ఈరోజు రెండు వార్తలు ఇంట్రస్టింగుగా అనిపించాయి… వాటిని ప్రజలు సీరియస్‌గా తీసుకుంటే మాత్రం, కాంగ్రెస్‌కు ఓటేయాలని అనుకున్నవాళ్లు కూడా మానేస్తారేమో… వీళ్లకన్నా ఆ కేసీయారే నయం, ఆయనకే వోటేద్దాం అనుకుంటారేమో… వార్త ఏమిటంటే..? ఎక్కడో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ… నాకూ సీఎం చాన్స్ వస్తుంది, వెంటనే నా కొడుకు రాజీనామా చేస్తాడు, నేను ఉపఎన్నికల్లో పోటీచేస్తాను అంటూ ఏదేదో చెప్పుకొచ్చాడు…
నిజానికి కొన్నేళ్లుగా జానారెడ్డి ఏది మాట్లాడినా సరే, అది కేసీయార‌్‌కు పరోక్షంగా అనుకూలించేలా ఉంటోంది… ఇదీ అంతే… ఆలూ లేదు, చూలూ లేదు… అప్పుడే సీఎం కుర్చీ మీద దస్తీ వేయడానికి రెడీ అయిపోయాడు ముసలాయన… అసలు ఎన్నికల నోటిఫికేషనే రాలేదు, పెంట పెట్టేశాడు… కాంగ్రెస్‌లో ఎందరు కేసీయార్ కోవర్టులున్నారో తెలియదు, ప్రజలు కాంగ్రెస్ నేతల్ని నమ్మడం లేదు, కానీ కర్నాటకలో పార్టీ గెలిచాక, తెలంగాణలో కూడా ఊపొచ్చింది…
కేసీయార్ మీద వ్యతిరేకత ఉంది జనంలో… దానికితోడు కేసీయార్, బీజేపీ లోలోపల ఒక్కటే, బయటికి నాటకాలాడుతున్నాయి అనే సందేహం కూడా ప్రజల్లో బలంగా ఉంది… బీజేపీ నిర్ణయాలూ అలాగే ఉన్నాయి… అదే బీజేపీని ఎదగకుండా చేస్తోంది… అదీ కాంగ్రెస్‌కు ఉపకరిస్తోంది… కర్నాటకలో వోటర్లకు ఇచ్చిన హామీల్లాగే సిక్స్ గ్యారంటీస్ పేరిట అలవిమాలిన వాగ్దానాల్ని చేసింది పార్టీ… ముందు గెలుద్దాం, హామీల అమలు సంగతి తరువాత అనుకుంది పార్టీ…
Ads
మరి ఇదే సోయి సీఎం పదవి మీద ఎందుకు లేదు… ముందైతే కష్టపడి, అందరూ ఒక్కటై కొట్లాడితే కదా అధికారంలోకి వచ్చేది… ఎస్, 12 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు… మెజారిటీ సీట్లు వస్తే అప్పుడు తన్నుకోవచ్చు, కానీ ఇప్పుడే ఎందుకు..? ఒకవైపు టికెట్లు అమ్ముకుంటున్నట్టు రేవంత్ మీద బలమైన ఆరోపణలు… పొన్నాల వంటి సీనియర్ నేతల నిష్క్రమణ… కాంగ్రెస్‌కు అంత వీజీగా ఏమీ లేదు… మెజారిటీ సరిగ్గా రాకపోతే కేసీయార్ గండ్రగొడ్డలి పట్టుకుని నరుకుతాడు పార్టీ బలాన్ని… మస్తు సాధనసంపత్తి ఉందిప్పుడు తనకు…
సరే, ఈ జాఢ్యం కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఉండేదేలే అని సర్దిచెప్పుకుందాం… జనం కేసీయార్‌కు వోటు వేయవద్దని బలంగా అనుకుంటే వీళ్లకు వోటేయాల్సిందే తప్ప వీళ్ల మొహాలు చూసి కాదు… సరే, మరో వార్త… ఆంధ్రప్రభలో వచ్చింది… ఆ పత్రికలో (??) రోజూ చాలా జోకుల్లాంటి వార్తలు పబ్లిష్ చేస్తుంటారు… ఇదే నయా పాత్రికేయమోయ్ అని మనల్నే దబాయిస్తుంటారు… కేసీయార్ ఎందుకైనా మంచిదని అనుకున్నాడో, లేక మరేదైనా వ్యూహం ఉందో తెలియదు గానీ కామారెడ్డిలో కూడా పోటీచేస్తున్నాడు కదా…
అక్కడ కేసీయార్ మీద రేవంత్‌రెడ్డి పోటీచేయబోతున్నాడు అనేది వార్త… కేసీయార్ గజ్వెల్, కామారెడ్డి అన్నట్టుగానే రేవంత్ కొడంగల్, కామారెడ్డి అట… హైకమాండ్ చెప్పేసిందట… కామారెడ్డిలో పోటీచేయాల్సిన షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ స్థానానికి వలస వెళ్తాడట… అబ్బే, రేవంత్ ఆ తప్పు నిర్ణయం తీసుకునే చాన్సే లేదసలు… నాలుగు డబ్బులు ఎక్కువ ఖర్చయినా సరే కొడంగల్‌లో గెలవడానికే ప్రయత్నిస్తాడు, మరి సీఎం సీటుకు టార్గెట్ పెట్టుకోవాలి కదా… ఎప్పుడైనా ఎక్కడైనా సరే, ఏ పార్టీలోనైనా సరే, పెద్ద నాయకుల మీద పెద్ద నాయకులు పోటీలకు దిగరు…
ఇంకా నయం… సిద్దిపేటలో హరీష్ మీద జగ్గారెడ్డిని, సిరిసిల్లలో కేటీయార్ మీద కూడా మైనంపల్లిని నిలబడాలని హైకమాండ్ ఆదేశించిందని రాయలేదు…
అవునూ, కామారెడ్డిలో కిషన్‌రెడ్డి (అంబర్‌పేటకు అదనంగా…) సిద్దిపేటలో బండి సంజయ్ (కరీంనగర్‌కు అదనంగా…) సిరిసిల్లలో ఈటల (హుజూరాబాద్‌కు అదనంగా…) నిలబడితే ఎలా ఉంటుందబ్బా…!! కాసేపు షర్మిల, ప్రవీణ్‌కుమార్, జ్ఞానేశ్వర్, జనసేన, కేఏపాల్, కోదండరాం తదితరుల పోటీల్ని కాసేపు పక్కనపెడితేనే…!!
అన్నట్టు రేవంత్ రెండు సీట్ల పోటీ గురించి వ్యూహకర్త సునీల్ కనుగోలు, కన్నడ డీకే శివకుమార్‌లకైనా తెలుసోలేదో…!! అలాగే బోలెడు మంది ఉపముఖ్యమంత్రులను నియమిస్తున్నట్టుగానే ఒకే రాష్ట్రానికి ఐదారుగురు ముఖ్యమంత్రుల్ని పెట్టుకునే అవకాశం లేదా అధ్యక్షా…!!
Share this Article