Jagannadh Goud………………… రతన్ టాటా – మనమంతా జరుపుకోవాల్సిన ఒక ఉత్సవం..! టాటా వాళ్ళే ఇండియాలో మొదటి ఎయిర్ లైన్స్ ప్రారంభించారు. ఆ తర్వాత అది ఎయిర్ ఇండియా అయ్యి ప్రభుత్వ చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ అది టాటా వాళ్ళ చేతుల్లోకి వచ్చిన సందర్భంలో రతన్ టాటా గారి గురించి నా అభిప్రాయం. టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా. జంషెట్ టాటా కొడుకు రతన్ జంషెట్ టాటా. రతన్ జంషెట్ టాటాకి పిల్లలు లేకపోతే నావల్ అనే వ్యక్తిని పెంచుకొని నావల్ టాటా అని పేరు పెట్టుకున్నారు. నావల్ టాటా కొడుకు రతన్ టాటా. టెక్నికల్ గా టాటాల వారసుడు రతన్ టాటానే, కాని నిజానికి రతన్ టాటా ఒక అనాధ కొడుకు. రతన్ తండ్రి నావల్ సూరత్ (గుజరాత్) లో దిగువ మధ్య తరగతి కుటుంబం, 4 యేండ్ల వయస్సులోనే అతని తండ్రి చనిపోతే, తల్లి కుట్టు మిషిన్ తో వచ్చే ఆదాయంతో పోషించలేక ఒక అనాధాశ్రమంలో చేర్పించారు నావల్ ని. పిల్లలు లేని రతన్ జంషెట్ టాటా భార్య నావల్ ని దత్తత తీసుకోవటం వలన నావల్ టాటా అయ్యాడు…
నావల్ టాటా సోను అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. వీరికి రతన్ టాటా పుట్టాక కొన్ని రోజులకే విడిపోయారు. ఆ తర్వాత నావల్ టాటా స్విట్జర్లాండ్ అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. రతన్ టాటా జీవితంలో మెలోడ్రామా లేదు గోల్డెన్ స్పూన్ తో పెరిగాడు అనుకుంటాం. ఏదో క్రియేట్ చేసి మెలోడ్రామా సృష్టించటం కూడా కరక్ట్ కాదు. కానీ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు, తను ఆర్కిటెక్ట్ అవుదాం అనుకుంటే తండ్రి ఇంజనీరింగ్ చేయమనేవాడు, తను అమెరికా వెళ్ళి విద్యాభ్యాసం చేయాలనుకుంటే తండ్రి ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమనేవాడు. చివరికి రతన్ జంషెట్ టాటా (టెక్నికల్ గా తాత) ని ఒప్పించి అమెరికాలోని కార్నెగీ యూనివర్శిటీలో చదువుకున్నాడు. అమెరికాలో చదువుకునే రోజుల్లో ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆ సమయంలోనే గ్రాండ్ పేరెంట్స్ ఆరోగ్యం బాగాలేకపోతే ఇండియా తిరిగి వచ్చాడు. ఆ సమయంలో ఇండియా చైనా యుద్ధం జరుగుతుండటంతో రతన్ టాటాని చేసుకోటానికి ఆ అమ్మాయి ఇండియా రాలేదు, వేరే వాళ్ళని చేసుకుంది. ఆ తర్వాత ఎవరిని చూసినా ఆ అమ్మాయే గుర్తు వచ్చిందో ఏమో రతన్ టాటా పెండ్లి చేసుకోలేదు (బ్రహ్మచారి).
Ads
టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా కజిన్ బ్రదర్ కొడుకు JRD టాటా (JRD టాటాకి భారత రత్న కూడా వచ్చింది). రతన్ టాటా ఇండియా వచ్చిన సమయంలో JRD టాటానే టాటా గ్రూపు వ్యాపారాలని చూసుకునేవాడు. రతన్ టాటా కూడా మామూలు ఉద్యోగిలాగే టాటా గ్రూపులో జాయిన్ అయ్యాడు. JRD టాటా ఆరోగ్యం బాగాలేని స్థితిలో రతన్ టాటాకి టాటా గ్రూపు పగ్గాలు అప్పగించాడు. అప్పటిదాకా కుటుంబ వ్యాపారంలాగా ఉన్న టాటా సంస్థని అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దాడు రతన్ టాటా. ఇండియాలో ఉన్న కార్లు, విమానాలు అన్నిటినీ కొనగలడు కానీ ఇప్పటికీ ఆయన కారుని ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వెళతాడు రతన్ టాటా. తన సొంత సంస్థల్లోకి వెళుతుంటే అందరిలాగే తప్పనిసరిగా ఆగి తన కారుని చెక్ చేపించుకుంటాడు. రిలయన్స్, బిర్లా, బజాజ్ లాంటి వారి అందరి సంపద కంటే టాటా గ్రూపు సంపద ఎక్కువ. కానీ అంబానీలలాగా ఇండియాలో కానీ, ప్రపంచంలో కానీ టాప్ జాబితాలో లేడు రతన్ టాటా. కారణం తన సంపదలో 60% ఎప్పుడూ దాన ధర్మాలకి వినియోగిస్తుంటాడు రతన్ టాటా.
ఆసియాలో మొదటి క్యాన్సర్ హాస్పటల్ నుంచి ఇండియాలో మొదటి ఎయిర్ లైన్స్ (ఆ తర్వాత ఎయిర్ ఇండియా అయ్యింది) వరకు టాటాలే ప్రారంభించారు. టీ పొడి, ఉప్పు నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు టాటాలు లేని వ్యాపారం లేదు; సిగరెట్స్ & ఆల్కహాల్ వ్యాపారం తప్ప. గుండు సూది నుంచి గూడ్స్ రైలు ఇంజన్స్ వరకు టాటాలే నంబర్ వన్. టాటా ఇండికా వచ్చిన కొత్తలో నష్టాల్లో ఉంటే అమెరికాకి చెందిన ఫోర్డ్ మోటార్స్ కి వెళ్ళి అమ్ముతాం కొనమని అడిగితే వాళ్ళు ఎగతాళిగా మాట్లాడి పంపించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అదే ఫోర్డ్ మోటార్స్ నష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించి ఫోర్డ్ వాళ్ళ లగ్జరీ కార్లు అయిన “జాగ్వార్”, “లాండ్ రోవర్” ని కొని ఫోర్డ్ మోటార్స్ కి సహాయం చేశాడు రతన్ టాటా.
గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ లో ఇండియాలో మొట్టమొదట 5/5 రేటింగ్ సాధించిన కార్ టాటా వాళ్ళదే (టాటా నెక్సాన్). ఈ కారు సృష్టికర్త రతన్ టాటా గారే. ఇండియాలో రిలయన్స్ తర్వాత 100 బిలియన్స్ రూపాయలు సాధించిన సంస్థ కూడా టాటా వాళ్ళ TCS నే (మార్కెట్ క్యాపిటలైజేషన్- mcap ప్రకారం). ఇలాంటివెన్నో ఉన్నాయి రతన్ టాటా గారి ఖాతాలో. ఇండియాకి ఏ కష్టం వచ్చినా సంపదని అంతా ఇచ్చేవాళ్ళలో రతన్ టాటా ముందు ఉంటాడు. అంబానీలు ధనవంతులు కానీ రతన్ టాటా ఐశ్వర్యవంతుడు. కష్టపడితే అందరూ అంబానీలు అవ్వకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ రతన్ టాటాలాగా ఐశ్వర్యవంతుడు అవ్వొచ్చు. రతన్ టాటా అంటే నమ్మకం, రతన్ టాటా అంటే నిజాయతీ, రతన్ టాటా అంటే నిలువెత్తు భారతం. One of my inspiring persons Ratan Tata. రతన్ టాటా అంటే మనమంతా జరుపుకోవాల్సిన ఒక ఉత్సవం…
Share this Article