Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమ్మే అతడి సైన్యం… చదరంగం బోర్డ్ ను జయించాడు…

August 26, 2023 by M S R

By Mother: తెలుగు సినిమా దిగంతాలకు ఎదిగి ప్రపంచాన్ని ఊపేస్తున్న రుతువు ఇది. ఇంతకు ముందు విస్మరించినట్లు ఇప్పుడు తెలుగు సినిమాను విస్మరించడానికి వీలు లేదు. తగ్గేదే ల్యా అని పుష్ప, త్రిబులార్ లను వరించిన అవార్డులు తెలుగువారందరికీ గర్వకారణమే. ఆకాశం పట్టనంతగా ఎదిగిన తెలుగు యశస్వి ఎస్వీ రంగారావు, ఎన్ టీ ఆర్, ఏ ఎన్ ఆర్ లు 69 ఏళ్ల జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రయాణంలో ఒక్కరికయినా ఎందుకు కనపడలేదన్న చర్చ ఇప్పుడు మొదలయ్యింది. జక్కన్న రాజమౌళికి జాతీయ అవార్డు రాకపోవడం ఒక్కటే వెలితి అని మీడియా బాధపడుతోంది. నిజానికి త్రిబులార్ కు వచ్చిన అర డజను అవార్డులన్నీ రాజమౌళివే. రాజమౌళి సినీ వినోద  వ్యాపార విస్తృతి కోణంలో చూస్తే ఈ అవార్డులు బై ప్రాడక్టులే తప్ప…అసలు ఫలితం కానే కాదు. హిపోక్రసీ లేకుండా ఆ విషయం తనే ఓపెన్ గా అనేక వేదికల మీద చెప్పారు.

పత్రికల్లో మొదటి పేజీల్లో సినిమా అవార్డుల వార్తలు, లోపల విశ్లేషణలు, ప్రముఖుల ఉద్వేగ ఆలింగనాలు, పరస్పర అభినందనలు, ఆనంద బాష్పాలు రావాల్సిన ప్రాధాన్యంతోనే వచ్చాయి. రావాలి కూడా. వీటన్నిటి మధ్య ఒక పసి పిల్లాడిని ఒళ్లో పెట్టుకుని…దేశమంతా కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ అంతర్జాతీయ చదరంగ క్రీడాకారుడిగా తీర్చి దిద్దిన ఒక మధ్యతరగతి తల్లి కథనం చిన్న వార్తగా లోపలి పేజీల్లో ఎక్కడో ఉన్నా…విశేషమయిన ప్రాధాన్యం ఉన్న వార్త. ఆ తల్లికి మొదటి పేజీలో ఉన్న ఈ జాతీయ అవార్డులన్నీ ఇవ్వాలని పాఠకులకు అనిపించే గొప్ప స్ఫూర్తిదాయకమయిన వార్త.

తెలుగు గడ్డ మీద పుట్టి ఉద్యోగరీత్యా మద్రాసులో స్థిరపడ్డ మధ్య తరగతి కుటుంబం. తల్లి నాగలక్ష్మి. తండ్రి రమేష్ బాబు. అమ్మాయి వైశాలి. అబ్బాయి ప్రజ్ఞానంద. చింతలు లేని, ఉన్నా చింతలను తలుచుకుని తలుచుకుని చింతించని చిన్న కుటుంబం. ఇంట్లో టీ వీ పెట్టె ముందు కూర్చున్న పిల్లలను చూస్తే తల్లి నాగలక్ష్మికి దిగులుగా ఉండేది. రోజంతా అలా కళ్లప్పగించి పసి పిల్లలు టీ వీ కి అతుక్కుపోతే భవిష్యత్తు ఏమి కాను? అని భయపడి…ఖర్చు లేని ఒక చదరంగం అట్ట ముక్క, పావులు ఇచ్చి…టీ వీ చూడ్డానికి బదులు చదరంగం ఆడుకోండి అని చెప్పింది.

Ads

అలవాటయిన ఒకదాన్ని వదిలేయ్ అంటే వదలరు; మరొకటి పట్టుకోమని ఇస్తే అప్పుడు మొదటిదాన్ని వదిలేస్తారు- అని సూత్రీకరించింది వేదాంత శాస్త్రం. ఆ సూత్రాన్నే ఈ తల్లి అక్షరాలా పాటించింది. అంతే- ఆరేళ్ల ప్రజ్ఞానంద చదరంగంతో అక్షరాలా ఆడుకున్నాడు. చదరంగంలో కొడుకు అనితరసాధ్యమయిన ప్రతిభను తల్లి గమనించింది.

కట్ చేస్తే-
ప్రపంచానికి 18 ఏళ్ల అంతర్జాతీయ చదరంగం గ్రాండ్ మాస్టర్ పరిచయమయ్యాడు. ఆరేళ్ల వయసు నుండి ఇప్పటిదాకా ప్రజ్ఞానంద జాతీయ, అంతర్జాతీయ చదరంగంలో లెక్కలేనన్ని విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా  ప్రతిష్ఠాత్మక  ఫిడే చెస్ ప్రపంచ కప్ పోటీల్లో రన్నరప్ గా రెండో స్థానంలో నిలిచినా…అతడిది ఓటమి కాదు…గెలుపే అంటోంది లోకం. భవిష్యత్తును గెలవనున్నవాడు. భారత చరంగం బోర్డుపై ఉదయించిన కొత్త రారాజు.

ఆ తల్లికి చదరంగంలో ఓనమాలు తెలియవు. కొడుకు కోచింగ్ కు వెళితే వెంట వెళుతుంది. కొడుకు పోటీల్లో ఆడుతుంటే ఒక మూలన కూర్చుని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. ఇంట్లో వండిన శాకాహారం తప్ప ఇతర పదార్థాలు ప్రజ్ఞానందకు పడకపోవడంతో ఒక స్టౌ, వంటకు తగిన బియ్యం, మసాల పొడులు సంచిలో వేసుకుని వెంట వెళ్లి వంట చేసి పెట్టేది.

ప్రజ్ఞానంద చదరంగం ప్రజ్ఞలో సైనికుల కాలికి బలాన్ని ఇచ్చింది ఆ అమ్మ. వెయ్యేనుగుల బలాన్ని సమకూర్చింది ఆ అమ్మ. ఎడారిలో ఒంటరి ఒంటెను తోడుగా ఇచ్చింది ఆ అమ్మ. స్వారీకి గుర్రాన్ని సిద్ధం చేసింది ఆ అమ్మ. మంత్రాంగానికి మంత్రిగా నిలుచుంది ఆ అమ్మ. కొడుకును రాజును చేసి…చదరంగ సామ్రాజ్యానికి సర్వం సహా చక్రవర్తిని చేయబోతోంది ఆ అమ్మ.

“దేవుడికంటే అమ్మే గొప్ప; అమ్మ ఆశీర్వదిస్తే ఆ వాక్కును నిజం చేయడానికి దేవుడే పరుగెత్తుకొస్తాడు” అంటుంది మన సనాతన ధర్మం. ఈ అమ్మ చదరంగం బోర్డు ఎదురుగా నిలుచుని ఉండగా ఆ కొడుకు ఏ యుద్ధానికయినా సిద్ధం. అమ్మే అతడి సైన్యం.

“అమృతానికి , అర్పణకు అసలు పేరు అమ్మ;
అనుభూతికి , ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ;
ప్రతి మనిషి పుట్టుకకే పట్టుగొమ్మ అమ్మ;
ఈలోకమనెడి గుడిజేరగ తొలివాకిలి అమ్మ”
– మాడుగుల నాగఫణి శర్మ

ఆ అమ్మకు వందనం.
ఆ కొడుకుకు అభినందనం.…. by -పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions