మొన్న ఓసారి చెప్పుకున్నాం గుర్తుందా..? ఇండస్ట్రీ ఎందుకు భ్రష్టుపట్టిపోతుందంటే… టీ సప్లయ్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్, హీరోయిన్ దాకా హీరోయే ఎంపిక చేస్తాడు… నిర్మాత ఎవరుండాలో కూడా తనే డిసైడ్ చేస్తాడు… కథ, కథనం, డైలాగ్స్, సంగీతం అన్నీ తనకు ఇష్టమున్నట్టే నడవాలి… తన లుక్కు, తన బిల్డప్పు, తన ఇమేజీ తనే ప్లాన్ చేస్తాడు…
మరి నిర్మాత, దర్శకుడు, మిగతా వాళ్లు ఏం చేయాలి..? హీరో షూటింగుకు రాగానే ఓసారి కాళ్లు మొక్కాలి… రిలీజయ్యేంతవరకు హీరోకు కోపం రావద్దు అని దేవుడికి మొక్కుకోవాలి… దీన్ని హీరోస్వామ్యం అంటారు… అది ఎక్కువై తెలుగు సినిమా భ్రష్టుపట్టింది… అవేవీ లేక కన్నడ సినిమా గర్జిస్తోంది… తమిళ, మలయాళ సినిమా తమ స్పెషాలిటీని కాపాడుకుంటున్నయ్… తెలుగులో చిన్న హీరోలకు ఇదే మిడిసిపాటు…
ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… విష్వక్సేన్ గురించి..! మొదటి నుంచీ అదో టైపు… ఇష్టారాజ్యం మాటలు, దూకుడు… అసలు డౌన్ టు ఎర్త్ అనే మాటకు అర్థమే తెలియదు… ఆమధ్య ఓ పిచ్చి ప్రమోషన్ చేయించి, టీవీ9 ఆఫీసులో దేవి చేత గేటు చూపించుకున్న కేరక్టర్… మారతాడా..? మారడు… మారలేదు… చివరకు హీరో అర్జున్‌నే ఫోఫోవోయ్ అనేంతవరకూ వచ్చింది యవ్వారం…
Ads
అర్జున్ ఏ వివాదంలోకి రాడు… సినిమా కుటుంబం… ఎవ్వరూ కంట్రవర్సీల్లోకి రారు… అందరినీ గౌరవిస్తారు, తమ పని తాము చేసుకుంటూ పోతారు… అర్జున్ అన్నిరకాల పాత్రలు చేశాడు… యాక్షన్‌కు, స్టెప్పులకు అప్పట్లోనే, 1985 నుంచే కొత్త దిశను చూపించినవాడు… రాణీరాణమ్మా అనే పాట దగ్గర నుంచి భజే మంజునాథం పాట వరకు అర్జున్ అనగానే బోలెడు పాత్రలు కళ్ల ముందు చకచకా కదులుతాయి… తన అనుభవం ముందు విష్వక్సేన్ పిపీలికం…
అర్జున్ తన కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా ఓ తెలుగు సినిమా ప్లాన్ చేశాడు… తనే నిర్మాత, తనే దర్శకుడు… అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు, చంద్రబోస్ గీతరచయిత, సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ హీరో గారికి నచ్చలేదట… (నిర్మాతకు కదా నచ్చాల్సింది…) దాంతో సినిమా టీంతో విభేదాలు ఏర్పడి, కంటిన్యూ అవుతున్నయ్… అర్జున్ సాధారణంగా ప్రెస్ ముందుకు వచ్చి, ఎవరినీ నిందించడు… కానీ విష్వక్సేన్ వైఖరితో షాక్ తిన్నాడు… నష్టమైనా సరే, తన పరపతి దెబ్బతిని, ఇజ్జత్ పోవడంతో… ఇక విష్వక్సేన్‌తో సినిమా చేయకూడదని నిర్ణయించాడు, హీరోను తీసిపారేశాడు… అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బుల సంగతి తెలియదు… ఒక ఏరియా హక్కులు తీసేసుకున్నాడట… (టాలీవుడ్‌లో ఓ అసాధారణ దృశ్యం)…
అసలు అర్జున్‌కే ఈ పరిస్థితి ఎదురైతే, ఇక అనామక దర్శకులు, నిర్మాతలు అయితే పరిస్థితి ఏమిటి..? రేప్పొద్దున విష్వక్సేన్‌తో సినిమాలు తీసే సాహసులు ఎవరు..? ‘‘42 ఏళ్ల కెరీర్‌లో ఎవరి గురించీ చెడ్డగా మాట్లాడలేదు నేను… కీలక షెడ్యూల్‌కు అంతా సిద్ధం చేశాం, హీరో ఓ మెసేజ్ పెట్టి సారీ, షూటింగ్ కేన్సిల్ అనేశాడు… హీరోకు ఓ మేనేజర్ ఉన్నాడు, నేను తరువాత మాట్లాడతాను మీతో అని ఫోన్ పెట్టేశాడు… నాకు జీర్ఖం కాలేదు, మరీ ఇంత అన్‌ప్రొఫెషనలిజమా..?
ఒక ప్రొడ్యూసర్‌కు, ఒక డైరెక్టర్‌కు మర్యాద లేదా..? సినిమా ఫంక్షన్లకు రావాలని ఆహ్వానిస్తే బాలకృష్ణ, అల్లు అర్జున్, జగపతిబాబు, వెంకటేష్, చిరంజీవి… ఎంత డబ్బున్నా, పరపతి ఉన్నా, స్టేటస్ ఉన్నా తోటి నటుల పట్ల పద్దతిగా వ్యవహరిస్తుంటారు… పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఓ ప్రొడక్షన్ బాయ్‌ను కూడా నిర్మాత సొంతంగా పెట్టుకోలేడు… ఇబ్బంది పెట్టాలని కాదు, ఇతరులకు ఇదే స్థితి రాకూడదని ప్రొడ్యూసర్స్ గిల్డ్‌కు చెబుతాను… ఎస్, వేరే హీరోతో అదే కథతో, ఆ టెక్నిషియన్లతోనే సినిమాను మొదటి నుంచీ ప్రారంభిస్తాను… ఇదొక చేదు అనుభవం…’’ ఇంత చెబుతూ ఒక్కమాట తూలలేదు, ఎక్కడా సంస్కారాన్ని కోల్పోలేదు… దటీజ్ అర్జున్…
వేర్వేరు విషయాల్లో తన్నుకునే పెద్ద పెద్ద స్టార్ల అభిమానులు కూడా అర్జున్‌ను ఉమ్మడిగా అభిమానిస్తారు… తనొక ఆర్టిస్టు… నటిస్తాడు, నిర్మాత, దర్శకుడు, రైటర్, డిస్ట్రిబ్యూటర్, సింగర్… కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం… రియల్ సౌత్ ఇండియన్ ఐకన్ తను… టీవీ9 దేవీ… యువార్ కరెక్టు…!!
అర్జున్ మీడియా మీట్ తర్వాత విశ్వక్ తనకు గౌరవం ఇవ్వలేదని, అందుకే తప్పుకున్నాను అని చెప్పాడు… పొసగక పోతే ముందే బయటకు రావాలి కదా… ఎవరిది తప్పు..!? రాను రాను విశ్వక్ తో సినిమా ఎవరికైనా రిస్కే…
Share this Article