ఒక్క తెలుగులోనే ఈ పైత్యం ఉన్నట్టుంది… దానికి ఆద్యురాలు శ్రీముఖియే కావచ్చు… ప్రోగ్రామ్ హోస్టింగ్ కావచ్చు, యాంకర్ కావచ్చు భీకరంగా అరిస్తేనే అది ఎఫీసియెంట్ యాంకరింగ్ అనే ఓ భ్రమ పెరుగుతోంది… అది అంతిమంగా ప్రోగ్రామ్ మీదే నెగెటివిటీ పెరగడానికి కారణం అవుతుంది… అనసూయ పిచ్చి, వెకిలి డ్రెస్సింగును శ్రీముఖి ఆదర్శంగా తీసుకుంటే, శ్రీముఖి పిచ్చి కేకల్ని ఇండియన్ ఐడల్ యాంకర్ సింగర్ హేమచంద్ర ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు…
బాలయ్య మూడు భాగాల పెద్ద ఎపిసోడ్ తరువాత ఈసారి ఇండియన్ ఐడల్‌కు కోటి వచ్చాడు… ఓవరాక్షన్ కనిపిస్తోంది… నిజానికి సంగీత ప్రధానమైన టీవీ ప్రోగ్రామ్స్‌లో మెలోడ్రామలు, కృత్రిమ కన్నీళ్లు, విషాదగాథలు గట్రా ఉండకూడదు… గాయకుల వ్యక్తిగత జీవితాల ప్రభావం పాటలపై, తీర్పులపై పడొద్దు… అలాగే ముందే జడ్జిలు ఏమేమో చెప్పేశాక ఇక జనం వోటింగును కోరడం కూడా నాన్సెన్స్… ఆ ప్రభావం వోటింగు మీద ఉంటుంది కదా…
ప్రత్యేకించి జడ్జిల రాగద్వేషాలు, నువ్వు ఫైనల్స్‌కు వచ్చేసినట్టే, నువ్వు టాప్ 5 గ్యారంటీ, నేను నీకు అభిమానిని వంటి వ్యాఖ్యలు పోటీతత్వాన్ని నీరుకారుస్తాయి… అఫ్‌కోర్స్, అవన్నీ తెలిసి ఏడిస్తే టీవీ షోలకు జడ్జిలు ఎలా అవుతారు..? కోటి ఎపిసోడ్ చేస్తుంటే హేమచంద్ర యాంకరింగు చిరాకు పుట్టించింది… హైపిచ్ అరుపులు దేనికో అర్థం కాలేదు… ఇండియన్ ఐడల్ హిందీ షో చూడండి, ఎంత ప్లజెంటుగా యాంకరింగు ఉంటుందో తెలుసుకొండి… విశాల్ దడ్లానీ, నేహ కక్కర్, హిమేశ్ రేషమియా అతిగా పొగడ్తలకు పాల్పడతారే తప్ప మరీ వేషాలు వేసే నీచానికి దిగజారలేదు…
Ads
ఈవిషయంలో జీసరిగమప మరీ దిగజారిపోయింది… అసలే అనంత శ్రీరాం డాన్సులు, వేషాలతో షోను భ్రష్టుపట్టించగా… ఈసారి రెట్రో పేరిట ఎన్టీయార్, కృష్ణ, ఏఎన్నార్‌లను అనుకరిస్తూ, పాత పాటలకు వేషాలు వేస్తూ చివరకు ఓ మ్యూజిక్ షోను కాస్తా ఓ శ్రీదేవి డ్రామా కంపెనీని చేసేశారు… చివరకు రమ్య బెహరాను కూడా ఈ మురికిలోకి, ఈ బురదలోకి లాగేశారు… అసలే శ్రీముఖి బీభత్సపు అరుపులు… దానికితోడు వీళ్ల వేషాలు… ఇక్కడ ఎస్పీ శైలజను మెచ్చుకోవచ్చు… ఈ పిచ్చ పోకడల్లోకి రాకుండా హుందాగా ఉంటోంది… ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడదు ఆమె…
అంతెందుకు..? ఇదే ఇండియన్ ఐడల్ తెలుగు షోలో గత సీజన్‌లో సింగర్ శ్రీరామచంద్ర బాగానే యాంకరింగు చేశాడు… హేమచంద్రా, ఒక్కసారి సీరియస్‌గా ప్రదీప్ యాంకరింగ్ తీరు చూడు… ఎక్కడా అరుపులు, కేకలు ఉండవు… స్పాంటేనియస్‌గా చెణుకులు వేస్తూ, అందరినీ నవ్విస్తూ తన యాంకరింగ్ సాగిపోతుంది… (సింగర్ యుతి విషయంలో మాత్రం అదుపు తప్పాడు… అది వేరే సంగతి…) పోనీ, సుమ హోస్టింగ్ చూడు… ఎక్కడా గతి తప్పదు ఆమె… కాదు, నేను ఒక అనసూయ, ఒక శ్రీముఖిలాగే ఇలాగే అరుస్తాను, అల్లు అరవింద్‌కు ఇలా ఉంటేనే ఇష్టం అనుకుంటే నీ ఇష్టం…
చివరగా :: ఓచోట ఎవరినో ఉద్దేశించి ‘తిను’ అన్నాడు హేమచంద్ర… ఈ పదమే మరో రెండుమూడు షోలలోనూ విన్నాను… వాళ్ల ఉద్దేశం ఏమిటంటే… అతను, తను అంటాం కదా… దగ్గరగా ఉంటే తిను అంటున్నారు… తిను పాడింది, తిను పాల్గొంది అంటూ మాట్లాడుతున్నారు… ఇదేం భాష మహాశయా… తిను అనకు, తినాల్సిన పనేమీ లేదు అక్కడ… ఇతను, ఈమె, ఈయన అనొచ్చు… లేదా ఎంచక్కా వాళ్లకు పేర్లున్నాయి కదా, పలకొచ్చు కదా…!!
Share this Article