వాట్సాప్ వాడే అమాయకులకు మాయకులయిన వాట్సాప్ ఫేస్ బుక్ యాజమాన్యం ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా-
1 . మేము మీకు సేవచేసి తరించడానికి ధర్మసంస్థ కాదు. అహోబిల మఠం కాదు. ఊరిచివర తలుపు చెక్క కూడా మిగలని శివాలయం కాదు. మాది ఫక్తు అంతర్జాతీయ డిజిటల్ దిగ్గజ వ్యాపార సంస్థ.
2. భూగోళమంతా కోట్ల మందికి వాట్సాప్ అలవాటు చేసిన తరువాత- ఇక ఆ గుత్తాధిపత్యాన్ని అనుభవిస్తూ ఫలితాలు పిండుకోకుండా ఉండడానికి మేమేమీ సేవా ప్రతిఫలాపేక్ష లేని సంస్థ నడపడం లేదు.
Ads
3 . ఎండ్ టు ఎండ్ వాట్సాప్ లో మీ రాతలు, మాటలు, వీడియోలు సమస్తం మేము చూడగలం. కానీ ధర్మబద్ధులమయిన మేము చూడం.
4 . చూడడానికి మీరు అనుమతిస్తే మాత్రం- మేము అన్నీ చూడగలం. బిజినెస్ వ్యవహారాల సందేశాలయితే మా వ్యాపార ప్రయోజనాల కోసం మీ అనుమతితో చూస్తాం. మీరు వద్దనుకుంటే మానేస్తాం.
5 . మీ వ్యక్తిగత సమాచార భద్రత మాకు అత్యంత ముఖ్యం. దానికోసం మేము ఎంతదాకా అయినా వెళతాం.
వాట్సాప్ యాజమాన్య కంపెనీ ఫేస్ బుక్ ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు ఖర్చు పెట్టి ఇస్తున్న ప్రకటనల సారాంశమిది.
వాట్సాప్ ను ఒకందుకు ఒప్పుకోవాలి. మీరు అనుమతిస్తే చూడగలం అని ఒప్పుకున్నందుకు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా డిజిటల్ వేదికల మీద ఉన్న ఏ సమాచారమయినా భద్రం కాదు. వ్యక్తిగతం కాదు. అమెరికా సైనిక ప్రధాన కేంద్రం పెంటగాన్ నుండి ఆముదాలవలస ఆటో మెకానిక్ దాకా ఎవరి సోషల్ మీడియా సమాచారమయినా భద్రం అనుకుంటే ఒక డిజిటల్ భ్రమ.
సోషల్ మీడియాలో మన వ్యక్తిగత సమాచార భద్రత తేనె తుట్టెను కదిలించినందుకు నిజంగా ఫేస్ బుక్ ను అభినందించాలి. ఇప్పటికిప్పుడు సిగ్నల్ గొప్పది. టెలిగ్రామ్ ఇంకా గొప్పది అని మనకు అనిపించవచ్చు కానీ- ఇంటర్నెట్ తో ముడిపడిన ఏ సోషల్ మీడియా అయినా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరికి అందుబాటులోకి రాకపోదు. నిజం చెప్పులు తొడుక్కునేలోపు అబద్దం లోకం చుట్టి వస్తుంది. సోషల్ మీడియాలో పోస్టు పెట్టి అది రహస్యం అనుకుంటే- అది రెండోసారి మనం చదివేలోపు ఎవరు చదవకూడదో వారే చదివి మన ఇల్లు కనుక్కుని వస్తారు.
———————–
వాట్సాప్ సమాచార భద్రత మీద ఒక్కసారిగా అనుమానాల పుట్ట పగలడంతో దాని సమీప పోటీ వేదికలు టెలిగ్రామ్, సిగ్నల్ పంట పండింది. రెండ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ డిలిట్ చేసి టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నవారు దాదాపు రెండున్నర కోట్లకు పైగా ఉన్నారు. వరల్డ్ ఈజ్ టూ స్మాల్! వాట్సాప్! తాడిని తన్నేవాడు ఒకడుంటే- వాడి తలదన్నేవాడు మరొకడుంటాడు. రోజులన్నీ ఒకేలా ఉండవు.
వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే కుప్పకూలిపోవచ్చు…….. టెలిగ్రామ్- సిగ్నళ్లు భద్రమని ప్రస్తుతానికి అనుకోవడం తప్ప యూజర్లు చేయగలిగింది లేదు….. By… పమిడికాల్వ మధుసూదన్
Share this Article