Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆకాశంలో నివాసం అంటుంటే… అనారోగ్యమని బెదిరిస్తారా..? హమ్మా..!!

August 20, 2024 by M S R

 

రెండేళ్ల క్రితం ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ కోకాపేట ఎకరా వంద కోట్ల రూపాయల పాట పాడుకుంది. ఆ భూమి తనకు తానుగా ఆ విలువ కట్టుకుని…మార్కెట్ వేలం సాహిత్యానికి ఆ రాగం రేటు స్వరాలు కట్టుకోలేదు. ఆస్థాన రియలెస్టేట్ రారాజ నిలయ సంగీత విద్వాంసులు కృత్రిమంగా అలాంటి వేలం వెర్రి స్వరాలు కట్టి వేలం పాటలు పాడుకున్నారని…తరువాత శంకరపల్లి వేలం పాటల్లో పాడిన వంకరాభరణ తిరోగమన అవరోహణ రాగాల వల్ల తేలిపోయింది.

మహా భారతంలో చెప్పిన ఒంటి స్తంభపు మేడను మనకు మనమే భావనాశక్తితో ఊహించుకోవాలి. అలాంటి ఒంటి స్తంభపు ఆకాశహర్మ్యాలను తలదన్నేవి ఆధునిక భారతంలో ఇప్పుడు లెక్కలేనన్ని మన కళ్లతో చూడవచ్చు. హైదరాబాద్ కోకాపేటలో ఆకాశహర్మ్యాల ఎత్తు కొలవాలంటే సినిమా గీత రచయితలు హీరోకు ఉపమాలంకారాలు వేయబోయి ఉత్ప్రేక్షలు చెప్పినట్లు ఆకాశమే తల ఎత్తి చూడాలి!

Ads

భారతదేశంలో బాంబే, ఢిల్లీతో పాటు ఎక్కడా లేనంత ఎక్కువ ధరకు భూములు అమ్ముడు పోతున్నాయని భ్రమ కలిగించడంలో సక్సస్ అయ్యామని రియలెస్టేట్ మాఫియా చేసుకున్న విజయోత్సవాలు పూర్తికాకముందే…ఇదంతా హైప్ అని…ఒట్టి డొల్ల అని…ఒక పథకం ప్రకారం కొందరు ఒకటి లేదా రెండెకరాల రేటును అమాంతం పెంచి…ఆ రేట్లనే హైదరాబాద్ చుట్టుపక్కల యాభై కిలోమీటర్ల వరకు స్థిరపరచిన…స్థిరాస్తి వ్యాపారుల రియల్ ఎత్తుగడ అని సాక్ష్యాధారాలతో తేలింది.

ఆ కథనాల సాంకేతిక, ఆర్థిక అంశాల లోతుల్లోకి వెళ్లాల్సిన పనిలేదు. సులభంగా అర్థం కావడానికి అందులోనుండి ఒకటి రెండు విషయాలను పట్టుకుంటే చాలు.

కోకాపేట ఎకరా వంద కోట్ల లోకోత్తర వేలం పాట ఆస్కార్ అవార్డు తరువాత…శంకరపల్లి భూముల వేలం పాటల అంతర్జాతీయ అవార్డుల ప్రదానం జరిగింది. అంతదాకా గజం ముప్పయ్ వేల రూపాయల ధర ఉన్నది…ఈ ఈవేలం గాలిపాటల్లో లక్ష రూపాయలతో పల్లవి మొదలయ్యింది. రెండు చరణాలు పూర్తయ్యేసరికి శ్రోతల కాలికింద భూమి కదిలిపోయింది. గజం లక్ష అంటే ఎకరా దాదాపు యాభై కోట్లు. మొన్నటిదాకా ఎకరా పదిహేను కోట్లు.

వంద ప్లాట్లకు వేలం పాటలో పాల్గొని రేట్లు నాలుగయిదింతలు పెంచిన రియలెస్టేట్ విలయవిద్వాంసులు తరువాత అడ్రస్ లేకుండా పోయారు. వేలం పాటలో పాల్గొనడానికి కట్టిన కనీస రుసుమే లక్షల్లో ఉంది. నిర్ణీత గడువులోగా అత్యంత ఎక్కువ ధర పాడినవారు వచ్చి…ఆ సొమ్ము చెల్లించకుంటే…ముందు కట్టిన ఆ రుసుము వెనక్కు రాదు. అలా నూటికి 95 మంది వదులుకున్న సొమ్మే హైదరాబాద్ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ- హెచ్ఎండిఏ కు కోట్లకు కోట్లు మిగిలిపోయింది.

దీనితో అరటిపండు ఒలిచిపెట్టినట్లు కోకాపేట వంద కోట్ల వెనుక ఉన్న కథ అందరికీ అర్థమయింది. వందల ఎకరాలు ఉన్నవారు ఒక ఎకరాను ఈ వేలంవెర్రి జూదంలో ఎక్కువరేటుకు వారే కొని మార్కెట్ కు ఎర వేస్తారు. చుట్టూ మిగతా భూములకు ఆకాశం అంచులు తాకిన ఆ ధరనే నిర్ణయిస్తారు. కోకాపేటలో ఇళ్లు కొనాలనుకుని వెళ్లేవాడు పగలే చుక్కలు కనిపించి కళ్లు తిరిగి పడిపోతూ ఉంటాడు. అర ఎకరమో, పావు ఎకరమో ఉన్నవాడు క్యాలిక్యులెటర్లో ఈ లెక్కలు వేసుకుంటూ సున్నాలు పట్టని వందల కోట్ల పగటి కలలు కంటూ…అమ్ముకోలేక పట్టపగలే చీకట్లలో పడి ఉంటాడు.

ప్రపంచ నగరానికి ఈ వందకోట్ల పాటే సిగ్నేచర్ ట్యూన్ అని అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అని…ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంది. అధికార పక్షం గూట్లో మనిషి పాడిన వంద కోట్ల పాటలో అపస్వరాల రియలెస్టేట్ గతితప్పిన గమకాలను అప్పుడు ఎత్తి చూపిన ప్రతిపక్షం ఇప్పుడు అధికార పీఠం మీద కూర్చుంది. రియలెస్టేట్ మాఫియా లక్షల కోట్ల భూవ్యాపారాలు ఎలా చేస్తోందో మీడియా వైనవైనాలుగా చెప్పింది. చెబుతోంది. చెబుతూనే ఉంటుంది.

సామాన్యుడు కొనలేని, చేరుకోలేని, కనీసం కలగనలేని వందో అంతస్థు ఆకాశహర్మ్యం హైరైజ్ బాల్కనీలో మరో కోకాపేట వేలం పాటల సంగీత కచేరీకి ముహూర్తం నిర్ణయమవుతూనే ఉంటుంది.

అన్నట్లు-
30 అంతస్థులు దాటిన హైరైజ్ బిల్డింగ్స్ లో ఉండేవారికి కింద నేలమీద ఉన్నవారితో పోలిస్తే అనేక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందట. చీటికి మాటికి కిందికి దిగాలంటే లిఫ్టుల కోసం చాలాసేపు ఎదురుచూడలేక పైనే గాల్లో ఉండిపోవడం, పైపైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం, నేలవిడిచి కాళ్లు ఆకాశంలో సాము చేయడం లాంటి అనేకానేక కారణాలతో-
1. శ్వాసకోశ సమస్యలు
2. తల తిరగడం
3. అజీర్తి
లాంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయట.

తూచ్…
మెమొప్పుకోము! ఎవరైనా లోకంలో పైకి రావాలంటారు. మేము ఎంతో కష్టపడి కోరి కోరి పైకి వస్తే…ఇప్పుడు కిందికి పడిపొమ్మంటారా? కుళ్లు మీకు…ఒళ్లంతా ఒకటే కుళ్లు!

“దిగిరాను దిగిరాను దివినుండి భువికి…
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?
నా ఇచ్ఛయే గాక నా కేటి వెరపు?”

అని కృష్ణశాస్త్రి అంటే వంత పాడతారా?

ఆకాశంలో మేఘాలకు వేలాడుతూ మేమంటే మాత్రం వంత పాడరా?

ఏం? కింద నేల మీద మీ లోకం ఏమన్నా భూలోక స్వర్గమా!
మేము దిగిరాము దిగిరాము దివినుండి భువికి!

కొస చికిత్స:-

“హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీల్లో ఇతరేతర విలాసవంతమైన వసతులతో పాటు ప్రాథమిక చికిత్స కేంద్రం, తలతిరుగుళ్ల మందుల దుకాణం కూడా పెట్టడంలో దూరదృష్టి ఇదేనా ఏం పాడు!
ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్య/సంక్షోభంలో ఒక వ్యాపారం దాగి ఉంటుందని కొందరి విచికిత్స!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ ప్రధాని మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసినట్టు… రోడ్రిగో కథే వేరు…
  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions