మంచి సంకల్పం… మంచి తోడ్పాటు… స్నేహితుడి దాతృత్వానికి కొనసాగింపు… భేష్ విశాల్..! మొన్న హఠాత్తుగా మరణించిన తన స్నేహితుడు, కన్నడహీరో అప్పు పునీత్ రాజకుమార్ ఆశయాల్ని కొనసాగిస్తాననీ, పునీత్ చదివిస్తున్న 1800 మంది పిల్లల బాధ్యత, ఖర్చు ఓ సంవత్సరంపాటు తను భరిస్తాననీ విశాల్ ప్రకటించాడు… తన ఎనిమీ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో చెప్పాడు… గుడ్, అభినందనలు విశాల్… ఏదో ఓ ఎమోషన్‌లో చెబుతారులే అని విశాల్ మీద సందేహపడనక్కర్లేదు… ప్రజలకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు స్వయంగా ఫీల్డులోకి దిగి సాయం చేయడం విశాల్‌కు అలవాటే… చాలా ఉదాహరణలు ఇంతకుముందే చూశాం, చదివాం… పునీత్‌లాగా అది కూడా స్పందించే హృదయమే…
పునీత్ నిజమైన సంస్మరణ కోసం నేనేమైనా చేయగలనా అనే ఆలోచనల వచ్చిందే ఈ నిర్ణయం… తను తెలుగువాడు, చదువూసంధ్యాకెరీర్ కేరాఫ్ చెన్నై, పునీత్ కన్నడం, ఇప్పుడు విశాల్ సాయం చేయబోయే పిల్లలూ కన్నడమే… భాషలకు అతీతంగా ఎంత మంచి బంధం… పునీత్ ఫోటో దగ్గర నాలుగు పూలు పెట్టేసి, ఓ దండం పెట్టడంతో సరిపుచ్చలేదు… పునీత్ మరణం వల్ల ఓ మంచి కార్యక్రమం ఆగిపోకూడదని బాధ్యత తన మీద వేసుకోవడం అభినందనీయమే… ఫ్రీ ఎడ్యుకేషన్ ఎంతమందికి, ఎంత ఖర్చు అనేది ఇక్కడ ప్రశ్న కాదు… తన సంకల్పం, తన విశిష్ట ఆలోచన ధోరణి గమనార్హం… నిజానికి పునీత్ చారిటీ కార్యక్రమాల్లో ఆ 1800 మంది పిల్లల ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు… అనాథాశ్రమాలు, గోశాలలు, వృద్ధాశ్రమాలు గట్రా ఉన్నయ్… అవిప్పుడు అనాథయ్యాయి…
Ads
విశాల్ ఒక సంవత్సరంపాటు భరిస్తాడు సరే… కానీ తరువాత..? అందరూ పునీతులు, విశాల్‌లు కారు కదా… వాస్తవానికి పునీత్ తండ్రి రాజకుమార్, తల్లి పార్వతమ్మ కలిసి స్థాపించిన శక్తిధామ అనే ఎన్జీవో చాన్నాళ్లుగా మైసూరులో చారిటీ కార్యక్రమాల్లో ఉంది… విధివంచితలైన మహిళలు, ఆడపిల్లలకు కొన్ని వృత్తుల్లో శిక్షణ ఇప్పించి, వాళ్లను తమ సొంత కాళ్ల మీద నిలబడేట్టు చేయడం ఆ సంస్థ యాక్టివిటీ… అయితే ఆ సంస్థ విరాళాల సేకరణ ద్వారా ఆ ఖర్చుల్ని భరిస్తుంది… కొంతమేరకు రాజకుమార్ కుటుంబం, ప్రత్యేకించి పునీత్ భరించేవాళ్లు… అది గాకుండా ఈ 1800 మంది పిల్లల ఎడ్యుకేషన్ బాధ్యతలు…
పునీత్ సోదరుడు శివ, రాఘవేంద్ర కూడా నటులే… కన్నడ ఇండస్ట్రీలో పేరున్న ఆ కుటుంబం కూడా ‘కలిగిన కుటుంబమే’… సో, పునీత్ చారిటీని ఆ కుటుంబం కొనసాగిస్తే, సాయార్థులకు ఓ భరోసా… చారిటీ యాక్టివిటీని ఇంకా విస్తరిస్తే సొసైటీకి మేలు, ఇతర సినిమా వ్యక్తులకు ఆదర్శం, పునీత్‌కు నిజమైన నివాళి… పునీత్ మరణంతో లక్షల మంది కన్నీళ్లు పెట్టుకున్నారంటే తనేదో పాపులర్ హీరో అని కాదు, వాళ్లంతా సైకోఫ్యాన్స్ కాదు… పునీత్ వ్యక్తిత్వం, దాతృత్వంతో తనమీద అభిమానాన్ని పెంచుకున్నవాళ్లు… పునీత్ సోదరులకు ఇది అర్థమైతే మంచిదే…
Share this Article