.
Siva Racharla ………. విజయ్ కిషోర్ …. 2017 జులై 8 న జరిగిన వైసీపీ ప్లీనరీలో తొలిసారి ప్రశాంత్ కిషోర్ బహిరంగంగా కనిపించారు.. జగన్ మోహన్ రెడ్డి ఆయన్ను వైసీపీ నేతలకు కార్యకర్తలకు పరిచయం చేశారు.. మళ్ళీ ఎనిమిదేళ్ల తరువాత అలాంటి పరిచయమే నిన్న జరిగింది..
నటుడు విజయ్ స్థాపించిన “తమిళగ వెట్రి కళగం” (టీవీకే) తొలి వార్షికోత్సవ సభలో విజయ్ ప్రశాంత్ కిషోర్ ను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ధోనీ ఎలా గెలిపిస్తున్నాడో అదేవిధంగా టీవీకేను తాను గెలిపిస్తానన్నారు. టీవీకే పార్టీని గెలిపిస్తే తమిళనాడులో ధోనికన్నా తనకే ఎక్కువ పాపులారిటీ వస్తుందని ప్రకటించాడు.
Ads
తమిళ్ సినిమా పిచ్చి గురించి అందరికీ తెలిసిందే కానీ రాజకీయాల్లో సక్సెస్ అయ్యింది తొలుత ఎంజీఆర్ మాత్రమే… తరువాత జయలలిత… కరుణానిధి సక్సెస్ ను సినిమా కోటాలో కాకుండా అన్నాదురై వారసత్వంగా చూడాలి. శివాజీ గణేశన్ స్వయంగా ఓడిపోయాడు. శరత్ కుమార్ ఒక సీట్ గెలిచాడు. కార్తీక్ గెలిచింది లేదు.
విజయ కాంత్ పార్టీ డీఎండీకే మొదటిసారి 2006లో 234 స్థానాల్లో పోటీచేసి ఒకే ఒకటి (విజయ్ కాంత్ ) గెలిచింది. 2011లో జయలలిత పార్టీతో పొత్తు పెట్టుకొని 41 స్థానాలకు పోటీచేసి 28 గెలిచారు. మళ్ళీ 2016 & 2021లో సొంతంగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు.
రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం ప్రకటనలను దాటి ఎన్నికల వరకు రాలేదు. కమల్ హాసన్ “మక్కల్ నీది మయ్యం” 2021 స్థానాల్లో పోటీచేసి ఒక్క సీటు కూడా గెలవలేదు, స్వయంగా కమల్ హాసన్ కూడా ఓడిపోయాడు. ఇక 2026 ఎన్నికలకు వస్తే విజయ్ తో పనిచేస్తాను అని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.
అన్నాడీఎంకేకు “అపూర్వ” అని ప్రశాంత్ కిషోర్ శిష్యురాలు పనిచేస్తున్నారు. గత ఆంధ్రా ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తరుపున ఈ అపూర్వ టీడీపీ కోసం పనిచేశారు. డీఎంకే కు రాబిన్ శర్మ పనిచేస్తున్నారు.. అందరూ ఒకే స్కూల్.. కాకుంటే గురువు శిష్యురాలు వేరు వేరు పార్టీలకు పనిచేయటం విశేషం.
ప్రశాంత్ కిషోర్ మరియు అపూర్వ నిజంగా వేరు వేరుగా పనిచేస్తున్నారా?, లేక ప్రశాంత్ కిషోర్ విజయ్, అన్నాడీఎంకేల మధ్య పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది. విజయ్ అభిమానుల్లో డీఎంకే మద్దతుదారులు ఎక్కువ. అయితే ఓటు మాత్రం స్థానిక నాయకుడు, అభ్యర్థిని బట్టి పడతాయి..
ఎన్నికల్లో కేవలం స్ట్రాటజిస్టులు గెలవరు.., చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి గెలవడానికి, ఓడిపోవడానికి… ఎలాగూ గెలిచే పక్షానికి పనిచేసి ఆ క్రెడిట్ తను కొట్టేశాడనే విమర్శ కూడా ప్రశాంత్ కిషోర్ మీద ఉంది… విజయ్ అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంటే గెలుస్తారా?, ఒక అంచనాకు రావటానికి కనీసం 8 నెలలు ఆగాలి.. కానీ రాజకీయాల్లో 1+2 = 3 అనేది అన్నిసార్లూ నిజం కాదు. గతంలో ప్రశాంత్ కిషోర్ చేసిన ఇలాంటి పొత్తు ప్రయోగం వికటించింది.
ఉత్తరప్రదేశ్ లో 2012 ఎన్నికల్లో విడివిడిగా పోటీచేసిన సమాజ్ వాదీ పార్టీ 29.15% ఓట్లతో 224 సీట్లు , కాంగ్రెస్ 11.63% ఓట్లతో 28 సీట్లు గెలవగా, 2017 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ప్రకారం సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని పోటీ చేయగా సమాజ్ వాదీ పార్టీ 21.82% ఓట్లతో 47 సీట్లు , కాంగ్రెస్ 6.2% ఓట్లతో 7 సీట్లు గెలిచాయి.. అంటే ఉమ్మడిగా పోటీచేసినా 12.76% ఓట్లు కోల్పోయి 198 సీట్లు కోల్పోయారు..
2017లో గెలిచిన బీజేపీ (NDA) కి 41% ఓట్లు 321 సీట్లు వచ్చాయి. 2012లో సమాజ్ వాదీ + కాంగ్రెస్ కు కలిపి 40.78% ఓట్లు వచ్చాయి..అంటే 2017లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతంతో దాదాపు సమానం.. అందుకే ఎన్నికల్లో 1 + 2 = 3 అనేది అన్నిసార్లు నిజం కాదు ..
మళ్ళీ ఎన్నికల స్ట్రాటజీ పని చేయను పూర్తికాలం రాజకీయమే చేస్తానన్న ప్రశాంత్ కిషోర్ విజయ్ పార్టీకి పనిచేయటం ఒకింత ఆశ్చర్యమే.. CSK ను గెలిపించిన ధోనీతో పోల్చుకున్న ప్రశాంత్ కిషోర్ కు కప్పు దక్కుతుందో లేదో 2026 మేలో తెలుస్తుంది.. ఈ లోపు, అంటే వచ్చే అక్టోబర్ లో జరిగే బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ పార్టీ భవిషత్తు తెలుస్తుంది.
2021 ఎన్నికల్లో సైకిల్ మీద వచ్చి ఓటు వేసిన విజయ్ వలనే అన్నాడీఎంకే ఓడిపోయి డీఎంకే గెలిచింది అని ప్రచారం చేసిన తలపతి స్వయంగా ఎలాంటి విజయాన్ని సాధిస్తారో 2026 మేలో జరిగే తమిళనాడు ఎన్నికల వరకు ఆగాలి …
Share this Article