హేమ… నిన్న కొన్ని చానెళ్లలో మళ్లీ ఒకటే హోరు… సోది… బోరు… ఆమె ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) నుంచి సస్పెండ్ చేయాలని సదరు సంస్థ కార్యవర్గంలో చర్చించారట… అధ్యక్షుడు మంచు కన్నప్ప అలియాస్ విష్ణు తుది నిర్ణయం తీసుకుంటాడట…
ఎస్, హేమ చేసిన పని కరెక్టు కాదు… అది ఒక కోణంలో మాత్రమే… ఆమె డ్రగ్స్ తీసుకోవడం, అమ్మాయిలని రేవ్ పార్టీకి సప్లయ్ చేయడం, ఆర్గనైజింగులో భాగస్వామ్యం వంటివి చట్టం చూసుకుంటుంది… అవి నేరాలా కాదా తేలుస్తుంది… ఆమె ప్రస్తుతానికి దోషి కాదు, నిందితురాలు మాత్రమే…
ఆమె పోలీసులను తప్పుదోవ పట్టించి మరింత ఇరుక్కోవడంతో మీడియా మరింత ఎక్కువగా స్పందించింది… ఆమె మాట తీరు, గతంలో మీడియాతో గొడవల కారణంగా మీడియా ఫుల్లు నెగెటివ్ స్టాండ్ తీసుకుంది… ఐతే ఇవన్నీ ‘మా’ అసోసియేషన్‌కు దేనికి..? సంస్థ నియమావళిలో ఈ రూల్స్ ఏమైనా ఉన్నాయా..?
Ads
1. పోలీసు కేసు నమోదు కాకూడదు 2. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడొద్దు 3. రేవ్ పార్టీలు ఆర్గనైజ్ చేయకూడదు ఎట్సెట్రా బైలాస్‌లో ఉన్నాయా..? మత్తుపదార్థాలు తీసుకోవడం మా నియామవళి మేరకు తప్పే అనుకుంటే… ఒక్క రాత్రి హైదరాబాదు పబ్బుల్లో వెతికితే ఎంత మంది ‘మా’ సభ్యులు దొరుకుతారు..? పోలీసు కేసులున్నవాళ్లు లేరా..? భూవ్యవహారాల కేసులు కూడా ఉన్నాయి కదా… తమ ఫామ్ హౌజులను రేవ్ పార్టీలకు అద్దెకు ఇచ్చినవాళ్లు లేరా..? అనైతిక వ్యవహారాల గురించి అసలు ‘మా’ చెప్పడమేమిటి..?
ఇదే మంచు విష్ణు మొదట్లో హేమకు సపోర్టుగా నిలబడ్డాడు… ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు ఏమైనా ఆధారాలిస్తే ఆలోచిస్తాం, ఆధారరహిత వార్తల్ని మీడియా రాయొద్దు, ఆమెకు పిల్లలున్నారు, ఓ తల్లి, ఇలా రాస్తారా..? అదీ ఇదీ అని ఏదేదో చెప్పుకొచ్చాడు… మరేమైంది ఇప్పుడు..? ఇప్పుడు బెంగుళూరు పోలీసులు ఏమైనా మా సంస్థకు రిపోర్టు ఇచ్చారా..? ఆమె మా సభ్యురాలిగా ఉంటే మా దర్యాప్తును ప్రభావితం చేస్తుందని మొరపెట్టుకున్నారా..? ఒకవేళ రిపోర్టు ఇచ్చినా సరే, పోలీసులు ఎవరిని బుక్ చేస్తే వాళ్లను సంస్థ నుంచి తీసేస్తారా..? ఈ విషయంలో కూడా ఆమె కోర్టుకు వెళ్తే భలే ఉంటుంది కథ..
అయ్యా.., చట్టసభల్లో సభ్యత్వమే దోషులుగా నిర్దారణయ్యేవరకు అనర్హతకు గురికాదు, జైలులో ఉంటూ సైతం చట్టసభలకు ఎన్నిక కావచ్చు… ‘మా’ అంతకన్నా చాలా ఎక్కువా..? ఆమె ‘మా’ సభ్యురాలు… నిజానికి ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు నైతిక మద్దతు ఇస్తే సరి… సరే, ఇలాంటి కేసుల్లో మద్దతు పలికితే సబబుగా ఉండదు కాబట్టి సైలెంటుగా ఉండొచ్చు…
‘మా’ సభ్యత్వం నుంచి తప్పించాలా, వద్దా అనే విషయంలో చర్చ పెట్టి… అసలే పీకల్లోతు ఇరుక్కున్న ఆమె మీద మరింత నెగెటివ్ ప్రచారానికి ఒకరకంగా ‘మా’ అవకాశం ఇస్తున్నట్టయింది… మళ్లీ దొరికింది కదాని మీడియా మళ్లీ ఆడుకుంటోంది… అందుకే హేమా… ఏం చేసినా దొరక్కుండా చూసుకోవాలి, లేకపోతే మా సంఘాలు, మీ సంఘాలు అలుసుగా తీసుకుంటాయి..!!
Share this Article