.
నాకు బాగా నచ్చిన ఫోటో… దుబాయ్‌లో కార్ రేసింగ్‌లో మూడో స్థానంలో నిలిచి హీరో అజిత్ గర్వంగా భారతీయ పతాకాన్ని ఎగరేస్తున్న ఫోటో…
మొన్నమొన్ననే రేస్ ప్రాక్టీస్‌లో కారు ప్రమాదానికి గురై తప్పించుకున్నాడు తను… ఏమాత్రం వెనుకంజ లేదు… ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో ఇటీవల ఒక రేసింగ్ (Car racing Team) టీమ్‌ను ప్రకటించిన తను టీమ్‌తో కలిసి దుబాయ్ వేదికగా జరుగుతోన్న 24హెచ్ దుబాయ్ కారు రేసింగ్‌లో పాల్గొని విజయాన్ని అందుకున్నాడు..
Ads
యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నా, ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఈ రేసులో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేస్తూ… స్పిరిట్ ఆఫ్ రేస్ (Dubai Car racing) అనే అవార్డును ఆయనకు టీమ్ బహుకరించింది….
ఈ సందర్భంగా నాలుగేళ్ల క్రితం రాసుకున్న ఓ స్టోరీ మరోసారి గుర్తుచేయాలి… సందర్భం… ఎందుకంటే… దిక్కుమాలిన రీల్ హీరోలతో పోలిస్తే తను ఓ రియల్ హీరో కాబట్టి… స్టార్ హీరోల తాలూకు చాలా అవలక్షణాలు లేవు కాబట్టి… ఆ పాత కథనం ఇదీ…
అజిత్… అసలు ఈయన హీరో ఏమిటో అర్థం కాదు… ఎందుకు చెప్పుకుంటాడో కూడా తెలియదు… అసలు హీరో అంటే ఎలా ఉండాలి..? అందులోనూ ఓ ఇండియన్ హీరో… అదీ సౌతిండియా హీరో అంటే ఏ రేంజ్ ఉండాలి… ఫ్యాన్స్ గీన్స్ హంగామా రెచ్చిపోవాలి, చచ్చిపోవాలి, లేదా చంపాలి… కానీ తనకు ఫ్యాన్స్ సంఘాలు అధికారికంగా ఏమీ లేవు, వద్దంటూ రద్దు చేశాడు…
ఏమిటయ్యా అది… అసలు ఒక హీరో అంతటి అప్రాచ్యపు పని చేయొచ్చా..? ఫ్యాన్స్, ఏసీలు లేకపోతే హీరో అనిపించుకోరయ్యా బాబూ… అసలు ఒక సినిమా కూడా విడుదల గాకముందే ఫ్యాన్స్ ఉండే రోజులు ఇవి… నువ్వేదో తప్పుదారిన సినిమాల్లోకి వచ్చిపడ్డట్టున్నవ్…
అసలు హీరో అంటే ఎలా ఉండాలి..? మాటిమాటికీ హెయిర్ టచప్, మీసాల ట్రిమ్మింగ్‌కు ఓ అసిస్టెంట్ ఉండాలి… నయా నయా ట్రెండ్ల బట్టలు ఉండాలి., అవి మడత నలగొద్దు… కారవ్యాన్ దాటి రావొద్దు… ఈయనేమిటో యాభై ఏళ్లకు వచ్చాడు… జుట్టుకు రంగు వేయడు… రఫ్‌గా అలా వదిలేస్తాడు… మేకప్ సోయి లేని ఏకైక హీరో…
పుట్టింది హైదరాబాదే… తండ్రి తమిళ బ్రాహ్మిన్, తల్లి సింధీ… ఈయన తమిళ స్టార్… చదివింది పదో తరగతి… అంతే… కానీ తమిళం, తెలుగు, మళయాళం, కన్నడ, ఇంగ్లిషు దంచి కొట్టేస్తాడు… సొంత డబ్బింగు… ఎహె, తనకు అసలు ఈ ఇండస్ట్రీ హీరోయిజమే లేదు… దగ్గరకే రానివ్వడు… తను రియాలిటీలో హీరో…
ఒక్కొక్క రీల్ హీరో ఈర్ష్యతో లోలోపల గింజుకునేంత హీరో… ముందు ఏదో వెహికిల్ మెకానిక్… తరువాత డ్రైవర్… ఎలాంటి డ్రైవరో తెలుసా..? రేస్ కార్ల పోటీదారు… అనేక జాతీయ కార్ల రేసుల్లో పార్టిసిపేట్ చేశాడు… ఇక బైక్ రైడింగ్ అనేది తనకు ఉత్త జుజుబీ… ఆగండాగండి… ఒక్క రేసరే కాదు… మంచి షూటర్…
ఓసారి చెన్నైలో స్టేట్ లెవల్ షూటింగ్ పోటీలు జరిగితే 900 మంది వచ్చారు ప్రొఫెషనల్ షూటర్లు… చెన్నై రైఫిల్ క్లబ్ మెంబర్ ఈ అజిత్… ఏకంగా ఆరు మెడల్స్ మెడలో పడ్డయ్… రకరకాల విభాగాల్లో ఇరగదీసేశాడు… అల్లాటప్పా ఏమీ కాదు… సీరియస్ ప్రాక్టీస్ కూడా చేస్తాడు… (తాజాగా డ్రోన్ల మీద కూడా ప్రేమలో పడ్డాడు… ఏదో ప్రిస్టేజియస్ కంట్రాక్టు కూడా చేజిక్కించుకున్నాడు…)
జీవితం అంటే మొహానికి రంగు, డబ్బులు, ఆస్తులు, ఫాల్స్ ఇమేజీ అనుకునే తొక్కలో దిక్కుమాలిన హీరో కాదు తను… పోలింగ్ బూత్ వెళ్తే సిన్సియర్‌గా అందరితోపాటు అలా క్యూలో నిల్చుంటాడు… నేను ఓ హీరోను, నేను దైవాంశసంభూతుడిని అనుకుని విర్రవీగే టైపు చిల్లర హీరో కాదు… అప్పుడప్పుడూ తన ఫ్యాన్స్ పేరిట కొందరు ఇతర హీరోల ఫ్యాన్స్‌తో సోషల్ గొడవలకు దిగితే అసలు ఆవైపు చూడడు… అలాంటివి కలలో కూడా ఎంకరేజ్ చేయను అంటాడు…
అప్పుడెప్పుడో 1993లో ప్రేమపుస్తకం అని తెలుగులో హీరో… అప్పట్నుంచి నేటికీ వెనక్కి తిరిగి చూడని హీరో… హీరా రాజగోపాల్ అనే హీరోయిన్ ఉండేది… ఆమెతో ప్రేమ, సహజీవనం… చాలాఏళ్లు గడిపారు, ఎక్కడ తేడా కొట్టిందో అకస్మాత్తుగా బ్రేకప్…
తరువాత షాలినితో ప్రేమ, పెళ్లి… పిల్లలు… సినిమాల్లోనూ పిచ్చి పిచ్చి రొమాన్స్ సీన్లు, తనకు నప్పని కామెడీ సీన్లు, తిక్క తిక్క స్టెప్పుల జోలికి పెద్దగా పోడు… యాక్షన్ అంటే ఇక సీరియస్ యాక్షన్‌లోకి దిగిపోతాడు అంతే… ఎస్… అజిత్… ఒక డొల్ల హీరో కాదు… హీరో… అంతే…!!
Share this Article