అందరూ రాసేశారు… మరి ఇద్దరు హీరోయిన్ల తల్లి, ఓ పాపులర్ హీరో మాజీ భార్య డ్రామాల్లో నటిస్తూ రోజుకు 2 వేలు, 3 వేలు సంపాదించి, పొట్టుపోసుకుంది అనేది ఖచ్చితంగా మంచి వార్తే… దాచుకున్న సొమ్ము కరిగిపోయి, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనిపించక, ఇక తప్పనిసరై చిన్నాచితకా వేషాలు వేయసాగింది… నిజానికి ఓసారి తరచిచూస్తే ఓ సినిమా కథకన్నా… కాదు, కాదు, ఓ పెద్ద నవలకు మించిన ట్రాజెడీ స్టోరీ ఆమె బతుకు… పేరు సారిక… సారిక ఠాకూర్… ఢిల్లీలో పుట్టిన ఓ రాజ్‌పుట్…
ఆమె పిల్లలే శృతిహాసన్, అక్షరహాసన్… తల్లికి కాస్త డబ్బు సాయం చేయలేని దురవస్థలో ఉన్నారా వాళ్లు..? లేక పట్టించుకోరా..? ఎలాగూ సారిక మాజీ భర్త కమలహాసన్‌కు పెళ్లిళ్లంటే నమ్మకం లేదు… వాడుకోవడం, వదిలేయడం అలవాటు… సో, ఈమెనూ వదిలేశాడు… అప్పట్లో ఏమైనా డబ్బు, భరణం ఒప్పందం కుదుర్చుకుందా లేదా తెలియదు… 61 ఏళ్ల వయస్సులో వెయ్యి, రెండు వేలకు దిక్కులు చూసే దురవస్థ ఏమిటి..? వీటికి జవాబులు దొరకవు… కానీ ఆమె బతుకంతా ప్రేమరాహిత్యం… ఒంటరితనం… నిరాశ… ఓ శాపగ్రస్త ఆమె… వాళ్లూ వీళ్లూ రాసిన వివరాల ఆధారంగా ఆమె కథను సంక్షిప్తంగా ఓసారి చెప్పుకుందాం…
నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రి ఆమెను, ఆమె తల్లిని వదిలేశాడు… అనుకోకుండా బాలనటిగా మారింది… ఫుల్ డిమాండ్ ఏర్పడింది… చదువు లేదు… బడి లేదు… ట్యూషన్ టీచర్‌ను పెడితే వాడు చెప్పిన పాఠాలే చెప్పీ చెప్పీ ఫీజులు తీసుకునేవాడు… ఎంతసేపూ ఆమె బతుకు ‘‘స్టార్ట్ కెమెరా, యాక్షన్’’… అంతే… తను సంపాదిస్తేనే ఇల్లు గడిచేది… సొంత తల్లే అయినా సరే సారిక తల్లి చిన్నప్పటి నుంచీ కొట్టేది, తిట్టేది… ఏ నిర్మాత ఎంత డబ్బులు ఇస్తున్నాడో కూడా ఆమెకు తెలియదు… తల్లి అంటే వణుకు… అడగాలంటే దడ…
Ads
ఆమెకు చదువు అంటే పిచ్చి… ఏది దొరికినా చదువుతూ ఉండేది… ఓసారి తల్లి ఆమెతోపాటు షూటింగ్ స్పాట్‌కు రాలేదు… నిర్మాత 1500 ఇచ్చాడు… వాటితో పుస్తకాలు కొనేసింది… ఆరోజు ఆమె తల్లి విపరీతంగా కొట్టింది ఆమెను… ఏడ్చీ ఏడ్చీ కారెక్కి పారిపోవాలని అనుకుంది… తన సంపాదనతో తల్లి అయిదు అపార్ట్‌మెంట్లు కొన్నదని తెలుసామెకు… కానీ తెలిసిన చేదు నిజం ఏమిటంటే..? ఒక్కటీ ఆమె పేరుతో లేవు… ఆరు రోజులపాటు కారులోనే పడుకోవడం, తెలిసిన స్నేహితుల ఇళ్లల్లో స్నానం… తప్పనిసరై ఇంటికి వాపస్… తరువాత కొన్నాళ్లకు తల్లి మరణించాకే ఆమె తేలికగా ఊపిరి పీల్చుకుంది…
కానీ అప్పటికే తల్లి తన సంపాదనతో కొన్న అపార్ట్‌మెంట్లను ఎవరికో ఇచ్చేసింది… సారిక తరపున అడగడానికి ఎవరూ లేరు… కానీ ఆమిర్ ఖాన్ కజిన్ నుజత్ సారికకు మంచి ఫ్రెండ్… ఆమె ద్వారాా ఆమిర్ ఖాన్ సాయం కోరింది… లీగల్ ఇష్యూస్ తనే చక్కబెట్టాడు…
ప్రేమరాహిత్యంలో బతుకుతున్న ఆమెకు కపిల్‌దేవ్ దొరికాడు … (అవును, భారత క్రికెట్ జట్టు కెప్టెన్) తన కోసం తరచూ చండీగఢ్ వెళ్లేది… వాళ్ల కుటుంబసభ్యులతో హాయిగా గడిపేది… ఆల్‌రెడీ కపిల్‌కు రోమీ అనే గరల్ ఫ్రెండ్ ఉందనీ, వాళ్లు పెళ్లి చేసుకోబోతున్నారని కొన్నాళ్లకు గానీ ఆమెకు తెలియలేదు… ఆ ప్రేమ అలా భగ్నమైంది… బాలనటుడిగా ఉన్నప్పటి నుంచే తెలిసిన సచిన్ పిల్గావ్కర్‌తో కొన్నాళ్లు కాలం గడిపింది… అదీ భగ్నం… మోడల్ దీపక్ పరాశర్‌తో కొన్నాళ్లు… అదీ సక్సెస్ కాలేదు… పదే పదే ఆమెను ఒంటరితనం వెంటాడుతనే ఉంది…
ఆమె జీవితంలోకి అప్పుడు ప్రవేశించాడు కమలహాసన్… బాలీవుడ్ మీద ఆశలున్నాయి… సాగర్ అనే సినిమా సక్సెస్ తరువాత ముంబైలోనే తిష్ట వేశాడు… అప్పటికే వాణిగణపతితో తనకు పెళ్లయ్యింది… అయితేనేం… సారిక దొరికింది… ముంబైలో ఓ అడ్డా దొరికింది… ఆమె పిచ్చిపిచ్చిగా ప్రేమించింది తనను… ఇక వాణికి విడాకులు ఇస్తాడనీ, సారికతో ఉంటాడనీ ప్రచారం సాగుతోంది… సహజీవనం ఆరంభించారు… ఆమెకు ప్రేమ కావాలి… కుటుంబం కావాలి… అందుకే గుడ్డిగా తనను తాను అర్పించేసుకుంది… ఆమె గర్భవతైంది… శృతి పుట్టింది… తరువాత మరో గర్భం… అక్షర పుట్టింది…
ఆ ఇద్దరు పిల్లలు పుట్టాక… పోరితే పోరితే కమలహాసన్ ఇక తప్పనిసరై 1988లో పెళ్లి చేసుకున్నాడు… కానీ కమల్ బ్యాక్ టు చెన్నై… ముంబై కమల్‌ను తరిమేసింది… సారికకేమో హిందీలో సొంత కెరీర్ ఉంది… డిమాండ్ ఉంది… కానీ కమల్‌హాసన్ కోసం అన్నీ వదులుకుంది… 28 ఏళ్ల వయస్సులో… కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే వదిలేసింది… చివరకు ఆమెకు 43 ఏళ్లు వచ్చేసరికి… కమల్ ఆమెను వదిలేశాడు… మరోసారి విధి ఆమెను వెక్కిరించింది… ప్రేమరాహిత్యం ఆమె పుట్టుకతోనే వెంట తెచ్చుకున్నట్టుంది…
సూసైడ్ ప్రయత్నం చేసింది… కమల్ జీవితంలోకి మరో మహిళ వస్తున్నదనే సమాచారాన్ని ఆమె సహించలేకపోయింది… చెన్నైలోని ఇంటి బాల్కనీ నుంచి కిందకు దూకింది… వెన్నెముకకు తీవ్ర గాయాలు… 3 నెలలు హాస్పిటల్‌లో ఉంది… విడిపోయాక సైతం కమల్ పిల్లలను బాగా నూరిపోశాడు… వాళ్లు తల్లి దగ్గరకు వెళ్లేవాళ్లు కాదు ఎక్కువగా… (ఈమధ్య కాస్త బెటర్ అంటారు)… తల్లి ప్రేమ, పురుష ప్రేమ, పిల్లల ప్రేమ… ప్రతిదీ ఆమెకు దక్కే ప్రాప్తం లేదు… నిజానికి ఎప్పుడూ ఆమె ప్రచారంలోకి రాదు.,. లోప్రొఫైల్ బతుకు గడుపుతోంది… కరోనాకు ముందు చాన్నాళ్లు అసలు ఆమె కెమెరా ముందుకే రాలేదు… ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది… సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది… అవసరం కదా, ఏవో ఆమె వయస్సుకు తగ్గ వేషాలు..!!
Share this Article