అతను ప్రధానితో రహస్యంగా ఏం మాట్లాడి ఉంటారు? … అందుకే మహానుభావులు అంటారు… జర్నలిస్ట్ జ్ఞాపకాలు…..
————————————-
ప్రధానమంత్రితో ఎవరైనా ఒక అరగంట ఏకాంతంగా మాట్లాడితే ఏం మాట్లాడి ఉంటారు . ఇప్పుడంటే ఆఫీస్ లో కూర్చొని ఏం మాట్లాడారో తోచింది రాసుకునే మహానుభావులు ఉన్నారు కానీ అప్పుడలా కాదు … ఏం మాట్లాడి ఉంటారు ? అధికారులను , జర్నలిస్ట్ లను , రాజకీయనాయకులను అందరి మెదడును తొలిచిన ప్రశ్న . ఐతే ప్రధాని చెప్పాలి , లేదంటే ఆ కలిసిన వ్యక్తి చెప్పాలి .క లిసిన వ్యక్తి కాసింత కోపంతో రుస రుస వెళ్లిపోతుంటే , ఏం మాట్లాడారు అని అడిగితే , వెళ్లి ఆయన్నే అడగండి అని వెళ్లిపోయారు . అలా వెళ్లి పోయి వారు కాళోజీ , అప్పుడు ప్రధాని పివి నరసింహారావు …
***
1994 లో ప్రధాన మంత్రిగా తొలిసారి పివి నరసింహారావు వరంగల్ జిల్లాకు వచ్చారు . వరంగల్ పివి సొంత జిల్లా. పుట్టింది పెరిగింది , ఎదిగింది వరంగల్ జిల్లాలో , దత్తత వెళ్ళింది కరీంనగర్ జిల్లా. పివి సాహిత్య ,రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దింది వరంగల్ జిల్లా . పివి వరంగల్ నుంచి ఒక పత్రికను కూడా నడిపించారు . ఢిల్లీ రాజకీయ జీవితాన్ని ముగించి, వరంగల్ వచ్చి తిరిగి సాహిత్య జీవితాన్ని ప్రారంభించాలి అనుకుని ఏర్పాట్లు చేసుకున్నారు . ఆ ఉద్దేశంతో ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు .
నేను వచ్చేస్తున్నా , సాహిత్యంతో గడుపుదాం అని మిత్రులకు సమాచారం కూడా ఇచ్చారు . అన్నీ అనుకున్నట్టు జరగవు , రాజకీయ జీవితాన్ని వదిలేద్దాం అని నిర్ణయించుకున్న వ్యక్తి రాజీవ్ గాంధీ హత్యతో ప్రధానమంత్రి పదవి చేపట్టాల్సి వచ్చింది . ప్రధాన మంత్రి హోదాలో తొలిసారిగా వరంగల్ వచ్చారు . అప్పుడక్కడ దాదాపు అర డజను మంది జర్నలిస్ట్ లే ఉండేవారు . వరంగల్ జిల్లా రిపోర్టర్ గా నేనూ అక్కడున్నాను .
Ads
ఇప్పుడంటే ప్రధాని ఢిల్లీలోనే తొమ్మిదేళ్లయినా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు . అప్పుడు తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వరంగల్ లో పివి ప్రధానిగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడితే, ప్రశ్నించే అవకాశం కూడా లభించింది . బిసిలకు టికెట్ల గురించి అడిగితే , ఎక్కువ సీట్లు ఇవ్వడం గురించి చెప్పారు . చాలా మంది రాజకీయ నాయకులు అడిగిన మనిషి ముఖంలోకి చూసి సమాధానం చెబుతారు . ఎంతో సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని , ఎన్నో మార్పులు చూసిన జీవితం కాబట్టి పివి నరసింహారావు ఎదుటి వారిని చూడకుండా చెప్పాల్సింది చెప్పేశారు . అది స్థిత ప్రజ్ఞత అనుకున్నా , నిర్లిప్తత అనుకున్నా ఆయనకు పోయేదేమీ లేదు .
***
పివి నరసింహారావు గెస్ట్ హౌస్ లో ఉన్నారు . ముందుగా నిర్ణయించిన కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు తో సమావేశం లేదు . చిన్ననాటి మిత్రుడు కాదనేవారు ఎవరు . గెస్ట్ హౌస్ లో పివి , కాళోజీ ఇద్దరే అరగంటకు పైగా ఏకాంతంగా మాట్లాడుకున్నారు . ఏం మాట్లాడుకున్నారో తెలియదు . పివి ప్రధాని అయ్యాక వారి బంధువులు చాలా మందికి గ్యాస్ ఏజెన్సీలు వచ్చాయి . అప్పటి ఆంధ్రప్రభ రిపోర్టర్ ఎన్‌కౌంటర్ వార్త మిస్ అయితే ఉద్యోగం పోయింది . పివి అతని బతుకుతెరువు కోసం మరో వ్యక్తితో కలిపి గ్యాస్ ఏజెన్సీ ఇప్పించారు .
బతుకు తెరువు కోసం ఇలా ఉపాధి మార్గాలు చూపడం తప్ప భారీ కాంట్రాక్టులు , వందల కోట్ల కుంభకోణాలు అంటూ లేవు . ప్రధానితో అరగంట భేటీ అంటే ఏ భారీ కాంట్రాక్టునో , ఎవరికి మంత్రి పదవో , ఢిల్లీలో ఏదో పెద్ద పనే ఉంటుంది అనుకుందామా అంటే అక్కడున్నది కాళోజీ నారాయణరావు . ప్రజలు గోడును నా గోడు అనుకునే రకం . అడిగితే ఆయన్నే అడగండి అని విసవిసా వెళ్లి పోయారు . పీవీని అడగలేం . ఏమై ఉంటుందా ? అనే సందేహం బుర్రలో అలానే ఉండిపోయింది .
***
అటు తరువాత నేను హైదరాబాద్ వచ్చాను . వరంగల్ విషయాలు అక్కడే మరిచిపోయాను . ప్రధానిగా పివి పదవీ కాలం ముగిసిన తరువాత 2001-02 ప్రాంతంలో పబ్లిక్ గార్డెన్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో కాళోజీ నారాయణ రావుకు సహస్ర చంద్ర దర్శనం పేరుతో సన్మానం . ఆ సభలో పివి నరసింహారావు పాల్గొన్నారు . కాళోజీ గురించి మాట్లాడుతూ 94లో వరంగల్ లో వారిద్దరి మధ్య జరిగిన సమావేశం గురించి చెప్పారు . ప్రధాన మంత్రితో దాదాపు అరగంట ప్రత్యేకంగా సమావేశం అయితే రకరకాలుగా ఊహించుకుంటారు , ఏం వ్యవహారమో కానీ కాళోజీ ఏం మాట్లాడారో తెలుసా అని పివి వివరించారు .
మనం యువకులుగా ఉన్నప్పుడు ఈ దేశం విధానాలు ఎలా ఉండాలని మాట్లాడుకున్నాం , ప్రధానిగా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావ్ అని కాళోజీ నిలదీశారట . పివి ప్రధాని అయ్యే నాటికి దేశంలోని బంగారం విదేశాల్లో తాకట్టు పెడితే కానీ బతకలేని పరిస్థితి . ఆర్ధిక సంస్కరణలు తీసుకువస్తే తప్ప మనుగడ లేని గడ్డు స్థితి . ఈ విధానాలను మిత్రుడి ముఖం మీదే కాళోజీ నారాయణరావు తీవ్రంగా విమర్శిస్తూ వెళ్లిపోయారట . పివి కానీ , కాళోజీ నారాయణరావు కానీ తమ సొంత బాగు చూసుకున్న వారుకాదు అందుకే మహానుభావులుగా మిగిలిపోయారు .
ప్రధానిగా ఉన్నప్పుడు తన మీద వేసిన కేసుల్లో వాదించిన న్యాయవాదులకు ఫీజు ఇవ్వడానికి సొంత ఇంటిని అమ్ముకున్న వారు పివి . ఆర్ధిక సంస్కరణల ఫలాలను దేశం ఇప్పుడు అనుభవిస్తోంది . ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన సభలోనే .. సభలో కొందరు యువకులు తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలని కోరారు . మా కాలంలో మాకు నచ్చింది చేశాం , మీ కాలంలో మీకు నచ్చింది చేయండి అని సమాధానం ఇచ్చారు . ప్రధానులు అందరికీ ఢిల్లీలో సమాధులు నిర్మించినా పివి లాంటి జ్ఞానికి అక్కడ చోటు లేకుండా పోయింది …
**
ఆర్ధిక సంస్కరణలు అమలు అయి పాతికేళ్ళు అయిన సందర్భంగా వివిధ రంగాల్లో వచ్చిన మార్పులతో పలు జాతీయ ఛానల్స్ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు . బెంగళూరుకు చెందిన ఆర్ధిక నిపుణుడు ఒకరు తమ అనుభవాన్ని చెప్పారు . ఆర్ధిక సంస్కరణల కోసం దేశంలోని ఆర్ధిక రంగ మేధావులతో పివి ఓ సమావేశం నిర్వహించారు . మెజారిటీ మేధావులు సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఉపన్యాసాలు . అందరి అభిప్రాయాలు మౌనంగా విన్న పివి ముగింపులో దేశం పరిస్థితి ఇలా ఉంది ఆర్ధిక సంస్కరణలు అమలు చేయడం మినహా మరో మార్గం లేదు అని ముగించారట … ఆ రోజు పివి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం ఈ రోజు దేశం తలెత్తుకొని నిలిచేట్టు చేసింది ….. – బుద్దా మురళి
Share this Article