంది. దాని పేరు బ్లాండీ. ఆ కుక్కకి విషాన్ని ఇచ్చారు. వెంటనే బ్లాండీ చచ్చిపోయింది. ఒక జీవితకాలం తన యజమాని పట్ల విశ్వాసాన్ని చూపించిన కుక్క ఆ విధంగా యజమానికి తన రుణాన్ని తీర్చుకుంది. తర్వాత ఈవా పిస్తోలుతో ప్రాణం తీసుకోబోయింది. సాధ్యం కాలేదు. విషాన్ని మింగి ప్రాణం వదిలింది. హిట్లర్‌ విషాన్ని నమ్మలేదు. రివాల్వర్‌ని తీసుకుని తన గదిలోకి వెళ్లాడు. కాస్సేపటికి అక్కడివారు రివాల్వరు పేలిన శబ్దం విన్నారు.

తామిద్దరూ పోగానే తమ శవాల్ని గుర్తు తెలియకుండా కాల్చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు హిట్లర్‌. ఎందుకని? అంతకంటే ముందే చచ్చిపోయిన ఇటలీ నియంత, హిట్లర్‌ మిత్రుడు ముస్సోలినీ శవాన్ని మిలాన్‌ పెట్రోలు బంకులో కాళ్లకి తాళ్లు కట్టి వేలాడదీశారు. ఒక నియంత శవానికి శత్రువులు చేయగల అవమానమిది.. హిట్లర్‌ దంపతుల శవాల మీద లీటర్ల కొద్దీ పెట్రోలు పోసి తగులబెట్టారు. అవశేషాల్ని ఒక కేన్వాసులోకి ఎత్తి బంకరు గోడకి ఏర్పడిన బాంబుల కన్నం ద్వారా బయటికి తెచ్చి మట్టిలో కప్పెట్టారు.

ఒకప్పుడు హిట్లర్‌ ఆర్కిటెక్టు గీస్లర్‌తో అన్నారు: ”ఇక్కడే నేను పుట్టాను. ఇక్కడే నా ఉద్యమం సాగింది. ఇక్కడే నా హృదయం ఉంది” అని. ఆయన రాసుకున్న కవిత ఒకటి ఉంది:

నేను నా దేశ పతాకను తడబడుతూనయినా, ఒంటరిగా ఎగరేస్తాను

నవ్వే నా పెదాలు పిచ్చి మాటల కోసం తడబడవచ్చు

కాని నాచేతిలోని పతాకం నేను కూలిన తర్వాతే కూలుతుంది

నా శవానికి గర్వంగా ఆచ్చాదనంగా కప్పుతుంది

మరొక్కసారి విలియం బ్లేక్‌ మాటల్ని గుర్తుచేసుకుంటే -క్రూరత్వానికి మానవీయమైన హృదయం ఉంటుంది. హుందాతనం, అహంకారం, గాంభీర్యం, తాను నమ్మిన భయంకరమైన విశ్వాసం, ఓటమిని అంగీకరించని మూర్ఖపు పట్టుదలా, ఆత్మస్థైర్యం, కర్తవ్య దీక్షా, అన్నిటి వెనుకా ఏదో విచిత్రమైన క్రమశిక్షణా – ఇన్ని కలిస్తే -ఒక నియంత. ఇందుకు హిట్లర్ ది కేవలం విని, నిట్టూర్చి, మరిచిపోయే చావుకాదు. దాదాపు ప్రపంచాన్ని జయించిన ఒక సిద్ధాంతపు విపర్యాయానికి, విచిత్రమైన ముగింపుకి ఇది సంకేతం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions