మమ్ముట్టికి 68 ఏళ్లు… మలయాళంలో మెగాస్టార్… మోహన్‌లాల్‌తో పోలిస్తే కొన్నాళ్లుగా వెనకబడ్డట్టు అనిపించినా సరే, ఈరోజుకూ మంచి పాత్ర దొరికితే కుమ్మేస్తాడు… తన కొడుకు దుల్కర్ కూడా అంతే… మంచి మెరిట్ ఉంది… ఏ పాత్ర ఇచ్చినా దంచేస్తాడు… పాటలు పాడతాడు… కానీ పదేళ్లవుతున్నాసరే ‘‘ఇదీ నా సినిమా’’ అని కాలరెగరేసి చెప్పుకోదగినంత హిట్ లేదు… మలయాళం, తమిళం, తెలుగు, హిందీ… ప్రతి భాషలోనూ ఇంతే… హే సినామిక అనే తాజా సినిమా చూస్తే, దుల్కర్ మీద జాలేస్తుంది… ఇదీ తనకు మైనస్సే…
తమిళంలో ప్రముఖ గీత రచయిత వైరముత్తు… ఆయన కొడుకు మదన్ కార్కి… తనే కథ, మాటలు, పాటలు, స్క్రీన్-ప్లే అందించాడు… తను కొంచెం ప్రతిభ ఉన్నవాడే… సినిమాటోగ్రఫీ ప్రీత… ఈమె పీసీ శ్రీరామ్ మేనకోడలు… చిత్రీకరణలో నైపుణ్యం ఉంది… సినిమాలో అది కనిపిస్తూనే ఉంది… గోవింద్ వసంత మంచి ట్యూన్లే అందించాడు.. పెద్ద బ్యానరే కాబట్టి నిర్మాణ విలువలకు, ఖర్చుకు ఢోకా లేదు… ఇక దుల్కర్‌తోపాటు కాజల్, అదితిరావు… నిజంగా ఓ మంచి కథ పడి ఉంటే సినిమా ఎక్కడికో వెళ్లిపోయేది…
కానీ ఏం జరిగింది..? కొత్తగా దర్శకురాలిగా మారిన బృంద యాక్షన్, కట్ చెబుతూ పోయింది తప్ప ఆమె ముద్ర లేదు, సినిమాలో ఓ ఫీల్ లేదు… కథను, సీన్లను ప్రస్తుత కాలానికి తగినట్టుగా రాయించుకోలేకపోయింది… కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… అదితిరావు హైదరి ప్లజెంట్ అప్పియరెన్స్‌ను చాలామంది ఇష్టపడతారు… కానీ ఈ ముగ్గురు ప్రతిభావంతులు ఉన్నా దర్శకురాలు సరిగ్గా వినియోగించుకోలేదు… ఫలితంగా ఓ బోర్ సినిమా…
Ads
హీరో పెద్ద వాగుడుకాయ… వాగుబోతు అందామా..? సరే…! చాటర్ బాక్స్..! భార్య అదితి అంటే అమితమైన ప్రేమ… చాలా కేరింగ్… కానీ అది అతి అయిపోయి భార్య భరించలేకపోతుంది… వాడిని వదిలేద్దామని అనుకుంటుంది… ఓ సైకాలజిస్టు కాజల్‌ను కలిసి ఇదంతా చెబుతుంది… పోనీ, నువ్వే వాడితో లవ్‌లో పడిపోయినట్టు నటించు, ఆ సాకుతో నేను వదిలేస్తాను అంటుంది… కాజల్ నటించబోయి నిజంగానే లవ్‌లో పడిపోతుంది… నిజానికి ఇదెంత పాతచింతకాయ పచ్చడి అంటే… చివరకు నాసిరకం సీరియళ్లు తీసే టీవీ నిర్మాతలు కూడా ఈ కథల్ని వదిలేసి చాలాకాలం అయిపోయింది…
పైగా భర్త వాగుడు, అతి ప్రేమ అనేవి మరీ విడాకులు ఇచ్చేంత దుర్లక్షణాలా..? అసలే కథ ఇలా ఉంటే… ఇక సీన్లు బోరింగ్‌గా సాగుతుంటాయి… పెద్దగా ట్విస్టుల్లేవు, థ్రిల్ లేదు… దీనికితోడు సినిమా ఎడిటింగ్ సరిగ్గా లేదు, నిడివి ఎక్కువైపోయింది… ఎంత అదితి అయినా సరే, అంతసేపు తెర మీద చూస్తుంటే బోర్ రాదా..? సో, ఏతావాతా చెప్పుకునేది ఏమిటయ్యా అంటే… మంచి టీం ఉండగానే సరిపోదు… సరైన కథ, సరైన స్క్రీన్ ప్లే పడాలి… పాత్రల కేరక్టరైజేషన్ పండాలి… అదీ హే సినామికా చెప్పిన నీతి… ఫాఫం… రన్ టైం కుదించేసి, ఓటీటీకి అమ్మిపారేస్తే ఓ పనైపోయేది… చివరగా :: దుల్కర్‌లాగే అదితి అదృష్టం కూడా… అంగట్లో అన్నీ ఉన్నా, నెత్తి మీద శని…!!
Share this Article